గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

29, మార్చి 2011, మంగళవారం

వికృతి ఉగాది జాల సభలోఇచ్చిన కొన్ని సమస్యలు. నా పూరణలు.

0 comments


పాఠక సోదరీ సోదరులారా!
వికృతి ఉగాది సందర్భంగా జాల కవి సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించిన సందర్భంగా శ్రీమాన్ భైరవభట్ల కామేశ్వర రావు గారు పూరణార్థం  ఇచ్చిన సమస్యలకు ఆ నాడు నేను పూరించిన పద్యములను మీ ముందుంచుతున్నాను. 
ఉత్సాహం ఉంటే ఈ సమస్యలకు మీ పూరణలు  పంపగలందులకు మనవి.
సమస్యా పూరణములు:-
ఉ:-
భీకరమైన యుద్ధములు విశ్వ జనీనత, నీతి, నిల్పగా
శ్రీకరమైన భావనలఁ జేసిరొకప్పుడు. నేడు గాంచితే?
లోక విరుద్ధ దుష్కృతులు లుబ్ధతఁ జేయుచు నుండె నెందరో!
బాకులు క్రుమ్మినట్లగును భారతపౌర! వచింప సిగ్గగున్!
ఆ.వె.
చలిది లేక మిగుల చలియించి పోవుచు
వెంట పడియె నొకఁడు వేడుకొనుచు;
ముష్టివానిబట్టి మూతిపై కొట్టి రా
కలికి శిక్ష యేల కరుణమాలి!
క.
సద్వ్యాపారము దేవుఁడు;
సద్వ్యవహారమునరుఁడును సలుపుచు నుండన్
సద్వ్యక్తుల రచనలన,
గద్వ్యాప్తములయ్యె నిరులు ఖరకరుడుండన్!
క.
శ్రీరామా!కరుణాలయ!
మారామా! రావదేల? మారామా? రా! 
ధీరా? జనకాత్మజ నే
తా(!) రా! నను బ్రోవ రమ్ము తాపము దీరన్.
గీ.
పాత్రునకు దానమిచ్చిన భవ్యఫలము.
ప్రాత్ర హీనునకిచ్చిన పాపమొదవు.
పాత్రునకుదానమీవలె భవ్యముగను.
పాత్రతనుబట్టి దానము ఫలమునొందు.
మత్త.
మేటి పద్ధతిలోన రాజ్యము మేలుగా గ్రహియించి నీ
సాటి లేరన నేలరాదొకొ? చంపుటేలరవ్యక్తులన్?
నేటి భారతమాత దుస్థితి నీవు గాంచవదేలరా?
గోటితో సరిపోవుదానికి గొడ్డలేటికి? వద్దురా!
క.
మన్ననలొందగ తగువిధ
మున్నది పాలింప; మనకు నొప్పది; యను నా
యన్నల కొసగుఁడు పాలన
(న్+)అన్నలదే రాజ్యమయిన నదె భాగ్యమ్మౌ!
శా.
సూక్ష్మజ్ఞాన విశిష్ఠ నేత్రుఁడు; సదా శూలాయుధుండున్ మహా
సుక్ష్మామండల పోషకుండు, కరుణా శోభా జగత్ కాంతుఁడున్
లక్ష్మీ పూజ్య హిమాగ్ర జాత వలవన్ లాలించి కాంతుండయెన్.
లక్ష్మీ(!)కాంతుఁడు పార్వతిన్ వలచె పౌలస్త్యుండు మేల్మేలనన్.
క.
సంస్కృత పదమని కృష్ణను;
సంస్కృతమది శాస్త్రియనుచు చక్కగ నితఁడున్
సంస్కృత కవి యనుచు తలచి 
సంస్కృత కవులందు కృష్ణ శాస్త్రిని జేర్చెన్.
చ.
తెలతెలవారుదాక నిట దీక్షగ నాటక మాడె కొంద రా
విలువలు పెంచె పాత్రలకు. విజ్ఞులు మువ్వురు నన్నదమ్ములే.
చెలువము తోడ పాండవుల శ్రీకర యాకృతులందు వారిలో
తలఁపఁగ భీమసేనునకుఁ దమ్ముఁడు ధర్మజుఁ డన్న క్రీడియే.
క.
ఆమని శ్రీ కృష్ణుఁడు తా
భామగపరిణతిని బొంది భామా మణులన్
ప్రేమగ పురుషులఁ జేసిన
భామకు పదునారు వేల భర్తలు గనరే.
ఉ.
రాముని కాదు, రావణుని, రాజిత శంకరభక్తి యుక్తునిన్
భీమ పరాక్రమాన్వితుని ప్రేమ నుతింతుమటంచుకొంద రీ
సీమను పల్కు. రావణుఁడు సీతను గైకొని దుఃఖ పెట్టె నా
రాముని రాక్షసాంతకుని దాశరధిన్ ! వినుతించుటొప్పునే?
దత్త పదులను త్వరలో మీ ముందుంచగలను.
జైశ్రీరామ్.
జైహింద్.

25, మార్చి 2011, శుక్రవారం

చంద్ర గణములు, వాటిని కలిగి యుండు పద్యముల లక్షణములు.

1 comments


సరస్వతీ! నమస్తుభ్యం.
సరస సాహిత్య సౌందర్యోపాసకులారా! అనేక మంది పాఠకులు చంద్ర గణములను, అవి ప్రయోగింప బడిన పద్యములను గూర్చి తెలుసుకొనఁ గోరిరి.
నే నెఱిగిన వాటిని ఆంధ్రామృతం ద్వారా అందిస్తున్నందుకు ఆనందంగా ఉంది.
ఇంకా వివరంగా కాని, సవరణలు గాని తెలియ జేయ గోరు వారు. తమ అమూల్యమైన వ్యాఖ్యల ద్వారా పంప గలందులకు మనవి.
ఇక చూడండి.
చంద్ర గణములు:-
UIUU = రగ
I I IUU = నగగ
UUIU = తగ
I I U IU = సలగ
U I I U = భగ
I I  I IU =నలగ
UUUI = మల
I I UU I = సగల
U I U I = రల
I I  I U I =నగల
U U I I = తల
I I  U I I = సలల
U  I I  I = భల
I I  I I  I = నలల
చంద్ర గణములను కలిగి యుండే కొన్ని  పద్యముల వివరణ.
మహాక్కర:- 
౧ సూ.౫ ఇం. ౧ చం. యతి: 
ద్వితీయ చతుర్థ గణములు ఇంద్ర గణములకు బదులు సూర్య గణములైనను ఉండ వచ్చును.
ఐదవ గణము మొదటి అక్షరము యతి స్థానము.
ప్రాస నియమము కలదు.
ఉదా:-
సీత హృదయాబ్జ భృంగమా! శ్రీరామ!క్షితిజుల వెతలను తీర్చవయ్య!
మధురాక్కర:- 
౧ సూ. ౩ ఇం. ౧ చం. యతి: ౪ వ గణము మొదటి అక్షరము.
నాల్గవ గణము మొదటి అక్షరము యతి స్థానము.
ప్రాస ప్రాస నియమము కలదు.
ఉదా:-
రామ శ్రీరామ సీతాభిరామ! మ మ్మరయుమయ్య!
అంతరాక్కర:- 
౧ సూ. ౨ ఇం. ౧ చం. యతి: ౩ వ గణము చివరి అక్షరము.
మూడవ గణము తుది వర్ణము యతి స్థానము. కవి జనాశ్రయము, కావ్యాలంకార చూడామణులను బట్టి చూచినచో ౪ వ గణము మొదటి అక్షరము యతిస్థానముగా తెలియును. 
ప్రాస నియమము కలదు.
ఉదా:-
రాము కనుగొంటి సుందరారామమందు
అల్పాక్కర:- 
౨ ఇం. ౧ చం. 
౩ వ గణము మొదట యతి యుండును.
ప్రాస నియమము కలదు.
ఉదా:-
శ్రీరామ చంద్రుఁడు క్షేమ మిచ్చు.
షట్పదము:- 
౬ ఇంద్ర గణములు + ౧ చంద్రగణము = ౭ గణముల లోను 
౧వ, ౨వ ఇంద్రగణములు మొదటి పాదమునందును,
౩వ, ౪వ, ఇంద్రగణములు రెండవ పాదమునందును,
౫వ, ౬వ, ఇంద్ర గణములు, ౧ చంద్రగణము మూడవ పాదమునందును వచ్చును, అట్టివి మూడు + మూడు =  పాదములు మొత్తం ఆరు పాదములు షట్ పదముగా ఒప్పిదమై యుండును.
౬పాదములందు అమరి యుండునది అగుటచే ఇది షట్ పదమనబడును.
యతి ఉండదు.
ప్రాస నియమమున్నది.
ఉదా:-
శ్రీ రామ! జయరామ!
ధీరాత్మ! నీ ప్రేమ
ధారాళముగ గొన్నధన్య సీత!
కారుణ్య మును జూపి
నీరూప మును జూపి,
కోరిన ముక్తిని కొలుపుమయ్య!
జై శ్రీరామ్.
జైహింద్.

23, మార్చి 2011, బుధవారం

బ్రహ్మశ్రీ మంగి పూడి వేంకట రమణ మూర్తి భాగవతార్.

4 comments

బ్రహ్మశ్రీ మంగి పూడి వేంకట రమణ మూర్తి భాగవతార్.
ఆంధ్రామృత పాన లోలులారా! మనమిదివరకు ఎందరో మహాను భావులను గూర్చి వినడంలో అనాసక్తత చూప లేదు. మహానుభావులను తెలుసుకోవాలనే ఆసక్తితో ఎక్కడెక్కడికో వెళ్ళి వారిని కలుసుకొని, జన్మ చరితార్థమైందని సంతోషిస్తుంటాం. అలాంటిది ఆ పరమేశ్వరుని కృపావృష్టి నాపై కురవడంతో తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన హరికథా విద్వాంసులు బ్రహ్మశ్రీ మంగి పూడి వేంకట రమణ మూర్తి భాగవతార్ మైత్రీ సంబంధంతో నాయింటికి వచ్చి మా గృహాన్ని పావనం చేసారని మీకు తెలియఁ జేయడానికి చాలా ఆనందంగా ఉంది.
మన మిదివరలో భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారినుద్దేశించి వారు వ్రాసిన బుర్ర కథను కూడా మన ఆంధ్రామృతం ద్వారా అనేక మందికి అందఁ జేయటం జరిగింది. వారు ప్రస్తుతం కార్యార్థులై మన భాగ్య నగరంలోనే ఉన్నారు. అనేక ప్రాంతాల్లో వారు హరి కథలు, ప్రవచనములు, భువన విజయాది ప్రదర్శనలు ఇస్తున్నారు.
మాయింటికి ఆ మహాను భావుని రాక మా అదృష్టం. పరమ భాగవతోత్తములైన వీరి యొక్క భగవత్ప్రార్థనలు మన రాష్ట్రమును సస్యశ్యామలంగా మంగళాకరంగా చేసి కాపాడాలని కోరుకొంటున్నాను.
జై శ్రీరాం.
జైహింద్. 



19, మార్చి 2011, శనివారం

సంపత్కుమారాచార్య కలం నుండి జాలువారిన మాతృహృదయ సౌకుమార్యం.

1 comments


కోవెల సంపత్కుమారాచార్య
26 జూన్ 1933 - 6 ఆగస్ట్ 2010

సంపత్కుమారాచార్యులు పండితుడు, పరిశోధకుడు మాత్రమే కాదు, కవి కూడ.  యశోద అనే ఖండికలోని మొదటి పద్యము మాతృహృదయాన్ని ఎంత చక్కగానో చిత్రించింది. మీరూ చూడండి.

  1. ఈ చలిగాలిలో బయట కేగకురా పసితండ్రి! ఇంత ఈ
    కాచిన ఆవుపాలను చకాచక త్రాగి, మనింటిలోనె నీ
    తోచిన ఆటలాడు. మరి దుందుడుకుందన మిన్ని నాళ్లుగా
    సైచితిఁ గాని, చూడుమిక సైచను సుంతయు నింక మీదటన్!

17, మార్చి 2011, గురువారం

నే విరచించిన శివాష్టకముపై వల్లభవఝల కవిగారి స్పందన.

2 comments

శ్రీమాన్ వల్లభవఝల నరసింహ మూర్తి కవి
అక్షరాలు పెద్దగా కనపడాలంటే పద్యంపై క్లిక్ చెయ్యండి.
జైశ్రీరాం
జైహింద్.

15, మార్చి 2011, మంగళవారం

శ్రీ వల్లభవఝల కవి కృత తోటక వృత్త గర్భ చంపక మాల.

1 comments


11, మార్చి 2011, శుక్రవారం

శ్రీమాన్ వల్లభ వఝల కవి కృత విలోమ కందము.

2 comments



7, మార్చి 2011, సోమవారం

సప్తతి పూర్తి అభినందనలు.

2 comments

పూజ్యులైన మా బావగారు శ్రీ లింగాల శ్రీనివాసరావు, సప్తతి పూర్తి మహోత్సవము సందర్భముగా
మా అక్కగారు శ్రీమతి లింగాల జానకి,బావగారు శ్రీ లింగాల శ్రీనివాస్ దంపతులకు అభినందనలు.
శ్రీరస్తు                                         శుభమస్తు                                     అవిఘ్నమస్తు.
స్వస్తి శ్రీ చాంద్రమాన వికృతి నామ సంవత్సర ఫాల్గుణ శుద్ధ తదియా సోమ వారం అనగా తే.07 - 03 - 2011నాటికి 
సప్తతి వర్ష ప్రాయులు అయిన సందర్భముగా పూజ్యులు శ్రీ లింగాల జానకీ శ్రీనివాస్ పుణ్య దంపతులకు
( హైదరాబాదు ) వనస్థలిపురం పంచముఖ ఆంజనేయ స్వామి వారి కోవెల సమీపం లో
సప్తతి పూర్తి మహోత్సవము జరుపుచున్న సందర్భముగా బంధు మిత్రులు సమర్పించిన  
"అభినందన మందార మాల  "
రచన:- చింతా రామ కృష్ణా రావు
ఉ:- శ్రీ కమనీయ భావ పరి సేవిత పాద సహస్ర మూర్తి, జ్ఞా
నైక సువేద్య మూర్తి, శుభమెన్ని యొసంగెడి శ్రీనివాసు డీ
శ్రీకర పూర్ణ సప్తతి విశేష మహోత్సవ మూర్తి, జానకిన్
జే కొని గొల్చు వేళను విశేష ఫలంబు లనంత మిచ్చుతన్.
ఉ:- జానకిఁ బత్నిగా బడసి, చక్కని జీవన మార్గమందు సు
జ్ఞాన కళా నిధానులగు చక్కని బిడ్డలఁ గాంచి, వారికిన్
ప్రాణముగా చరించి, వర భాగ్య నిధాన మనంగ నొప్పు శ్రీ
జానకి శ్రీనివాసులకు సప్తతి పూర్తి శుభంబుఁ గూర్చుతన్.
మ:- వర లింగాల సుధాంబుధిన్ వెలసి, శోభల్ గూర్చి  సుబ్బమ్మకున్,
గురు వర్యుండుగ పేరుఁ గన్న విల సద్గోత్రుండు సన్యాసికిన్,
చెరియించే మిముఁ జూడ మాకు శుభల్ చేకూరు నిత్యంబు. సుం
దరభావాశ్రయ సమ్మదుల్ కలిగి యౌదార్యంతో వెల్గుడీ!
క:- లక్ష్మియు రామేశమ్మును - లక్ష్మీ సాయిలును మిమ్ము లక్ష్యము తోడన్
లక్ష్మీ ప్రదముగ చూచును - సూక్ష్మ జ్ఞత కలిగి సతము. శోభిలఁ జేయున్.
క:- పౌత్రీమణి యగు మేఘన - పౌత్రీమణి స్ఫూర్తి, గొలుపు ప్రాశస్త్యము. దౌ
హిత్రుఁడు చైతన్యయు, దౌ - హిత్రుఁడు చందనయు, మీకు హితమును గూర్చున్.
సీ:- ఏ నాడు పుణ్యంబు నెలమిఁ జేసిరొ మీర -  లింత చక్కని బిడ్డ లిటులఁ గలిగె.
సప్తతి పూర్ణంబు సమయంబుఁ గణియించి -  తృప్తినీ యుత్సవ స్ఫూర్తిఁ గొలిపె.
ఈనాటి మీ యోగ మెన్న నెవ్వరికబ్బు? -  ఆది దంపతు లన నలరుచుండ్రి.
పుత్రుఁడు, కోడలు, పుత్రిక, యల్లుండు, -  మనుమలు, మీదగు మనుమరాండ్రు,
గీ:- భక్తి భావాన మిముఁ జేరి పరవశించి, - శక్తి కొలది మీ సేవలు రక్తి తోడ
చేయు చుండిరి, క్షేమంబు సిరులు గొలుప. - మీకు శ్రీనివాస్ జానకీ! మేలు కలుగు.
పంచచామరము:-
మహాత్ములార! దైవ భక్తి, మాన్య వర్తనంబులన్ 
మహేశుడే గణింప నుండి, మాకు మార్గ దర్శమై
మహిన్ వసించు చుండుడీ! మరిన్ని వత్సరంబులున్. 
సహస్ర చంద్ర దర్శనంబు చక్క నౌత మీకికన్.
( మత్తకోకిల గర్భ ) సీసము:-
మూడు కోట్ల సురల్, ప్ర పూజ్యుఁలు, ముఖ్యులున్, -  మిము నెల్లెడన్ బ్రేమ మీర దయను
తోడుగా నడయాడి వేడుక తోడ మి -  మ్ములఁ గాచుచున్ శుభ మూర్తు లగుచు,
వాడిపోని వసంత భాగ్యము పాదుకొ -  ల్పుత నిత్యమున్ మీకు స్తుతము గాను.
జాడకైనను నష్ట మేడను సల్పకుం -  డను గాంచెడున్, సుధల్ గనగఁ జేయు.
గీ:- మంగళం బగు జానకీ ! మంగళంబు. -  మంగళం బగు శ్రీనివాస్ ! మంగళంబు.
మంగళం బగు సంతుకు మంగళంబు. - మంగళం బగు జగతికి మంగళంబు. 
మంగళం                      మహత్                   శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ


5, మార్చి 2011, శనివారం

శ్రీ వల్లభవఝల కవి విరచిత చతుర్విధ కందము.

7 comments

జైశ్రీరామ్.
 శ్రీ వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి కవి.
జైహింద్.

3, మార్చి 2011, గురువారం

భక్తితో మీరున్నంత కాలం మీ వెంటే మేముంటాము.

2 comments


నిన్నంతా మహా శివ రాత్రి అని, 
మీ హృదయ కైలాసంలో మమ్ములను ప్రతిష్ఠించి, 
దివ్యమై భక్తి భావంతో ఉపవసించి, 
అభిషేకాలు చేసి, 
జాగరణ చేసి, 
నా భక్త బాంధవుఁడు 
చింతా రామ కృష్ణా రావు వ్రాసిన 
శివాష్టకం పారాయణ చేసి, 
మా యెడ విధేయతతో, 
అంకిత భావంతో ప్రవర్తించి, 
సేవించిన మీకు 
మా పరిపూర్ణమైన అనుగ్రహం లభిస్తుంది.
పలుపలు రూపముల్ కలిగి భక్తుల కేమగుపించుచుండగా
కలుషిత భావ జాలము కకావిక చేసి, చలింపఁ జేయగా,
నిలుపగ లేక మీ మనసు నిశ్చల భక్తిని చూపి మాపయిన్
కలత వహింపనేల? మిముఁ గాంతుము మేము శుభంబు లిచ్చుచున్.
మమ్ములనెట్లు కొలవాలో మీకు తెలిసినప్పుడు 
మిమ్ములనెట్టులనుగమించాలో మాకు తెలియదా?
భక్తితో మీరున్నంత కాలం మీ వెంటే మేముంటాము.
శుభమస్తు.
సన్మనోవాంఛా ఫల సిద్ధిరస్తు. 

2, మార్చి 2011, బుధవారం

పాఠకులకు మహా శివరాత్రి శుభాకాంక్షలు. నే విరచించిన శివాష్టకము. ఏ ఛందస్సులో వ్రాసానో చెప్పుకోండి చూద్దాం?

15 comments

ఓం నమశ్శివాయ.
౧. శివా! భవా! నమో నమః! విశేష భక్త వత్సలా!
భవాని వామ భాగమందు భవ్యమై వసింపగా
నవీన దివ్య తేజసంబు నాట్యమాడు నీదరిన్.
నివాసముండు నామదిన్. వినీల కంధరా! శివా!
౨. నమశ్శివా!నమశ్శివా! ప్రణామమో సదాశివా!
నిమీలితాక్ష! నీల కంఠ! నీ కృపా కటాక్షముల్
ప్రమోదమందఁ జేయుగా, ప్రభావపూర్ణ తేజమై.
నమస్కరింతునయ్య నీకు.నన్ను గాంచుమా! శివా!
౩. శశాంక శేఖరా! హరా! విశాల నేత్ర! సుందరా!
ప్రశాంత చిద్విరాజమాన భవ్య  భక్త వత్సలా!
నిశీధిలో విశేష కాంతి నింపి లింగమూర్తిగా
నశేష భవ్య భక్త కోటి యార్తిఁ బాపితే! శివా!
౪. ఉపాసనా ప్రభావ మెన్న నో హరా! పొసంగునే?
కృపా నిధీ! ఉపాసకుల్ నిరీక్షణన్ నినున్ గనన్
ప్రపూజ్యమాన దివ్య తేజ భద్ర లింగ దర్శనం
బపూర్వ మై యమేయమై న హాయి గొల్పుగా! శివా!
౫. సమస్త దోష హారి వంచు జాగరంబుఁ  జేసి,నిన్
ప్రమోద మందఁ జేయఁ బూను భక్త కోటి. గాంచితే?
క్షమింపుమా దురాత్ములన్.విశాల నేత్రుఁడా!హరా!
నమామి భక్త వత్సలా! ప్రణామమందుమా! శివా!
౬. సరోరుహాననా! నినున్ ప్రసన్నతన్ కనుంగొనన్
ధరాతలంబునన్ బుధుల్ ప్రతాపమొందు.నిత్యుఁడా!
దురాత్ములైన గాని నిన్ను దోయిలించి మ్రొక్కినన్
కరావలంబమిచ్చి దీక్షఁ గాచు చుందువే! శివా!
౭. ప్రదీప్త దీప మొక్కటైన భక్తి నీదు సన్నిధిన్
ముదంబుతో వెలుంగఁ జేసి పూజ చేయు వారికిన్
సదా సుయోగ భాగ్యమిచ్చి, సత్ కృపన్ గ్రహింతువే!
మదీయ చిత్తసంస్థితా! నమోనమో నమశ్శివా!
౮. దురంత దుష్కృతంబులేను దుర్మదాంధ వర్తినై
నిరంతరంబు చేసితో! వినీతునై చెలంగితో.
కరంబు నిచ్చి గాచితీవు గౌరవంబుదక్కెరా!
వరంబు నాకు నీ యుదార భావమీశ్వరా! శివా!
౯. ఈ యష్టక పాఠకులకు
శ్రేయంబును గొల్పు మీశ! చిన్మయ రూపా!
నీ యాజ్ఞనిటుల వ్రాసితి
మాయల నెడఁ బాపుమయ్య! మా దేవ! శివా!  
ఆంధ్రామృత పాఠకులకు వికృతి నామ సంవత్సర శివరాత్రి సందర్భంగా ఆ పరమేశ్వరుని కృపా కటాక్ష వీక్షణలు పుష్కలంగా ప్రసరించాలని ఆకాంక్షిస్తూ, శుభాకాంక్షలు తెలియఁ జేస్తున్నాను.
ఓం నమశ్శివాయ.
జైహింద్.