గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

31, ఆగస్టు 2011, బుధవారం

కట్టమూరి జీవన భారతంలో అవధాన పర్వం.(సమస్యాపూరణ13)

17 comments


సాహితీ బంధువులారా!
అవధాని శ్రీ చంద్ర శేఖరం గారెదుర్కొని పూరించిన ఒక సమస్యను ఇప్పుడు చూద్దాం.
"ద్రౌపది రామునకు భర్త దౌహిత్రియగున్"
చూచారు కదా! ఈ సమస్యకు నాయొక్క ,  అవధానిగారి యొక్క పూరణలను వ్హ్యఖ్యలో చూడవచ్చును.
మీరు మీ జ్ఞాన ప్రభాసమానంగా ఉండేలా పూరణలు చేసి, మీ పూరణల ద్వారా పాఠకాళిని ముగ్ధుల్ని చేసాతని ఆశిస్తున్నాను.
జైశ్రీరాం.
జైహింద్.

30, ఆగస్టు 2011, మంగళవారం

కట్టమూరి జీవన భారతంలో అవధాన పర్వం.(సమస్యాపూరణ12)

19 comments

సహృదయ సాహితీ ప్రియ బంధువులారా!
శ్రీ చంద్రశేఖరావధానిగారొక అవధానంలో పూరణకై స్వీకరించిన ఒక సమస్యను చూడండి.
"సూర్యుఁడు, చంద్రుఁడుం బొడమె చుక్కలు పెక్కులు నిక్కుచుండగన్"
ఈ సమస్యకు మీపూరణల ద్వారా ఆంధ్రామృతాస్వాదనా లోలురకానందమందించండి.
అవధానిగారి యొక్క, నాయొక్క పూరణలను వ్యాఖ్యానంలో నూంచగలను.
జైశ్రీరాం.
జైహింద్.29, ఆగస్టు 2011, సోమవారం

తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా మీకందరికీ అభినందనలు.

8 comments

వాడుక భాషా ఉద్యమ పితామహుఁడు  గిడుగు వేంకట రామ మూర్తి.
గిడుగు వెంకట రామమూర్తి 1863 ఆగష్టు 29వ తేదీ శ్రీకాకుళానికి  ఉత్తరాన ఇరవైమైళ్ళ దూరంలో ముఖలింగ క్షేత్రం దగ్గర ఉన్నపర్వతాలపేట అనే గ్రామంలో జన్మించాడు. అతని తండ్రి వీర్రాజు, తల్లి వెంకమ్మ. 
గురజాడ, గిడుగులు, శ్రీనివాస అయ్యంగారు, యేట్సు — ఈ నలుగురి ఆలోచనల వల్ల వ్యావహారిక భాషోద్యమం ఆరంభమైంది. 
వాడుక భాషా ఉద్యమ పితామహుఁడు  గిడుగు వేంకట రామ మూర్తి.
పంతులుగారి పుట్టిన రోజు 'తెలుగు భాషా దినోత్సవము'గా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము పరిగణిస్తున్నది.
తెలుగు భాష దినోత్సవం సందర్భంగా తెలుగు భాషాభిమానులకూ, తెలుగు సంతతికి, నా హృదయ పూర్వక అభినందనలు. 
గిడుగు రామమూర్తి , జనవరి 22, 1940 న కన్ను మూశారు. వారి సామాజిక దృక్పథానికి జోహార్.
పాఠకులు  హాస్యావధానాన్న, మేడసానివారి శతావధానంలోని, సమస్యా పూరణ కొంత భాగాన్ని ఈ క్రింది urlల ద్వారా తెరచి, చూచి, విని ఆనందించవచ్చును.
http://www.youtube.com/watch?v=72pWN0ml9M8&feature=player_detailpage
http://www.youtube.com/watch?v=7KUWs8hzY_g&feature=player_detailpage
http://www.youtube.com/watch?v=uHidzTYwbss&feature=player_detailpage
జైశ్రీరాం.
జైహింద్.

28, ఆగస్టు 2011, ఆదివారం

మూడు వసంతాలను అధిగమించిన ఆంధ్రామృతం.

17 comments

ఈనాడు దిన పత్రికలో ప్రశంసింపబడిన ఆంధ్రామృతం.(ఫొటోపై క్లిక్ చెయ్యండి) 
శ్రీమన్మంగళ భావనా ప్రతిభులైన ఆంధ్రామృత  పాఠకుల ఆదరాభిమానాలతో
ఆంధ్రామృతం మూడు వసంతాలను అధిగమించి నేడు నాల్గవ యేట అడుగు పెట్టింది. 
ఈ సందర్భంగా  అమృత హృదయులై ఆంధ్రామృత పాన లోలురైన, ఆంధ్రామృతాభిమానులైన ప్రతీ ఒక్కరికీ నేను ధన్యవాదాలు తెలియ జేసుకొనుచున్నాను.
శ్రీమాన్ కల్వపూడి వేంకట వీర రాఘవాచార్య గురు దేవుల కృప  చేత ఆంధ్ర భాషాధ్యనం చేసి, ఆంధ్రోపన్యాసకునిగా ఉద్యోగ జీవితం గడిపి,  ప్రస్తుతం విశ్రాంతి తీసుకొంటున్న నేను భాషాపరంగా ఏ కొంచెమైనా కృషి, సేవాయత్నం, చేయ గలిగే సద్భాగ్యం ఈ నాడు నాకు కలిగింది. ఇందుకు కారణం  ఈ బ్లాగ్ నిర్మాణ సాంకేతికాలను కనుగొని, వెలుగులోకి తెచ్చిన, అజ్ఞాత శాస్త్రవేత్తల యొక్క, గూగుల్ నిర్మాత యొక్క, ఆంధ్రాభిమానులైన మనీషుల యొక్క అనంతమై కృషియే అనడం అత్యుక్తి కానేరదు.
ఆ విధంగా ప్రత్యక్షంగాను, పరోక్షంగాను, ఈ అభ్యున్నతికి కారణమైన ప్రతీ ఒక్కరికీ నేను కృతజ్ఞతా పూర్వకంగా శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నాను.
చిరంజీవులనేకమంది నాకు తమ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి, సహాయ సహకారాలనందిస్తుండడం నా మనసుకెంతో ఆనందంకలిగిస్తోంది.
అట్టి చిరంజీవులందరికీ భగవంతుడు మరింత సేవా తత్పరులై ఉల్లాసంగా పనిచేసే అవకాశం కలిగించడం కోసం వారి నిజ జీవితాలలో సుఖ సంతోషాలను పరిపూర్ణంగా నింపుతూ ఆనందప్రదుడు కావలసినదిగా మనసారా ప్రార్థిస్తున్నాను.
నేను నాకు కలిగిన పరిజ్ఞానంతో నిరంతరం నిష్కళంకమైన సన్మార్గప్రదమైన, సామాజిక ప్రయోజన కరమైన, భాషాభివృద్ధికరమైన మార్గంలోనే ఈ బ్లాగును మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నానని, చేస్తూ ఉండ గలననీ, హృ దయ పూర్వకంగా తెలియజేస్తున్నాను.
ఏమైనా పోరపాటులు దొర్లే అవకాశం లేకపోలేదు. అట్టివి ఉన్నట్లైతే అవి నా పరాకు కారణంగానే, అజ్ఞానం కారణంగానే జరిగి ఉంటాయే తప్ప ప్రయత్న పూర్వకంగా చేసినవి కాదని మనవి చేసుకొనుచున్నాను. అట్టి పొరపాటులు జరిగి ఉంటే మన్నించమని వేడుకొంటున్నాను.
మీ అందరి సూచనలే ఆంధ్రామృతానికి అనంత జీవం.
ఇంతవరకూ నడిపించి నాల్గవయేట అడుగు పెట్టేలా చేసిన ప్రతీ ఒక్కరికీ నాహృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకొంటున్నాను.
నమస్తే.
జైశ్రీరాం.
జైహింద్.

27, ఆగస్టు 2011, శనివారం

కట్టమూరి జీవన భారతంలో అవధాన పర్వం.(సమస్యాపూరణ11)

10 comments

కవి మిత్రులారా!
ఆటవెలది, కంద గర్భ తేటగీతి:-  
కవన కుతుకమొ లయుభవ కవి వరులు త  
మరు! తమదు గుణ విపుల రుచిరముల కని, 
దివిజ కవివరులును, భువి దివి వెలసిన
కవులను మిము, ప్రవిమల వర వరులుగను. 
గర్భస్థ ఆటవెలది:-
కవన కుతుక మొలయు భవ కవి వరులు త  
మరు! తమదు గుణ విపుల రుచిరముల
దివిజ కవివరులును భువి దివి వెలసిన 
కవులను మిము. ప్రవిమల వర వరులు. 
గర్భస్థ కందము:-
కవనకు తుకమొలయు భవ  క     
వి వరులు తమరు!   తమదు గుణ విపుల  రుచిరముల్!
దివిజ కవివరులును భువి ది
వి వెలసిన కవులను మిము ప్రవిమల వర వరుల్ . 
అంతటి ప్రాశస్త్యం మీరు పొందినట్టుగా భావించి వ్రాసినపద్యం ఈ ఆట వెలది, కంద గర్భ తేటగీతి.
నా భావనను నిజం చేసే సత్తా మీలో ఉందని నేను భావిస్తూ,
ఈ నాడు అవధానిగారెదుర్కొని పూరించిన ఒక సమస్యను మీ ముందుంచుతున్నాను.
"భామయు భామయున్ గలియ బాలుఁడు పుట్టెను  సత్య భామకున్".
చూచారు కదా! సమస్య?
అవధానిగారి యొక్క, నాయొక్క పూరణలను  వ్యాఖ్యలో చూడనగును.
మీ పూరణలతో పాఠకులను ఆనంద పరవశులుగా చేయగలరని ఆశిస్తున్నాను.
జైశ్రీరాం.
జైహింద్.

26, ఆగస్టు 2011, శుక్రవారం

కట్టమూరి జీవన భారతంలో అవధాన పర్వం.(సమస్యాపూరణ10)

16 comments

కవన కుతూహల భాసమాన సన్మిత్రులారా!
అవధాని చంద్రశేఖరం గారు పూరణకై ఎదుర్కొన్న సమస్యనొకదాన్ని ఇప్పుడు చూద్దాము.
"రంభకు తాళి కట్టె రఘు రాముఁడు వేల్పులు సన్నుతింపగన్".
ఈ సమస్యకు నాయొక్క, అవధానిగారి యొక్క పూరణలను వ్యాఖ్యలలో చూడవచ్చును.
మీ పూరణలను వ్యాఖ్యల ద్వారా అందించి, పాఠకాళికి ఆనంద కారకులగుదురని ఆశిస్తున్నాను.
జైశ్రీరాం.
జైహింద్.

25, ఆగస్టు 2011, గురువారం

కట్టమూరి జీవన భారతంలో అవధాన పర్వం.(సమస్యాపూరణ9)

12 comments

అవధాని గారి తల్లిదండ్రులు.

సుజన బాంధవులారా!
శ్రీ చంద్రశేఖరావధాని గారు పూరించిన మరొక సమస్యను ఈ రోజు చూద్దాం.
"పవి పూవుగ మారిపోయి పరవశమయ్యెన్".
(పవి = వజ్రాయుధము)
ఈ సమస్యకు అవధాని గారి పూరణను, నా పూరణను వ్యాఖ్యాలో చూడ వచ్చును.
మీరు మీ పూరణలద్వారా పాఠకులనలరింపఁ జేయగలరని ఆశింతును.
జైశ్రీరాం.
జైహింద్.

24, ఆగస్టు 2011, బుధవారం

ఇదెక్కడి వింత??? ఈ పిల్లేమిటి? ఈ డేన్సేమిటి?

1 comments


ఇదెక్కడి వింత??? 
ఈ పిల్లేమిటి? ఈ డేన్సేమిటి?
వాహ్!
చిరంజీవీ! సుఖీభవ.

కట్టమూరి జీవన భారతంలో అవధాన పర్వం.(సమస్యాపూరణ8)

12 comments

సాహితీ సంసేవక కవి మిత్రులారా!
మన అవధాని శ్రీ చంద్రశేఖరం గారికి ఒక అవధానంలో పూరణకై ఇచ్చిన సమస్యను ఈ క్రింద పరికించండి.
"శిరమున బడబాగ్ని మిగుల శీతలమయ్యెన్".
ఈ సస్యకు కవిగారి పూరణమును, నా పూరణమును వ్యాఖ్యలలో గమనింప గలరు.
మీరు అత్యద్భుతంగా ఈ సమస్యా పూరణము చేసి వ్యాఖ్య ద్వారా పాఠకాళికి ఆనందం కలిగించ గలరని ఆశిస్తున్నాను.
శుభమస్తు.
జైశ్రీరాం.
జైహింద్.

23, ఆగస్టు 2011, మంగళవారం

కట్టమూరి జీవన భారతంలో అవధాన పర్వం.(సమస్యాపూరణ7)

11 comments

ఆర్యులారా!
అవధాని కట్టమూరి జీవనములో అవధాన పర్వంలో ఎదుర్కొనిన ఒక సమస్యను ఈ రోజు చూద్దాము.
మాటలు తప్పువారె బహుమాన్యులు పూజ్యులు వందనీయులున్.
ఈ సమస్యకు అవధాని చేసిన పూరణను, నాయొక్క పూరణను వ్యాఖ్యానంలో చూద్దాము.
మీరు తమ భావనా సౌరభం గుబాళింప జేస్తూ,రచనా పాటవాన్ని ప్రదర్శిస్తూ, పూరణలను చేసి పంపి సాహితీ ప్రియానందకరులగుదురని విశ్వసిస్తున్నాను.
జైశ్రీరాం.
జైహింద్.


22, ఆగస్టు 2011, సోమవారం

గీతా మాహాత్మ్యము

2 comments

మీ అందరికీ నా శుభాశీస్సులు.
గీతా మాహాత్మ్యము
ధరోవాచ:
భగవాన్! పరమేశాన! భక్తిరవ్యభిచారిణీ!|
ప్రారబ్ధం భుజ్యమానస్య కథం భవతి హేప్రభో || 1 ||
కః- ప్రారబ్ధ కర్మ బద్ధుల
కే రకముగ భక్తి యబ్బు నీశ్వర! యనుచున్
చేరి ధర హరిని యడుగగ
నారాయణుఁ డిట్లు చెప్పె నమ్మిక మీరన్.
భూదేవి విష్ణుభగవానుని గూర్చి ఇట్లు ప్రశ్నించెను. ఓ భగవానుడా! పరమేశ్వరా! ప్రభూ! ప్రారబ్ధము అనుభవించే వానికి అచంచలమైన భక్తి ఎట్లు కలుగగలదు?

శ్రీవిష్ణురువాచ:
ప్రారబ్ధం భుజ్యమానోపి గీతాభ్యాసరతస్సదా |
స ముక్త స్స సుఖీ లోకే కర్మణా నోపలిప్యతే || 2 ||
కః- ప్రారబ్ధ కర్మ బద్ధులు
తీరికగా గీత చదివి తృప్తిగ నాపై
భారము వేసిన, కర్మలు
వారల కంటవు. విముక్తి ప్రాప్తించు ధరా!
ఓ భూదేవీ! ప్రారబ్ధము అనుభవిస్తున్ననూ ఎవరు నిరంతరము గీతాభ్యాసమందు నిరతుడై ఉండునో అట్టివాడు ముక్తుడై కర్మలచే అంటబడక ఈ ప్రపంచమునందు సుఖముగా ఉండును.

మహాపాపాదిపాపాని గీతాధ్యానం కరోతి చేత్ |
క్వచిత్ స్పర్శం న కుర్వంతి నలినీదళమంభసా || 3 ||
కః- గీతా ధ్యానము చేయు పు
నీతుల కఘమంట బోదు. నీరముఁ గన నే
రీతిని  తామర కంటునె?
యాతీరుగ  నిదియు, తెలియ నద్భుతమిదియే.
తామరాకును నీరంటనట్లు గీతాధ్యానము చేయు వానిని మహాపాపములు కూడా కొంచమైనను అంటవు.

గీతాయాః పుస్తకం యత్ర యత్ర పాఠః ప్రవర్తతే
తత్ర సర్వాణి తీర్థాని ప్రయాగాదీని తత్ర వై || 4 ||
కః- గీతా గ్రంథ మదెచ్చట,
గీతా పఠనంబదెచట కీర్తి ప్రదమై
భూతలమందున నుండునొ
యా తలమున పుణ్య తీర్థ మమరిక నుండున్.
ఎచ్చట గీతా గ్రంధము ఉండునో మరియు ఎచ్చట గీతా పారాయణము జరుగుచుండునో అచ్చట ప్రయాగ మొదలగు సమస్త తీర్ధములు ఉండును.

సర్వే దేవాశ్చ ఋషయో యోగినః పన్నగాశ్చ యే |
గోపాల గోపికా వాపి నారదోద్ధవ పార్షదైః
సహాయో జాయతే శీఘ్రం యత్ర గీతా ప్రవర్తతే || 5 ||
గీః- ఎచట గీతపారాయణ మెలమి జరుగు
నచట దేవతల్, ఋషివరు లఖిల యోగు
లఖిల నాగులు గోపిక లఖిల గోప
కులును నార దోద్ధవులు కొలుపు మేలు.
ఎచ్చట గీతాపారాయణము జరుగుచుండునో అచటికి దేవతలు, ఋషులు, యోగులు, నాగులు, గోపికలు, గోపాలురు భగవత్స్పర్శ్యాస్యాసక్తులగు నారద, ఉద్ధవాదులు వచ్చి శీఘ్రముగా సహాయమొనర్తురు.

యత్ర గీతా విచారశ్చ పఠనం పాఠనం శ్రుతం |
తత్రాహం నిశ్చితం పృథ్వి నివసామి సదైవ హి || 6 ||
గీః- గీత పఠన పాఠన , శ్రావ్య కృతి విచార
మెచట జరుగుచు నుండునో యచట నేను
నిష్టతో నుండి కాతును నేర్పు మీర. 
గమ్య మార్గము  చూపుదు. కనుమ! పృథ్వి!
ఓ భూదేవీ! ఎచట గీతను గూర్చి విచారణ, పఠనము, భోధన, శ్రవణము జరుగుచుండునో అచట నేను ఎల్లప్పుడు తప్పక నివసింతును.

గీతాశ్రయేహం తిష్ఠామి గీతా మే చోత్తమం గృహమ్ |
గీతాజ్ఞానముపాశ్రిత్య త్రీన్ లోకాన్ పాలయామ్యహమ్ || 7 ||
ఆః- గీత నాశ్రయించి క్రీడింతు జగమున.
గీతయే గృహముగ ప్రీతి నుందు.
గీత నాశ్రయించి ఖ్యాతి ముజ్జగముల
నేలు చుంటి నేను మేలుగాను.
నేను గీతనాశ్రయించి ఉన్నాను, గీతయే నాకు ఉత్తమగు నివాస మందిరము మరియు గీతాజ్ఞానమును ఆశ్రయించియే మూడు లోకాలను నేను పాలించుచున్నాను.

గీతా మే పరమా విద్యా బ్రహ్మరూపా న సంశయః |
అర్ధమాత్రాక్షరా నిత్యా స్వనిర్వాచ్య పదాత్మికా || 8 ||
గీః- గీతయే నా పరమ విద్య. ఖ్యాతిఁ గనిన
గీత బ్రహ్మస్వరూపము. కీర్తి ప్రదము.
ప్రణవమందున నాల్గవ పాదమైన
అర్థ మాత్ర నిత్య సు శాశ్వితానుపమము.
గీత నాయొక్క పరమవిద్య అది బ్రహ్మస్వరూపము దీనిలో సందేహము లేదు, మరియు అది ప్రణవములో నాలగవ పాదమగు అర్ధమాత్రా స్వరూపము, నిత్యమైనది, నాశరహితమైనది, అనిర్వచనీయమైనది.

చిదానందేన కృష్ణేన ప్రోక్తా స్వముఖతోర్జునమ్ |
వేదత్రయీ పరానందతత్త్వార్ధజ్ఞానమంజసా || 9 ||
గీః- కృష్ణుఁ డర్జునునకుఁ జెప్పె గీత  కృపను 
మూడు వేదాల సారము. మూడు లోక
ములకు నానందప్రదమిది. కలుగ జేయు
తత్వ విజ్ఞానమును తనన్ దలచినంత.
సచ్చిదానంద స్వరూపుడగు శ్రీ కృష్ణ పరమాత్మచే స్వయముగా అర్జుననుకు ఉపదేశింప బడినది. ఇది మూడు వేదముల సారము, పరమానందమయినది, తన్నాశ్రయించిన వారికి శీఘ్రముగా తత్వజ్ఞానాన్ని కలుగచేయును.

యోష్టాదశ జపేన్నిత్యం నరో నిశ్చలమానసః |
జ్ఞానసిద్ధిం స లభతే తతో యాతి పరం పదమ్ || 10 ||
గీః- ప్రీతి నష్టా దశాధ్యాయ ఖ్యాతి నెఱిగి,
పఠన చేయు నా నరుఁడు తా బ్రహ్మ పథము
నొందు. సందేహమే లేదు. మంద మతియు
దీనిని పఠించి మోక్షంబు తాను పొందు. 
ఏ నరుడు నిత్యమూ గీతయందలి పద్దెనిమిది అధ్యాయములను పఠించునో అతడు జ్ఞానసిద్ధిని పొంది తద్వారా పరమ పదమును (మోక్షమును) పొందును.

పాఠే సమర్థస్సంపూర్ణే తదర్థం పాఠమాచరేత్ |
తదా గోదానజం పుణ్యం లభతే నాత్ర సంశయః || 11 ||
గీః- శక్తి హీనులు గీతను భక్తి తోడ
సగము చదివిన చాలును సత్ ఫలమిడు.
గంగి గోదాన ఫలమిచ్చు గాన  చదివి
సత్ ఫలంబును గాంతురు సహృదయు లిల.
గీతని మొత్తము పఠించలేని వారు అందులో సగమైనను పఠించవలెను దీనివలన అతడికి గోదాన ఫలము వలన కలుగు పుణ్యము లభించుననుటలో సందేహము లేదు.

త్రిభాగం పఠమానస్తు గంగాస్నానఫలం లభేత్ |
షడంశం జపమానస్తు సోమయాగఫలం లభేత్ || 12 ||
గీః- గీత మూడవ వంతైన ప్రీతి తోడ
చదువ స్వర్గంగ స్నాన ఫలదము. నిజము.
గీతనారవ భాగము ప్రీతిఁ జదువ
సోమ యాగ ఫలంబిచ్చు. శుభము లొసగు.
గీతయొక్క మూడవభాగము(ఆరు అధ్యాయములు) పఠించినవానికి గంగా స్నాన ఫలము లభించును, ఆరవ భాగము(మూడు అధ్యాయములు)పఠించువారికి సోమయాగ ఫలము లభించును.

ఏకాద్యాయం తు యో నిత్యం పఠతే భక్తిసంయుతః |
రుద్రలోకమవాప్నోతి గణోభూత్వా వసేచ్చిరమ్ || 13 ||
గీః- ఒక్క అధ్యాయమైనను నిక్కముగను
గీత ప్రతిదినంబు చదువఁ బ్రీతి తోడ
రుద్ర లోకము పొంది తా రుద్ర గణము
నందు నొకడగు.నివసించు నందనిశము.
ఎవడు గీతయొక్క ఒక అధ్యాయము భక్తితో పఠించునో అతడు రుద్రలోకమును పొంది రుద్ర గణములలో ఒకడుగా శాశ్వతముగా నివసించును.

అధ్యాయశ్లోకపాదం వా నిత్యం యః పఠతే నరః |
స యాతి నరతాం యావన్మనుకాలం వసుంధరే! || 14 ||
గీః- నిత్య మధ్యాయ పాదము నేర్పు మీర
చదువ నుత్కృష్ట నర జన్మ చక్క నొదవు
సరిగ మన్వంతరము . కాన చదువ వలయు
భక్తి తోడను గీత. సద్భక్తు లెల్ల.
ఓ భూదేవీ ఎవరు గీతనందలి ఒక అధ్యాయమునందలి నాల్గవ భాగమును నిత్యమూ పఠించునో అతడు ఉత్కృష్టమైన మానవ జన్మ ఒక మన్వంతర కాలము పొందును.

గీతాయాః శ్లోకదశకం సప్త పంచ చతుష్టయమ్ |
ద్వౌత్రీనేకం తదర్ధం వా శ్లోకానాం యః పఠేన్నరః || 15 ||
చంద్రలోకమవాప్నోతి వర్షాణామయుతం ధ్రువమ్ |
గీతాపాఠ సమాయుక్తో మృతో మానుషతాం వ్రజేత్ || 16 ||
గీత పది, ఏడయిదు నాల్గు ప్రీతి తోడ
మూడు, రెండొకటందర్థము చదివినను
నింద్ర లోకమున పదివేలేండ్లుబ్రతుకు.
గీత చదువుచు మరణింప కీర్తిఁ గొలుపు
మనుజ జన్మము నొందును మానవుండు.
ఎవరు గీతనందలి పది శ్లోకములను కానీ, ఏడుశ్లోకములను కానీ, ఐదు శ్లోకములను కానీ, నాలుగు శ్లోకములను కానీ, మూడు శ్లోకములను కానీ, రెండు శ్లోకములను కానీ, ఒక శ్లోకమును కానీ, అర్ధ శ్లోకమును కానీ నిత్యము ఏవరు పటింతురో,౧౫.
వారు ఇంద్రలోకములో పదివేల సంవత్సరములు సుఖముగా జీవించుననుటలో సందేహము లేదు మరియు గీతను పఠిస్తూ ఎవరు మరణిస్తారో అతడు ఉత్తమ మగు మానవ జన్మను పొందుట నిశ్చయము.౧౬

గీతాభ్యాసం పునః కృత్వా లభతే ముక్తిముత్తమాం |
గీతేత్యుచ్చారసంయుక్తో మ్రియమాణో గతిం లభేత్ || 17 ||
గీః- అట్లు మానవుఁడై పుట్టి యనుపమగతి
గీత పఠియించి సన్ముక్తి నాతఁడు గొను.
గీత గీతయనుచు ప్రాణ మాతఁడు విడ
సద్గతిని పొందు నప్పు డసంశయముగ.
అట్లాతడు మానవుడై జన్మించి గీతాభ్యాసమును మరల మరల గావించి ఉత్తమమగు మోక్షమును పొందుననుటలో సంశయము లేదు. గీతా గీతా అనుచు ప్రాణమును వదలువాడు సత్గతిని పొందుననుటలో సందేహము లేదు.

గీతార్థశ్రవణాసక్తో మహాపాపయుతోపి వా |
వైకుంఠం సమవాప్నోతి విష్ణునా సహ మోదతే || 18 ||
క:- గీతార్థము వినఁ గోరెడి 
పాతకుఁడును ముక్తి పొంది పరమాత్మునితో
ప్రీతిగ నొందును సుగతిని.
ఖ్యాతిగ పఠియింప గీత యమరుడతఁడగున్. 
మహా పాపాత్ముడైనను అతడు గీతార్ధమును తెలుసుకొనుటలో ఆసక్తుడైనచో అతడు విష్ణు లోకమును పొంది శ్రీమహా విష్ణు సన్నిధిలో ఆనందమును అనుభవించుచూ ఉండును.

గీతార్థం ధ్యాయతే నిత్యం కృత్వా కర్మాణి భూరిశః |
జీవన్ముక్త స్స విజ్ఞేయో దేహాంతే పరమం పదమ్ || 19 ||
క:- గీతార్థ చింతనంబున
నాతండగు కర్మదూరుఁడాతనికబ్భున్
ఖ్యాతిగ జీవన్ముక్తియు.
భాతిగ నొడఁగూడు పరమ పథమతనికిలన్.
ఎవడు గీతార్ధమును నిత్యము చింతన చేయుచుండునో అతడు అనేక కర్మల నాచరించిననూ జీవన్ముక్తుడేనని చెప్పబడెను, మరియు దేహ పతనానంతరము పరమ పదమును(కైవల్యమును) పొందును.

గీతామాశ్రిత్య బహవో భూభుజో జనకాదయః |
నిర్ధూతకల్మషా లోకే గీతా యాతాః పరమం పదమ్ || 20 ||
ఆ:- సాక్షులరయ మనకు జనకాది రాజులీ
లోకమందనుపమ శ్రీకరమగు 
గీతనాశ్రయించి పాతక దూరులై
ముక్తి నొందినారు పూజ్యముగను.
ఈ ప్రపంచమున గీతను ఆశ్రయించి జనకాది రాజులు అనేకులు పాపరహితులై ముక్తిని పొందియున్నారు.

గీతాయాః పఠనం కృత్వా మాహాత్మ్యం నైవ యః పఠేత్ |
వృథాపాఠో భవేత్ తస్య శ్రమ ఏవ హ్యుదాహృతః || 21 ||
క:- గీతా పఠనము చేసియు
గీతా పఠన ఫలమున్నొకింతచదువమిన్
గీతాపఠనము వ్యర్థం
బేతత్ఫల శూన్యులగుదు రెఱుగుడు దీనిన్.
గీతని పఠించి పిదప మహత్యమును ఎవరు పఠించకుందురో అట్టి వారి గీతా పఠనము వ్యర్ధమే(నిష్ఫలమే). అట్టివారి గీతాపఠనము శ్రమ మాత్రమేనని చెప్ప బడినది.

ఏతన్మాహాత్మ్యసంయుక్తం గీతాభ్యాసం కరోతి యః |
స తత్ఫలమవాప్నోతి దుర్లభాం గతిమాప్నుయాత్ || 22 ||
గీ:- గీత మాహాత్మ్యము చదివి, గీత చదువు
సజ్జనులు పొందుదురు తాముసత్ఫలములు
పైన చెప్పిన ఫలములు ప్రాప్తమగును.
దుర్లభంబగు సద్గతి దొరకు నిజము.
గీతా మహత్యముతో గీతా పారాయణము చేయువారు పైన చెప్పబడిన ఫలములను పొంది, దుర్లభమగు సద్గతిని పొందుతురు.

సూత ఉవాచ:
మాహాత్మ్యమేతద్గీతాయా మయా ప్రోక్తం సనాతనమ్ |
గీతాంతే చ పఠేద్యస్తు యదుక్తం తత్ఫలం లభేత్ || 23 ||
గీ:- శౌనకాదిమహాఋషి సౌమ్యులార!
అతి సనాతన గీతా మహత్యమేను
తెలిపితిని. గీత పఠియించి దీని నెవరు
చదువు గీతా ఫలము వారు సరగున గను.
సూతుడు చెప్పెను.
శౌనకాది ఋషులారా! ఈ ప్రకారనముగా సనాతనమైన గీతా మహత్యమును మీకు తెలుపుచున్నాను. దీనిని గీతా పారాయణానంతరము ఎవరు పఠింతురో అతడు పైన చెప్పిన ఫలమును పొందును.
ఓం ఇతి శ్రీవరాహపురాణే గీతామాహాత్మ్యం సంపూర్ణమ్.
ఇట్లు వరాహ పురాణమునందలి గీతా మహత్యము సమాప్తము.
జై శ్రీకృష్ణ.
జైహింద్.

21, ఆగస్టు 2011, ఆదివారం

పాఠకులకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు (దీని తరువాత టపాలో గీతా మాహాత్మ్యం చూద్దాం)

12 comments

శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆంధ్రామృత పాఠకులకు భగవద్భక్త బాంధవులకు నా శుభాకాంక్షలు.
శ్రీ కృష్ణామృత నామ పాన రతులై చెల్వొందు భక్తాళికిన్
శ్రీకృష్ణుండవనీతలంబున శుభాశీస్సుల్ ప్రసాదింపగా
వక్రత్వంబులు రూపుమాపగ భువిన్ ప్రఖ్యాతిగా బుట్టె నా
శ్రీకృష్ణాష్టమి మీకు శోభ గొలుపున్. క్షేమంబుగా వెల్గుఁడీ!   
జై శ్రీకృష్ణ.
జై హింద్.

20, ఆగస్టు 2011, శనివారం

కట్టమూరి జీవన భారతంలో అవధాన పర్వం.(సమస్యాపూరణ6)

14 comments

సాహితీ బంధువులారా!
అవధాని బ్రహ్మశ్రీ కట్టమూరి చంద్రశేఖరం గారికి ఒక అవధానంలో యిచ్చిన 
ఆ  సమస్యను ఈనాడు చూద్దాం.
తల క్రిందుగ నిలిపి నెలత తల దువ్వుకొనెన్.
ఈ సమస్యను మీరు పూరించి వ్యాఖ్యద్వారా పాఠకులకు అందించ గలరని ఆశిస్తున్నాను.
అవధాని పూరణను, నా పూరణను వ్యాఖ్యలో చూడఁగలరు.
నమస్తే.
జైశ్రీరాం.
జైహింద్. 


19, ఆగస్టు 2011, శుక్రవారం

కట్టమూరి జీవన భారతంలో అవధాన పర్వం.(సమస్యాపూరణ5)

14 comments

కవి, పండిత, సాహితీ ప్రియులారా!
బ్రహ్మశ్రీ కట్తమూరి చంద్రశేఖరావధాని అవధానం చేస్తున్నప్పుడు ఆ నాడు  ఇచ్చిన 
ఈ నాటి సమస్య- 
కోడలు పైట తీసి మరి కోరెను మామను మాటి మాటికిన్.
దానిని వారు పూరించిన విధము  వ్యాఖ్యానములో చూద్దాము. ఎందుకంటే మనం పూరించే భావ స్వచ్ఛ మనకుం టుంది. వారి భావన మనకు తెలిసిపోతే మన భావన కుంచించుకు పోయే అవకాశం ఉంది.
ఈ సమస్యను మీరు అద్భుతంగా పూరించగలరని నా విశ్వాసం.ఆ వాగ్దేవి మనల ననుగ్రహించు కాక.
నా పూరణను వ్యాఖ్యలో చూడగలరు.
జైశ్రీరాం.
జైహింద్.
18, ఆగస్టు 2011, గురువారం

కట్టమూరి జీవన భారతంలో అవధాన పర్వం.(సమస్యాపూరణ4)

7 comments


సాహితీ బంధువులారా! అవధాన శేఖర, అవధాన భారతి బిరుదాంకితులగు బ్రహ్మశ్రీ  కట్టమురి చంద్ర శేఖర్ అవధాని  విజయనగరం నివాసి. విశ్రాంత ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యక్షులు, సుప్రసిద్ధ తెలుగు ఉపన్యాసకులు. రాష్ట్ర ప్రతిభారత్న పురస్కార గ్రహిత. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహిత, శ్రీమాన్ సద్గురు కృష్ణ యాజిగారి నిర్వహణలో గల శ్రీ సూర్య సదన ఆస్థాన పండితులు. 

అట్టి శ్రీమాన్ కట్టమురి చంద్రశేఖర్ చేసిన అవధానములలో పూరణకై  ఇచ్చిన సమస్యలను, అవధాని ఆ సమస్యలను  పూరించిన విధమును మీ ముందుంచుటకు ఆనందంగా ఉంది.
ఈ సమస్యలను పాఠకులు తమ నిపుణత చూపుతూ పూరించి, తమ పూరణలను కూడా తోటి పాఠకులకు అందించడం ద్వారా ముదావహులగుదురని ఆశించుచున్నాను.
 ఈ రోజు ప్రకటిస్తున్న సమస్య:-
"ఎంతవాఁడైన తన తల్లి కింత వాడె"

ఈ సమస్యను మన అవధానిగారు పూరించిన విధానం చూద్దాము.
అన్ని గణములకధిరపతి యైన నాడు
అయ్య గణపయ్య జూచి యా అంబ ముద్దు
లాడె తమకంబుతో మేనునాని తనయు
"డెంతవాఁడైన తన తల్లి కింత వాడె"
చూచారు కదా అవధాని చేసిన పూరణ.
నేను చేసిన పురాణము వ్యాఖ్యలలో చూడఁ గలరు. 
ఔత్సాసికులైన మీరు కూడా ఈ సమస్యను పూరించే ప్రయత్నం ఎందుకు చేయ కూడదు? ప్రయత్నించి చూడండి. తప్పక పూరించ గలరని నా నమ్మకం. శంకరాభరణంలో అద్భుతంగా తీర్చి దిద్దబడుతోంది మీ రచనా పాటవం. అది ఎంతవరకూ మెఱుగులు దిద్దుకుందో ఈ సమస్యా పూరణద్వారా ప్రయత్నించండి. మీ పాటవాన్ని పరీక్షించుకోండి. శుభమస్తు.
జైశ్రీరాం.
జైహింద్.

17, ఆగస్టు 2011, బుధవారం

కట్టమూరి జీవన భారతంలో అవధాన పర్వం.(సమస్యాపూరణ3)

9 comments

సాహితీ బంధువులారా! 
అవధాన శేఖర, అవధాన భారతి బిరుదాంకితులగు బ్రహ్మశ్రీ  కట్టమురి చంద్ర శేఖర్ అవధాని  విజయనగరం నివాసి. విశ్రాంత ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యక్షులు, సుప్రసిద్ధ తెలుగు ఉపన్యాసకులు. రాష్ట్ర ప్రతిభారత్న పురస్కార గ్రహిత. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహిత, శ్రీమాన్ సద్గురు కృష్ణ యాజిగారి నిర్వహణలో గల శ్రీ సూర్య సదన ఆస్థాన పండితులు. 
అట్టి శ్రీమాన్ కట్టమురి చంద్రశేఖర్ చేసిన అవధానములలో పూరణకై  ఇచ్చిన సమస్యలను, అవధాని ఆ సమస్యలను  పూరించిన విధమును మీ ముందుంచుటకు ఆనందంగా ఉంది.
ఈ సమస్యలను పాఠకులు తమ నిపుణత చూపుతూ పూరించి, తమ పూరణలను కూడా తోటి పాఠకులకు అందించడం ద్వారా ముదావహులగుదురని ఆశించుచున్నాను.
 ఈ రోజు ప్రకటిస్తున్న సమస్య:-
"ఖరము శిఖరమయ్యె కవి కులమున"
ఈ సమస్యను మన అవధానిగారు పూరించిన విధానం చూద్దాము.
కవిని కన్న తల్లి గర్భంబు ధన్యంబు.
కవిని కన్న పేరు గాంతురిలను.
తనర పేరు పొందు ధరణిలో చంద్రశే
"ఖరము శిఖరమయ్యె కవి కులమున"
చూచారు కదా అవధాని చేసిన పూరణ.
నేను చేసిన పురాణము వ్యాఖ్యలలో చూడఁ గలరు. 
ఔత్సాసికులైన మీరు కూడా ఈ సమస్యను పూరించే ప్రయత్నం ఎందుకు చేయ కూడదు? ప్రయత్నించి చూడండి. తప్పక పూరించ గలరని నా నమ్మకం. శంకరాభరణంలో అద్భుతంగా తీర్చి దిద్దబడుతోంది మీ రచనా పాటవం. అది ఎంతవరకూ మెఱుగులు దిద్దుకుందో ఈ సమస్యా పూరణద్వారా ప్రయత్నించండి. మీ పాటవాన్ని పరీక్షించుకోండి. శుభమస్తు.
జైశ్రీరాం.
జైహింద్.

16, ఆగస్టు 2011, మంగళవారం

కట్టమూరి జీవన భారతంలో అవధాన పర్వం.(సమస్యాపూరణ2)

24 comments


సాహితీ బంధువులారా! 
అవధాన శేఖర, అవధాన భారతి
 బిరుదాంకితులగు బ్రహ్మశ్రీ  కట్టమురి చంద్ర శేఖర్ అవధాని  విజయనగరం నివాసి. విశ్రాంత ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యక్షులు, సుప్రసిద్ధ తెలుగు ఉపన్యాసకులు. రాష్ట్ర ప్రతిభారత్న పురస్కార గ్రహిత. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహిత, శ్రీమాన్ సద్గురు కృష్ణ యాజిగారి నిర్వహణలో గల శ్రీ సూర్య సదన ఆస్థాన పండితులు. 
అట్టి శ్రీమాన్ కట్టమురి చంద్రశేఖర్ చేసిన అవధానములలో పూరణకై  ఇచ్చిన సమస్యలను, అవధాని ఆ సమస్యలను  పూరించిన విధమును మీ ముందుంచుటకు ఆనందంగా ఉంది.
ఈ సమస్యలను పాఠకులు తమ నిపుణత చూపుతూ పూరించి, తమ పూరణలను కూడా తోటి పాఠకులకు అందించడం ద్వారా ముదావహులగుదురని ఆశించుచున్నాను.
ఈ రోజు ప్రకటిస్తున్న సమస్య:-
"పత్రముతో కోయ ఒరిగె వట భూరుహమున్."
(ఆకుతో కోసినంత మాత్రముననే వట వృక్షము నేలకూలినది  అని ఈ సమస్య యొక్క భావము) 
ఈ సమస్యను మన అవధానిగారు పూరించిన విధానం చూద్దాము.
ధాత్రికి వృక్షమె ప్రాణము
ధాత్రిని జనియించి కాచు ధరణిని ప్రజలన్.
పాత్రములౌనే వాటిని 
"పత్రముతో కోయ ఒరిగె వట భూరుహమున్."
చూచారు కదా అవధాని చేసిన పూరణ.
నేను చేసిన పురాణము వ్యాఖ్యలలో చూడఁ గలరు. 
ఔత్సాసికులైన మీరు కూడా ఈ సమస్యను పూరించే ప్రయత్నం ఎందుకు చేయ కూడదు? ప్రయత్నించి చూడండి. తప్పక పూరించ గలరని నా నమ్మకం. శంకరాభరణంలో అద్భుతంగా తీర్చి దిద్దబడుతోంది మీ రచనా పాటవం. అది ఎంతవరకూ మెఱుగులు దిద్దుకుందో ఈ సమస్యా పూరణద్వారా ప్రయత్నించండి. మీ పాటవాన్ని పరీక్షించుకోండి. 
శుభమస్తు.
జైశ్రీరాం.
జైహింద్.

15, ఆగస్టు 2011, సోమవారం

భవ్యమహోజ్వల భారతీయుడా! స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు.

5 commentsఆంధ్రామృత పాఠకులకు స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు.
భారత మాత బిడ్డలు శబాసన వర్ధిలి రొక్క నాడిలన్
శ్రీ రఘురామ పాలనను చేతన మొందిన ధాత్రి.. దీనిపై
ధీరులు, వీరులున్,సుగుణ తేజ విరాజిత దివ్యమూర్తులున్
ప్రేరణ గొల్పు పాలనము ప్రీతిఁగ చేసిరనేకులిద్ధరన్. ౧

బంగరు భూమిగా, ప్రథిత భాగ్య విధాత్రిగ, ప్రాగ్వరేణ్యగా,
నింగికి నేలకుం దగులు నీతి నిధానగ, వజ్ర ధీర స
త్సంగులకాలవాలముగ, శాంతి గుణాన్వితగా తలంచి, యీ
తొంగి కనంగ రాని సువధూటిని స్వేత విజాతి క్రమ్మెనే! ౨

భారతరత్న బిడ్డల ప్రభావము గాంచి, సమైక్యతా గుణో
ద్భారతిఁ దెల్లవారు వల పన్ని, భ్రమల్ కలిగించి, ఐక్యతన్
దూరము చేసి, భవ్యులను ధూర్తులఁ జేసి, కుయుక్తి తోడ తా
చేరిరి మధ్య లోన. విరచించిరి దుర్మత దౌష్ట్య భావముల్.౩

ధన ధాన్యంబులు, పాడి పంటలు,  బృహద్రత్నావళుల్, భాగ్యముల్
మన సర్వంబును కొల్లగొట్టి, కొనిపో మార్గంబునన్ తెల్లవా
రనిశంబున్ కృషి చేసినారు. వివిధ ప్రాంతీయ దుర్భేదముల్
మనలోనన్ గలిగించి, రైక్య కలిమిన్ మాయామయుల్ దోచిరే! ౪

ఉనికిని గోలి పోవు తరి నున్న యదార్థములన్ గ్రహించినా
రనిరత సాధ్యమైన రుధిరార్పణకున్ వెనుకంజ లేని మా
యనిమహ నీయ శక్తిగ ప్రియంబున సర్వులునొక్కటై, మహా
ఘనతరమైన పోరున కకావికలొనరించిరి తెల్లవారలన్. ౫

ఎందరి ప్రాణ దాన ఫల మెందరి జీవన దాన సత్ఫలం
బెందరి భాగ్యదాన ఫల మెందరి సౌఖ్యప్రదాన సత్ఫలం
బెందరి భావనా ఫలిత మెందరి దీక్షల సత్ఫలామృతం 
బిందరమిప్పుడీ యనుభవించెడి స్వేచ్ఛ? గ్రహింప నేర్తుమా? ౬

ఎట్టుల వారి త్యాగ ఋణ మెప్పుడు  తీర్తుము? తీర్చనౌన? వా
రెట్టి మహత్వ భారతము నేర్పడఁ జూడగ కోరినారు ? నే
డెట్టి విచిత్ర దుస్థితి వరించినదీ జగదంబ భారతిన్?
గట్టి ప్రయత్నముం జరిపి గాంచగ చేతుము  స్వప్న భారతిన్. ౭.

స్వార్థము కల్గియుండియు లసత్గుణ సజ్జన శోభనెంచుచున్, 
స్వార్థ విదూర సేవలను చక్కగ చేయుచు ధర్మబద్ధతన్
స్వార్థ మదాంధులన్ దునిమి, చక్కగ నందరి తోడ జీవనం
బర్థమనోజ్ఞ మై వెలుగ హాయిగ సాగు విధంబు నుందుమా? ౮.

నైతిక కట్టుబాటు విడనాడక, సభ్య సమాజమందునన్
భౌతిక జీవితాన వరభావమహోజ్వల కాంతి రేఖయై
ధాతిరిపైవెలుంగుచును, ధర్మ నిబద్ధ ప్రశాంత జీవనం
బీ తరినుండఁగాదలచి యీశ్వరునాజ్ఞగ నెంచి యుందుమా?  ౯. 

మరువగ రాదు బాధ్యతలు. మంచితనంబును వీడరాదు.స
త్కరుణను వీడ రాదు. వర గౌరవభావము వీడరాదు. స
ద్గురు చరణాబ్జ సేవనము  గొప్పగ చేయుట మానరాదు. సా
దరముగ చూడగా వలయు దక్షత హీనుల ధర్మబద్ధులై. ౧౦. 

దురితము లాచరింపమియు, దుష్టవిదూరతయున్, సముల్లసో
ద్భరిత మనమ్ము, సౌమ్యతయు, బ్రహ్మ విధేయత, భక్తి తత్వమున్,
భరిత సుధాంతరంగమును, భవ్య నిరంతర సాధు సేవయున్,
భరతమహోజ్వలాత్ములకుభావ్యముగా మదినెంచుటొప్పగున్. ౧౧.
జైహింద్.

14, ఆగస్టు 2011, ఆదివారం

కొత్తపాళీగారు మాయింటికి వచ్చారు. మాకెంతో ఆనందం తెచ్చారు.

20 comments

ప్రియ పాఠకులారా!
మన ప్రియ బ్లాగ్బంధువు శ్రీమాన్ కొత్తపాళీ (నారాయణస్వామి)గారు ఎంతో శ్రమదమాదులకోర్చి హైదరాబాదులో గల మా స్వగృహానికి వచ్చారు. వారు, వారి బావగారు, మేనల్లుఁడు వచ్చారు. నాకెంతో సంతోషమనిపించింది. వారెంతో ఆనందంతో ఎంతో హాయిగా మాటాడారు.

మన తెలుగు అభివృద్ధి కారకులైన అనేకమంది దివ్యమైన బ్లాగ్ కృషిని ఎంతో సోదాహరణంగా వివరించారు.
తెలుగుభాషన్నా, తెలుగు ప్రజలన్నా,  వారికెంతటి ప్రీతో మాటలలో చెప్పలేను.వారు తన నాటకపాత్రాభినయంలో గల అనుభవాన్ని తెలియఁజేస్తూ, చక్కగా రెండు  పద్యాలు పాండవోద్యోగ విజయాలు నాటకంలో గల శ్రీకృష్ణ పడకసీనులో తాను నిర్వహించిన దుర్యోధనుని పాత్ర నుండి రెండు పద్యాలు కూడా ఎంతో అద్భుతంగా ఆలపించారు.
నాకు, మాకుటుంబ సభులకందరికీ కూడా ఎంతో ఆనందం అనిపించింది. వారికీ వారితో వచ్చిన బంధువులకూ నేను నాకుటుంబం మా ఆనందం వ్యక్తం చేసుకొంటున్నాము. వారికి మా ధన్యవాదాలు.

ఇక మేము పొందిన అనుభూతులు మీకూ పంచాలనే భావనతో వారు ఆలపించిన పద్యాలను, వారితో కూడిన చిత్తరువులను ఇక్కడ బ్లాగులో ఉంచుతున్నందుకు ఆనందంగా ఉంది. 


కొత్తపాళీగారు ఆలపించిన పడకసీనులో దుర్యోధనుని పద్యం.నన్ను అభిమానిస్తున్న మీకు నాధన్యవాదములు. 
రేపు మన భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నా హృదయ పూర్వక శుభాకాంక్షలు ముందుగానే తెలియ జేసుకొంటున్నాను.
శుభమస్తు.
జైశ్రీరామ్.
జైహింద్.

ఈ రోజు కొత్తపాళీగారు హైదరాబాదులో మాయింటికి వస్తున్నారు. మీకూ రావలసినదిగా నా హృదయ పూర్వక ఆహ్వానం.

0 comments


ఆర్యులారా! శుభోదయం. ఈ రోజు నిజంగానే శుభోదయం. 
ఈ రోజు కొత్తపాళీగారు మాయింటికి పది గంటలకు రాబోతున్నారు.
అవకాశం కల్పింఉకొని మీరూ వస్తే నాకు అాలా ఆనందంగా ఉంటుంది.
నమీరు వఏలాగుంటే నా సెల్ నెంబరుకు ఫోన్ ఎయ్యవలసినదిగా మనవి నాయింటికి ఏమార్గాన రావడానిక్ వీలు పడుతుందో ఎప్పడానికి వీలవుతుంది.
నా సెల్ నెంబరుః- 9247238537.(హైదరాబాదు)
నమస్తే.

12, ఆగస్టు 2011, శుక్రవారం

శ్రావణ వరలక్ష్మీ శుక్రవారం సందర్భంగా మీకు శుభాకాంక్షలు.

2 comments

శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చిన శుక్రవారం సందర్భంగా ఆంధ్రామృత పాఠకులకు శుభాకాంక్షలు.
క :- 
అఖిల జగంబుల యందున
సుఖ జీవన భాగ్య మిచ్చి శోభిలఁ జేసే
నిఖిలేశ్వరి శ్రీదేవీ
సఖులగు సన్మాతృ తతిని శ్రీ కరుణించున్.
శా :-
లోకంబంతయు పద్మ నాభు సతి సంలోకామృతం బందగా
నేకాగ్రాత్ములుఁగా తపించు. సమయం బీనాడు లభ్యంబయెన్.
సాకారంబుగ దర్శనంబొసగు. సంసారాంధులం బ్రోచు నా
శ్రీ కల్యాణి సుఖంబు సంపదలతో క్షేమంబుఁ గొల్పుం గృపన్. 
ఉ :-
సాగర కన్యకల్ కలరు చక్కగ నిద్దరు.వారి లోపలన్
వేగముఁ గల్గి చేరుటకు వేచెడు జ్యేష్ఠ మనన్.మహాత్మురా
లాగక మున్నుగానె మనసార మనన్ గరుణించి చేరు తా
నేగతినైన.భక్తి మహనీయత దెల్పగ సాధ్యమేరికిన్?   
శా :-

ఆనందామృత పాన భాగ్యులయి మీరత్యంత సచ్ఛీలురై,   
జ్ఞానాంభోజ పవిత్ర మూర్తులయి సత్కార్యంబులం జేయగా.
శ్రీనాధుండును విష్ణు పత్నియు కృపం జేకొంచు మిమ్మున్ స
ప్రాణంబట్టులఁ గాచు కావుత! మహద్భాగ్యంబు మీదే సుమా!
జై శ్రీరాం.
జైహింద్.

11, ఆగస్టు 2011, గురువారం

కట్టమూరి జీవన భారతంలో అవధాన పర్వం.(సమస్యాపూరణ1)

15 comments

అవధాన శేఖర, అవధాన భారతి బిరుదాంకితులగు బ్రహ్మశ్రీ  కట్టమురి చంద్ర శేఖర్ అవధాని  విజయనగరం నివాసి. విశ్రాంత ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యక్షులు, సుప్రసిద్ధ తెలుగు ఉపన్యాసకులు. రాష్ట్ర ప్రతిభారత్న పురస్కార గ్రహిత. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహిత, శ్రీమాన్ సద్గురు కృష్ణ యాజిగారి నిర్వహణలో గల శ్రీ సూర్య సదన ఆస్థాన పండితులు. 
అట్టి శ్రీమాన్ కట్టమురి చంద్రశేఖర్ చేసిన అవధానములలో పూరణకై  ఇచ్చిన సమస్యలను, అవధాని ఆ సమస్యలను  పూరించిన విధమును మీ ముందుంచుటకు ఆనందంగా ఉంది.
ఈ సమస్యలను పాఠకులు తమ నిపుణత చూపుతూ పూరించి, తమ పూరణలను కూడా తోటి పాఠకులకు అందించడం ద్వారా ముదావహులగుదురని ఆశించుచున్నాను.
ఈ రోజు ప్రకటిస్తున్న సమస్య:-
రంభా శ్మశ్రు నిపీడనోచ్చలితుడౌరా రావణుండెంతయున్.
(రంభ యొక్క గెడ్డపు వెంట్రుకలచే రావణుఁడు పీడింప బడినాఁడు అని ఈ సమస్య యొక్క భావము) 
ఈ సమస్యను మన అవధానిగారు పూరించిన విధానం చూద్దాము.
స్తంభంబుం గనినాడు, కామ దహితోత్కంపంబునుం బొంది దోః 
స్తంభాలింగిత చేష్టలెవ్వి యొకటా! తాపంబునం జేయుచున్
గుంభీభూత మనస్కుఁడై ధరణిజం గోల్పోవు కోపాన  ఓ 
రంభా! స్మశ్రు నిపీడనోచ్చలితుడౌరా రావణుండెంతయున్.
చూచారు కదా అవధాని చేసిన పూరణ.
ఔత్సాసికులైన మీరు కూడా ఈ సమస్యను పూరించే ప్రయత్నం ఎందుకు చేయ కూడదు? ప్రయత్నించి చూడండి. తప్పక పూరించ గలరని నా నమ్మకం. శంకరాభరణంలో అద్భుతంగా తీర్చి దిద్దబడుతోంది మీ రచనా పాటవం. అది ఎంతవరకూ మెఱుగులు దిద్దుకుందో ఈ సమస్యా పూరణద్వారా ప్రయత్నించండి.
శుభమస్తు.
జైశ్రీరాం.
జైహింద్.

10, ఆగస్టు 2011, బుధవారం

శ్రీ వేణు గోప కంద గీత గర్భ చంపకోత్పల శతకము. పద్యము 21 / 21 వ భాగము

4 comments

చ:- తొలి చిగురాకులో మృదువు తూఁగగ సృష్టిని మేలొనర్చి; కా
       చెడి ప్రభువా! కృపన్ మధువు చిందెడి వృక్ష సుమాలఁ గొల్పి; నీ
       విల సుగుణాకృతిన్ సుజను నేలగ నిల్చితొ? శుభ్ర దేహ! ల
       బ్ధుఁడవె హరీ! దయన్ వెలసి; పూజ్యత నిల్చిన వేణు గోపకా! 101.
         భావము:-
         దయతో పూజ్యముగా నిలిచిన ఓ వేణుగోపకుఁడా! ఓ శుభ్ర దేహుఁడా!
         ఓ శ్రీ హరీ! సృష్టిని తొలి నుండియు చిగురాకు సుకుమారముతో
         సరి తూగు విధముగా మేలుగా చేసి; కాపాడే ఓ పరమాత్మా! తేనెను చిందెడి
         వృక్ష సుమాలను సృష్టించి; నీవే ఈ భూమిపై మంచి గుణముల రూపమున
         మంచివారిని ఏలుట కొఱకు నిలిచితి వేమో! మాకు లభించు వాఁడివే సుమా!

క:-  చిగురాకులో మృదువు తూఁ  -  గగ సృష్టిని మేలొనర్చి; కాచెడి ప్రభువా!
       సుగుణాకృతిన్ సుజను నే  -  లగ నిల్చితొ? శుభ్ర దేహ! లబ్ధుఁడవె హరీ! 101.
         భావము:-
         ఓ శుభ్ర దేహుఁడా!  ఓ శ్రీహరీ! చిగురాకు సుకుమారముతో సరి తూగు విధముగా
         మేలుగా సృష్టిని చేసి; కాపాడే ఓ పరమాత్మా! మంచి గుణముల రూపమున మంచివారిని
         ఏలుట కొఱకు నిలిచితి వేమో! మాకు లభించు వాఁడివే సుమా!

గీ:- మృదువు తూఁగగ సృష్టిని మేలొనర్చి; -  మధువు చిందెడి వృక్ష సుమాలఁ గొల్పి;
      సుజను నేలగ నిల్చితొ? శుభ్ర దేహ!  -  వెలసి; పూజ్యత నిల్చిన వేణు గోప! 101.
        భావము:-
        ఓ శుభ్ర దేహుఁడా! మా వద్ద వెలసి; పూజ్యముగా నిలిచిన  ఓ వేణుగోపుఁడా! మృదుత్వముతో
        తులతూగే విధముగాఈ సృష్టిని మేలుగా చేసి; తేనెలు చిందెడి వృక్ష సుమాలను సృష్టించి;
        సుజనులను పాలించుటకై నిలిచితివేమో!

చ:- నను మది నేలరా! పరమ నైష్ఠ్య! దిగంతుఁడ!; భవ్య తేజ!  ప్రా
      ర్థన వినుమా మదిన్.  బహుళ ధన్యతఁ గొల్పెడి భవ్యమూర్తి! నన్
      కను ముదమారగా ధరణిఁ గాచు దయాంభుధి! తత్వ మెన్నుచున్
      గనర హరీ! దయన్! విపుల కామిత పూరక! వేణు గోపకా! 102.
        భావము:-
        స్వచ్ఛమైన కోరికల నీడేర్చువాఁడా! ఓ వేణుగోపకుఁడా! గొప్ప నిష్ఠా సమన్వితుఁడా!
        దిగంతమూ వ్యాపించియున్న వాఁడా! ఓ గొప్ప తేజస్సు కలవాఁడా! అనేక విధములుగా
        ధన్యతను కొలిపెడి ఓ భవ్య మూర్తీ!  నీ మనసు పెట్టి నా ప్రార్థనను వినుము.
        నన్ను ముదమారా చూడుము. ధరణిని కాపాడెడి దయా సముద్రుఁడా!
        నా తత్వమును గణించుచూ నన్ను చూడుము.

క:- మది నేలరా! పరమ నై  -  ష్ఠ్య! దిగంతుఁడ!; భవ్య తేజ!  ప్రార్థన వినుమా!
      ముదమారగా ధరణిఁ గా  -  చు దయాంభుధి! తత్వ మెన్నుచున్ గనర హరీ! 102.
        భావము:-
        గొప్ప నిష్ఠా సమన్వితుఁడా! దిగంతమూ వ్యాపించి యున్న వాఁడా! ఓ గొప్ప తేజస్సు కలవాఁడా!
        ఓ శ్రీహరీ! నా ప్రార్థన వినుము. మనస్పూర్తిగా నన్నేలుము.  ముదమారా చూడుము.
        ధరణిని కాపాడెడి దయా సముద్రుఁడా! నా తత్వమును గణించుచూ నన్ను చూడుము.

గీ:- పరమ నైష్ఠ్య! దిగంతుఁడ!; భవ్య తేజ!  -  బహుళ ధన్యతఁ గొల్పెడి భవ్యమూర్తి!
      ధరణిఁగాచు దయాంభుధి! తత్వమెన్ను -విపుల కామిత పూరక! వేణుగోప!  102.
        భావము:-
        ఓ గొప్ప తేజస్సు కలవాఁడా!  గొప్ప నిష్ఠా సమన్వితుఁడా! దిగంతమూ వ్యాపించి యున్నవాఁడా!
        ఓ వేణుగోపుఁడా! అనేక విధములుగా ధన్యతను కొలిపెడి ఓ భవ్య మూర్తీ! భూమిని కాపాడే
        దయా సముద్రుఁడా! విపులమైన మా తత్వమును గణించు వాఁడా! విపులమైన
        కామితములూ ఈడేర్చు వాఁడా!

చ:- వినఁ పటు నైపుణుల్ ప్రణుత వేంకట సన్యసి రామ తండ్రి గా
       రును;  కనగా సుధీవర గురుండు; ప్రగణ్యులు! భవ్య మూర్తి తా.
       వినఁ పటు భక్తురాల్ జనని వేంకట రత్నము జన్మ నిచ్చి, గా
       చెనుర హరీ! ననున్ పెనిచె చిత్తముఁ జేరిచి వేణు గోపకా!  103.
         భావము:-
         ఓ వేణుగోపకుఁడా! ఓ శ్రీ హరీ! వినినట్లైతే చింతా వేంకట సన్యాసి రామా రావు తండ్రి గారు;
         అన్నివిషయములలోను పటువైన నిపుణత గలవారలు; ప్రణుతులు. చూచినట్లైతే
         వారు సుధీ వరగురులు. ప్రగణ్యులు; భవ్య మూర్తి. అట్టి వీరునూ; వినినచో గొప్ప భక్తురాలైన
         మాతల్లి  శ్రీమతి వేంకట రత్నం గారును;నాకు ఈ జన్మనిచ్చి; కాపాడిరి.
         నన్ను వారి మనస్సులో నిలుపుకొని పెంచిరి.

క:- పటు నైపుణుల్ ప్రణుత వేం  -  కట సన్యసి రామ తండ్రి గారును;  కనగా
      పటు భక్తురాల్ జనని వేం  -  కట రత్నము జన్మ నిచ్చి, గాచెనుర! హరీ! 103.
        భావము:-
        ఓ శ్రీహరీ!  అన్ని విషయములలోను పటువైన నిపుణత గలవారలైన నమస్కరింపఁబడెడి
        చింతా వేంకట సన్యాసి రామా రావు తండ్రి గారును; చూడగా గొప్ప భక్తురాలైన మాతల్లి
        శ్రీమతి వేంకట రత్నం గారును; నాకు ఈ జన్మనిచ్చి; కాపాడెనయ్యా!

గీ:- ప్రణుత వేంకట సన్యసి రామ తండ్రి  -  వర గురుండు; ప్రగణ్యులు! భవ్య మూర్తి.
      జనని వేంకట రత్నము జన్మ నిచ్చి,  -  పెనిచె చిత్తముఁ జేరిచి వేణు గోప! 103.
        భావము:-
        ఓ వేణుగోపుఁడా! వర గురులు; ప్రగణ్యులు; భవ్య మూర్తి; ప్రణుతులు అయిన
        చింతా వేంకట సన్యాసి రామారావు తండ్రి గారును;   మాతల్లి  శ్రీమతి వేంకట రత్నం గారును;
        నాకు ఈ జన్మనిచ్చి; కాపాడిరి. నన్ను వారి మనస్సులో నిలుపుకొని పెంచిరి.

ఉ:- ఓ యరి నాశకా! రచన నోర్చి రచించితి రామ కృష్ణ చిం
      తా; యను నే; నిటన్ నెనరు; దర్పము; దెల్పగ నీ ప్రశస్తి;  ప్రా
      పై యరమున్.  గనన్ కెలయు బంధుర కందము గీత మిందు తో
      డాయె హరీ! కృపన్ వినుమయా శతకంబును వేణు గోపకా!  104.
        భావము:-
        ఓ శత్రు నాశకుఁడా! ఓ వేణు గోపకుఁడా! చింతా రామ కృష్ణా రావు అనే పేరుఁ గల నేను
        యాతనలనోర్చుకొని; ఇక్కడ నీపై నాకుఁ గల కృతజ్ఞత; నీవు నా పక్షమున కలవన్న గర్వము
        ఉట్టి పడే విధముగ వడిఁ గలదియును; ఆశ్రయమై; ఒప్పెడిదియును అగు నీప్రశస్తిని
        వ్యక్త పరుస్తూ నీకు సంబంధించిన విషయము కల ఈ శతక రచన చేసితిని.
        విడదీసి చూచినట్లైతే ఈ శతకమునందలి ప్రతీ వృత్త పద్యము లోనూ విజృంభమాణముగా
        కంద పద్యము; మరియు తేటగీతి పద్యము తోడై యుండెను. నీవు కృపతో నేను రచించిన
        ఈ శతకమును ఆలకింపుమయ్యా!

క:- యరి నాశకా! రచన నో  -  ర్చి రచించితి రామ కృష్ణ చింతా; యను నే
      యరమున్ గనన్  కెలయు బం  -  ధుర కందము గీత మిందు తోడాయె హరీ!  104.
        భావము:-
        ఓ శత్రు వినాశకుఁడా! ఓ శ్రీహరీ! చింతా రామ కృష్ణా రావు అనే పేరుఁ గల నేను
        యాతనలనోర్చుకొని; ఈ శతక రచన చేసితిని. చూడగా వడిఁ గలిగిన విజృంభమాణమగు
        కంద పద్యము; గీతపద్యము ఈ శతకమున తోడాయెను.

గీ:- రచన నోర్చి రచించితి రామ కృష్ణ  -  నెనరు; దర్పము; దెల్పగ నీ ప్రశస్తి.
      కెలయు బంధుర కందముగీతమిందు-వినుమయా శతకంబును వేణుగోపకా!104.
       భావము:-
       ఓ వేణుగోపుఁడా! రామకృష్ణ యనఁబడే నేను నీపై నాకుఁ గల కృతజ్ఞత; నీవు నా పక్షమున
       కలవన్నగర్వము తెలియఁ జేసే విధముగా నీ ప్రాశస్త్యమును శతకముగా రచన చేసితిని.
       ఇందు ప్రతి వృత్తమునావిజృంభమాణముగా కంద పద్యము; తేట గీతి పద్యము ఉన్నవి.
       ఈ శతకమును ఆలకింపుమయ్యా!

ఉ:- శ్రీ గుణ ధాముఁడా! వినగ ప్రేరణ భద్రము వేణు గోపరా!
      భాగవతాఢ్యుఁడౌ బుధుఁడు వఝ్ల నృసింహుని బోధనంబు కాన్;
      తా గణనీయమై చెలఁగు ధారణ కల్గి రచించి తేను; రా
      వేగ; హరీ! కృపన్ వినర ప్రీతిగ నియ్యది; వేణు గోపకా!  105.
        భావము:-
        ఓ మంగళప్రదమైన సద్గుణముల కాకరమైనవాఁడా! ఓ వేణుగోపకుఁడా! శ్రీ భద్రము
        వేణు గోపాలాచార్య అష్టావధానియు. పరమ భాగవతులలో శ్రేష్ఠుడగు శ్రీ వజ్ఝల
        నరసింహమూర్తి కవి బోధనయును ఈ శతక రచనకు ప్రేరణ కాగా; అది
        గణనీయమగుచూ చెలగేటువంటి ధారణ కలిగినందున నేను రచించితిని. ఓ శ్రీ హరీ!
        వేగముగా రమ్ము. ప్రీతితో ఈ శతకమునాలకింపుము.

క:- గుణ ధాముఁడా! వినగ ప్రే  -  రణ భద్రము వేణు గోపరా! భాగవతా!
      గణనీయమై చెలఁగు ధా  -  రణ కల్గి రచించి తేను; రావేగ; హరీ! 105.
       భావము:-
       సద్గుణముల కాకరమైనవాఁడా! ఓ శ్రీహరీ! భాగవతుఁడుగ నీవే ఐనవాఁడా! ఈ శతక రచనకు
       ప్రేరణ శ్రీ భద్రము వేణు గోపాలాచార్య అష్టావధానియే. ధారణ కలిగి నేనిది రచించితిని సుమా!
       నీవు వేగముగా నాకడకు రమ్ము.

గీ:- వినగ ప్రేరణ భద్రము వేణు గోప .-  బుధుఁడు వఝ్ల నృసింహుని బోధనంబు ;
      చెలఁగు ధారణ కల్గి రచించి తేను;  -  వినర ప్రీతిగ నియ్యది; వేణు గోప! 105.
        భావము:-
        ఓ వేణుగోపుఁడా! శ్రీ భద్రము వేణు గోపాలాచార్య అష్టావధానియు; కవి పండితులు
        శ్రీ వజ్ఝల నరసింహమూర్తియొక్క బోధన కారణము కాగా చెలగెడి ధారణఁ గలిగి
        నే నియ్యది రచించితిని. నేను రచించిన ఈ శతకమును ప్రీతితో వినుము.

చ:- దొర! నగ ధారి! మా అఖిల దోష గుణంబుల నాపుమయ్య!సా
       దరముగ నన్ తగన్ కనుమ దారిని చూపుచు కాంక్ష తీర; స
       చ్చిర సుగుణాకృతిన్ వరలఁ జేయగ నీకది భావ్య మయ్య! ఆ
       సురుఁడ! హరీ! కృపన్ వినర! చూడర! నాకృతి! వేణు గోపకా! 106.
         భావము:-
         ఓ నగధారీ! ఓ మా దొరా! ఓ వేణుగోపకుఁడా!  మాకు సంబంధించిన సమస్తమైన
         దోషావహమైన గుణములను నిలిపివేయుము. సాదరముగా తగిన రీతిగా
         నన్ను చూడుమా! నా కోరిక తీరే విధముగా మంచి దారిని మాకు చూపుము.
         నిజమైన శాశ్వితమైన సుగుణాకృతిగా ఈ శతకమును వరలఁ జేయుట అనునది
         నీకు భావ్యమయ్యా! ఓ మూల విరాట్టూ! ఓ శ్రీ హరీ! కృపతో నన్ను చూడుము.
         నేను రచించిన ఈ శతకమును వినుము.

క:- నగ ధారి! మా అఖిల దో  -  ష గుణంబుల నాపుమయ్య సాదరముగ! నన్
      సుగుణాకృతిన్ వరల జే  -  యగ నీకది భావ్య మయ్య! ఆసురుఁడ! హరీ! 106.
        భావము:-
        ఓ నగధారీ! మూల విరాట్టువైన  ఓ శ్రీహరీ! నాపై అదరము చూపుతూ; నాలోను,
        నా యీ రచన లోను కలిగిన  సమస్తమైన దోషములను నిలిపివేయుము. నన్ను
        సుగుణాకారునిగా వరలే విధముగా చేయుట యనునది నీకు భావ్యముసుమా!

గీ:- అఖిల దోష గుణంబుల నాపుమయ్య! -  కనుమ దారిని చూపుచు కాంక్ష తీర
      వరల జేయగ నీకది భావ్య మయ్య!  -  వినర! చూడర! నాకృతి! వేణు గోప! 106.
        భావము:-
        ఓ వేణుగోపుఁడా! నాలోను నా యీ రచన లోను కలిగిన సమస్తమైన దోషములను
        నిలిపివేయుము. నా కోరిక తీరే విధముగా మంచి దారిని మాకు చూపుచు దయతో
        చూడుము. నన్ను వరలే విధముగా చేయుట యనునది నీకు భావ్యముసుమా!
        నన్ను చూడుము నాకృతిని వినుము.

చ:- సుమ మధురీతిగా వినినచో ప్రథమంబుగ వేణు గోప ప
      ద్యములు; కృపన్ సదా శతక మందు కనంబడి; క్షామ మంతటిన్;
      తమ వ్యధలన్నిటిన్ తరిమి;  తన్మధురంబగు తత్వ మిమ్ము! నా
      డె మను హరీ! భువిన్. విదితుడే నిను గాంచును వేణు గోపకా! 107.
        భావము:-
        ఓ వేణుగోపకుఁడా! ఓ శ్రీహరీ!  పాఠకులు ముఖ్యముగా భావించి యీ
        వేణు గోప శతకమునందలి పద్యములు వినినట్లైతే పూల తేనెవలె ఒప్పునట్లుగా చేయుచు;
        కృపతో ఎల్లప్పుడూ ఈ శతకములో నీవు ప్రత్యక్షమయి; సమస్తమైన క్షామమును;
        తమను గూర్చిన శంక వలన కలిగిన వ్యధ లన్నిటినీ తరిమి; ఆ మధురమైన
        పరమాత్మ తత్వమును కలుఁగఁ జేయుము.  అప్పుడే భూమిపై మనుట జరుగును.
        నిన్ను గూర్చి ఎఱిఁగిన వాడే నిన్ను చూడఁగలుగును సుమా!

క:- మధురీతిగా వినినచో  -  ప్రథమంబుగ వేణు గోప! పద్యములు; కృపన్
      వ్యధలన్నిటిన్ తరిమి;  త  -  న్మధురంబగు తత్వమిమ్ము. నాడె మను హరీ! 107.
        భావము:-
        ఓ శ్రీహరీ! అమృతముగా భావించి యీ శ్రీ వేణు గోప శతక పద్యములను ముఖ్యముగా భావించి
        వినినచో నీ కృపతో పాఠకుల వ్యధలన్నిటినీ పోఁ గొట్టి; అందుఁ గల నీకు సంబంధించిన
        ఆ మధురమైన పరమాత్మ తత్వమును ప్రసాదించుము.

గీ:- వినినచో ప్రథమంబుగ వేణు గోప  -  శతక మందు కనంబడి; క్షామ మంత;
      తరిమి;  తన్మధురంబగు తత్వమిమ్ము!-విదితుడే నినుగాంచును వేణుగోప! 107.
        భావము:-
        ఓ వేణుగోపుఁడా! ముఖ్యమని భావించి యీ శ్రీ వేణు గోప శతకమును ఎవరైనను వినినచో
        వారికి నీవు శతకమునందు దర్శనమిచ్చి; క్షామమును పోఁ గొట్టి; అందుగల
        మధురమైనటువంటి నిన్ను గూర్చిన తత్వమును ప్రసాదించుము. నిన్ను గూర్చి
        తెలుసుకొన్న వాడే నిన్ను చూడ గలుగును సుమా!

ఉ:- మంగళ మందుమా! మధుర మంగళ  గీతుల మంగళంబుగా!
       మంగళుఁడా! సుధా మధుర మంగళ కందపు మంగళంబురా!
       మంగళ మందుమా! మధుర మంగళ వృత్తుల మంగళంబుగా;
       మంగ హరీ! సదా వినుత మంగళ రూపుఁడ! వేణు గోపకా! 108.
         భావము:-
         ఎల్లప్పుడూ పొగడఁ బడెడి మంగళ స్వరూపుఁడా! ఓ వేణుగోపకుఁడా! మంగళప్రదముగా
         మేము పాడెడి మంగళ గీతుల మూలమున జయములు పొందుము.
         మంగళమే నీ వైనవాఁడా! అమృతము వలె మధురమైన మంగళమైన
         కందపద్య రూపమగు మంగళము.  మధురమైన మంగళ వృత్తులతో నీకు మంగళము.
         అట్టి మంగళము స్వీకరింపుమా!.

క:- గళ మందు; మా మధుర మం  -  గళ  గీతుల మంగళంబు గా! మంగళుఁడా!
      గళ మందుమా! మధుర మం  -  గళ వృత్తుల మంగళంబు గా!  మంగ హరీ! 108.
        భావము:-
        ఓ అలమేలు మంగా సమేతుఁడ వైన శ్రీహరీ! మా గొంతుకలనుండి వెలువడు మధురమైన
        మంగళ ప్రదమైన తేట తేట గీతుల మూలమున మంగళ మగును గాక! మధురమైన
        మంగళ ప్రదమైన వృత్తులతో గూడిన మా గళ మందు మా మంగళ మందుము.

గీ:- మధుర మంగళ  గీతుల మంగళంబు!  -  మధుర మంగళ కందపు మంగళంబు!
      మధుర మంగళ వృత్తుల మంగళంబు!-వినుత మంగళ రూపుఁడ!వేణుగోప!108.
       భావము:-
       పొగడఁ బడెడి మంగళ ప్రదమైన స్వరూపము కలవాఁడా! ఓ వేణుగోపుఁడా! నీకు మధురమైన
       మంగళ ప్రదమైన గీతులతో మంగళము పలుకు చుంటిని. నీకు మధురమైన మంగళప్రదమైన
       కంద పద్యములతో మంగళము పలుకు చుంటిని. నీకు మధురమైన మంగళ ప్రదమైన
       వృత్తులతో మంగళము పలుకు చుంటిని. నీకు శుభమంగళమ్.
// అంకితము //
చః-
త్రిక పర తత్వమై విపుల ధీ వరదాయికి, వేణు గోపబా
లక మణికిన్, బ్రభాంకునకు,లక్ష్మి హృదీశ్వర కూర్మ మూర్తికిన్,
త్రిక వరుడౌ  పినాకి నుత ధీవరుకిత్తు సుఖింప దీని, పా
వకుఁడ! హరీ!మదిన్ వినుమ! వర్ధిలఁ జేయుమ! వేణు గోపకా!

కః-
పర తత్వమై విపుల ధీ
వరదాయికి, వేణు గోప బాలక మణికిన్
వరుడౌ పినాకి నుత ధీ
వరుకిత్తు సుఖింప దీని, పావకుఁడ! హరీ!

గీః-
విపుల ధీ వర దాయికి, వేణు గోప
కునకు,లక్ష్మి హృదీశ్వర కూర్మ మూర్తి
కి, నుత ధీవరుకిత్తు సుఖింప దీని,
వినుమ! వర్ధిలఁ జేయుమ! వేణు గోప!


మంగళం                                   మహత్                                          
శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ
జైశ్రీరాం.
జైహింద్.