గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

30, జూన్ 2015, మంగళవారం

మహా పాశుపత మంత్ర ప్రయోగము, హోమము.

2 comments

జైశ్రీరామ్.
పాశుపత మంత్ర ప్రయోగము
శివ ఆరాధనలలో అత్యంత క్లిష్టమైనది, ప్రత్యక్ష ఫలదాయకమైనది ఈ పాశుపత మంత్రము. పూర్వ కాలములో అర్జునునికి కృష్ణుని ద్వారా ఈ పాశుపత మంత్ర విధానము బోధించబడినది. అర్జునుడు దీని ద్వారా శతృంజయమైన పాశుపతాస్త్రాన్ని పొందాడు. 
పాశుపతము రుద్ర సంపుటి ద్వారా చేయవలయును. రుద్రమునందలి 169 మంత్రములతో మనకు కావలసిన మంత్రమును సంపుటీకరించి శివునికి అభిషేకం చేయాలి. ఉదాహరణకు ఆరోగ్యాన్ని, ఆయుర్వృద్ధిని ఇచ్చే అమృత పాశుపతమును చేస్తున్నప్పుడు ముందుగా పాశుపత మంత్రమును చెప్పాలి. 
ఓం హౌం ఓం జూం ఓం సః ఓం భూః ఓం భువః ఓం స్వః 
ఓం త్య్రంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం । 
ఉర్వారుకమివ బంధనాన్మృత్యోర్ముక్షీయమామృతాత్‌ ।। 
ఓం స్వః ఓం భువః ఓం భూః ఓం సః ఓం జూం ఓం హౌం ఓం స్వాహా। 
ఇది సంపుటి చేయవలసిన మంత్రం. 
ఈ మంత్రం చెప్పాక రుద్రం లోని ఒక మంత్రం చెప్పాలి. 
ఆ తర్వాత మళ్లీ త్య్రంబకం చెప్పాలి. 
ఆ తర్వాత మళ్లీ త్య్రంబకం చెప్పి రుద్రంలోని తర్వాతి మంత్రాన్ని చెప్పాలి. 
ఇలా 169 రుద్ర మంత్రములను సంపుటీకరిస్తే అది ఒక పాశుపతం అవుతుంది. ఇది గురుముఖతః నేర్చుకొని, మంచి అనుభవజ్ఞులతో చేయించుకొన్నచో మంచి ఫలితములను ఇస్తుంది. 
ఈ పాశుపత మంత్రములు ప్రధానముగా 14 రకములు. 
1. మహా పాశుపతము 
2. మహాపాశుపతాస్త్ర మంత్రము 
3. త్రిశూల పాశుపతము 
4. ఆఘోర పాశుపతము 
5. నవగ్రహ పాశుపతము 
6. కౌబేర పాశుపతము 
7. మన్యు పాశుపతము 
8. కన్యా పాశుపతము 
9. వరపాశుపతము 
10. బుణ విమోచన పాశుపతము 
11. సంతాన పాశుపతము 
12. ఇంద్రాక్షీ పాశుపతము 
13. వర్ష పాశుపతము 
14. అమృత పాశుపతము 
విధానము: 
1. మహాపాశుపతము: 
మంత్రము: నమశ్శంభవేచ మయోభవేచ నమశ్శంకరాయచ మయస్కరాయచ నమశ్శివాయచ శివతరాయచ।। 
ఈ మంత్రమును 169 రుద్రమంత్రములతో సంపుటీకరించి శివునికి అభిషేకించాలి. 
అభిషేక ద్రవ్యములు: పంచామృతములు మరియు ఇతర అభిషేక ద్రవ్యములు. 
ఫలము: ఈ మహా పాశుపత మంత్ర రాజముతో సమానమగు మంత్రము ముల్లోకములలో ఎక్కడను లేదు. దీని వలన రాజ్యాధికారము ఎట్టి కార్యమైననూ శీఘ్రముగా అగుటకు ఈ మంత్రమును చేయించవలయును. 
2. మహాపాశుపతాస్త్ర మంత్రము: 
మంత్రము: క్రాం క్రీం క్రోం ఘ్రం క ఎ ఇ ల హ్రీం నమశ్శంభవేచ మయోభవేచ నమశ్శంకరాయచ మయస్కరాయచ నమశ్శివాయచ శివతరాయచ।। 
ఈ మంత్రమును 169 రుద్రమంత్రములతో సంపుటీకరించి శివునికి అభిషేకించాలి. 
అభిషేక ద్రవ్యములు: పంచామృతములు మరియు ఇతర అభిషేక ద్రవ్యములు. 
ఫలము: సర్వ కార్య సిద్ధి, వాంఛితార్థ ఫలదాయిని. 
3. త్రిశూల పాశుపతము: 
దీని విధానము మిగతా పాశుపతములకంటే భిన్నంగా ఉంటుంది. దీనిలో మొదట నమకమును, తరువాత పురుషసూక్తమును తదనంతరము చమకమును పఠించిన యెడల ఈ పాశుపత విధానము పూర్తి అగును. ఇది అపమృత్యుహరము. 
4. అఘోర పాశుపతము: 
మంత్రము: ఓం అఘోరేభ్యో2ధఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః। సర్వేభ్య స్సర్వ శర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః।। 
ఈ మంత్రమును రుద్రముతో సంపుటము చేసి శివుణ్ణి అభిషేకించినచో ఈ మంత్రసిద్ధి అగును. 
అభిషేక ద్రవ్యములు: దీనికి పంచామృత అభిషేకముతో పాటు అష్టపుష్పపూజ, క్షీరాన్న నివేదనము చేయవలసియుండును. 
ఫలము: అపమృత్యుహరం. 
5. నవగ్రహ పాశుపతము: 
మంత్రము: ఓం క్లీం శ్రీం ఐం హ్రీం గ్లౌం రం హుం ఫట్‌ 
విధానము: పైన ఇచ్చిన మంత్రముతో రుద్ర సంపుటి గావించి శివుణ్ణి అభిషేకించాలి. 
అభిషేక ద్రవ్యము: పంచామృతములు, బిల్వపత్రములు, అష్టపుషములు, క్షీరాన్నము ఈ అభిషేకమునకు కావలసియుండును. 
ఫలము: నవగ్రహ పీడా పరిహారము. జాతకంలోని గ్రహదోష నివృత్తికి, గోచార గ్రహదోష నివృత్తికి ఈ పాశుపత మంత్రము అత్యంత ఫలదాయి. 
6. కౌబేర పాశుపతము: 
మంత్రము: రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే । 
నమో వయం వై శ్రవణాయ కుర్మహే। 
సమే కామాన్కామ కామాయ మహ్య।్‌ 
కామేశ్వరో వైశ్రవణో దదాతు। 
కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః। 
ఈ పై మంత్రముతో 169 రుద్రమంత్రములను సంపుటము చేసిన యెడల కౌబేర పాశుపతమనబడును. 
ద్రవ్యము: ఆవునెయ్యి తో అభిషేకము, బిల్వపత్ర పూజ, మౌద్గదన నివేదన 
ఫలము: ఐశ్వర్యాభివృద్ధి. ఆర్థిక లాభములు. 
7. మన్యు పాశుపతము: 
మంత్రము: సంపృష్టం ధనముభయం సమాకృతమస్మభ్యం దత్తాం వరుణశ్చమన్యుః। 
భియం దధానా హృదయేషు శత్రవః పరాజితాసో అపనిలయం ।। 
పై మంత్రముతో 169 రుద్రమంత్రములను సంపుటము చేసిన యెడల అది మన్యుపాశుపతమనబడును. 
ద్రవ్యము: ఖర్జూర ఫల రసాభిషేకము, జమ్మి పత్రి పూజ, మాషచక్ర నివేదన. 
ఫలము: ఈ పాశుపతము వలన శతృబాధానివారణమగును. 
8. కన్యా పాశుపతము: 
మంత్రము: ఓం పావీ రవీ కన్యా చిత్రాయుస్సరస్వతీ వీరపత్నీధియంధాత్‌ । 
జ్ఞ్నాభిరచ్చిద్రగ్‌ ం శరణగ్‌ ం సజోషా దురాద్ష్రం గృణతే శర్మయగ్‌ ం సత్‌ ।। 
ఈ మంత్రమును 169 రుద్రమంత్రమంత్రములచే సంపుటితము చేసిన యెడల కన్యాపాశుపతమనబడును. 
అభిషేక ద్రవ్యము: పంచదార (మెత్తగా పొడిచేయాలి) అభిషేకము కొరకు, కరవీర పుష్పములు పూజ కొరకు, చక్కెర పొంగలి నివేదన కొరకు. 
ఫలము: ఈ మంత్రము వలన ఇష్టకన్యాప్రాప్తి, వివాహము కాని పురుషులకు తొందరగా వివాహం అవటం ఫలములుగా చెప్పబడ్డాయి. 
9. వర పాశుపతము: 
మంత్రము: ఓం క్లీం నమో భగవతే గంధర్వరాజ విశ్వావసో మమాభిలషితం వరక్షిప్రం ప్రయచ్ఛ స్వాహా।। 
ఈ మంత్రముతో 169 రుద్రమంత్రములను సంపుటితం చేసిన యెడల అది వర పాశుపతం అగును. 
అభిషేక ద్రవ్యము: పంచదార (మెత్తగా పొడిచేయాలి) అభిషేకము కొరకు , కరవీర పుష్పములు పూజ కొరకు, చక్కెర పొంగలి నివేదన కొరకు. 
ఫలము: ఈ పాశుపతం వలన ఇష్ట వర ప్రాప్తి, వివాహం కాని కన్యలకు శీఘ్రముగా వివాహం అవటం ఫలములుగా చెప్పబడ్డాయి. 
10. ఋణ విమోచన పాశుపతం : 
మంత్రము: ఆనృణా అస్మిన్ననృణాః పరస్మిగ్గ్‌ న్తృతీయే లోకే అనృణాస్యామా। యే దేవయానా ఉత పితృయాణా సర్వాంపథో అన్నణా ఆక్షియేమ।। 
ఈ మంత్రముతో 169 రుద్ర మంత్రములను సంపుటితము చేసిన యెడల అది  బుణ విమోచక పాశుపతమగును. 
అభిషేక ద్రవ్యములు: అభిషేకము కొరకు చెఱకు రసం, పూజ కొరకు వాకుడు పువ్వులతో పూజ, ఆవునేయి నైవేద్యం కొరకు. 
ఫలితం : బుణ బాధనుంచి విముక్తి 
11. సంతాన పాశుపతము : 
మంత్రము: ఓం కాణ్డాత్కాణ్డాత్ప్రరోహంతీ పరుషః పరుషః పరీ। ఏవానో దూర్వే ప్రతను సహస్రేణ శతేనచ।। 
ఈ మంత్రముతో 169 రుద్ర మంత్రములను సంపుటితము చేసిన యెడల అది బþల్³సంØతాçనò విమోచక పాశుపతమగును. 
అభిషేక ద్రవ్యములు: పంచామృతములు, దూర్వాలు(గరిక) -అభిషేకం కొరకు, బిల్వ పత్రములు, అష్ట పత్రములు- అభిషేకము కొఱకు, అపూపములు(అప్పడములు), క్షీరాన్నము నైవేద్యము కొరకు. 
ఫలము: సంతాన ప్రాప్తి. 
12. ఇంద్రాక్షీ పాశుపతము: 
మంత్రము: భస్మాయుధాయ విద్మహే। రక్త నేత్రాయ ధీమహీ। తన్నో జ్వరః ప్రచోదయాత్‌ । 
ఈ మంత్రముతో 169 రుద్ర మంత్రములను సంపుటితము చేసిన యెడల అది ఇంద్రాక్షీ పాశుపతమగును. 
అభిషేక ద్రవ్యములు: భస్మము ( భస్మోదకముతో అభిషేకము చేయాలి.) అష్ట పుష్పములు, బిల్వ పత్రములు పూజ కొరకు, మాష చక్రము నివేదన కొర కు. 
ఫలితము: నిరంతరము అనారోగ్యములు, జ్వరములతో బాధ పడువారు ఈ పాశుపతము చేసినచో అన్ని రకాల అనారోగ్యముల నుంచి దూరమవుతారని ఫలితము చెప్పబడ్డది. 
13. వర్ష పాశుపతము: 
మంత్రము: నమో రుద్రేభ్యో యే దివియేషాం వర్షమిషవస్తేభ్యో దశ ప్రాచీర్దశ దక్షిణా దశ ప్రతీచిర్దశోదీచిర్దశోర్ధ్వాస్తేభ్యో నమస్తేనో మృడయంతు తేయం ద్విశ్మోయశ్చవో ద్వేష్టితం వో జంభే దధామి. 
ఈ మంత్రముతో 169 రుద్ర మంత్రములను సంపుటితము చేసిన యెడల అది వర్ష పాశుపతమగును. 
అభిషేక ద్రవ్యములు: పంచామృతములు, నారికేళములు అభిషేకము కొరకు, బిల్వపత్రములు అర్చన కొరకు, క్షీరాన్నము నివేదన కొరకు 
ఫలము: ఇది లోక కళ్యాణార్థము చేయబడే పాశుపతము. సకాల వర్ష ప్రాప్తి, కరువు కాటకముల నివారణ దీని ఫలములు. 
14. అమృత పాశుపతము: 
మంత్రము:ఓం హౌం ఓం జూం ఓం సః ఓం భూః ఓం భువః ఓం స్వః 
ఓం త్య్రంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం । 
ఉర్వారుక మివ బంధనాన్మృత్యోర్ముక్షీయమామృతాత్‌ ।। 
ఓం స్వః ఓం భువః ఓం భూః ఓం సః ఓం జూం ఓం హౌం ఓం స్వాహా। 
ఈ మంత్రముతో 169 రుద్ర మంత్రములను సంపుటితము చేసిన యెడల అది అమృత పాశుపతమగును. 
అభిషేక ద్రవ్యము: అభిషేకము కొరకు పంచామృతములు, పూజ కొరకు బిల్వ పత్రములు. 
ఫలము: ఈ పాశుపతము అన్నింటిలోకి ముఖ్యమైనది. ఇది అపమృత్యు హరము. సకల ఐశ్వర్య ప్రదము. 





జైహింద్.

29, జూన్ 2015, సోమవారం

పరమ ప్రయోజనకర శ్రీసూక్త రహస్యార్ధము

1 comments

జైశ్రీరామ్.
శ్రీసూక్త రహస్యార్ధము
వేదముల యందు మహా శక్తి వంతమయిన మంత్రములలో పురుష సూక్తము,  శ్రీ సూక్తము, నారాయణ సూక్తము, దుర్గా సూక్తము మొదలగునవి వేదమునకు శిరస్సు వంటివి.  వేదము అంటే జ్ఞానము, జ్ఞానమంటే వెలుగు, వెలుగు అంటే ఆనందము,   ఆనందమే శ్రీమహాలక్ష్మి. వేద స్వరూపిణి, వేద మాత అయిన శ్రీమహాలక్ష్మి యొక్క మంత్ర౦, వేదాన్తర్గతమైన శ్రీసూక్తము, సమస్త దారిద్ర్యములను పోగట్టగలిగే ఏకైక మహా మంత్రము.
శ్రీ సూక్తము యొక్క విశేష ప్రాశస్త్యము గురించి ఇప్పుడు మనము చర్చించుకొనెదము.
జీవుల పుట్టుకకు కారణమైన ప్రకృతి పురుషులలో ప్రకృతి స్వరూపిణి యైన జగన్మాతయగు శ్రీ మహాలక్ష్మిని ఉపాసించు మంత్రమే శ్రీ సూక్తము. ముగ్గురమ్మలలో ఒకరైన శ్రీదేవి  ఈ సూక్తమునకు అధిష్టాన దేవత. పదిహేను ఋక్కులతో, పదిహేను వేదమంత్రములతో శ్రీ మహాలక్ష్మి కీర్తింప బడినది. పాడ్యమి మొదలుకొని పౌర్ణమి వరకు గల 15 రోజులలో, 15 కళలతో, రోజుకు ఒక్కో కళ చొప్పున వృద్ది చెందుతూ పౌర్ణమి నాటి చంద్ర బింబములో షోడశిగా వెలుగొందే జగన్మాత యొక్క చంద్ర కళకు రహస్య సంకేతమిది.  గురుముఖత: నేర్చుకొని, స్వరయుక్తముగా సామాన్యుడు సహితము ఈ సూక్తమును ఉపాసించ వచ్చును.
దారిద్ర్య నాశనము కొఱకు, దుఖ నాశనము కొఱకు, కష్టములు తొలుగుట కొరకు, అన్న వస్త్రములు సమృద్ధిగా ఉండుట కొఱకు, సౌఖ్యము, సౌభాగ్యము, సౌందర్యము కొఱకు ఈ ఉపాసన చేయవచ్చును. అష్ట్యైశ్వర్య సిద్ధి, అధికార ప్రాప్తి, మహా భాగ్యము, భోగము, ఆనందము, సుఖ సంతోషముల కొఱకు, శాంతి కొఱకు, సత్సంతానము, వంశాభి వృద్ధి, మోక్ష ప్రాప్తి కొఱకు ఈ శ్రీ సూక్త పఠనము చేయుట చాలా చాలా ఉత్తమము.
వేదములను, మంత్ర శాస్త్రములను ఔపోసన పట్టిన వారికి మాత్రమే, నిగూడార్ధముతో ఉన్న ఈ మంత్ర సూక్తము యొక్క రహస్యములు తెలియును.  ఐదు వందల సంవత్సరములకు పూర్వము శ్రీ విద్యారణ్య మహా స్వామి శ్రీసూక్త రహస్యార్ధములను తమ భాష్యములో చాలా వివరముగా తెలిపి వున్నారు. భక్తీ, గౌరవములతో శ్రీసూక్త ఉపాసనా మంత్ర రహస్యములను తెలుసుకొనవలెనని, ఆసక్తి కలిగిన వారు ఇది పఠి౦చి సకల భోగ భాగ్యములను, ఆనందములను  పొందగలరని ఆశింతుము. సమస్త దారిద్ర్యములను పోగట్టగలిగే ఏకైక మహా మంత్రము ఈ శ్రీసూక్తం. ఇది అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనది. శ్రీసూక్తంతో అమ్మ వారికి  అభిషేకము చేయుట లోకాచారము.
1. హిరణ్య వర్ణాం హరిణీ౦ సువర్ణ రజతస్రజాం!
   చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహా!!
బంగారు వర్ణముతో మెఱయుచు అష్ట్యైశ్వర్యము లను ప్రసాదించునది, హ్రీంకారము కలిగినది, విష్ణువును కలిగినది, సూర్య మరియు చంద్ర నాడులను మెడయందు హారములుగా కలిగినది, చంద్ర సహోదరి, నారాయణ శక్తి అయిన శ్రీ దేవి నన్ను ఆవహించు గాక.
౨. తాం మ ఆవాహ జాతవేదో లక్ష్మీ మనపగామినీం |
   యస్యాం హిరణ్యం విన్దేయం గామశ్వం పురుషా నాహమ్ ||
యజ్ఞ సంపదల నిచ్చు ఓ అగ్నిహోత్రుడా, అష్ట్యైశ్వర్యములను, సిరి సంపదలను, కామధేనువును, మంది మార్బలము, బంధు మిత్ర పరివారమును ప్రసాదించుము. ఏ సమయములయందును మమ్ములను విడువకుండా ఉండునట్లుగా ఆ శ్రీ దేవిని మా యందు ఆవాహన చేయుము.
౩. అశ్వపూర్వా౦ రథమధ్యాం హస్తినాద ప్రబోధినీమ్ |
   శ్రియం దేవీ ముపహ్వాయే శ్రీర్మాదేవీ జుషతామ్ |
ఇచ్చట అశ్వములనగా ఇంద్రియములు, రథమధ్యాం అనగా రథమనేడి శరీర మధ్యమున అనగా మనస్సునందు ఆసీనురాలైన సామ్రాజ్యలక్ష్మీ, గజముల ఘీంకారముతో మేలుకొనెడి ఆ శ్రీ దేవిని శ్రద్ధాభక్తులతో పూజించు చున్నాను. మాతృమూర్తి అయిన ఆ దేవి నన్ను ప్రేమతో  అనుగ్రహించు గాక.
ఈ శ్లోకము ప్రతి దినము సహస్రం చేసిన అధికారం దక్కుటయే గాక, ఎల్లకాలం నిలబడుతుందని దుర్గా కల్పము నందు తెలుపబడినది.
౪. కాంసోస్మితాం హిరణ్య ప్రాకారా మార్ధ్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం,          
     పద్మేస్థితాం పద్మ వర్ణాం తామిహోపహ్వాయే శ్రియం ||
బంగారు వర్ణముతో తయారయిన ప్రాకారమునందు నివసించెడిది, జీవుల మనస్సులయందు ఆర్ద్రతను కలిగించునది, అన్ని కోర్కెలను తీర్చి, జీవులకు తృప్తిని కలిగించునది, పద్మము నందు ఆసీనురాలై యుండెడిది, పద్మము వంటి వర్ణముతో ప్రకాశించునది అయిన శ్రీ మహాలక్ష్మీదేవిని   శ్రద్ధా భక్తులతో ఆశ్రయించుచున్నాను.
ఈ శ్లోకమును ప్రతి నిత్యమూ పఠి౦చుచున్న శ్రీ దేవి యొక్క కృపఁ గలిగి, సమస్త కోరికలు తీరి, జీవితమును సంపూర్ణ ఆనందముతో అనుభవించ గలరు.
౫. చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం,  శ్రియం లోకే దేవ జుష్టాము దారాం
   తాం పద్మినిమీం శరణ మహం ప్రపద్యే అలక్ష్మీర్యే నశ్యతాం త్వాం వృణే ||
చంద్రుని వోలె ప్రకాశించునది, ప్రకృతి యందు విలీనమైనది, తెల్లటి యశస్సు చేత నలుదిక్కులు ప్రకాశించునది, కుండలినీ శక్తిని హృదయ పద్మము నందు వికసింప చేయునది, “ఈ౦” అను బీజాక్షరము చేత ద్యానింప బడునది, దారిద్ర్య దేవతను తరిమివేసి, అష్ట్యైశ్వర్యము లను సిద్ధింప జేయునది అయిన ఆ శ్రీ దేవిని అహం విడిచి శరణు జొచ్చుచున్నాను.
ఈ శ్లోకమును ప్రతి నిత్యమూ వెయ్యి సార్లు పఠి౦చుచున్న అమ్మ అనుగ్రహముతో అఖండ సంపదలు ప్రాప్తించును.
౬. ఆదిత్య వర్ణే తపసోజ్ధిజాతో వనస్పతిస్తవ వృక్షోజ్ధ బిల్వః
   తస్య ఫలాని తపసానుదంతు బాహ్యాంత రాయాశ్చ బాహ్యా అలక్ష్మీ: ||
సూర్య భగవానునితో సమానమైన తేజస్సుతో ప్రకాశించు శ్రీదేవిని, శ్రీ మహాలక్ష్మి అధిష్టాన దేవతగా ఉండేడి బిల్వ వృక్షము క్రింద తపమాచరించు మహాలక్ష్మి యంత్రమునకు పూజలు చేసి మారేడు ఫల సమిధులతో పూర్ణాహుతి చేసిన,  ఆ శ్రీదేవి లోపల, బయట వుండే మాయను పూర్తిగా తోలగించి, జీవుని ఆవహించిన దారిద్ర్యమును నశింప చేయును.
ఈ శ్లోకమును ప్రతి నిత్యమూ వెయ్యి సార్లు పఠి౦చుచున్న, జన్మ జన్మల దారిద్ర్యము కూడా నశించును.
౭. ఉపైతు మాం దేవ సఖః కీర్తిశ్చ మణినాసహ
   ప్రాదూర్భూతోజ్స్మి రాష్ట్రే జ్స్మిన్ కీర్తి మృద్ధి౦ దధాతు మే ||
యక్షులకు అధిపతి, అనంతమైన సంపదలు నిచ్చునది కుబేర మంత్రము, అఖండమైన యశస్సును ఇచ్చేడి చింతామణి మంత్రమును రెండింటితో పాటు ఈ ఏడవ శ్లోకమును జపించిన శ్రీ దేవి మర్త్య లోకమున లేదా జీవుని శరీరము నందు సంపూర్ణారోగ్యము కలిగింప చేసి, అష్ట్యైశ్వర్యములను, కీర్తిని పెంపొందించును గాక.

ఈ శ్లోకమును భక్తితో 44 లక్షల జపము చేసి పూర్ణాహుతి చేసిన వారికీ దారిద్ర్యము నశించి, సంపూర్ణారోగ్యము,   అష్ట్యైశ్వర్యములు కలుగును.
౮. క్షుత్పిపాసా మలాం జ్యేష్టా౦ అలక్ష్మీర్ నాశయామ్యహం
   అభూతి మ సమృద్ధి౦చ సర్వాన్ నిర్ణుద, మే గృహాత్ ||
అలక్ష్మి దేవి, గృహమనేడి శరీరమును ఆవహించిన దారిద్ర్యమును కలుగ చేయును. జ్యేష్టా దేవి ఆవహించిన ఆకలి, అతినిద్ర, దప్పిక, ఆశుభ్రతను కలిగించు బద్ధకము వంటివన్నీ శరీరము యందు కలుగ చేయును, వీటి ఫలితముగా దారిద్ర్యమును అరిష్టములు సంభ విన్చును. కావున ఈ శ్లోకమును పఠి౦చిన ఇటువంటి దారిద్ర్యము అరిష్టము లన్నింటిని శ్రీదేవి నశింపచేసి సౌభాగ్య లక్ష్మిని వాని యందు ఆవహింపజేయును.
పై శ్లోకమును ప్రతి నిత్యమూ 108 పర్యాయములు జపించు చున్న ఆ దేవి కృపచే అలక్ష్మి, జ్యేష్టా దేవి ఇరువురు ఆ సాధకుని నుంచి అతి దూరముగా తొలగి పోవును.
౯. గంధద్వారా౦ దురాధర్షా౦ నిత్యపుష్టాం కరీషిణీ౦
   ఈశ్వరీం సర్వ భూతానాం తామిహోపహ్వాయే శ్రియం ||
పంచ ప్రాణముల యందు ముఖ్యమైన ప్రాణము శ్వాస యందుండును. అటువంటి ప్రాణము, ప్రాణాయామము చేయుటకు, ఉపాసించుటకు, వీలును కల్పించుతున్న ఆత్మ స్వరూపిణి, అనురాగవర్షిణీ, మాతృ స్వరూపిణి, ఈశ్వర శక్తి అయిన శ్రీదేవిని గోమయం తో అలికిన ప్రాంతము నందు ఆసీనులై ఆరాధించిన వారి యందు ధాన్య లక్ష్మిని ఆవహింప జేసి ధన, ధన్య, పశు సమృద్ధిని ప్రాప్తింప జేయును.
ఈ శ్లోకము 5000 పర్యాయములు జపము చేసి దశాంశము హోమ తర్పణము గావించి అన్న దానము శక్తి కొలది గావించిన మంత్రం సిద్దియగును. శ్వాశ మీద జయము కలిగి లక్ష్మీ కటాక్షము కలుగును.
౧౦. మనసః కామమా కూతిం వాచః సత్యమశీమహి
    పశూనాం రూపమన్నస్యమయి శ్రీ: శ్రయతాం యశః ||
మనస్సునందుండు కోరికలు, యిష్టములు సిద్దించుట, వాక్సిద్ధి మరియు అన్న వస్త్ర గో సంపద, రూప సంపద, లక్ష్మీ సంపదలను ఎల్లప్పుడూ నా యందు స్థిరముగా ఉంచమని శ్రీలక్ష్మీ దేవిని భక్తీ తో ఆశ్రయించు చున్నాను.
ఈ శ్లోకమును దీక్షతో మనస్సును, వాక్కును పవిత్రముగా నుంచి 8 లక్షల సార్లు జపించిన అనంతరం ప్రతినిత్యం 108 సార్లు జపించు చున్న భోగ భాగ్యములు, అన్న వస్త్రములు, గో సంపద, పాడి పంటలు అభివృద్ధి చెంది వాక్ సిద్ధి  కలుగును.
౧౧. కర్ధమేన ప్రజాభూతా మయి సంభవ కర్దమ
    శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీం ||
కర్దమ మహర్షి కోరికపై స్వయముగా లక్ష్మీ దేవి ఆయన కూమార్తేయై జన్మించినది. సర్వ జగత్తుకు మాతృమూర్తి అయినది, శరీరము నందలి మూలాధార పద్మము మొదలుకొని సహస్రార దళ కమలముల వరకు వెన్నును దండము వలే ధరించునట్టి, శ్రీ మహాలక్ష్మి నా వంశమునందు స్థిరముగా నివాసమును ఏర్పరచు కొనవలెను.
ఈ శ్లోకమును దీక్షతో లక్ష సార్లు జపించిన వారికి, సంతానముతో బాటు అష్ట్యైశ్వర్యములు కలుగును.
౧౨. ఆపః సృజంతు స్నిగ్ధాని చిక్లీత వసమే గృహే
    నిచ దేవీం మాతరం శ్రియం వాసయమే కులే ||
సృష్టికి కారణమైన మన్మధుడు లక్ష్మీ దేవి పుత్రుడు. మాయ అయిన ఈ సంసార బంధములను, ఆ కామ దేవునిని జయంచ వలెనన్న నారాయణ శక్తి యగు నారాయణిని ప్రార్ధించి, ఆమె అనుగ్రహము పొంది మోక్షము పొంద వచ్చును. ఇంకను జగన్మాత స్వరూపిణి అయిన ఆ మహాలక్ష్మిని మా వంశాభి వృద్ధిని చేయమని సదా ప్రార్ధన చేయు చున్నాను.
మారేడు చెట్టు క్రింద 64,000 జపము చేసి, అన్నదానము చేసిన ఈ మంత్ర సిద్ధి కలిగి వంశాభి వృద్ధి కలిగి అమ్మ స్థిర నివాసము ఏర్పరుచు కొనును.
౧౩. ఆర్ద్రాం పుష్కరిణీ౦ పుష్టిం పింగళా౦ పద్మ మాలినీం
    చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ  ||
బంగారు వర్ణముతో మెరయుచున్న ఇడ పింగల నాడులు అనగా సూర్య చంద్ర నాడులను ధరించి కుండలినీ  శక్తిని మేల్కొలిపినందు వలన కలిగిన అపరితమైన ఆనందముచే కలిగిన ఆర్ధ్రతచే వచ్చిన కన్నుల యందు నీటితో తడిసినది, అన్న వస్త్రములను భక్తులకు ఇచ్చునటువంటి ఆ మహా తల్లి నన్ను ఆవహించుగాక.
౧౪. ఆర్ద్రాం యః కారిణీ౦ యష్టీం సువర్ణాం హేమమాలినీం
    సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ  ||
ఆర్ద్రత చే కన్నుల యందు నీటితో తడిచినది, బ్రహ్మ దండము అనే మేరు దండమును కలిగి వుండి, అధర్మము వైపు వేడలుచున్న వారిని దండిన్చునది, బంగారు రంగు చ్చాయతో బంగారు వర్ణము కలిగిన పాదములతో సూర్యనాడి కలిగినది అగు ఆ శ్రీ మహాలక్ష్మి నన్ను ఆవహించుగాక.
౧౫. తాం మ ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం
    యాస్యాం హిరణ్యం ప్రభూతం గావో, దాస్యో అశ్వాన్ విన్దేయం పురుషానహం ||
యజ్ఞముచే సంపదలు నిచ్చు ఓ అగ్నిహోత్రుడా ఎవరిచే బంగారము విశేషముగా ఉద్భవించినదో, గోవులు, అశ్వములు వంటి సంపదలు, దాసీ జనములు, పుత్ర, పౌత్ర బంధు మిత్ర, పరివారములను ఇచ్చును. అట్టి శ్రీ మహాలక్ష్మీ దేవి మా యందు ఎల్లప్పుడూ ఆవహించి మోక్షమును ప్రాసాదించుగాక.
ఈ మంత్రమును ప్రతి దినము జపించిన ఆరోగ్య, ప్రతిష్ట, కీర్తి, ఐశ్వర్యములు ప్రాప్తించును.
౧౬. యః శుచి: ప్రయతో భూత్వా జుహుయా దాజ్య మన్వహం
    శ్రియః పంచ దశర్చ౦చ శ్రీ కామః సతతం జపేత్  ||
సాధకుడు ఏకాగ్రతతో ఇంద్రియములను జయించి బాహ్య అన్త్ర్యములను శుచితో నుంచుకొని ప్రతి నిత్యమూ ఆవు నేతితో అగ్ని హోత్రములో పై 15 ఋక్కులతో  ఆహుతులను వేసి యజ్ఞమును నిర్వహించ వలెను.
లేదా 15 ఋక్కులతో  15 రోజులు అఖండ పారాయణ చేసిన వారికి సర్వ కార్య సిద్ది కలుగును.
శ్రీ మహాలక్ష్మి సాధనకు అత్యంత విశిష్టమైన మంత్రములు ౧. కనకధారాస్తవము, ౨. శ్రీసూక్తము. ప్రతి నిత్యం నారాయణ సహిత శ్రీమహాలక్ష్మి దేవి యొక్క ఈ మంత్రములను పారాయణ గావించిన వారికి భగవదానుగ్రహము కలిగి మోక్ష ప్రాప్తి లభించును.
విద్య అంటే జ్ఞానము. జ్ఞానము అంటే గంగ లాంటిది. అది ఎప్పుడూ ప్రవహిస్తూనే వుండాలి గాని, అది నిలిచి పోకూడదు. నిలిస్తే నీరు పాడౌవుతుంది. ఈ జ్ఞాన గంగ ఏ ఒక్కరి సోత్తో కాదు, ఇది అందరిది మన అందరిది. దీనిని గోప్యముగా ఉంచ కుండా అందరికీ అందు బాటలోకి తీసుకొని రావాలనే మన మహర్షులు ఎంతో తాపత్రయ పడినారు. అర్హత కలిగిన వారు అందరూ ఈ విద్యను అభ్యసిస్తూ ముందుకు కదిలి ఆ జగన్మాత పాదములు పట్టుకో గలరని రాబోయే శ్రావణ మాసపు పర్వ దినములలో అందరూ శ్రీహరితో గూడిన శ్రీమహాలక్ష్మీని  సాధన చేసి అమ్మ అనుగ్రహమును పొంది, అష్ట్యైశ్వర్యములు బడసి, ఆనందముతో, సుఖ సంతోషములతో పిల్లా పాలలతో తరించేదరని ఆశిస్తూ, అందరూ సుఖముగా వుండాలని కోరుకొంటూ,   అతి సులభుడు శ్రీ వరదుడు. కోరిన వారికి కొంగు బంగారమై నిలుస్తుంది అమ్మ శ్రీమహాలక్ష్మి.
లక్ష్మీం క్షీర సముద్రరాజ తనయాం శ్రీ రంగధామేశ్వరీం
దాసీ భూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం
శ్రీ మన్మంద కటాక్ష లబ్ద విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీ౦ సరసిజాం వందే ముకుంద ప్రియాం ||
జైహింద్.

28, జూన్ 2015, ఆదివారం

శ్రీసూక్తము.భావము

0 comments

జైశ్రీరామ్

జైహింద్.

27, జూన్ 2015, శనివారం

కాళిదాసు దండి ల చమత్కార శ్లోకమ్.

1 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! కాళిదాసు దండిల చమత్కార పద్యం చూడండి.
కాళిదాసు, దండి తాంబూలం కోసం ఒక దుకాణానికి వెళ్లారట. 
దండి ముందుగా సున్నం కావాలని ఆ దుకాణంలోని అమ్మాయిని ఇలా అడిగాడట.
"తూర్ణమానీయతాం చూర్ణం పూర్ణ చంద్రనిభాననే"
(ఓ పూర్ణ చంద్రుడిలాంటి ముఖం గల చిన్నదానా! త్వరగా సున్నం ఇప్పించు).
వెంటనే కాళిదాసు
"పర్ణాని స్వర్ణ వర్ణాని కర్ణాంత కీర్ణ లోచనే"
(చెవుల వరకు వ్యాపించిన విశాలు నేత్రాలు గల దానా! బంగారు వన్నెగల తమలపాకులు కూడా ఇప్పించు).
అని అన్నాడట.
ఆమె ముందుగా కాళిదాసుకు తమలపాకులిచ్చి, తర్వాత దండికి సున్నం ఇచ్చిందట.
"ముందుగా నేనడిగితే ఆయనకు ఇచ్చావేంటి"
అని అడిగాడట దండి.
దానికి ఆమె
"మీరిద్దరూ మహాకవులు, చమత్కారులు. మీలో ఎవరు గొప్పో చెప్పే స్థాయి నాకు లేదు.
ముందు మీరు 3 "ణ" లు వచ్చేలా ఒక వాక్యం చెప్పారు.
తర్వాత ఆయన 5 "ణ" లు వచ్చేలా మరో వాక్యం చెప్పారు.
మూడణాల కంటే ఐదణాలు పెద్ద బేరం కదా అని అగ్ర తాంబూలం ఆయనకిచ్చాను"
అని చమత్కరించింది ఆ దుకాణం నడిపే ఆ అమ్మాయి.
అణాని డబ్బులరూపంలో చెప్పాలంటే అణా కి పన్నెండు దమ్మిడీలు.
ఇప్పటి పైసలైతే అణాకి ఆరు పైసలు.
ఆమె లెక్ఖ ప్రకారం దండి ఇచ్చినది మూడణాలైతే, కాళిదాసు ఇచ్చినది మాత్రం ఐదణాలు. అంటే దండి కంటే కాళిదాసే ఎక్కువ ఇచ్చాడు కాబట్టి కాళిదాసుకే ముందుగా తమలపాకులనిచ్చింది ఆ సుందరి.
చూచారా! ఆ నాడు సంభాణలో కూడా ఎంతటి చమత్కారం ఉండేదో!.
జైహింద్.

26, జూన్ 2015, శుక్రవారం

మహోపకారం చేసే 30 రకాల శివలింగాలు, శ్రీ వేంకటరమణ.

0 comments

జైశ్రీరామ్.
ఓం నమశ్శివాయ.
మహోపకారం చేసే 30 రకాల శివలింగాలు,
సాధారణంగా మనకు తెలిసినవి శిలా నిర్మితమైన లింగాలు మాత్రమే. అందులో కూడా నల్ల రాతి శివలింగాలే అధికం. కానీ మనకు తెలీని శివ లింగాలు ఇంకా అనేకం ఉన్నాయి. అందులో 30 రకాల శివలింగాలు మరీ ముఖ్యమైనవి, అపురూపమైనవి. ఆయా లింగాలు ఇచ్చే ఫలితాలు అనంతం. అందుకే వాటి గురించి తెలుసుకుందాం. రకరకాల పదార్ధాలతో రూపొందిన శివలింగాల గురించి పురాణాలు వివిధ సందర్భాల్లో వర్ణించాయి. ఏయే శివలింగాలను పూజిస్తే ఏయే ఫలితాలు కలుగుతాయో చూడండి...
1. గంధలింగం: రెండు భాగాలు కస్తూరి. నాలుగు భాగాలు గంధం, మూడు భాగాలు కుంకుమను కలిపి ఈ లింగాన్ని చేస్తారు. దీనిని పూజిస్తే శివ సాయిజ్యం లభిస్తుంది.
2. పుష్పలింగం: నానావిధ సుగంధ పుష్పాలతో దీనిని నిర్మిస్తారు. దీనిని పూజిస్తే రాజ్యాధిపత్యం కలుగుతుంది.
3. నవనీతలింగం: వెన్నతో చేసిన ఈ లింగాన్ని పూజిస్తే కీర్తి సౌభాగ్యాలు కలుగుతాయి.
4. రజోమయలింగం: పుప్పొడితో నిర్మించిన ఈ లింగాన్ని పూజించడం వల్ల విద్యాధరత్వం సిద్ధిస్తుంది. శివ సాయుజ్యాన్ని పొందగలం.
5. ధాన్యలింగం: యవలు, గోధుమలు, వరిబియ్యపు పిండితో ఈ లింగాన్ని నిర్మిస్తారు. దీనిని పూజించడం వల్ల సంపదల వృద్ధి, సంతానం కలుగుతుంది.
6. తిలిపిస్టోత్థలింగం: నూగుపిండితో చేసిన ఈ లింగాన్ని పూజిస్తే ఇష్టసిద్ధి కలుగుతుంది.
7. లవణలింగం: హరిదళం, త్రికటుకం, ఉప్పు కలిపి చేసిన ఈ లింగాన్ని పూజిస్తే వశీకరణ శక్తి.
8. కర్పూరాజ లింగం: ముక్తిప్రదమైనది.
9. భస్మమయలింగం: భస్మంతో తయారు చేస్తారు. సర్వ సిద్ధులను కలుగచేస్తుంది.
10. శర్కరామయలింగం: సుఖప్రదం.
11. సద్భోత్థలింగం: ప్రీతిని కలిగిస్తుంది.
12. పాలరాతి లింగం: ఆరోగ్యదాయకం
13. వంశాకురమయ లింగం: వంశవృద్ధిని కలిగిస్తుంది. దీనిని వెదురు మొలకలతో తయారు చేస్తారు.
14. కేశాస్థిలింగం: వెంట్రుకలు, ఎముకలతో తయారు చేస్తారు. ఇది శత్రునాశనం చేస్తుంది.
15. పిష్టమయలింగం: ఇది పిండితో తయారు చేయబడుతుంది. ఇది విద్యలను ప్రసాదిస్తుంది.
16. దధిదుగ్థలింగం: కీర్తిప్రతిష్టలను కలిగిస్తుంది.
17. ఫలోత్థలింగం: ఫలప్రదమైనది.
18. ధాత్రిఫలజాతలింగం: ముక్తిప్రదం.
19. గోమయలింగం: కపిలగోవు పేడతో ఈ లింగాన్ని తయారు చేస్తారు. దీనిని పూజిస్తే ఐశ్వర్యప్రాప్తి కలుగుతుంది. భూమిపై పడి మట్టి కలసిన పేడ పనికిరాదు.
20. దూర్వాకాండజలింగం: గరికతో తయారుచేయబడిన ఈ లింగం అపమృత్యుభయాన్ని తొలగిస్తుంది.
21. వైడూర్యలింగం: శత్రునాశనం, దృష్టిదోషహరం
22. ముక్తాలింగం: ముత్యంతో తయారుచేయబడిన ఈ లింగం ఇష్టసిద్ధిని కలిగిస్తుంది.
23. సువర్ణనిర్మితలింగం: బంగారంతో చేసిన ఈ లింగం ముక్తిని కలిగిస్తుంది.
24. రజతలింగం: సంపదలను కలిగిస్తుంది.
25. ఇత్తడి – కంచులింగం: ముక్తిని ప్రసాదిస్తుంది.
26. ఇనుము – సీసపులింగం: శత్రునాశనం చేస్తుంది.
27. అష్టథాతులింగం: చర్మరోగాలను నివారిస్తుంది. సర్వసిద్ధిప్రదం.
28. తుsసషోత్థలింగం: మారణక్రియకు పూజిస్తారు.
29. స్పటిక లింగం: సర్వసిద్ధికరం, అనుకున్న కార్యాలను సఫలీకృతం చేస్తుంది.
30. సీతాఖండలింగం: పటికబెల్లంతో తయారు చేసింది. ఆరోగ్యసిద్ధి కలుగుతుంది.
శివలింగంలో శివశక్తుల సమ్మేళనం జరగడం వలన ప్రచండమైన ఊర్థస్సు ఉద్భవిస్తుంది. దాని ప్రతికూల ఫలితాలు మనపై పడకుండా ఉండేందుకు శివలింగంపై జలధారను పోస్తుండాలి. ఆ దారనుంచి సూక్ష్మమైన ఓంకారం ఉద్భవిస్తుంది. ఇదే నిర్గుణబ్రహ్మ. ఇలా జీవుడు మంత్రపూర్వక ధారాభిషేకం ద్వారానిర్గుణ బ్రహ్మను తెలుసుకుంటాడు.
ఇవి కాకుండా మరికొన్ని శివలింగాలున్నాయి. మన పురాణాల్లో వర్ణ వ్యవస్థకు ప్రాధాన్యం ఇచ్చారు. దాని ప్రకారం ఏయే వర్ణాలవారు ఏ రకమైన లింగాలను అర్చించాలి అంటూ వివరాలు అందించారు. ఎవరు ఏ లింగాన్ని పూజిస్తే మంచి ఫలితాలు లభిస్తాయన్నది పురాణాలలో విశదీకరించారు. ఆ సమాచారాన్ని అనుసరించి బ్రాహ్మణులు రస లింగాన్ని, క్షత్రియులు బాణ లింగాన్ని, వైశ్యులు స్వర్ణలింగాన్ని, ఇతరులు శిలాలింగాన్ని పూజించాలని పురాణాలు సూచిస్తున్నాయి. వితంతువులు స్ఫటిక లింగాన్ని పూజించవచ్చని చెబుతున్నాయి.
సృష్టి స్థితి లయకారులైన త్రిమూర్తులలో లయ కారకుడైన మహేశ్వరునిది ఎంతో సాత్విక స్వభావం. కనుకనే పరమశివునికి బోళా శంకరుడనే పేరు తెచ్చి పెట్టింది. దేవతలకు ముప్పు తెచ్చిపెట్టే ఏ దైత్యుడైనా ముందుగా మొక్కేది, ప్రార్ధించేది కరుణాసముద్రుడైన మహేశ్వరుడినే. శివుడు అనుగ్రహిస్తే ఎంత కరుణా సముద్రుడో ఆగ్రహిస్తే మాత్రం ఇక వారి అంతు చూస్తాడు. కనుకనే పరమేశ్వరుని భక్త సులభుడు అంటారు. కోరిన వరాలు ప్రసాచిందే ఆ బోళా శంకరుని అనుగ్రహం పొందడానికి శివరాత్రిని మించిన రోజు లేదు. శివరాత్రినాడు శివభక్తులే కాదు, హిందువులంతా నియమనిష్టలతో శివుని పూజించి, ప్రార్థించి, తరిస్తారు. మన తెలుగువారికి పరమేశ్వరుడితో అనాదిగా అపూర్వమైన అనుబంధం ఉంది. మనది తెలుగుదేశం. ఈ ప్రాంతాన్నే త్రిలింగ దేశమని కూడా అంటారు. అంటే మూడు పవిత్ర, మహిమాన్విత శివలింగాలైన శ్రీశైలం, కాళేశ్వరం దాక్షారామం నడుమ ఉన్న ప్రదేమని అర్ధం. కాలగమనంలో ఈ ఎల్లలు విస్తరించాయి. అయినా మనకు శివుడితో ఉన్న అనుబంధం మాత్రం చెరిగిపోలేదు. నిరాడంబరతకు సంకేతంగా నిలిచే శివుడిని చూసినా, శివుని నివాసమైన మరుభూమిని తలచుకున్నా మనసులో వైరాగ్యభావం జనిస్తుంది. ఫాల్గుణ మాసంలోని కృష్ణపక్షంలో 13 లేదా 14వ రోజును శివరాత్రిగా మనం పాటిస్తాము. శివరాత్రి రోజు శివునికి అభిషేకం చేసి, ఉపవాసం, జాగరణ ఉంటూ శివనామస్మరణ చేసే ఆ భక్తుడికి పరమేశ్వరుడు కటాక్షించి కోరిన వరాలు ప్రసాదిస్తాడని పురాణాలు చెబుతున్నాయి.
శివ క్షేత్రాలైన శ్రీశైలం, శ్రీకాళహస్తి పరమ పుణ్య ప్రదేశాలని మనకు తెలుసు. అవి మాత్రమే కాదు, ఆంధ్రదేశంలో ప్రతి జిల్లాలోనూ ప్రసిద్ధి చెందిన శివాలయం ఉంది. ఈ పుణ్య క్షేత్రాలలో ఒక్కో క్షేత్రానిదీ ఒక్కో చరిత్ర. ఇంద్రకీలాద్రి మీద మల్లికార్జునిది ఒక కథ అయితే, కోటప్పకొండ మీద త్రికూటేశ్వరునిది మరో గాథ. అలాగే వేములవాడ. ఇటువంటి క్షేత్రాలన్నీ శివరాత్రి రోజు మాత్రమే కాదు, ఇతర దినాల్లోనూ భక్తులతో రద్దీగా ఉంటాయి. శివుని ప్రసన్నం చేసుకోవడం చాలా తేలిక. శివ పూజా విధానమూ తేలికే. మహావిష్ణువుకు పెట్టినట్టు దద్దోజనం, చక్రపొంగలి వంటి నైవేద్యాలు పరమేశ్వరుడికి అక్కరలేదు. ఒక్క అభిషేకం చాలు.
మనసంతా శివుడిపై లగ్నం చేసి, చేసే అభిషేకం చాలు శివుని ప్రసన్నం చేసుకోవడానికి, తన మీద భక్తే ప్రధానం కానీ ఎటువంటి ఆడంబరాలు అవసరం లేదని చాటిచెప్పిన భక్త సులభుడు ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడి అనుగ్రహం పొందడం ఎంత తేలికో, ఆయన ఆగ్రహిస్తే రక్షణ పొందడం అంత కష్టం. తెలిసీ తెలియక భక్తుడు చేసే తప్పుల్ని పెద్ద మనసుతో క్షమిస్తాడా శంకరుడు.
బోళా శంకరుడు భక్తులపై వెనకా ముందు చూడకుండా కరుణ కురిపించే లక్షణమున్నదని తెలుసుకున్న ఎందరో రాక్షసులు, ఆయనను ప్రసన్నం చేసుకుని. ప్రపంచానికి చేటు తెచ్చే వరాలు పొందారు. వరాలు ప్రసాదించడంలో, భక్తులను కటాక్షించడంలో ఈశ్వరుడి గుణమే అంత. ఆయన కరుణే అంత. భస్మాసురుడు వంటి రాక్షసులపై ఆయన కురిపించిన ఆ కరుణ అపారం.
మహాశివుడు వెలసిన ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలున్నది మన భారతదేశంలోనే. సౌరాష్ట్రలో సోమనాథునిగా, శ్రీశైలంలో మల్లికార్జునిగా, ఉజ్జయినిలో మహా కాళేశ్వరునిగా ఇలా 12 ప్రాంతాలలో జ్యోతి స్వరూపంలో వెలశాడు పరమేశ్వరుడు. ఈ క్షేత్రాలన్నీ పరమ పవిత్రమైనవి. మనకు ఎంతో పుణ్యక్షేత్రమైన కాశీలో కూడా దేవుడిది జ్యోతిర్లింగ రూపమే. ఈ జ్యోతిర్లింగాలలో ఎక్కువ అంటే ఐదు క్షేత్రాలున్న రాష్ట్రం మహారాష్ట్ర ఆ క్షేత్రాలేమిటంటే ఉజ్జయని, పర్లి, డాకిని, నాసిక్, దేవసరోవర్ ఈ ప్రాంతాలలో మహాకాళుడిగా, వైద్యనాథుడిగా, త్రయంబకేశ్వరుడిగా, భీమశంకరుడిగా, ఘ్రశ్నేశ్వరుడిగా భక్తుల పూజలందుకుంటున్నాడు పరమేశ్వరుడు.
కావడానికి శివుడు లయ కారకుడైనా జనులకు ఏదైనా ముప్పు వాటిల్లుతుంటే చూస్తూ కోర్చోడు. జన సంరక్షణకు నడుము బిగిస్తాడు, సాగర మధనమపుడు జనించిన హాలాహలాన్ని స్వీకరించడం, గంగను తలలో ధరించడం దీనికి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. భక్తుల మొరను ఆలకించి వారిని ఆడుకోవడంలో ముందుండే పరమేశ్వరుని మనసారా పూజిద్దాం. ఆయన కృపకు పాత్రులమవుదాం.
       వేంకటరమణ.
సేకరణ శ్రీమాన్ జి.భాస్కర రామం
                                                                                                                            
జైహింద్.

25, జూన్ 2015, గురువారం

సుమతీ శతకము. రచన: బద్దెన భూపాలుఁడు

0 comments

జైశ్రీరామ్.
సుమతీ శతకం (రచన: బద్దెన భూపాల)
 శ్రీ రాముని దయచేతను
నారూఢిగ సకల జనులు నౌరా యనగా
ధారాళమైన నీతులు
నోరూరగ జవులు పుట్ట నుడివెద సుమతీ || 1 ||

అక్కరకు రాని చుట్టము,
మ్రొక్కిన వరమీని వేల్పు, మొహరమున దా
నెక్కిన బారని గుర్రము
గ్రక్కున విడవంగవలయు గదరా సుమతీ || 2 ||

అడిగిన జీతంబియ్యని
మిడిమేలపు దొరను గొల్చి మిడుకుట కంటెన్
వడిగల యెద్దుల గట్టుక
మడి దున్నుకు బ్రతుక వచ్చు మహిలో సుమతీ || 3 ||

అడియాస కొలువు గొలువకు,
గుడి మణియము సేయబోకు, కుజనుల తోడన్
విడువక కూరిమి సేయకు,
మడవిని దోడరకొంటి నరుగకు సుమతీ || 4 ||

అధరము గదలియు, గదలక
మధురములగు భాష లుడుగి మౌన వ్రతుడౌ
అధికార రోగ పూరిత
బధిరాంధక శవము జూడ బాపము సుమతీ || 5 ||

అప్పు కొని చేయు విభవము,
ముప్పున బృఆయంపుటాలు, మూర్ఖుని తపమున్,
దప్పరయని నృపు రాజ్యము
దెప్పరమై మీద గీడు దెచ్చుర సుమతీ || 6 ||

అప్పిచ్చువాడు, వైద్యుడు
నెప్పుడు నెడతెగక పారు నేరును, ద్విజుడున్
జొప్పడిన యూర నుండుము
చొప్పడకున్నట్టి యూరు చొరకుము సుమతీ || 7 ||

అల్లుని మంచితనంబు,
గొల్లని సాహిత్య విద్య, కోమలి నిజమున్,
బొల్లున దంచిన బియ్యము,
దెల్లని కాకులును లేవు తెలియుము సుమతీ || 8 ||

ఆకొన్న కూడె యమృతము,
తాకొంచక నిచ్చువాఁడె దాత ధరిత్రిన్,
సోకోర్చువాడె మనుజుడు,
తేకువ గలవాడె వంశ తిలకుడు సుమతీ || 9 ||

ఆకలి యుడుగని కడుపును,
వేకటియగు లంజ పడుపు విడువని బ్రతుకున్,
బ్రాకొన్న నూతి యుదకము,
మేకల పాడియును రోత మేదిని సుమతీ || 10 ||

ఇచ్చునదే విద్య, రణమున
జొచ్చునదే మగతనంబు, సుకవీశ్వరులున్
మెచ్చునదే నేర్చు, వదుకు
వచ్చునదే కీడు సుమ్ము వసుధను సుమతీ || 11 ||

ఇమ్ముగ జదువని నోరును,
నమ్మా యని బిలిచి యన్న మడుగని నోరున్,
దమ్ముల బిలువని నోరును
గుమ్మరి మను ద్రవ్వినట్టి గుంటర సుమతీ || 12 ||

ఉడుముండదె నూరేండ్లును,
బడియుండదె పేర్మి బాము పదినూరేండ్లున్,
మడువున గొక్కెర యుండదె,
కడు నిల బురుషార్థ పరుడు గావలె సుమతీ || 13 ||

ఉత్తమగుణములు నీచున
కెత్తెఱగున గలుగ నేర్చు; నెయ్యెడలం దా
నెత్తిచ్చి కరగి పోసిన
నిత్తడి బంగారమగునె యిలలో సుమతీ? || 14 ||

ఉదకము ద్రావెడు హయమును,
మదమున నుప్పొంగుచుండు మత్తేభంబున్,
మొదవు కడ నున్న వృషభము,
జదువని యానీచు గడకు జనకుర సుమతీ || 15 ||

ఉపకారికి నుపకారము
విపరీతము గాదు సేయ వివరింపంగా;
నపకారికి నుపకారము
నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతీ || 16 ||

ఉపమింప మొదలు తియ్యన
కపటం బెడనెడను జెఱకు కై వడినే పో
నెపములు వెదకును గడపట
గపటపు దుర్జాతి పొందు గదరా సుమతీ || 17 ||

ఎప్పటి కెయ్యది ప్రస్తుత
మప్పటికా మాటలాడి, యన్యుల మనముల్
నొప్పించక, తా నొవ్వక,
తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతీ || 18 ||

ఎప్పుడు దప్పులు వెదకెడు
నప్పురుషుని గొల్వగూడ దది యెట్లన్నన్
సర్పంబు పడగ నీడను
గప్ప వసించిన విధంబు గదరా సుమతీ || 19 ||

ఎప్పుడు సంపద కలిగిన
నప్పుడు బంధువులు వత్తు రది యెట్లన్నన్
తెప్పలుగ జెఱువు నిండిన
గప్పలు పదివేలు చేరు గదరా సుమతీ || 20 ||

ఏఱకుమీ కసుగాయలు,
దూఱకుమీ బంధుజనుల దోషము సుమ్మీ,
పాఱకుమీ రణమందున,
మీఱకుమీ గురువు నాఙ్ఞ మేదిని సుమతీ || 21 ||

ఒక యూరికి నొక కరణము,
నొక తీర్పరియైన గాక, నొగి దఱుచైనన్,
గకవికలు గాక యుండునె
సకలంబును గొట్టువడక సహజము సుమతీ || 22 ||

ఒరు నాత్మ దలచు సతి విడు,
మఱుమాటలు పలుకు సతుల మన్నింపకుమీ,
వెఱ పెఱుగని భటునేలకు,
తఱచుగ సతి గవయ బోకు, తగదుర సుమతీ || 23 ||

ఒల్లని సతి నొల్లని పతి,
నొల్లని చెలికాని విడువ నొల్లని వాడే
గొల్లండు, కాక ధరలో
గొల్లండును గొల్లడౌనె గుణమున సుమతీ || 24 ||

ఓడల బండ్లును వచ్చును,
ఓడలు నాబండ్లమీద నొప్పుగ వచ్చున్,
ఓడలు బండ్లును వలనే
వాడంబడు గలిమి లేమి వసుధను సుమతీ || 25 ||

కడు బలవంతుడైనను
బుడమిని బ్రాయంపుటాలి బుట్టిన యింటన్
దడవుండ నిచ్చెనేనియు
బడుపుగ నంగడికి దానె బంపుట సుమతీ || 26 ||

కనకపు సింహాసనమున
శునకము గూర్చుండబెట్టి శుభ లగ్నమునం
దొనరగ బట్టము గట్టిన
వెనుకటి గుణమేల మాను వినరా సుమతీ || 27 ||

కప్పకు నొరగాలైనను,
సర్పమునకు రోగమైన, సతి తులువైనన్,
ముప్పున దరిద్రుడైనను,
తప్పదు మఱి దుఃఖ మగుట తథ్యము సుమతీ || 28 ||

కమలములు నీట బాసిన
కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్
తమ తమ నెలవులు దప్పిన
తమ మిత్రులు శత్రులౌట తథ్యము సుమతీ || 29 ||

కరణము గరణము నమ్మిన
మరణాంతక మౌను గాని మనలేడు సుమీ,
కరణము దన సరి కరణము
మఱి నమ్మక మర్మ మీక మనవలె సుమతీ || 30 ||

కరణముల ననుసరింపక
విరసంబున దిన్న తిండి వికటించు జుమీ
యిరుసున కందెన బెట్టక
పరమేశ్వరు బండి యైన బారదు సుమతీ || 31 ||

కరణము సాదైయున్నను,
గరి మద ముడిగినను, బాము గఱవక యున్నన్,
ధర దేలు మీటకున్నను,
గర మరుదుగ లెక్క గొనరు గదరా సుమతీ || 32 ||

కసుగాయ గఱచి చూచిన
మసలక పస యొగరు రాక మధురంబగునా,
పస గలుగు యువతులుండగ
పసి బాలల బొందువాడు పశువుర సుమతీ || 33 ||

కవి కాని వాని వ్రాతయు,
నవరస భావములు లేని నాతుల వలపున్,
దవిలి చను పంది నేయని
వివిధాయుధ కౌశలంబు వృధరా సుమతీ || 34 ||

కాదు సుమీ దుస్సంగతి,
పోదుసుమీ “కీర్తి” కాంత పొందిన పిదపన్,
వాదు సుమీ యప్పిచ్చుట,
లేదు సుమీ సతుల వలపు లేశము సుమతీ || 35 ||

కాముకుడు దనిసి విడిచిన
కోమలి బరవిటుడు గవయ గోరుట యెల్లన్
బ్రేమమున జెఱకు పిప్పికి
చీమలు వెస మూగినట్లు సిద్ధము సుమతీ || 36 ||

కారణము లేని నగవును,
బేరణము లేని లేమ, పృథివీ స్థలిలో
బూరణము లేని బూరెయు,
వీరణము లేని పెండ్లి వృధరా సుమతీ || 37 ||

కులకాంత తోడ నెప్పుడు
గలహింపకు, వట్టి తప్పు ఘటియింపకుమీ,
కలకంఠి కంట కన్నీ
రొలికిన సిరి యింట నుండ నొల్లదు సుమతీ || 38 ||

కూరిమి గల దినములలో
నేరము లెన్నడును గలుగ నేరవు మఱి యా
కూరిమి విరసంబైనను
నేరములే తోచు చుండు నిక్కము సుమతీ || 39 ||

కొంచెపు నరు సంగతిచే
నంచితముగ గీడు వచ్చు నది యెట్లన్నన్
గించిత్తు నల్లి కుట్టిన
మంచమునకు జేటు వచ్చు మహిలో సుమతీ || 40 ||

కొక్కోకమెల్ల జదివిన,
చక్కనివాడైన, రాజ చంద్రుండైనన్,
మిక్కిలి రొక్కము లియ్యక,
చిక్కదురా వారకాంత సిద్ధము సుమతీ || 41 ||

కొఱ గాని కొడుకు బుట్టిన
కొఱ గామియె కాదు, తండ్రి గుణముల జెఱచున్
చెఱకు తుద వెన్ను బుట్టిన
జెఱకున తీపెల్ల జెఱచు సిద్ధము సుమతీ || 42 ||

కోమలి విశ్వాసంబును,
బాములతో జెలిమి, యన్య భామల వలపున్,
వేముల తియ్యదనంబును,
భూమీశుల నమ్మికలును బొంకుర సుమతీ || 43 ||

గడన గల మగని జూచిన
నడుగడుగున మడుగు లిడుదు రతివలు దమలో,
గడ నుడుగు మగని జూచిన
నడ పీనుగు వచ్చె నంచు నగుదురు సుమతీ || 44 ||

చింతింపకు కడచిన పని,
కింతులు వలతురని నమ్మ కెంతయు మదిలో,
నంతఃపుర కాంతలతో
మంతనముల మాను మిదియె మతముర సుమతీ || 45 ||

చీమలు పెట్టిన పుట్టలు
పాముల కిరవైనయట్లు పామరుడు దగన్
హేమంబు గూడ బెట్టిన
భూమీశుల పాల జేరు భువిలో సుమతీ || 46 ||

చుట్టములు గాని వారలు
చుట్టములము నీకటంచు సొంపు దలిర్పన్
నెట్టుకొని యాశ్రయింతురు
గట్టిగ ద్రవ్యంబు గలుగ గదరా సుమతీ || 47 ||

చేతులకు దొడవు దానము,
భూతలనాథులకు దొడవు బొంకమి ధరలో,
నీతియె తొడవెవ్వారికి,
నాతికి మానంబు తొడవు నయముగ సుమతీ || 48 ||

తడ వోర్వక, యొడ లోర్వక,
కడు వేగం బడిచి పడిన గార్యం బగునే,
తడ వోర్చిన, నొడ లోర్చిన,
జెడిపోయిన కార్యమెల్ల జేకుఱు సుమతీ || 49 ||

తన కోపమె తన శత్రువు,
తన శాంతమె తనకు రక్ష, దయ చుట్టంబౌ
తన సంతోషమె స్వర్గము,
తన దుఃఖమె నరక మండ్రు తథ్యము సుమతీ || 50 ||

తన యూరి తపసి తపమును,
తన పుత్రుని విద్య పెంపు, దన సతి రూపున్,
దన పెరటి చెట్టు మందును,
మనసున వర్ణింపరెట్టి మనుజులు సుమతీ || 51 ||

తన కలిమి యింద్ర భోగము,
తన లేమియె స్వర్గలోక దారిద్ర్యంబున్,
దన చావు జల ప్రళయము,
తను వలచిన యదియె రంభ తథ్యము సుమతీ || 52 ||

తన వారు లేని చోటను,
జనమించుక లేని చోట, జగడము చోటన్,
అనుమానమైన చోటను,
మనుజునకును నిలువ దగదు మహిలో సుమతీ || 53 ||

తమలము వేయని నోరును,
విమతులతో చెలిమి చేసి వెతబడు తెలివిన్,
గమలములు లేని కొలకును,
హిమధాముడు లేని రాత్రి హీనము సుమతీ || 54 ||

తలనుండు విషము ఫణికిని,
వెలయంగా దోక నుండు వృశ్చికమునకున్,
తల తోక యనక యుండును
ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ || 55 ||

తలపొడుగు ధనము పోసిన
వెలయాలికి నిజము లేదు వివరింపంగా
దల దడివి బాస జేసిన
వెలయాలిని నమ్మరాదు వినరా సుమతీ || 56 ||

తల మాసిన, నొలు మాసిన,
వలువలు మాసినను బ్రాణ వల్లభునైనన్
గులకాంతలైన రోతురు
తిలకింపగ భూమిలోన దిరముగ సుమతీ || 57 ||

తాను భుజింపని యర్థము
మానవ పతి జేరు గొంత మఱి భూగతమౌ
గానల నీగలు గూర్చిన
తేనియ యొరు జేరునట్లు తిరముగ సుమతీ || 58 ||

దగ్గఱ కొండెము సెప్పెడు
ప్రెగ్గడ పలుకులకు రాజు ప్రియుడై మఱి దా
నెగ్గు బ్రజ కాచరించుట
బొగ్గులకై కల్పతరువు బొడుచుట సుమతీ || 59 ||

ధనపతి సఖుడై యుండిన
నెనయంగా శివుడు భిక్షమెత్తగ వలసెన్,
దన వారి కెంత గలిగిన
దన భాగ్యమె తనకు గాక తథ్యము సుమతీ || 60 ||

ధీరులకు జేయు మేలది
సారంబగు నారికేళ సలిలము భంగిన్
గౌరవమును మఱి మీదట
భూరి సుఖావహము నగును భువిలో సుమతీ || 61 ||

నడువకుమీ తెరువొక్కట,
గుడువకుమీ శత్రు నింట గూరిమి తోడన్,
ముడువకుమీ పరధనముల,
నుడువకుమీ యొరుల మనసు నొవ్వగ సుమతీ || 62 ||

నమ్మకు సుంకరి, జూదరి,
నమ్మకు మొగసాల వాని, నటు వెలయాలిన్,
నమ్మకు మంగడి వానిని,
నమ్మకు మీ వామ హస్తు నవనిని సుమతీ || 63 ||

నయమున బాలుం ద్రావరు,
భయమునను విషమ్మునైన భక్షింతురుగా,
నయమెంత దోషకారియొ,
భయమే జూపంగ వలయు బాగుగ సుమతీ || 64 ||

నరపతులు మేఱ దప్పిన,
దిరమొప్పగ విధవ యింట దీర్పరి యైనన్,
గరణము వైదికుడైనను,
మరణాంతక మౌనుగాని మానదు సుమతీ || 65 ||

నవరస భావాలంకృత
కవితా గోష్టియును, మధుర గానంబును దా
నవివేకి కెంత జెప్పిన
జెవిటికి శంఖూదినట్లు సిద్ధము సుమతీ || 66 ||

నవ్వకుమీ సభ లోపల,
నవ్వకుమీ తల్లి, దండ్రి, నాథుల తోడన్,
నవ్వకుమీ పరసతితో,
నవ్వకుమీ విప్రవరుల నయమిది సుమతీ || 67 ||

నీరే ప్రాణాధారము
నోరే రసభరితమైన నుడువుల కెల్లన్
నారియె నరులకు రత్నము
చీరయె శృంగారమండ్రు సిద్ధము సుమతీ || 68 ||

పగవల దెవ్వరి తోడను,
వగవంగా వలదు లేమి వచ్చిన పిదపన్,
దెగ నాడ వలదు సభలను
మగువకు మనసియ్య వలదు మహిలో సుమతీ || 69 ||

పతికడకు, దన్ను గూరిన
సతికడకును, వేల్పు కడకు, సద్గురు కడకున్,
సుతుకడకు రిత్తచేతుల
మతిమంతులు చనరు నీతి మార్గము సుమతీ || 70 ||

పనిచేయునెడల దాసియు,
ననుభవమున రంభ, మంత్రి యాలోచనలన్,
దనభుక్తి యెడల దల్లియు,
నన్ దన కులకాంత యుండు నగురా సుమతీ || 71 ||

పరనారీ సోదరుడై,
పరధనముల కాసపడక, పరులకు హితుడై,
పరులు దను బొగడ నెగడక,
పరు లలిగిన నలుగ నతడు పరముడు సుమతీ || 72 ||

పరసతి కూటమి గోరకు,
పరధనముల కాసపడకు, బరునెంచకుమీ,
సరిగాని గోష్టి సేయకు,
సిరిచెడి చుట్టంబు కడకు జేరకు సుమతీ || 73 ||

పరసతుల గోష్ఠి నుండిన
పురుషుడు గాంగేయుడైన భువి నింద పడున్,
బరసతి సుశీలయైనను
బరుసంగతి నున్న నింద పాలగు సుమతీ || 74 ||

పరులకు నిష్టము సెప్పకు,
పొరుగిండ్లకు బనులు లేక పోవకు మెపుడున్,
బరు గదిసిన సతి గవయకు,
మెఱిగియు బిరుసైన హయము లెక్కకు సుమతీ || 75 ||

పర్వముల సతుల గవయకు,
ముర్వీశ్వరు కరుణ నమ్మి యుబ్బకు మదిలో,
గర్వింప నాలి బెంపకు,
నిర్వహణము లేని చోట నిలువకు సుమతీ || 76 ||

పలు దోమి సేయు విడియము,
తలగడిగిన నాటి నిద్ర, తరుణులయెడలన్
బొల యలుక నాటి కూటమి
వెల యింతని చెప్పరాదు వినరా సుమతీ || 77 ||

పాటెఱుగని పతి కొలువును,
గూటంబున కెఱుకపడని కోమలి రతియున్,
బేటెత్త జేయు చెలిమియు,
నేటికి నెదురీదినట్టు లెన్నగ సుమతీ || 78 ||

పాలను గలసిన జలమును
పాల విధంబుననె యుండు బరికింపంగా
పాల చవి జెఱచు గావున
పాలసుడగు వాని పొందు వలదుర సుమతీ || 79 ||

పాలసునకైన యాపద
జాలింబడి తీర్ప దగదు సర్వఙ్ఞునకున్
తేలగ్ని బడగ బట్టిన
మేలెఱుగునె మీటు గాక మేదిని సుమతీ || 80 ||

పిలువని పనులకు బోవుట,
గలయని సతి గతియు, రాజు గానని కొలువుం,
బిలువని పేరంటంబును,
వలువని చెలిమియును జేయ వలదుర సుమతీ || 81 ||

పుత్రోత్సాహము తండ్రికి
పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా
పుత్రుని కనుగొని బొగడగ
పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ || 82 ||

పురికిని ప్రాణము గోమటి,
వరికిని ప్రాణంబు నీరు వసుమతి లోనన్,
గరికిని ప్రాణము తొండము,
సిరికిని ప్రాణంబు మగువ సిద్ధము సుమతీ || 83 ||

పులి పాలు దెచ్చి యిచ్చిన,
నలవడగా గుండె గోసి యఱచే నిడినన్,
దలపొడుగు ధనము బోసిన,
వెలయాలికి గూర్మి లేదు వినరా సుమతీ || 84 ||

పెట్టిన దినముల లోపల
నట్టడవులనైన వచ్చు నానార్థములున్,
బెట్టని దినముల గనకపు
గట్టెక్కిన నేమి లేదు గదరా సుమతీ || 85 ||

పొరుగున బగవాడుండిన,
నిరవొందక వ్రాతకాడె యేలిక యైనన్,
ధర గాపు కొండెమాడిన,
గరణాలకు బ్రదుకు లేదు గదరా సుమతీ || 86 ||

బంగారు కుదువ బెట్టకు,
సంగరమున బాఱిపోకు సరసుడవైతే,
నంగడి వెచ్చము వాడకు,
వెంగలితో జెలిమి వలదు వినరా సుమతీ || 87 ||

బలవంతుడ నాకేమని
పలువురతో నిగ్రహించి పలుకుట మేలా,
బలవంత మైన సర్పము
చలి చీమల చేత జిక్కి చావదె సుమతీ || 88 ||

మదినొకని వలచి యుండగ
మదిచెడి యొక క్రూర విటుడు మానక తిరుగున్
బది చిలుక పిల్లి పట్టిన
జదువునె యాపంజరమున జగతిని సుమతీ || 89 ||

మండల పతి సముఖంబున
మెండైన ప్రధాని లేక మెలగుట యెల్లన్
గొండంత మదపు టేనుగు
తొండము లేకుండినట్లు దోచుర సుమతీ || 90 ||

మంత్రిగలవాని రాజ్యము
తంత్రము సెడకుండ నిలుచు దఱచుగ ధరలో
మంత్రి విహీనుని రాజ్యము
జంత్రపు గీలూడినట్లు జరుగదు సుమతీ || 91 ||

మాటకు బ్రాణము సత్యము,
కోటకు బ్రాణంబు సుభట కోటి, ధరిత్రిన్‌
బోటికి బ్రాణము మానము,
చీటికి బ్రాణంబు వ్రాలు సిద్ధము సుమతీ || 92 ||

మానధను డాత్మధృతి చెడి
హీనుండగు వాని నాశ్రయించుట యెల్లన్‌
మానెడు జలముల లోపల
నేనుగు మెయి దాచినట్టు లెఱుగుము సుమతీ || 93 ||

మేలెంచని మాలిన్యుని,
మాలను, మొగసాలెవాని, మంగలి హితుగా
నేలిన నరపతి రాజ్యము
నేల గలసి పోవుగాని నెగడదు సుమతీ || 94 ||

రాపొమ్మని పిలువని యా
భూపాలుని గొల్వ భుక్తి ముక్తులు గలవే
దీపంబు లేని యింటను
జేపున కీళ్ళాడినట్లు సిద్ధము సుమతీ || 95 ||

రూపించి పలికి బొంకకు,
ప్రాపగు చుట్టంబు నెగ్గు పలుకకు మదిలో,
గోపించు రాజు గొల్వకు,
పాపపు దేశంబు సొఱకు పదిలము సుమతీ || 96 ||

లావిగలవాని కంటెను
భావింపగ నీతిపరుడు బలవంతుండౌ
గ్రానంబంత గజంబును
మావటివాడెక్కినట్లు మహిలో సుమతీ || 97 ||

వఱదైన చేను దున్నకు,
కఱవైనను బంధుజనుల కడ కేగకుమీ,
పరులకు మర్మము చెప్పకు,
పిరికికి దళవాయి తనము పెట్టకు సుమతీ || 98 ||

వరిపంట లేని యూరును,
దొర యుండని యూరు, తోడు దొరకని తెరువున్,
ధరను పతి లేని గృహమును
నరయంగా రుద్రభూమి యనదగు సుమతీ || 99 ||

వినదగు నెవ్వరు జెప్పిన
వినినంతనె వేగ పడక వివరింప దగున్
కని కల్ల నిజము దెలిసిన
మనుజుడె పో నీతి పరుడు మహిలో సుమతీ || 100 ||

వీడెము సేయని నోరును,
జేడెల యధరామృతంబు సేయని నోరున్,
పాడంగరాని నోరును
బూడిద కిరవైన పాడు బొందర సుమతీ || 101 ||

వెలయాలి వలన గూరిమి
గలగదు, మఱి గలిగెనేని కడతేఱదుగా,
బలువురు నడచెడు తెరువున
మొలవదు పువు, మొలిచెనేని పొదలదు సుమతీ || 102 ||

వెలయాలు చేయు బాసలు,
వెలయగ మొగసాల బొందు వెలమల చెలిమిన్,
గలలోన గన్న కలిమియు
విలసితముగ నమ్మరాదు వినరా సుమతీ || 103 ||

వేసరపు జాతి గానీ,
వీసము దా జేయనట్టి వీరిడి గానీ,
దాసి కొడుకైన గానీ,
కాసులు గల వాడె రాజు గదరా సుమతీ || 104 ||

శుభముల పొందని చదువును,
నభినయముగ రాగరసము నందని పాటల్,
గుభ గుభలు లేని కూటమి,
సభ మెచ్చని మాటలెల్ల జప్పన సుమతీ || 105 ||

సరసము విరసము కొఱకే,
పరిపూర్ణ సుఖంబు లధిక బాధల కొఱకే,
పెరుగుట విరుగుట కొఱకే,
ధర తగ్గుట హెచ్చు కొఱకె తథ్యము సుమతీ || 106 ||

సిరి తా వచ్చిన వచ్చును
సలలితముగ నారికేళ సలిలము భంగిన్,
సిరి తా బోయిన బోవును
కరి మ్రింగిన వెలగ పండు కరణిని సుమతీ || 107 ||

స్త్రీల యెడ వాదులాడకు,
బాలురతో జెలిమిచేసి భాషింపకుమీ,
మేలైన గుణము విడువకు,
మేలిన పతి నింద సేయ కెన్నడు సుమతీ || 108 ||
 జైహింద్.

24, జూన్ 2015, బుధవారం

సూర్యోపనిషత్. తాత్పర్య సహితము.

0 comments

జైశ్రీరామ్.

జైహింద్.

22, జూన్ 2015, సోమవారం

వందేమాతరమ్ సంపూర్ణ గీతము. . . రచన: బంకించంద్ర ఛఠోపాధ్యాయ్

1 comments

జైశ్రీరామ్
వందేమాతరమ్ గీతము. . . రచన: బంకించంద్ర ఛఠోపాధ్యాయ్
వందేమాతరం, సుజలాం సుఫలాం మలయజ శీతలాం, సస్య శ్యామలాం మాతరమ్ ||వందే||
శుభ్రజ్యోత్స్నా పులకితయామినీం; పుల్లకుసుమిత ద్రుమదల శోభినీం
సుహాసినీం సుమధుర భాషిణీం, సుఖదాం వరదాం మాతరమ్ || వందే ||

కోటికోటి కంఠ కలకల నినాదకరాలే; కోటి కోటి భుజైర్ ధృత కర కరవాలే
అబలా కేయనో మా ఏతో బలే; బహుబల ధారిణీం నమామి తారిణీం
రిపుదలవారిణీం మాతరామ్ || వందే ||

తిమి విద్యా తిమి ధర్మ తుమి హృది తుమి మర్మ త్వం హి ప్రాణాః శరీరే
బాహుతే తుమి మా శక్తి హృదయే తుమి మా భక్తి తో మారయి ప్రతిమా గడి మందిరే మందిరే || వందే ||

త్వం హి దుర్గా దశ ప్రహరణ ధారిణీ, కమలా కమలదళ విహారిణీ
వాణీ విద్యాదాయినీ’ నమామి త్వాం నమామి కమలామ్ అమలామ్ అతులాం
సుజలాం సుఫలాం మాతరమ్ || వందే ||
శ్యామలాం సరలాం సుస్మితాం భూషితాం, ధరణీం భరణీం మాతరమ్ || వందే ||
జైహింద్.

21, జూన్ 2015, ఆదివారం

క్రమశిక్షణతో పిల్లల్ని పెంచండి.

1 comments

జైశ్రీరామ్
ఆర్యులారా!
జైహింద్.

20, జూన్ 2015, శనివారం

జ్ఞాతిభి ర్వంచతేనైవ ... మేలిమి బంగారం మన సంస్కృతి,

1 comments

జైశ్రీరామ్.
శ్లో.  జ్ఞాతిభి ర్వంచతేనైవ, చోరేణాపి న నీయతే|
దానేన న క్షయం యాతి, విద్యారత్నం మహాధనం|| (చాణక్యనీతి)
గీ. జ్ఞాతులెవ్వరుఁ గొనలేని, కలుష మతులఁ
జోరులెవ్వరు గొనలేని, సుజన తతికి
దానమెంతగ చేసినన్ దరుగఁబోని,
విద్య మహనీయ రత్నమౌన్, విబుధులకును.
భావము: జ్ఞానముపెన్నిధి వంటిది. అది జ్ఞాతులువంచించి తీసుకోడానికి వీలులేనిది; దొంగలు అపహరించ లేనిది; దానము చేసినా తరగలేనిది పైగా వృద్ధినొందునది; ఇదిఒక అనర్ఘరత్నము.
జైహింద్.

19, జూన్ 2015, శుక్రవారం

వాగ్వైఖరీ శబ్దఝరీ ... మేలిమి బంగారం మన సంస్కృతి,

1 comments

జైశ్రీరామ్.
శ్లో. వాగ్వైఖరీ శబ్దఝరీ శాస్త్రవ్యాఖ్యానకౌశలమ్ ।
వైదుష్యం విదుషాం తద్వద్భుక్తయే న తు ముక్తయే ॥ వివేక చూడామణి ౫౮॥
वाग्वैखरी शब्दझरी शास्त्रव्याख्यात न कौशलम् ।
वैदुष्यं विदुषां तद्वद्भुक्तये न तु मुक्तये ।। ( विवेक चूड़ामणि 58)
vagvaikharee shabdajharee shashtravyakhyanakaushalam |
vaidushyam vidushAm tadvadbhuktaye na tu muktaye ||
గీ. పలుకు చతురత, పదముల పరుగు తెఱఁగు,
విషయ వివరణ నిపుణత విదుషులకిల
తినఁగ నమరుచు నభవముఁ గొనగ నిడవు.
పరమ పథమును గొన గురు పదమె శరణు.
భావము. పండితుల వాక్చాతుర్యము, అనర్గల పదప్రయోగ కౌశలము, శాస్త్రవ్యాఖ్యాన
నైపుణ్యము మున్నగునవి భుక్తినిచ్చునే కాని ముక్తినివ్వజాలవు. ముక్తిని కేవలము సద్గురు పదములే ప్రసాదించఁ గలవు. జైహింద్.

18, జూన్ 2015, గురువారం

దేవీభాగవతము - అందలి స్కంధములు - వానిలో వివరించబడిన అంశములు.

1 comments

జైశ్రీరామ్.
దేవీభాగవతము
ప్రథమ స్కంధము: ఇందులో దేవీ మహిమ, హయగ్రీవుడు, మథుకైటభులు, పురూరవుడు, ఊర్వశి, శుకుని జననము మరియు సంతతి మొదలైన వాని గురించి వివరించబడ్డాయి.
ద్వితీయ స్కంధము: ఇందులో మత్స్యగంధి, పరాశరుడు, వ్యాసుడు, శంతనుడు, గాంగేయుడు, సత్యవతి, కర్ణుడు, పాండవుల జననం, పరీక్షిత్తు, ప్రమద్వర కథ, తక్షకుడు, సర్పయాగం, జరత్కారువు మొదలైన వాని గురించి వివరించబడ్డాయి.
తృతీయ స్కంధము: ఇందులో సత్యవ్రతుని కథ, దేవీ యజ్ఞం, ధ్రువసంధి కథ, భారద్వాజుడు, నవరాత్రి పూజ, రామ కథ మొదలైన వాని గురించి వివరించబడ్డాయి.
చతుర్థ స్కంధము: ఇందులో నరనారాయణులు, ఊర్వశి, ప్రహ్లాదుడు, భృగు శాపం, జయంతి, శ్రీకృష్ణ చరిత్ర మొదలైన వాని గురించి వివరించబడ్డాయి.
పంచమ స్కంధము: ఇందులో మహిషుడు, తామ్రభాషణ, చక్షుర తామ్రులు, అసిలోమాదులు తో దేవీ యుద్ధం, రక్తబీజుడు, శుంభ నిశుంభులు మొదలైన వాని గురించి వివరించబడ్డాయి.
షష్ఠ స్కంధము: ఇందులో నహుషుని వృత్తాంతం, అడీ బక యుద్ధం, వశిష్టుని రెండవ జన్మ, నిమి విదేహ కథ, హైహయ వంశం, నారదుడు మొదలైన వాని గురిమ్చి వివరించబడ్డాయి.
సప్తమ స్కంధము: ఇందులొ బ్రహ్మ సృష్టి, సూర్యవంశ కథ, సుకన్య చ్యవనుల చరిత్ర, రేవతుడు, శశాదుడు, మాంధాత, సత్యవ్రతుడు, త్రిశంకు స్వర్గం, దక్షయజ్ఞం, దేవీ స్థానాలు మొదలైన వాని గురించి వివరించబడ్డాయి.
అష్టమ స్కంధము: ఇందులొ ఆదివరాహం, ప్రియవ్రతుడు, సప్తద్వీపాలు, కులపర్వతాదులు, ద్వీపవృత్తాంతం, సూర్యచంద్రుల స్థితగతులు, శింశిమార చక్రం, అధోలోకాలు, నరకలోక, దేవీపూజ, మధూక పూజావిధి మొదలైన వాని గురించి వివరించబడ్డాయి.
నవమ స్కంధము: ఇందులో పంచశక్తులు, పంచ ప్రకృత్యాదుల కథ, కృష్ణుని సృష్టి, సరస్వతీ పూజ, కవచం, స్తుతి, కలి లక్షణాలు, గంగోపాఖ్యానం, వేదవతి, తులసి చరిత్ర, స్వాహా, స్వధ, దక్షిణ, షష్ఠీదేవి, సురభి, రాధా స్తోత్రం మొదలైన విషయాలు వివరించబడ్డాయి.
దశమ స్కంధము: ఇందులో వింధ్య గర్వాపహరణ, మనువులు భ్రామరి గురించి వివరించబడ్డాయి.
ఏకాదశ స్కంధము: ఇందులో సదాచారం, రుద్రాక్ష కథ, జపమాల, శిరోవ్రతం, సంధ్య, గాయత్రీ ముద్రలు, దేవీ పూజాదులు గురించి వివరించబడ్డాయి.
ద్వాదశ స్కంధము: ఇందులో గాయత్రీ విచారము, కవచము, హృదయము, స్తోత్రము, సహస్రనామ స్తోత్రము, గాయత్రి దీక్షా లక్షణము, గౌరముని శాపము, మణిద్వీపం, దేవీ భాగవత ప్రశస్తి గురించి వివరించబడ్డాయి.
జైహింద్

17, జూన్ 2015, బుధవారం

ధనే నష్టే పునః ప్రాప్తుం ... మేలిమి బంగారం మన సంస్కృతి,

1 comments

జైశ్రీరామ్.
శ్లో. ధనే నష్టే పునః ప్రాప్తుం శక్తిస్స్యాద్య స్య కస్యచిత్
గత కాలస్తు నాయాతి ఏవ మీశ్వర శాసనమ్.
గీ. ధనము పోయిన నెటులైన దాని మరల
పొంద వచ్చును. కలిగిన ముందు చూపు.
కనగ గత కాల మును మరి కాన లేము.
దైవ శాసనమిది మీరు తలచ వలయు.
భావము: ధనమును మనము నష్టపోయినచో ఏదో విధముగ మరల దానిని సంపాదించ వచ్చును. కాని గడచిపోయిన కాలమును మాత్రము ఏ విధముగనూ కాడా వెనుకకు తిరిగి రాబట్టలేము. ఇది దైవ శాసనము.
కావున మనం సకాలంలో విధ్యుక్త కర్మలనాచరించి ధర్మము వలన సుఖమును అంత్యమున పరమును పొందెదముగాక.
జైహింద్.

16, జూన్ 2015, మంగళవారం

కాలస్యామూల్యతాం జ్ఞాత్వా ... మేలిమి బంగారం మన సంస్కృతి,

1 comments

జైశ్రీరామ్.
శ్లో. కాలస్యామూల్యతాం జ్ఞాత్వా తద్వృధాయాపనం మహా
దోషస్స్యాదితి నిశ్చిత్య సత్కాలక్షేప మాచర!!
గీ. కనఁగ కాలమమూల్యము. కాన మనకు
కాల యాపన దోషంబు. కలుఁడు నిజము.
మంచి పనులకు కాలముఁ బంచి నడవ
జన్మసార్థక్యమగు నిది సజ్జనోక్తి. 
భావము: కాలము అమూల్యమైనదని తెలుసుకొని, దానిని వ్యర్థము చేయడం మహా దోషమను నిశ్చయబుద్ధితో కాలమును సదుపయోగము కావించవలె. 
జైహింద్.


15, జూన్ 2015, సోమవారం

ఆయుషం క్షణ ఏకో೭పి ... మేలిమి బంగారం మన సంస్కృతి,

1 comments

జైశ్రీరామ్.
శ్లో. ఆయుషం క్షణ ఏకోపి సర్వ యత్నైర్నలభ్యతే!
నీయతే తద్వృథాయేన ప్రమాదః సుమహానహో!! 
క. గడచిన క్షణమును వెనుకకు
నడుపఁగ మన వశమగునొకొ?. నడువఁగ వలయున్
వడివడి సమయము వెనుకనె.
నడువకునికి హితమొదవదు. నడువుడు వడిగా.
భావము: ఆయుర్దాయము ఒక్క క్షణము (వ్యర్థముగా) గడిచిపోయినను ఎన్ని ప్రయత్నములు చేసి అయినను దానిని తిరిగి వెనుకకు తీసుకొని రాలేము. (ఎంతటి మహానుభావులకయినను) సమయము వ్యర్థము అయినచో గొప్ప  ప్రమాదము కలుగ చేయును కదా! అహో ఎంతటి ఆశ్చర్యకరమయిన విషయమిది!  
కావున కాలము వ్యర్థము చేయక కాలముతో పాటుగా మనము కూడా మెలకువతో అప్రమత్తముగా నడువవలెను.
జైహింద్.

14, జూన్ 2015, ఆదివారం

అన్నదానం మహా దానం, మేలిమి బంగారం మన సంస్కృతి,

1 comments

జైశ్రీరామ్.
श्लॊ. अन्नदानम् महादानम् विद्यादानमतःपरम् !
अन्नॆन क्षणिकातृप्तिर्यावज्जीवम् च विद्यया !!
శ్లో. అన్నదానం మహా దానం, విద్యా దానం తతః పరమ్.
అన్నేన క్షణికా తృప్తిః, యావజ్జీవంచ విద్యయా.
గీ. అన్నదానంబు ఘనతరమెన్ని చూడ.
అంతకన్న విద్యాదాన మధిక తరము.
అన్నమున కల్గు సంతృప్తి యా క్షణమునె.
విద్య  శాశ్విత తృప్తిని వెలయఁ జేయు.
భావము. అన్నము మహా ఘనతరమైన దానము. విద్యా దానము అంతకంటెను ఘనతరమైనది. అన్నదానము కలిగించే తృప్తి తాత్కాలికమైనదే. విద్యాదానము కలిగించే తృప్తి జీవితమంతయు ఉండును.
జైహింద్.


13, జూన్ 2015, శనివారం

రుద్ర నమక చమకముల భావము.

2 comments

జైశ్రీరామ్.
రుద్రము - నమకము
అనువాకము 1.
1వ మంత్రము.  ఓ రుద్రుఁడా! నీ కోపమునకు నమస్కారము. నీ కోపము నా బాహ్యాంతశ్శత్రువులపైన ప్రవర్తించును గాక. (నన్ను బాహ్యాంతశ్సత్రుహీనునిగా చేయుదువు గాక అని భావము) అంతే కాదు. నీ బాణమునకు, ధనుస్సునకు ధనుర్బాణ సహితములైన నీ బాహువులకు ఇదే నా నమస్కారము.
2వ మంత్రము.  ఓ రుద్రుఁడా! నీ యీ శరము చాలా శాంతమైనదాయెను. నీ ధనుస్సు శాంతమైనదాయెను. నీ యమ్ములపొది శాంతమైనదాయెను. కావున శాంతించిన శరీరము తోడను, అమ్ములపొది తోడను మమ్ములను సుఖపరచుము.
3వ మంత్రము.  ఓ రుద్రుఁడా! మమ్ములను అనుగ్రహించు నీ శివ యను శరీరము మా పట్ల అఘోరమై యుండును గాక. ఆ నీశరీరము మా పట్ల హింసారూపమైన అనిష్టమును ప్రకాశింప జేయకుండును గాక.(ఇట పాపమనగా హింసా రూపమగు అనిష్టము) ఓ పరమ శివా నీ శరీరము మమ్ములను స్వయముగా హింసింప కుండుటయే కాదు. పరుల వలన యే అనిష్టము కలుగ నీయక కాపాడ వలయును. మమ్ములనెవరును హింసింపకుండ కాపాడవలెను. మాకేపాపములు అంటనీయక కాపాడవలెను. మాలోనేవేని పాపములు, లోపములు ఉన్నచో తొలగింపుము. వానిని బహిర్గతములు కానీయకుము, అని మేము నిన్ను ప్రార్థించు చున్నాము.
4వ మంత్రము.  ఓ గిరిశంత! రుద్ర! వైరులపై చిమ్ముటకు నీవు చేత బాణములను దాల్చితివి. కైలాస గిరిని పాలించు ఓ రుద్రుఁడా! శత్రువులను శిక్షించుటకు చేత దాల్చిన నీ యా బాణమును మాపై చిమ్మక, దానిని శాంతము కలదిగ నుంచుము. పురుషులమగు మమ్ములను, మనుష్య వ్యతిరిక్తమై స్థావర జంగమములతో నిండిన యే జగత్తును హింసింపకుము తండ్రీ! అని ప్రార్థించెను.
5వ మంత్రము.  మహా శివా! నీవు కైలాసమున నివసించు చున్నావు. నిన్ను జేరుటకు మంగళకరమైన స్తుతు లొనర్చుచు ప్రార్థించుచున్నాను. మాదగు ఈ సర్వ జగత్తు మనుష్య పశ్వాది జంగమములతో నిండి యున్నది. ఈ జంగమ ప్రపంచము నిరోగమై సౌమనస్య సంపన్నమగులట్లు గావింపుము తండ్రీ!
6వ మంత్రము.  మహాదేవా! మాయందరిలో నీతడే యధికుఁడని నిన్నుద్దేశించి చెప్పుటచే నీవే అధివక్తవైతివి. దేవతలలో నీవే ప్రథముఁడవు, ముఖ్యుఁడవు కదా! నీవు దైవ్యుఁడవు(దేవతలనెల్లస్వయముగా పాలింప సమర్థుఁడవు) నిన్ను దలంచి నంతనే సర్వ రోగములును ఉపశమించును. కాన నీవు చికిత్సకుఁడవు. సర్వ సర్పములను, వ్యాఘ్రాదులను, సర్వ రాక్షసులను నశింపజేయువాఁడవు కదా! కావున మమ్ములను కాపాడుము తండ్రీ!
7వ మంత్రము.  ఏ రుద్రుఁడు ఈ మండలస్థాదిత్య రూపుఁడో అతఁడు ఉదయ కాలమున అత్యంత రక్త వర్ణుఁడాయెను. ఉదయాత్పూర్వము ఇంచుకంత రక్త వర్ణుఁడాయెను.  అంతే కాదు ఉదయానంతర కాలమున పింగళ వర్ణుఁడాయెను.ఆయా కాలములందు అతనిలో మిగిలిన వర్ణములు కలవు. అంధకారాదులను నివారించుటచే అత్యంత మంగళ స్వరూపుఁడాయెను.   కిరణ రూపులైన ఏ యితర రుద్రులు ఈ భూమిపై నంతటను, తూర్పు మున్నగు దిక్కులందును,  వ్యాపించి యున్నారో  వారునూ సహస్ర సంఖ్యాకులై కలరు.  సూర్య రూపులును, సూర్య రశ్మి రూపులును అగు ఈ రుద్రులకు అందఱకును   ఏ క్రోధ సదృశమైన తీక్షణత్వము కలదో దానిని భక్తి నమస్కారాదులతో నివారించు చున్నారము.
8వ మంత్రము.  ఏ రుద్రుఁడు కాల కూటమను విషము దాల్చుటచే నీలగ్రీవము కలిగి యుండెనో,  అట్టి ఈతఁడు విశేషమైన రక్త వర్ణము కలవాడై, మండల వర్తియై, ఉదయాస్తమయ సంపాదకుడై ప్రవర్తించుచున్నాఁడు. అంతే కాదు. వేద శాస్త్ర సంస్కార హీను లైన గోపాలురు కూడ ఈ ఆదిత్య రూపుఁడై మండలమున గల రుద్రుని చూచుచున్నారు.  నీరమును గొనివచ్చు వనితలును ఈ రుద్రుని చూచుచున్నారు. అంతే కాదు ఆదిత్య రూపుఁడగు ఈ రుద్రుని గోవులు, బఱ్ఱెలు మున్నగు సకల ప్రాణులును చూచుచున్నవి. వేద శాస్త్రజ్ఞుల చేతను, వేదశాస్త్రములు తెలియని వారిచేతను, పశుపక్ష్యాదుల చేతను చూడ బడువాఁడైన రుద్రుఁడు మమ్ములను సుఖ వంతులనుగా చేయును గాక.
9వ మంత్రము.  ఇంద్ర మూర్తి ధారణచే వేయి కన్నులవాఁడైన శివునకు నమస్కార మగును గాక.  ఫర్జన్య  రూప ధారియై, వృష్టి కర్తయై సుఖమొసగు శివునకు నమస్కారము. అంతే కాదు. ఏవి ఈ రుద్రుని యొక్క భృత్య రూపములైన ప్రాణులు కలవో వానికి నేను నమస్కారము చేయుచున్నాను.
10వ మంత్రము.  ఓ భగవంతుఁడా! నీవు పూజా వంతుఁడవు. మహదైశ్వర్య  సంపన్నుఁడవు. ఓ రుద్రా! నీవు నీ ధనుస్సున రెండు చివరలకు కట్టిన త్రాటిని విడువుము. విప్పివేయుము. నీ చేతనున్న బాణములను విడిచిపెట్టుము. మాపై విడువకు తండ్రీ!
11వ మంత్రము.  ఇంద్ర రూపుఁడవైన ఓ రుద్రుఁడా! వందల కొలదీ అమ్ములపొదులు కలవాఁడా! ధనుస్సును దించి, బాణముల యొక్క ముఖములను అంప పొదులలో నుంచి, మా పట్ల అనుగ్రహ యుక్తుఁడవై శాంతుఁడవు  కమ్ము.
12వ మంత్రము.  జటాజూటము గల శివుని యొక్క ధనుస్సు విగతమైన వింటి త్రాడు కలది యగు గాక. అంతే కాదు. నీ యొక్క బాణములు గల అంప పొది బాణములు లేనిది అగు గాక. ఈ రుద్రుని యొక్క బాణములు అంప పొదిలో నుండుటచే చంపుట కసమర్ధములు అగుగాక. ఈ రుద్రుని యొక్క అంప పొది బాణ వహన మనెడి చిన్న పని చేయుటకు మాత్రమే సమర్ధము అగు గాక. కత్తులు దాచు ఒర కత్తులు మోయుటకు మాత్రమే సమర్ధమగు గాక.
13వ మంత్రము.  అందరి కోరికలను అధికముగా తీర్చే ఓ శివుఁడా! ఏ నీ ఆయుధము ఖడ్గాది రూపమున కలదో, నీ యొక్క చేతియందు ఏ ధనుస్సు కలదో, నీవు ఉపద్రవములు కావింపని ఆ ఆయుధముచే, ఆ ధనుస్సుచే, మమ్ములను అంతటను అన్ని విధములా పరిపాలింపుము.
14వ మంత్రము.  ఓ రుద్రుఁడా! ధనుస్సున బంధింప బడని కారణమున ప్రసరింపఁ జేయఁ బడినట్టియు, స్వరూపము చేతనే చంప సమర్ధమైనట్టి నీ యొక్క ఆయుధమునకు నమస్కార మగు గాక. అంతే కాదు నీయొక్క రెండు భుజములకు నమస్కారము అగు గాక. నీ యొక్క ధనుస్సునకు నమస్కార మగు గాక.
15వ మంత్రము.   శివుఁడా! నీధనుస్సునకు బాణాది రూపమైన ఆయుధము మమ్ములను అన్ని విధముల విడుచును గాక. అంతే కాదు. నీ యొక్క ఏ అంప పొది కలదో దానిని మా కంటె దూరముగా ఉంచుము.
అనువాకము 1 సమాప్తము.
భగవంతుఁడైన విశ్వేశ్వరునకు, మహా దేవునకు, త్ర్యంబకునకు, త్రిపురాంతకునకు, కాలాగ్ని యైన రుద్రునకు, నీల కంఠునకు, మృత్యుంజయునకు, సర్వేశ్వరునకు, సదా శివునకు, శ్రీమన్మహాదేవునకు నమస్కారము.

 అనువాకము 2.
యజుస్సు 1.  (13పదములు కల వచనరూప మంత్రమునే యజుస్సు అందురు) బంగారు నగలు గల బాహువు లందుఁ గల యట్టియు, యుద్ధ రంగమున సేనను జేర్చు సేనా నాయకు డగునట్టియు,  దిక్కులను పాలించు నట్టి వాడుఁను  రుద్రునకు నమస్కారము.
యజుస్సు 2.  హరిత వర్ణమైన కేశములు పర్ణ రూపమునఁ గల వృక్షాకార రుద్ర మూర్తులకు నమస్కారము అగు గాక. పశువులకు పాలకుఁడైన రుద్రునకు నమస్కార మగును గాక.
యజుస్సు 3.  సస్పి(లేత గడ్డి)వలె పసుపు, ఎఱుపు, రంగుల కలయిక గల మహా దేవునకు నమస్కార మగు గాక. కాంతి గల రుద్రునకు నమస్కార మగును గాక. శాస్త్రము లందు చెప్ప బడిన దక్షిణోత్తర తృతీయ మార్గములకు పాలకుఁడైన రుద్రునకు నమస్కార మగు గాక.
యజుస్సు 4.  వాహనమైన ఎద్దుపై కూర్చుండు నట్టియు, శత్రువులను విశేషముగ పీడించు శివునకు నమస్కార మగును గాక. అన్నములైన ఓషధులను పాలించు ప్రభువగు రుద్రునకు నమస్కారము.
యజుస్సు 5.  నల్లని జుత్తు గల, మంగళ ప్రయోజనమైన యజ్ఞోపవీతము గల రుద్రునకు నమస్కారము. పరిపూర్ణ గుణులైన పురుషులకు స్వామియైన రుద్రునకు నమస్కార మగును గాక.
యజుస్సు 6.  సంసార భేదకుఁడైన రుద్రునకు నమస్కార మగును గాక. లోకములకు పాలకుఁడైన రుద్రునకు నమస్కారమగును గాక.
యజుస్సు 7.  విస్తరింప బడిన ధనుస్సులతో రక్షించునట్టి రుద్రునకు నమస్కార మగు గాక. క్షేత్రములకు (శరీరములకు-పుణ్యక్షేత్రములకు) పాలకుఁడైన రుద్రునకు నమస్కార మగు గాక.
యజుస్సు  8.  సారథి యైనట్టియు, శత్రువులను సంహరింప శక్యుఁడైన రుద్రునకు నమస్కార మగు గాక. అరణ్యములకు పాలకుఁడైన రుద్రునకు నమస్కార మగు గాక.
యజుస్సు 9.  లోహిత వర్ణుఁ డైనట్టియు, ప్రభు వైనట్టి రుద్రునకు నమస్కారము. చెట్లకు పాలకుఁడైన రుద్రునకు నమస్కార మగుఁ గాక.
యజుస్సు 10.  రాజ సభలో మంత్రాలోచన కుశలుఁ డైనట్టియు, మంత్రి రూపమున వణిజులకు స్వామి యైనట్టి రుద్రునకు నమస్కారము. వనము లందలి గుల్మ లతాదులకు పాలకుఁడైన రుద్రునకు నమస్కార మగుఁ గాక.
యజుస్సు 11.  భూమిని విస్తరింప జేయు రుద్రునకు నమస్కార మగుఁ గాక. ధనము చేకూర్చునట్టి (సేవచేయుభక్తులకుచెందినట్టి) రుద్రునకు నమస్కార మగుఁ గాక. ఓషధులకు ప్రభువగు రుద్రునకు నమస్కార మగు గాక.
యజుస్సు 12.  యుద్ధ సమయమున మహోన్నత ధ్వనిగా కల శివునకు నమస్కారము. శత్రువుల నేడిపించు శివునకు నమస్కార మగు గాక. పాదచారులైన యోధులకు పాలకుఁడైన రుద్రునకు నమస్కార మగు గాక.
యజుస్సు 13.  చుట్టునూ ఆవరింపబడిన సకల సైన్యము గల రుద్రునకు నమస్కారము. పరుగులిడుచున్నశత్రుసైన్యముల వెనుకనేగు రుద్రునకు నమస్కారమగుగాక. సాత్వికులై శరణాగతులైనవారి పాలకుఁడైన రుద్రునకు నమస్కార మగుగాక.
అనువాకము 2 సమాప్తము.
అనువాకము 3.
యజుస్సు 1.  విరోధులను అభిభవించు (పరాభవించు) రుద్రునకు నమస్కారము
మిక్కిలి విరోధులను బాధించు రుద్రునకు నమస్కారము. అంతటను సంపూర్ణముగా బాధించు శూర సేనలకు పాలకుఁడైన రుద్రునకు నమస్కార మగు గాక.
యజుస్సు 2.  కకుభ (అర్జునవృక్షము వలె ప్రథానుఁడైనట్టి) సదృశమైన, ఖడ్గము చేతఁ గల శివునకు నమస్కారము. గుప్త చోరులకు పాలకుఁడైన శివునకు నమస్కారము.
యజుస్సు 3.  ధనుస్సును సంధించుటకు చేత బాణము కలిగినట్టియు, పృష్ఠ భాగమున కట్టఁ బడిన అమ్ముల పొది కలిగినట్టి శివునకు నమస్కారము. ప్రకట చోరులకు పాలకుఁడైన శివునకు నమస్కారము.
యజుస్సు 4.  యజమానికి ఆప్తుఁడై అతని క్రయ విక్రయాది వ్యవహారము లందు మెలగుచు, ఎచ్చట నైనను, ఏమాత్ర మైనను అతని ద్రవ్యమును అపహరించుట యనెడి వంచన మొనరించు వాని స్వరూపముతో నుండు శివునకు నమస్కారము. పైన చెప్పినట్లు యజమానిని బాగుగా మోసగించు శివునకు నమస్కారము. రాత్రి యందు పగటి యందు అన్యులకు తెలియనీయక యజమాని సొత్తు నపహరించు వారికి పాలకుఁడైన శివునకు నమస్కారము.
యజుస్సు 5.   నిరంతరము సంచార శీలము కలవాఁడు, బాగుగా సంచరించునట్టి శివునకు నమస్కారము. నిరంతరము అరణ్యమునందుండు వారి ప్రభువైనట్టి శివునకు నమస్కారము.
యజుస్సు 6.  వజ్రమును బోలిన స్వశరీరమును రక్షించువారు సృకావినులు. వజ్రము వంటి తమ శరీరము రక్షించు వారికి నమస్కారము. కృషికులై స్వామి ధాన్యము అపహరించు వారికి ప్రభువైన శివునకు నమస్కారము.
యజుస్సు 7.  ఖడ్గము కల చోరులకు నమస్కారము. రాత్రి సంచరించువారై వీధులలో పోవు వారిని పీడించు చోరులకు నమస్కారము. కుత్తుకలు కత్తిరించి అపహరించు వారికి ప్రభువగు శివునకు నమస్కారము.
యజుస్సు 8.  శిరస్సును కాపాడు తలపాగా కలిగినట్టి పర్వతముల సంచరించు నట్టి శివునకు నమస్కారము. భూమిని అపహరించు వారికి ప్రభువగు శివునకు నమస్కారము.
యజుస్సు 9.  బాణములు కలిగినట్టి మీకు నమస్కారము. ధనుస్సులు కలిగినట్టి మీకు నమస్కారము.
యజుస్సు 10.  ధనుస్సున త్రాటిని ఆరోపించు మీకు నమస్కారము. ధనుస్సున బాణమును సంధించు మీకు నమస్కారము.
యజుస్సు 11.  వింటి త్రాటిని ఆకర్షించునట్టి మీకు నమస్కారము. ధనుస్సు నుండి బాణములను విడుచు నట్టి మీకు నమస్కారము.
యజుస్సు 12.  లక్ష్యము వరకు బాణము విడుచునట్టియు, లక్ష్యము నందు బాణము ప్రవేశ పెట్టు మీకు నమస్కారము.
యజుస్సు 13.  కూర్చుండునట్టియును, నిద్రించునట్టి మీకు నమస్కారము.
యజుస్సు 14.  నిద్రించునట్టి మీకు నమస్కారము. మీల్కొని యుండునట్టి మీకు నమస్కారము.
యజుస్సు 15.  నిశ్చలముగా నుండునట్టి మీకు నమస్కారము. పరుగెత్తునట్టి మీకు నమస్కారము.
యజుస్సు 16.  సంఘముగా నున్న వారికి నమస్కారము. సంఘముగా నున్నవారికి ప్రభు వగు మీకు నమస్కారము.
యజుస్సు 17. అశ్వ విగ్రహులకు నమస్కారము.  తనదగు ధనము లేని వానికి నమస్కారము. ఎవరి నుండియు ఏమియును గ్రహింపకుండుటచే రేపటికవసరమగు ధనము లేనివారికి నమస్కారము. అశ్వాధ్యక్షులును మహాశ్రీ గల వారును అగు మీకు నమస్కారము.
అనువాకము 3 సమాప్తము.
అనువాకము 4.
యజుస్సు 1.  సంపూర్ణముగా వేధించుటకు సమర్థులైన స్త్రీలకు నమస్కారము. విశేషముగా పీడించుటకు సమర్థులైన స్త్రీలగు మీకు నమస్కారము.
యజుస్సు 2.  ఉత్కృష్ట గుణ రూపలైన సమస్త మాతృకలు మున్నగు స్త్రీలకు నమస్కారము. పరులను హింసించుటకు సమర్థులైన దుర్గ మున్నగు భయంకర దేవతలకు నమస్కారము.
యజుస్సు 3.  విషయాసక్తులకు నమస్కారము. విషయాసక్తులను రక్షించు మీకు నమస్కారము.
యజుస్సు 4.  నానా జాతుల సంఘములకు నమస్కారము. సంఘాధిపతులైన మీకు నమస్కారము.
యజుస్సు 5దేవానుచర గణములకు నమస్కారము. దేవానుచర గణములకు ప్రభువైన మీకు నమస్కారము.
యజుస్సు 6.  వికృత రూపులైన నగ్న ముండాదులకు నమస్కారము. తురంగ గజ వక్త్రాది నానా రూపములను దాల్చు భృత్యులును అగు మీకు నమస్కారము.
యజుస్సు 7.  అణిమా ద్యష్టైశ్వర్యములతో కూడుకొన్నవారికి నమస్కరము. అష్టైశ్వర్యములు లేని మీకు నమస్కారము.
యజుస్సు 8.  శరీర రథము నధిష్టించిన పరమాత్మకును, రథులైన యోధులకును, జీవులకును నమస్కారము.  రథము లేని సామాన్య జీవులకును, శరీర రథము లేని అప్రాణులున్నగు మీకును నమస్కారము.
యజుస్సు 9.  రథ రూపులకు నమస్కారము. రథములకు ప్రభువులైనట్టి మీకు నమస్కారము.
యజుస్సు 10.  రథ గజ తురగ పదాతి రూప సేనలకు నమస్కారము. సేనా నాయకులైనట్టి మీకు నమస్కారము.
యజుస్సు 11.  రథ శిక్షకులును, రథములను గ్రహించు సారథులును అగు మీకు నమస్కారము.
యజుస్సు 12.  దేవాధిష్టానులైన శిల్పి విశేషులకు నమస్కారము.  చక్కగా రథములను నిర్మించు శిల్పులగు మీకు నమస్కారము.
యజుస్సు 13.  కుంభకారులకు నమస్కారము. లోహకారులగు మీకు నమస్కారము.
యజుస్సు 14.  పక్షి పుంజములను సంహరించు వారికి నమస్కారము. మత్స్య ఘాతుకులైనట్టి మీకు నమస్కారము.
యజుస్సు 15.  చక్కని శరీరములను చేయునట్టి మీకు నమస్కారము. చక్కని ధనుస్సులను చేయునట్టి మీకు నమస్కారము.
యజుస్సు 16.  మృగములను చంపెడి వ్యాధులకు నమస్కారము. కుక్కల మెడలయందు గట్టబడిన పాశములను దాల్చెడి మీకు నమస్కారము.
యజుస్సు 17. శ్వాన రూపధారులకు నమస్కారము. శునక స్వాములైన మీకు నమస్కారము.
అనువాకము 4 సమాప్తము.
అనువాకము 5.
యజుస్సు 1.  ప్రాణుల యుత్పత్తికి మూల కారణమైన, జీవుల రోదనమునకు కారణ మైనట్టియు దుఃఖమును ద్రవింప జేయు నట్టి శివునకు నమస్కారము.
యజుస్సు 2.  పాప నాశకులకును, అజ్ఞానులైన పురుషులను పాలించు వారికిని నమస్కారము.
యజుస్సు 3.  నీలగ్రీవము స్వేత కంఠము కలవాఁడు నగు శివునకు నమస్కారము.
యజుస్సు 4.  జటాజూటము కల వానికి, వ్యుప్త ముండిత కేశునకు (జుత్తులేనివానుకు) నమస్కారము.
యజుస్సు 5.  ఇంద్ర వేషముచే సహస్రాక్షుఁడైన వాఁడును, సహస్ర భుజములు గల అవతారములు ధరించుటచే శతధన్వుఁడును ఐన శివునకు నమస్కారము.
యజుస్సు 6.  కైలాసమున ఉండువాఁడును, శయనించువాఁడును, విష్ణువును తన హృదయమున ధరించువాఁడును అగు శివునకు నమస్కారము.
యజుస్సు 7.  మేఘ రూపమున మిక్కిలి వర్షము కురిపించువాఁడును, బాణములు కలవాఁడును అగు శివునకు నమస్కారము.
యజుస్సు 8.  (అల్ప ప్రమాణుడగుటచే) హ్రస్వముగా నున్నట్టియును, (వ్రేళ్ళు మున్నగు అవయవముల సంకోచమువలన) వామనుఁడుగా నున్నట్టి శివునకు నమస్కారము.
యజుస్సు 9.  ఆకారముచే ప్రౌఢుఁడైనట్టియు, గుణములచే సమృద్ధుఁ డైనట్టి శివునకు నమస్కారము.
యజుస్సు 10.  వయసుచే అధికుఁడైనట్టియు, శృతులచే బాగుగా వృద్ధి పొందునట్టివాఁడు నగు శివునకు నమస్కారము.
యజుస్సు 11.  జగదుత్పత్తికి పూర్వమున్నట్టియు, సభలో ముఖ్యుఁడును అగు పరమ శివునకు నమస్కారము.
యజుస్సు 12.  అంతటను వ్యాపించినట్టి గమనకుశలుఁడైన శివునకు నమస్కారము.
యజుస్సు 13.  శీఘ్రముగా పోవు వాఁడును, ఉదక ప్రవాహముననున్నట్టి శివునకు నమస్కారము.
యజుస్సు 14.  తరంగములతో గూడి యున్నట్టియు, ధ్వని రహితమైన స్థిరమైన జలమున ఉన్నట్టి శివునకు నమస్కారము.
యజుస్సు 15.  ప్రవాహమున నున్నట్టియు, జల మధ్యస్థములైన ద్వీపములందున్నట్టి శివునకు నమస్కారము.
అనువాకము 6.
యజుస్సు 1.  విద్య ఐశ్వర్యము మున్నగు వానిచే జ్యేష్ఠుఁడైనట్టి వాఁడున్నూ విద్యాదులతో కనిష్ఠుఁడైన వాడును అగు మహాదేవునకు నమస్కారము.
యజుస్సు 2.  జగదాదిని హిరణ్య గర్భ రూపమున జన్మించి నట్టి జగ దవసాన సమయమున అగ్ని రూపమున జన్మించినట్టి మహాదేవునకు నమస్కారము.
యజుస్సు 3.  మధ్య కాలమున దేవ తిర్య గాది రూపమున జన్మించి నట్టియును, ప్రరూఢములు కాని ఇంద్రియములు కలవాఁడును అగు మహాదేవునకు నమస్కారము.
యజుస్సు 4.  గవాదులపశ్చాత్భాగమున వత్సాది రూపమున నున్నట్టియును, వృక్షాదుల మూలమున శాఖాదుల రూపమున నున్నట్టి పరమ శివునకు నమస్కారము.
యజుస్సు 5.  పుణ్య పాపములతో కూడుకొన్నవాఁడును, రక్షాబంధమున కర్హమైనట్టి శివునకు నమస్కారము.
యజుస్సు 6.  యమలోకమునఁ బాపులను శిక్షించు వాని రూపమున జన్మించి నట్టియును, మోక్షమున కర్హుడై యున్నట్టి శివునకు నమస్కారము.
యజుస్సు 7.  సర్వ సస్యములతో నిండిన భూమితో ధాన్యాది విశేష రూపమున ఉన్నట్టియు, మేడి, నక్కు నాగలి రూపమున భూమిని దున్ని, అందలి సారమును వెలిబుచ్చునట్టి శివునకు నమస్కారము.
యజుస్సు 8.  వేదమంత్రములచే తెలియ దగు మహిమ కలవాఁడై, వానిలోనున్నట్టియును, వేదాంతములైన ఉపనిషత్తులచే నిరూపింప దగు తత్వము కలవాఁడు కాన వానిలో నున్నట్టి శివునకు నమస్కారము.
యజుస్సు 9.  వృక్షాది రూపమున నున్నట్టియును, లతాది రూపమున నున్నట్టి శివునకు నమస్కారము.
యజుస్సు 10.  శబ్ద రూపుఁడును ప్రతి ధ్వని రూపుఁడును అగు శివునకు నమస్కారము.
యజుస్సు 11  వేగముగా పోవు సేన కలిగినట్టి, వేగముగా పోవు రథము కలిగినట్టి శివునకు నమస్కారము.
యజుస్సు 12.  యుద్ధమున ధైర్యము కలవాఁడును, శత్రువులను సంహరించువాఁడును అగు శివునకు నమస్కారము.
యజుస్సు 13.  కవచము కలిగినట్టియు, గృహము కలవాఁడును అగు శివునకు నమస్కారము.
యజుస్సు 14.  బిలము ఉపమానముగా కలదియును, యుద్ధమున శిరో రక్షకమునగు కిరీటము కలవాఁడును, శరీర రక్షకమైన కవచము కలవాఁడును అగు శివునకు నమస్కారము.
యజుస్సు 15.  వేద ప్రసిద్ధుఁడైనట్టియు, శత్రు నిగ్రహమందు ప్రసిద్ధమైన సేన కలవాఁడునగు శివునకు నమస్కారము.
అనువాకము 6 సమాప్తము.
అనువాకము 7.
యజుస్సు 1.  భేరీ నుండి బయల్వెడలిన శబ్దము స్వరూపముగా కలవాఁడును, దుందుభిని మ్రోగించు దండముతో మొత్తుటచే బయల్వెడలిన నాదము రూపముగా కలవాఁడును, వంశ దండోద్భవుఁడు అగు శివునకు నమస్కారము.
యజుస్సు 2.  యుద్ధమున పలాయన రహితుఁడును, పర సైన్య వృత్తాంతమును పరామర్శించువాఁడును అగు శివునకు నమస్కారము.
యజుస్సు 3.  స్వామి వృత్తాంతములను స్వస్వామి జనులకు తెలియ జేయుటలో కుశలుఁ డైనట్టియు, స్వామిచే పంపఁ బడిన పురుషుఁడైనట్టి శివునకు నమస్కారము.
యజుస్సు 4.  ఖడ్గము కలవాఁడును బాణాధారమైన అమ్ముల పొది కలవాఁడును అగు శివునకు నమస్కారము.
యజుస్సు 5.  వాడి బాణములు కలవాఁడును, బహ్వాయుధములు కలవాఁడునగు శివునకు నమస్కారము.
యజుస్సు 6.  శోభనమైన త్రిశూల రూపమగు ఆయుధము కలవాఁడును, శోభనమైన పినాక రూపమగు ధనుస్సు కలవాఁడును అగు శివునకు నమస్కారము.
యజుస్సు 7.  పాద సంచార యోగ్యమైన క్షుద్ర మార్గమునకు అర్హుఁడును, రథాశ్వాది సంచార యోగ్యమైన ప్రౌఢమార్గము కలవాఁడును అగు శివునకు నమస్కారము.
యజుస్సు 8.  కుత్సితమైన జలము అనగా అల్ప జలము ప్రవహించు చోటును కటము అందురు. అందు జల రూపమున నున్న శివుఁడు కాట్యుఁడు. అతనికి నమస్కారము. అథో ముఖము గాను, అడ్డము గాను జలము ప్రవహించు చోటను జల రూపమున నున్న శివునకు నమస్కారము.
అనువాకము 7 సమాప్తము.
అనువాకము 8.
యజుస్సు 1.  ఉమతో గూడి యున్నట్టియు, సకల జీవుల రోదన హేతువైన దుఃఖమును ద్రవింప జేయు నట్టి శివునకు నమస్కారము.
యజుస్సు 2.  ఉదయ కాలమున ఆదిత్య రూపుఁడగుటచే అత్యంత రక్త వర్ణుఁడై ఉన్నట్టియు, ఉదయానంతరమున ఇంచుకంత రక్త వర్ణుఁడై ఉన్నట్టి శివునకు నమస్కారము.
యజుస్సు 3.  సుఖమును పొందించు వాఁడును, సుఖము నుత్పాదించు వాఁడును, భయ హేతువులైన పాప రోగ చోరాదుల నుండి రక్శించు వాఁడును అగు  మహా దేవునకు నమస్కారము.
యజుస్సు 4.  విరోధులను నశింప జేయుటకు క్రోధ యుక్తుఁ డైనట్తి వాఁడును, దర్శన మాత్రము చేత విరోధులకు భయ హేతు వైనట్టి శివునకు నమస్కారము.
యజుస్సు 5.  అగ్రమునందు వధ కలవాఁడును (ముందున్నవానిని సంహరించువాఁడు) దూరమునందు వధ కలవాఁడును, అగు శివునకు నమస్కారము.
యజుస్సు 6.  దూర సమీప వర్తి శత్రువులను ధ్వంసము చేయువాఁడును, శత్రు ధ్వంసము చేయువాఁడును, సర్వాతిశాయి శక్తిచే సర్వులను సంహరించు వాఁడును అగు శివునకు నమస్కారము.
యజుస్సు 7.  కల్పవృక్షాది స్వరూపుఁడును, హరిత వర్ణములును, కేశ సదృశములునగు ఆకులు గల వృక్షములు స్వరూపముగా కలవాఁడునగు శివునకు నమస్కారము.
యజుస్సు 8.  ఓంకార రూపమైన ప్రణవముచే ప్రతిపాదింపఁబడు శివునకు నమస్కారము.
యజుస్సు 9.  సుఖము నుత్పాదించు వాఁడును, లోకములకు సుఖము భావించు వాఁడు నగు శివునకు నమస్కారము.
యజుస్సు 10.  విషయ సుఖములను జేకూర్చు వాఁడును, మోక్ష సుఖమును జేకూర్చువాఁడును అగు శివునకు నమస్కారము.
యజుస్సు 11.  కల్యాణ స్వరూపుఁడై స్వయముగ నిష్కల్మషముగ నుండు వాఁడును, మిక్కిలి కల్యాణ స్వరూపుఁడుగా నుండునట్టి శివునకు నమస్కారము.
యజుస్సు 12.ప్రయాగాది తీర్థములందు సన్నిహితుఁడై యుండునట్టియును, నదీ తీరములందు ప్రతిష్టింపఁబడిన లింగరూపమున నుండునట్టి శివునకు నమస్కారము.
యజుస్సు 13.  సంసార సముద్రము దాటించి, మోక్ష కాములచే ధ్యానింప దగిన వాఁడును, సంసార మధ్యమున నున్నవారికి కామ్య ఫలదుండునగు శివునకు నమస్కారము.
యజుస్సు14.  గొప్ప మంత్ర జపాదుల యొక్క రూపము వలనఁ బాప తరణమునకు హేతువైనట్టియు, తత్వ జ్ఞాన రూపమున సంపూర్ణముగా సంసారము నుండి దాటించు వాఁడునగు శివునకు నమస్కారము.
యజుస్సు 15.  జీవ రూపమున మరల సంసార గమనమునకు అర్హుఁడైనట్టియు, సంపూర్ణముగా కర్మఫలము ననుభవించు జీవుఁడైనట్టి శివునకు నమస్కారము.
యజుస్సు 16.  గంగా తీరాదులతో జన్మించు కుశాంకురాదులకు అర్హుఁడైనట్టియును, నదీ మధ్య గత ఫేనమునకు అర్హుఁడైనట్టి శివునకు నమస్కారము.
యజుస్సు 17.  సికతకు అర్హుఁడైనట్టియును, ప్రవాహమునకు అర్హుఁడైనట్టి శివునకు నమస్కారము.
అనువాకము  8 సంపూర్ణము.
అనువాకము 9.
1) ఊషర క్షేత్రములం దుండునట్టియును, పది మంది నడుచు త్రోవలోనుండు నట్టి శివునకు నమస్కారము.
2) కుత్సితములు అనగా క్షుద్రములగు శిలలు గల ప్రదేశముల నుండునట్టి, నివాస యోగ్య ప్రదేశమునం దుండునట్టి శివునకు నమస్కారము.
3) జటా బంధము కలవాఁడును భక్తుల యెదుట నుండు నట్టి శివునకు నమస్కారము.
4) గోశాలలో నుండునట్టియు, సామాన్య గృహములలో నుండునట్టి శివునకు నమస్కారము.
5) తల్పము నందును మంచము పైని శయనించునట్టియును, ధనికుల ప్రాసాదమునం దుండు వాఁడు నగు శివునకు నమస్కారము.
6) కుత్సితముగా తిరుగువాఁడును, ముండ్లతో నిండిన లతాదులచే ప్రవేశింప నలవి కాని ప్రదేశమున నుండువాఁడును, విషయములైన గిరి గుహాదులలో నుండువాఁడునగు శివునకు నమస్కారము.
7) అగాధ జలములం దుండువాఁడును, నీహార జలమం దుండువాఁడునగు శివునకు నమస్కారము.
8) పరమాణువులం దున్నట్టియును విస్పష్టమైన ధూళిలోనున్నట్టి శివునకు నమస్కారము.
9) కాష్ఠములం దున్నట్టియును, తడిసిన దాని యందు క్రొత్త దాని యందున్నట్టి శివునకు నమస్కారము.
10) తృణాదికము లోపించు కఠిన ప్రదేశమున నున్నట్టియును, రెల్లు మొదలగు తృణములం దున్నట్టి శివునకు నమస్కారము.
11) భూమియందుండువాఁడును, చక్కని కెరటములు గల నదులయందుండు వాఁడునగు శివునకు నమస్కారము.
12) ఆకులం దున్నట్టియును, ఎండుటాకుల మొత్తమునం దున్నట్టి శివునకు నమస్కారము.
13) సిద్ధము చేయబడిన ఆయుధములు కలవాఁడును, సంపూర్ణముగా సంహరించునట్టి శివునకు నమస్కారము.
14) ఇంచుకంత దుఃఖము కలిగించునట్టియు, అత్యంత దుఃఖము కలిగించునట్టి శివునకు నమస్కారము.
15) భక్తులకు ధనమును చిమ్మెడి ఉదారులగు రుద్రావతారులకును, సర్వ దేవ ప్రియుఁ డగుటచే సర్వ దేవతల హృదయమగు వారికి నమస్కారము.
16) క్షీణించు వాని కంటే విపరీతములై ఎపుడునూ నశింపని శివ శక్తులకు నమస్కారము.
17) అపేక్షించు అర్థమును సంపాదించి యొసంగు శివునకు నమస్కారము.
18)  సంపూర్ణముగా, నిశ్శేషముగా జీవుల యొక్క పాపములను, అచేతనము లందలి దోషములను, లోపములను, తొలగించు శివునకు నమస్కారము.
19) సంపూర్ణముగా స్థూల భావము పొంది దేవతలలో కల శివునకు నమస్కారము.
అనువాకము 9 సమాప్తము.
అనువాకము 10.
ఋక్కు 1.  కుత్సితమైన గతిని పొందించువాఁడా! అన్నమును రక్షించువాఁడా! ఏమియునూ లేనివాఁడా! కంఠమున నల్లనివాఁడవై ఇతరత్ర ఎఱ్ఱనివాఁడా!  పుత్రపౌత్రాదుల యొక్కయు ఈ మాదగు గో మహిష్యాదుల యొక్కయు, సమూహమును భయపెట్టకుము. ఈ మోక్షమందిన అందఱిలో ఒక వస్తువునైనను నశింప జేయకుము. రోగమందినవారిగా జేయకుము.
ఋక్కు 2.  ఓ శివుఁడా! నీదగు ఒక శరీరము శాంతమైనది. ఆ శరీరముతో మమ్ములను జీవింప జేయుటకు సుఖింప జేయుము. ఆ శరీరము అన్ని దినములందును రోగ దారిద్ర్యాదులను తొలగించుటకు ఔషధము వంటిది కాన శుభకరమైనది. శివుని యొక్క తాదాత్మ్యము పొందుటకు ఔషధ రూపమైనదియును, జ్ఞాన దానముచే సంసార దుఃఖమును తొలగించును గాన మంగళకరమైనదియును అగుచున్నది.
ఋక్కు 3.  ఏ ప్రకారముగా మా యొక్క పుత్ర పౌత్రాది రూప మనుష్యునకును మహిష్యాది రూప పశువునకును, సుఖము అగునో, ఇంతే కాదు. ఈ గ్రామము నందలి ప్రపంచము సుఖ పూర్ణమును, ఉపద్రవ శూన్యమును అగునో అట్లు మేము రుద్రుని కొఱకు ఈ పూజ ధ్యానము మున్నగు వానికి చెందిన బుద్ధిని గొప్పగా పోషించు చున్నాము. బల యుక్తుఁడును, తాపస వేషుఁడును, క్షీణించు ప్రతిపక్ష పురుషులు కలవాఁడు నగు రుద్రునకు సకలమును సమర్పించు చున్నాము.
ఋక్కు 4.  ఓ శివా! మమ్ములను ఇహ లోకమున సుఖింపఁ జేయుము. ఇంతే కాదు. మాకు పర లోకమునను సుఖమును చేయుము.   నశింప చేయ బడిన మా పాపములును, వీరులును గల నీకు నమస్కారముతో సేవించెదము. పాలకుఁడైన ప్రజాపతి ఏ సుఖమును, దుఃఖమునకు దూరముగా నుండుటను, ఏ లేశమును సంపాదించెనో ఆ సర్వమును మేము ఓ శివుఁడా! నీ యొక్క ప్రణయమును, స్నేహాతిశయమును కలుగగా పొంద గలము.
ఋక్కు 5.  ఓ రుద్రుఁడా! మా యొక్క ముదుసలియైన పురుషుని హింసింపకు. అంతే కాదు. మా యొక్క బాలుని హింసింపకుము. అంతే కాదు. మాయొక్క నీరు చిమ్ముటకు సేవ చేయుటకును సమర్ధుఁడైన పురుషుని హింసింపకుము. అంతే కాదు. మా యొక్క గర్భమందలి పురుషుని హింసింపకుము. మా యొక్క తండ్రిని చంపకుము. అంతే కాదు.మా తల్లిని కూడా చంపకుము. మా యొక్క ప్రియమైన శరీరములను హింసింపకుము.
ఋక్కు 6.  రుద్రుఁడా! మా యొక్క సంతానమందును దయ చూపి హింసింపకుము.   మా యొక్క ఆయుర్దాయము విషయమై హింసింపకుము. మాయొక్క గోవులందును, మాయొక్క గుఱ్ఱముల విషయమై హింసను ఆచరింపకుము. కృద్ధుఁడవై మాయొక్క వీరులను, భృత్యులను వధింపకుము.  మేము హవిస్సు గలవారమై నిన్ను నమస్కారముతో సేవించెదము.
ఋక్కు 7.  గోవులను చంపునట్టియు, అంతే కాదు పుత్ర పౌత్రాది పురుషులను సంహరించు నట్టియు నశింపఁ జేయఁ బడిన సేవకులు గల్గినట్టి  నీయొక్క (ఉగ్ర)రూపమున ఉండు గాక. సుఖకరమగు నీయొక్క రూపము మాయందుండుగాక. ఇంతే కాదు. మమ్ములను అన్ని విధముల కాపాడుము. అంతే కాదు. ఓ ప్రభూ! మమ్ములను ఇతరుల కంటే అధికులుగ చెప్పుము. ఇంతే కాదు రెండు లోకములను వృద్ధి చేయు నీవు సుఖమునొసంగుము.
ఋక్కు 8.  గుహను పోలిన హృదయ పద్మమును సర్వదా ఉండునట్టియును, నిత్యము యువకుఁడైనట్తియును, భయంకరమైన సింహము వలె ప్రళయ కాలమున సర్వ జగత్తును నశింపఁ జేయుటకు భయంకరుఁడైనట్టియు ప్రసిద్ధుఁడైన రుద్రుని ఓ నాదగు వాకా! స్తోత్రము చేయుము. మా వచనము చే స్తుతింప బడిన వాడవై ప్రతి దినము నశించు మా శరీరమునకు సుఖము చేకూర్చుము. నీ సేవలు అన్యుఁడగు శత్రువును నశింపఁ జేయు గాక.
ఋక్కు 9.  శివుని యొక్క ఆయుధము మమ్ములను పూర్తిగా క్రోధముచే ప్రజ్వరిల్లునట్టియు పాప పరిహారక రూపమును గోరు శివుని యొక్క భయంకరమైన బుద్ధి మమ్ములను విడిచి పెట్టును గాక. వొరోధ వినాశనకై చెక్కుచెదరక యున్న భయంకర బుద్ధిని హవిస్సనెడి అన్నముతో గూడిన యజమానుల నుండి తొలగింపుము. భక్తుల కోరికలను అమితముగా నొసంగు రుద్రుఁడా! మా పుత్రులకు మా మనుమలకును సుఖమునొసంగుము.
ఋక్కు 10.  అతిశయముగా వర్షించి తడుపువాఁడా!(కామముల నొసంగువాఁడా)మిక్కిలి శాంతమైన స్వరూపము కలవాఁడా! మమ్ములను గూర్చి శాంతుఁడవును, మంచి మనస్సుతోడను స్నేహముతోడను గూడినవాఁడవగుము. త్రిశూలాదికమును అత్యున్నతమైన మఱ్ఱి రావి మున్నగు వృక్ష జాతమునందుంచి, వ్యాఘ్ర చర్మమును మాత్రము దాల్చువాఁడవై మా కెదురుగా రమ్ము. పినాకమను ధనుస్సును హస్తమున ధరించుచు రమ్ము.
ఋక్కు 11.  విశేషముగ భక్తుల సన్నిధిని బహు విధముల ధన రాసులను జిమ్మి ఒసంగువాఁడా! తెల్లనివాఁడా! లేదా, మిక్కిలి ఎఱ్ఱనివాఁడా! ఓ భగవంతుఁడా! నీకు నమస్కారమగు గాక. నీకు ఏ ఆయుధములు వేలకొలది కలవో (వానిని) వాటి చే మాకంతే ఇతరుఁడైన విరోధిని నశింపజేయును గాక.
ఋక్కు 12.  ఓ శివా నీ యొక్క చేతులందు ఆయుధములు వేయి విధముల వేలకొలదీ కలవు. ఓ భగవంతుఁడా! సమర్థుఁడవగ్చు, ఆ ఆయుధములకు ముఖములను, శల్యములను మాకు పరాఙ్ముఖమగునట్లు చేయుము.
అనువాకము 10 సమాప్తము. 
అనువాకము 11.
ఋక్కు 1.  భూమి యొక్క ఉపరి భాగమున ఏ రుద్రులు సహస్ర ప్రకారులై సహస్ర సంఖ్యాకులై, కలరో ఆరుద్రులయొక్క ధనుస్సులును, మాకంటే సహస్ర యోజనములు దాటిన పిమ్మట గల దేశమున తొలగింపబడిన వింటి త్రాడు కలవిగా జేసి ఉంచుము.
ఋక్కు 2.  ఈ కాన వచ్చు మహా సముద్రముతో సమానమైన అంతరిక్షము నాశ్రయించి యున్న రుద్రమూర్తి విశేషములు సహస్ర యోజనముల దూరమున ఉండుగాక.
ఋక్కు 3.  రుద్రుని యొక్క మూర్తి విశేషములు కొన్ని ప్రదేశములందు నీల వర్ణములును, ఇతర ప్రదేశములందు శ్వేత వర్ణములై యుండును. నీల కంఠములు హింసించు నవియును పాతాళమున సంచరించు నవియును ఐయున్నవి.
ఋక్కు 4.  నీల శ్వేత వర్ణములును, నలుపు కంఠమునందు గల రుద్రాంశ గల దేవాదులు  స్వర్గమును ఆశ్రయించి యుండిరి.
ఋక్కు 5.  వృక్షము లందు ఏ రుద్రులు కలరో వారు లేత గడ్డి వలె పింజర వర్ణము కలవారు. నీల వర్ణమైన గ్రీవము కలవారు. కొందరు విశేషముగ రక్త వర్ణము కలవారు.
ఋక్కు 6.  ఏ రుద్రులు కాన రాని శరీరము కలవారై మనుష్యులకు ఉపద్రవములను గావించు భూత గణములకు ప్రభువులో వారిలో కొందరు నున్నగా చేయ బడిన   శిరస్సులు కలవారై జటాజూటము లకలవారై జీవులను హింసిచు చున్నారు. వారు దూరముగా నుందురు గాక.
ఋక్కు 7.  ఏ రుద్రులు (రుద్రాంశ గలవి) భుజింప దగిన వస్తువు లందు గూఢముగా నున్నవై జనులను విశేషముగా బాధించు చున్నవో త్రాగ తగిన పాలు మున్నగు వానిలో నున్నవై త్రాగుచున్న జనులను విశేషముగా బాధించు చున్నవో అవి దూరముగా నుండును గాక.
ఋక్కు 8.  ఏ రుద్రులు లౌకికములును వైదికములునగు మార్గములను రక్షించువారో , అన్న సమూహమును భరించువారో, అన్న ప్రదానముచే జీవులను పోషించువారో, వారు మిశ్రములై విరోధులతో యుద్దము చేయువారు అగుచున్నారు. వారు దూరముగా ఉందురుగాక.
నవమము, 
యజుస్సు1.  ఏ రుద్రులు కాశీ ప్రయాగాది క్షేత్రములను రక్షించుటకు సంచరించుచున్నారో వారు ఈటెలు కలవారును, కత్తులు కలవారును అయి యుండిరి.
దశమము.
యజుస్సు 2.  ఏ రుద్రులు వేలకొలది కలరో అంతకంటె అధికులై అన్ని దిక్కులను ప్రవేశించి కలరో వారి యొక్క ధనుస్సులను వేయి యోజనముల దూరమున వింటి త్రాడు తొలగించి ఉంచుడు.
ఏకాదశ. 
యజుస్సు 3.  ఏ రుద్రులు భూమిపై కలరో,ఏరుద్రులకు ఆహారమే బాణములో, అన్నమే బాణములుగా గల రుద్రులకు నమస్కారము. ఏ రుద్రులు ఆకాశమునందుఁ గాలరో, ఏ రుద్రులకు వాయువు బాణములో, ఆ రుద్రులకు నమస్కారము. ఏ రుద్రులు స్వర్గమునందు కలరో, ఏ రుద్రులకు వర్షము బాణములో, ఆ రుద్రులకు నమస్కారము. తూర్పు ముఖముగా పది వేళ్ళ చివరలు గల అంజలుల తోడను, దక్షిణ ముఖముగా పది వ్రేళ్ళ చివరలు గల అంజలుల తోడను, పడమట ముఖముగా పది వ్రేళ్ళ చివరలు గల అంజలుల తోడను, ఉత్తర ముఖముగా పది వ్రేళ్ళ చివరలు గల అంజలుల తోడను, ఊర్ధ్వ ముఖముగా పది వ్రేళ్ళ చివరలు గల అంజలుల తోడను, ఆ రుద్రులకు నమస్కారములు. ఆ రుద్రులు మమ్ములను సుఖపఱచుదురు గాక.  ఎవనిని ద్వేషింతుమో, ఏ శత్రువు మమ్ములను ద్వేషించునో, ఆ శత్రు ద్వయమును రుద్రులారా! మీయొక్క తెరచి యున్న నోటిలో ఉంచుచున్నాను.
అనువాకము 11 సమాప్తము
కాల స్వరూపుఁడు, అఖండ ఆనంద స్వరూపుఁడు ఐన ఆ పరమాత్మతో యోగము ద్వారా మన దేహము పవిత్రమగును గాక.పండిన దోస పండు తనంతట తానే తొడిమ నుండి వేరు పడినట్లు మనమూ మృత్యువు నుండి వేరు పడి అమృతత్వమును పొందుదుము గాక.
అగ్ని, నీరు మున్నగు వానియందును, ఓషధులు విశ్వమున భువనములందును ఏ రుద్రుఁడు లీనమై యుండెనో అట్టి రుద్రునకు నమస్కారము అగును గాక.
ఉత్తమమైన అస్త్ర శస్త్రములు కలిగివైద్యుడై మన రోగాలను నిర్మూలించే,రాక్షసులను సంహరించే రుద్రునికి మన మనస్సులను పవిత్రం చేస్తున్నందుకు నమస్కారములు.
శివుని తాకిపూజించే ఈ హస్తము మాకు దేవునితో సమానము. శివుని తాకినఈ హస్తము నా సర్వ రోగములకు దివ్యౌషధము.
ఓ దేవా! ప్రాణులను చంపుటకు ఉపయోగించే సహస్రమైన నీ పాశములను మాకు దూరముగా యుంచమని మా ప్రార్థన. దానికోరకై మేము ఈ అగ్నిహోత్రము ద్వారా నీకు ప్రీతిని సమర్పిస్తున్నాము. రుద్రునకు నా నమస్కారములు. మృత్యుదేవత నా వాద్దకు రాకుండు గాక. ప్రాణము,ఇంద్రియముల కలిసే గ్రంధులలో నివసించే ఓ దేవా! నేను సమర్పిస్తున్న ఆహారమును స్వీకరించి నాయందు నివసించుము. మృత్యు దేవతను నా నుండి దూరముగా ఉండు గాక.
ఓం శాంతిశ్శాంతిశ్శాంతిః.
నమక భావము సమాప్తము.
శ్రీ రుద్ర  చమకము. 
అనువాకము 1.
శ్రుతి:-  ఓ అగ్నావిష్ణులారా! అన్నమును, అన్న భోజనమునకు అనుమతియును, శుద్ధియును, బంధనమును, అనగా అన్న విషయకమైన ఔత్సుక్యమును నాకు సంపాదించెదరు గాక. 
అన్న ధారణమును, అన్న హేతువైన యజ్ఞమును, ఉదాత్తాది మంత్ర స్వరమును, స్తుతిని నా కొసంగుము.  
విని, వినిపించెడి శక్తిని, సామర్థ్యమును, ప్రకాశమును, స్వర్గమును నా కొసగుము.
ప్రాణ వాయువును, అపాన వాయువును, వ్యాన వాయువును, ప్రాణాపానాది వృత్తులు కల వాయువును నాకొసగుము.
మనస్సున జనించిన జ్ఞానమును, మనోజ్ఞానముచే సర్వదా ఇంద్రియములను గోచరించు ద్రవ్యమును, వాక్కును, మనస్సును నా కొసంగుము. 
నేత్రమును చెవిని జ్ఞానేంద్రియములకు చెందిన నేర్పును నా కొసంగుము.
బల హేతువగు అష్టమ ధాతువును, శత్రువును పరాభవింప గల శక్తిని, ఆయుర్దాయమును, ఆయుస్సు తగ్గి చర్మము ముడతలు పడి, జుత్తు పండే స్థితిని నాకు చేకూర్చుము.
శాస్త్ర ప్రసిద్ధ పరమాత్మయును, చక్కని సన్నివేశము గల శరీరమును, సుఖమును, శరీరమును రక్షించు కవచాదికమును నాకు అగు గాక.
శరీరావయవముల నన్నింటిని, యథా స్థానమున గల యముకలను అంగుళ్యాది పర్వములను, ఇంతకు మున్ను చెప్పని అవయవములను, నాకు చేకూర్చుదురు గాక.
అనువాకము 1 సమాప్తము.
అనువాకము 2.
1) అన్నిటి కంటే  శ్రేష్ఠముగా నుండుటను, ప్రభువుగా నుండుటను, మనస్సున నుండు క్రోధమును, ఓరిమి లేకుండుట మున్నగు కారణములచే కల్గు బాహ్య క్రోధమును నాకు ఒసంగుము.
2) స్వల్ప ప్రయత్నముతో శత్రువులు  ఛేదింప శక్యము కాకుండుటను, శైత్య మాధుర్యము గల జలమును జయింప సామర్థ్యమును, మహత్వమును, జయించి సంపాదించిన ధనాది సంపదను నాకు(చేకూర్చుము) .
3) కోర దగిన పూజ్యత్వమును, గృహ క్షేత్రాది విస్తారమును,  పుత్ర పౌత్రాదుల శరీరములను, పుత్ర పౌత్రాదులకు చెందిన దీర్ఘత్వమును, నాకు ఒసంగుము.
4) ఉత్కృష్టమగు అన్నమును, అధికమగు ధనమును, విద్యాదులకు చెందిన గుణములచే కలిగిన గొప్పదనమును, యధార్ధ మాడుటను, పర లోకము కలదను బుద్ధిని, నాకు ఒసంగుడు. 
5) స్థావర జంగమమైన గవాదికమును, సువర్ణాది ధనమును, సర్వము స్వాధీనముననుండుటను, శరీర కాంతిని నాకొసంగుము.
6) పాచికలాడుట మున్నగు దానిని, క్రీడలచే కలుగు ఆనందమును, కలుగబోవు సంతానమును నాకొసంగుడు.
7) ఋక్కుల సమూహమును, ఋగాది మంత్రములచే కలిగిన అపూర్వమును, పూర్వ లబ్ధమైన ధనమును, ఇటుపైన పొంద దగిన ద్రవ్య జాతమును నాకు ఒసంగుము.
8) పూర్వ సిద్ధమైన క్షేత్రాదులను, మున్ముందు చక్కగా పొంద దగిన దానిని, చక్కగా వెళ్ళ తగిన తావును, బంధువులు గల గ్రామాంతరాదులను, దొంగలు మున్నగు ఈరి బాధలు లేని మార్గమును, నాకు ఒసంగుడు.
9) వేద్ధి చేయఁ బడిన ధనాదికమును గాని, ఆచరించిన కర్మ ఫలమును గాని, అనుష్టించ బోవు యజ్ఞముల ఫలమును, తమ పనులు చేయుటకు సమర్థమైన ద్రవ్యమును, స్వకీయమైన సామర్ధ్యమును,  పదార్థమును మాత్రమే నిశ్చయించుటను దుర్ఘటములైన రాజ కార్యాదులకు చెందిన నిశ్చయమును నాకొసంగుడు.
అనువాకము 2 సమాప్తము.
అనువాకము 3.
1) ఐహిక సుఖమును, పర లోక సుఖమును, ప్రీతి కారణమైన వస్తువును, అనుకూలముగానున్న కారణమున కోరఁబడిన పదార్థమును నా కొసంగుము.
2)మనస్సునకు స్వాస్త్యమును కూర్చు బంధు వర్గమును, ఇహ లోకమున రమణీయమైన కల్యాణమును, పరలోకమును నాకొసంగుడు.
3) నివాస హేతువులగు గృహాదులను, కీర్తిని, సౌభాగ్యమును, ధనమును నా కొసంగుడు.
4) ఆచార్యాదుల వలె నియమకుడనగుటను, పిత్రాదుల వలె పోషకుఁడ నగు శక్తిని, ధైర్యమొంది నిశ్చలముగా నుండుటను, నాకొసంగుడు.
5) సర్వ జనులకు అనుకూలముగ నుండుటను, పూజను, వేద శాస్త్రము లకు చెందిన విజ్ఞానమును, జ్ఞాపకము చేయు సామర్థ్యమును నాకొసంగుడు. 
6) పుత్రాదులను ప్రేరేపించు సామర్ధ్యమును, భ్రుత్యాదులను ప్రేరేపించు సామర్ధ్యనును, గోలాంగూలాదులతో వ్యవసాయమును సాధించు సంపత్తిని, పైని చెప్పిన పనులు చేయుటకు వీలు కాకుండ చేయు ప్రతి బంధమును నివారించుటను నాకొసగుడు.
7) యజ్ఞాది కర్మను, యజ్ఞాది కర్మ ఫలమును, క్షయ మున్నగు వ్యాధులు లేకుండుటను, జ్వరము మున్నగు చిన్న వ్యాధులు లేకుండుటను, నాకు ఒసంగుడు.
8) జీవన కారణమైన వ్యాధి పరిహారకమైన ఔషధమును, అప మృత్యువు లేకుండుటను, శత్రువులు లేకుండుటను, భయము లేకుండుటను నాకు ఒసంగుడు.
9) శోభనమైన గమనమును, శయ్య, తలగడ మున్నగు సంపదను, స్నానాదులచే ప్రకాశించు ప్రాతః కాలమును, యజ్ఞ దానాధ్యనాదులతో కూడిన సంపూర్ణ దినమును నాకు ఒసంగుడు.
అనువాకము 3 సమాప్తము.
అనువాకము 4.
1) అన్న సామాన్యమును ప్రియ వచనమును, అన్న విశేషములను, వానిలో చేరిన పాలను, అన్న విశేషములందు సారమును నాకు ఒసంగుడు.
2) ఆవు నేయియును, పూతేనియును, బంధువులతోడి భోజనమును, సహ పానమును నాకు ఒసంగుడు.
3) అన్నమునకు హేతువైన వ్యవసాయమును, వర్షమును, జయ స్వభావమును, భూమిని దొలుచుకొని జన్మించు చెట్టులు, పొదలు మున్నగు వానిని నాకు ఒసంగుడు.
4) సువర్ణమును, మణులు ముత్యములు మున్నగు వానిని,  పూర్వమే చెప్పఁ బడిన సువర్ణము యొక్క సమృద్ధిని, శరీర పోషణమును నా కొసంగుడు. 
5) విభువును, ప్రభువును,బహు యను దానిని, భూయః అను దానిని, నాకు ఒసంగుడు. 
6) పూర్ణమును, పూర్ణ తరమును, అక్షితిని, కుత్సితములైన యవలను నాకు ఒశంగుడు.
7) ఆహారమును, అన్నము చేత ఆకలి బాధను పోగొట్టుటను, ప్రసిద్ధము లైన యవలు మాషములు, తిలలు, ముద్గములు మున్నగు ధాన్యములను, బార్లీలను నాకు ఒసంగుడు.
8)  మినుములను, నూవులను, ముద్గములను, పెసలు కంటే పెద్దవిగా నుండు ధాన్య విశేషములను నాకు ఒసంగుడు.
9) గోధుమలను, ముద్గల వలె సూపమునకు పనికి వచ్చు వానిని, ప్రియంగవములను, సూక్ష్మమైన శాలి ధాన్యములను, గ్రామము లందలి ధాన్య విశేషములను, అరణ్యమందలి ధాన్యమును నాకు ఒసంగుడు.
అనువాకము 4 సమాప్తము.
అనువాకము 5 .
1) రాయియును, మట్టియును, పెద్ద కొండలును, కొండలును, నాకు అగు గాక.
2) ఇసుకలను, అశ్వత్థాది వృక్షములను, బంగారమును, వెండిని నాకు ఒసంగుడు.
3) సీసమును, తగరమును, నల్లటి ఇనుమును, కాశ్య తామ్రాదులను నాకు ఒసంగుడు.
4) అగ్నిని, జలములను,  లతలను, ఓషధులను నాకు ఒసగుదు.
5) దున్నబడిన భూమిలో పండింప బడిన దానిని, దున్న బడని భూమిలో పండిన దానిని,  గ్రామము లందలి పశువులను అరణ్యమునందలి పశువులను నాకొసంగుడు.అవి నిమిత్తమైన యజ్ఞముచే సమర్థములు అగు గాక. 
6) పూర్వులచే లబ్ధమైన ధనమును, తన జన్మలో రాబోవు ధనమును, ఐశ్వర్యముతో గూడిన పుత్రాదికమును, స్వకీయమైన ఐశ్వర్యాదికమును నాకు ఒసంగుడు. 
7) నివాస సాధనమైన గవాదికమును, నివాసాధారమైన గృహాదికమును, అగ్నిహోత్రాది కర్మ జాతమును, కర్మాచరణమునకు అనుకూలమైన సామర్థ్యమును నాకు ఒసంగుడు.  
8) ప్రయోజన విశేషమును, పొంద దగిన సుఖమును, ఇష్ట వస్తువును పొందుటకుపాయమును, ఇష్ట ప్రాప్తిని నాకు ఒసంగుడు.
అనువాకము 5 సమాప్తము.
అనువాకము 6.  
1) నాయొక్క అగ్నియును నాకు ఇంద్రుఁడు. నాయొక్క చంద్రుఁడును నాకు ఇంద్రుఁడు. నా యొక్క నాయొక్క సమస్తమును ప్రేరేపించు సూర్యుఁడును నాకు ఇంద్రుఁడు. నాయొక్క సరస్వతియును నాకు ఇంద్రుఁడు.
2) నాయొక్క సూర్యుఁడును నాకు ఇంద్రుఁడు. నాయొక్క వేద మంత్రార్థమును చెప్పు బృహస్పతియును నాకు ఇంద్రుఁడు. నాయొక్క మిత్రః మిత్రుఁడగు సూర్యుఁడు నాకు ఇంద్రుఁడు. నాయొక్క వరుణ దేవు@డు నాకు ఇంద్రుఁడు అగు గాక.
3) నా యొక్క త్వష్ట ప్రజాపతియును నాకు ఇంద్రుఁడు అగు గాక. నా యొక్క బ్రహ్మయు నాకు ఇంద్రుఁడగు గాక. నా యొక్క విష్ణువున్ నాకు ఇంద్రుఁడగు గాక. నాయొక్క అశ్వినీ దేవతలును నాకు ఇంద్రుఁడు అగు గాక. 
4) నా యొక్క వాయువు నాకు ఇంద్రుఁడు అగు గాక. నాయొక్క సమస్త విశ్వ దేవతలు నాకు ఇంద్రుఁడు అగు గాక. నా యొక్క భూదేవి నాకు ఇంద్రుఁడు అగు గాక. నాయొక్క ఆకాశము నాకు ఇంద్రుఁడగు గాక.
5) నా యొక్క స్వర్గము నాకు ఇంద్రుఁడు అగు గాక. నాయొక్క దిక్కులు నాకు ఇంద్రుఁడు అగు గాక. నా యొక్క ఊర్థ్వ దిక్కును నాకు ఇంద్రుఁడు అగు గాక. నాయొక్క విశ్చ కర్మ యను ప్రజా పతియును నాకు ఇంద్రుఁడు అగు గాక.
అనువాకము 6 సమాప్తము.
అనువాకము 7.
1)  సోమ గ్రహమును నాకు అగు గాక. రశ్మి గ్రహమును నాకు అగు గాక. అదాభ్య గ్రహమును నాకు అగు గాక. అధిపతి గ్రహమును నాకు అగు గాక.
2) ఉపాంశువును నాకు అగు గాక. అంతర్యామమును నాకు అగు గాక. ఇంద్ర వాయువులకు చెందిన ఇంద్ర వాయవమును నాకు అగు గాక. మైత్రావరుణులకు చెందినవియును నాకు అగు గాక. 
3) అశ్వినులును నాకు ఒసంగుము. ప్రతి ప్రస్థానమును నాకు అగు గాక. శుక్రమును నాకు ఒసంగుము. మంథీ యనునదియును నాకు ఒసంగుము.
4) ఆగ్రయణమును నాకొసంగుము. వైశ్వ దేవమును నాకు ఒసంగుము. ధృవగ్రహమును నాకొసంగుము. వైశ్వానరమును నాకు ఒసంగుము.
5) ఆరు ఋతువులును నాకు ఒసంగ బడును గాక. నవ గ్రహములును నాకొసంగబడుదురు గాక. మిక్కిలి గ్రహింప దగిన ఇతర గ్రహమును నాకొసంగబడుదురు గాక. ఇంద్రాగ్నుల కలయికయును నాకొసంగబడును గాక. వైశ్వ ద్ఫేవమును నాకొసంగభడును గాక.
6) మరుత్వతీయములును నాకు అగు గాక. మహేంద్రమును నాకు అగును గాక. ఆదిత్యమును నాకు అగును గాక. సావిత్రమును నాకు అగును గాక.  
7) సారస్వతమును నాకు ఒసంగుఁడు. పౌష్ణమును నాకు ఒసంగుఁడు. పత్నీవతమును నాకు ఒసంగుఁడు. హరియోజనమును నాకు ఒసంగుఁడు.
అనువాకము 7 సమాప్తము.
అనువాకము 8.
1) ఇధ్మమును నాకు ఒసంగుము. బర్హిస్సును నాకు ఒసంగుము. వేదిని నాకు ఒసంగుము. ధిష్టియములను నాకు ఒసంగుము.
2) స్రుక్కులను నాకు ఒసంగుడు.  చమసలను నాకు ఒసంగుడు.  గ్రావాణములను నాకు ఒసంగుడు.  ఒక విధమగు యజ్ఞాంగములను నాకు ఒసంగుడు. 
3) ఉపరవములును నాకు అగు గాక. అధిషవణములును నాకు అగు గాక. ద్రోణ కలశమును నాకు అగు గాక.వాయవ్యములును నాకు అగు గాక. 
4) పూత భృత్తును నాకు ఒసగుఁడు.అధవనీయమును నాకు ఒసగుఁడు. అగ్నీధ్రవమును నాకు ఒసగుఁడు.  హవిర్ధానమును నాకు ఒసగుఁడు.  
5) పత్నీశాలౌదులను  నాకు చేకూర్పుఁడు.సదస్సులను  నాకు చేకూర్పుఁడు.పురోడాశములను నాకు చేకూర్పుఁడు. శామిత్రాదులను  నాకు చేకూర్పుఁడు.అవభృధమును  నాకు చేకూర్పుఁడు.శంయువాకమును   నాకు చేకూర్పుఁడు.  
అనువాకము 8 సమాప్తము.
అనువాకము 9.
1) చీయమానమైన అగ్నుయును నాకు అగును గాక. ప్రవర్గ్యమును నాకు అగును గాక. అర్కయాగమును సూర్య యాగమును నాకు అగును గాక. 
2) ప్రాణాహుతి హోమమును నాకు ఒసంగుము. అశ్వమేథమును నాకు ఒసంగుము.పృథివిని నాకు ఒసంగుము. అదితిని నాకు ఒసంగుము.  
3) దితియును స్వర్గమున్ వృషభ సంబంధమైనవియును  అంగుళి వలె నుండు విరాట్పురుషుని అవయవ విశేషములును దిశలును, విదిశలును అవన్నియును నా యొక్క యజ్ఞముతో స్వస్వవ్యాపార సమర్థములు అగు గాక. 
4) పద్య రూప స్తోత్రములతో నిండిన ఋగ్వేదమును  నాకు ఒసంగుఁడు.గానముతో మిళితమైన మంత్రములు గల సామ వేదమును నాకు ఒసంగుఁడు.సోమావృత్తి రూప స్తోత్రమును  నాకు ఒసంగుఁడు.వచన రూప మంత్రమును గల యజుర్వేదమును నాకు ఒసంగుఁడు. 
5) దీక్షను నాకు అగు గాక.  తపస్సును నాకు అగు గాక.  ఋతువును వ్రతమును నాకు అగు గాక.  రాత్రిందివములు కురియునట్టి వర్షముచే కలుగు సస్యమును నాకు అగు గాక. బృహత్తు రథంతరము అను సామములును నాకు అగు గాక. నా యజ్ఞముచే తమతమ వ్యవహారములందు సమర్థములు అగు గాక. 
అనువాకము 9 సమాప్తము.
అనువాకము 10.
1) కడుపులో నున్న ప్రాణులను నాకు ఒసంగుము. వత్సలను నాకు ఒసంగుము.ఒకటిన్నర సంవత్సరముల వయసు మగ గోవులను నాకు ఒసంగుము. అదే వయసు గల ఆడ గోవులను నాకు ఒసంగుము. 
2) రెండు సంవత్సరముల వయసు గల ఋషభమును నాకు ఒసంగుము. రెండు సంవత్సరముల గోవును నాకు ఒసంగుము. రెండున్నర సంణ్వత్సరముల వయసు కల ఋషభమును నాకు ఒసంగుము. రెండున్నర సంవత్సరముల వయసు కల గోవును నాకు ఒసంగుము. 
3) మూడు సంవత్సరముల వయసు కల ఋషభమును నాకు ఒసంగుము. మూడు సంవత్సరముల వయసు కల గోవును  నాకు ఒసంగుము.మూడున్నర సంవత్సరముల వయసు కల ఋషభమును నాకు ఒసంగుము. మూడున్నర సంవత్సరముల వయసు కల గోవును నాకు ఒసంగుము. 
4) నాలుగు సంవత్సరముల వయసు కల ఋషభమును  నాకు ఒసంగుము.నాలుగు సంవత్సరముల వయసు కల గోవును నాకు ఒసంగుము. సేచన క్రియకు సమర్థమైన ఋషభమును నాకు ఒసంగుము. వంధ్య యైన గోవును నాకు ఒసంగుము.
5) వేహత్తును నాకు ఒసంగుము. శకట వాహనమునకు ఉపయోగ పడు ఋషభమును నాకు ఒసంగుము. ధేనువును నాకుఒసంగుము. ఆయువును నాకు ఒసంగుడు.ప్రాణ శక్తిని నాకు ఒసంగుడు. అపానమును నాకు ఒసంగుడు.వ్యాన శక్తిని నాకు ఒసంగుడు. చక్షు శ్శక్తిని నాకు ఒసంగుడు. శ్రోత్ర శక్తిని నాకు ఒసంగుడు. మనశక్తిని నాకు ఒసంగుడు. వాక్శక్తిని నాకు ఒసంగుడు.  
అనువాకము 10 సమాప్తము.
అనువాకము11
1) ఒకటి సంఖ్యకు ప్రతీకయగు ప్రకృతి నా పట్ల ప్రసన్న మగును గాక. మూడుకు ప్రతీకయైన ఇచ్చ్ఛా క్రియా జ్ఞాన శక్తులు(సరస్వతి.లక్ష్మి,పార్వతి)నాయందు ప్రసన్నమగును గాక. ఐదుకు ప్రతీకలైన పంచ భూతమును నాయందు ప్రసన్నమగును గాక. జ్ఞానేంద్రియములు, మనస్సు బుద్ధి యను ఏడును నయందు ప్రసన్నమగును గాక. నవ దుర్గలు నాయందు ప్రసన్నమగును గాక. నవద్వారములు కపాల బిలము మరియు నాభి బిలము అను పదకొండును నాయందు ప్రసన్నమగును గాక. పది దిక్కులును త్రిమూర్తులును నాయందు ప్రసన్నమగును గాక. శ్రోత్రాది పదులాలుగు నాడులు, సుషుమ్నాడి నాయందు ప్రసన్నమగును గాక. దశేంద్రియములును వాటికి తోడుగా ఉన్న సప్త ధాతువులును నాయందు ప్రసన్నమగును గాక. నవదశ ఓషధులును నాయందు ప్రసన్నమగును గాక. 
2) మనో జ్ఞాన కర్మేంద్రియమును (11) పంచ తన్మాత్రలు(5) పంచ భూతములు (5) అను 21 జీవ తత్వములకు చెందిన మర్మములువైద్య శాస్త్ర ప్రసిద్ధమైనవి నాకు అనుకూలముగానుండును గాక. జ్వరము మొదలుగా గల 23 రోగములు నాయందు ప్రసన్నమగును గాక. అప్సరాదులు 25 మందియు నా యందు ప్రసన్నమగుదురు గాక. చిత్రసేనాది 27 మంది గంధర్వులు నాయందు ప్రసన్నమగుదురు గాక. కృత్యాది విద్యుద్దేవతలు 29 మందీ నాయందు ప్రసన్నమగుదురు గాక. ఊర్ధ్వ లోకములు 7 అధో లోకములు 7వైకుంఠ, రాధా లోక, గోలోక, మణిద్వీప, మహాకాలపుర,శివపుర, గణేశ లోకములను ఉపస్వరగములు అను 7 అయోధ్య, మధుర, మాయ, కాశీ, కాంచీ అవంతిక, ద్వారావతి యను 7 భూస్వర్గములును, కైలాస, మానస, మేరు వను 3 ఈ మొత్తము 31 నాయందు ప్రసన్నమగును గాక.   వసువులు 8మంది,రుద్రులు11 మంది, ఆదిత్యులు 12 మంది, అస్వినీ దేవతలు2, (ప్రజాపతి) యను 33 మంది దేవతలు నాయందు ప్రసన్నమగుదురుగాక.
3) ధర్మార్థకామమోక్ష అను 4 విద్యలు నాయందు పేసన్నమగును గాక. అష్టవిధ ప్రకృతులు నాయందు ప్రసన్నమగును గాక. శిక్షాది వేదాంగములు 6 ను, ధర్మ శాస్రాదులు 6ను, ఈ మొత్తము 12 నాయందు ప్రసన్నమగును గాక.  దూర శ్రవణ దూర దర్శన విద్య1. జ్ఞానేంద్రియములకు చెందిన సిద్ధి విద్యలు5.కర్మేంద్రియములకు చెందిన సిద్ధివిద్యలు5. స్థాపత్య వేద సిద్ది1.ఫర్జన్య సిద్ధి1. జ్యోతిర్విద్య1. ఆయుర్విద్య1. పరోక్ష బ్రహ్మ విద్య1.
ఈ 16 నాయందు ప్రసన్నమగును గాక.  పంచ భూతములు సూక్ష్మ రూపముచే5 స్థూలరూపముచే5.  శబ్దస్పర్శాది విషయములు స్థూలము5 సూక్ష్మము5 ఈ20 నాయందు ప్రసన్నమగును గాక. పంచ భూతములు, శబ్దస్పర్శాదులు5 జ్ఞాన కర్మేంద్రియములు10 మనోబుద్ధి చిత్త అహంకారములు4 .ఈ 24 నాయందు ప్రసన్నమగును గాక. ఆవు, మేక మున్నగు భేదములతో 28 విధములగు సృష్టి నాయందు ప్రసన్నమగునుగాక. దేవసృష్టివిధములు 8 స్థావర సృష్టి విధములు 6 కౌమార మానస సృష్టి విధములు 2 జ్ఞాన కర్మేంరియ సృష్టి విధములు 10 అహంకార సృష్టి విధములు 3. సత్వ రజస్తమోగుణసృష్టి విధములు 3 ఈ 32 నాయందు ప్రసన్నమగును గాక. 36 అక్షరములు గల బృహతీ ఛందస్సు నాయందు ప్రసన్నమగును గాక. 40 అక్షరములు గల పంక్తి ఛందము నాయందు ప్రసన్నమగును గాక. 44అక్షరములు గల త్రిష్టుప్ ఛందము నాయందు ప్రసన్నమగును గాక.  48 అక్షరములు గల జగతీ ఛందము నాయందు ప్రసన్నమగ్ను గాక. 
4) అన్నమును, ఉత్పత్తియును, మరల మరల ఉత్పత్తియును, భోగాది విషయకమైన సంకల్పమును, భోగాది సంకల్పము కలుగుటకు కారకుఁడైన ఆదిత్యుఁడును, ఆకాశమును, విశేషముగనంతటను వ్యాపించు ఆకాశమున సంభవించునదియును, అంతమున జనించునదియును, అంతమందున్నదియును, భువనమున ఉండునదియును, జగదాత్మకమును, అధిష్ఠించి పాలించు రాజును, నాకు సంభవించును గాక. 
అనువాకము 11సమాప్తము.
చమక భావము -  సంపూర్ణము. 
దేవతల నాహ్వానించు గోరూపిణి యగు ఇడ, మనువు మంత్రము రూపముగా గల వాగ్దేవి యగు యజ్ఞని, బ్రహ్మ, బృహస్పతి, ఉక్తామద(కర్మ జన్య సుఖములు)ప్రతిపాదియు, ప్రశంసించు వాడును అగు పరమేశ్వరుఁడు, పూర్వోక్త దేవతా సహితులై యున్న విశ్వేదేవులును, నన్ను హింసింపకుందురు గాక. అటులనే ఓ పృథ్వీ! నీవు తల్లివై రక్షింతువు గాక. నన్ను హింసింపకుందువు గాక. మాచే చేయదగు పని యేమి? అని చింతించెదరేని చెప్పెదను వినుండు.  నేను మీ మధు రూపమును మనసారా చింతించు చున్నాను. స్తోత్రమును మధురమైనదిగా జనింప జేయ గలను. స్వయముగా మధుర వచనమునే పలుక గలను. మాధుర్యముకల హవిర్యుక్తమైన వాక్కులనే పలుక యత్నింప గలను. కర్మాభిమానులైన మీ ముందువినదగు యదార్థమునే పలుక యత్నింతును.  మృషావాక్యములు పలుకనొల్లను. యథోక్తము నాచరించు నన్ను దేవతలు రక్షింతురు గాక. ఈ లోకమున కీర్త్యాదులచే శోభిల్లునట్టి పితరులును నన్ను ఆమోదింతురు గాక. 
ఓం శాంతిశ్శాంతిశ్శాంతిః.   
జైహింద్.