గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

30, మార్చి 2012, శుక్రవారం

వసు స్వారోచిషోపాఖ్యానము (ద్వ్యర్థి కావ్యము) కీ.శే. క్రొత్తపల్లి సుందర రామయ్య.

1 comments

ఆర్యులారా! 1875- 1949 మధ్య కాలమున జీవించి యున్న కీ.శే.క్రొత్తపల్లి సుందర రామయ్య గారు ఒక గొప్ప కవి. వారు రచించిన వసు స్వారోచిషోపాఖ్యానము అను ద్వ్యర్థి కావ్యమును మీ ముందుంచుతున్నాను. ఇందు మను చరిత్ర మరియు వసు చరియ్ర వ్రాయఁబడినది. విడి విడి గా ఏ కావ్యానికాకావ్య కథా గమనాన్నిమీరు పడికట్ట కలరని ఆశిస్తున్నాను.
వసు స్వారోచిషోపాఖ్యానము
ద్వ్యర్థి కావ్యము
ఆః-
ఆట పట్టు సిరికి న్యాయంబునకు, నధి - ష్ఠాన మనఁగ దనరి సౌధ వినిహి
తాబ్జ రాగ కాంతి నరుణాస్పదంబనఁ - బురము దనరు లోక భూషణంబు. ౧.
చః-
పురి ద్విజ కోటి ధాత, నృప పుంగవు లర్జును, వైశ్య పాళి కి
న్నరవరు, నంఘ్రిజుల్ హలిని, నట్టువకత్తెలు రంభ, నాగముల్
తురగములున్, మహీరుహతతుల్ సుర సింధుర సైంధవాద్రులన్
నిరతముఁ గ్రిందు సేయఁ దగు నేర్పున రంజిలు మంజు వైఖరిన్. ౨.
గీః-
పచ్చడాల్ పూని సకలార్థ భవ్య సాధ - నాత్మ పౌరుష వాగ్జాల మతిశయింప,
నతి ముదంబున వీర పండితు లనంగ - వెలయు చుందురు వీఁటఁ బ్రవీణులెపుడు. ౩.
ఆః-
భూమి దేవుఁడందుఁ బొల్చును ప్రవరాఖ్య - నుపరిచరుడనంగ నొప్పి వసువు
న్యాయ రీతి మిగుల నార్జించిన ఘనుండు - తేజ మొప్పఁగ ద్విజ రాజ కులము. ౪.
కః-
ఆర్యావర్తన రహితుఁ, డ - శీర్యత్సుగుణ ప్రవృత్తి, చేది వినుతుఁడై
ధైర్య గుణ మొప్ప నాతని - చర్యన్ వినుతింప వశమె! శత ధృతికైనన్. ౫.
గీః-
అనఘ వర్తనఁ బరమ వంశావతంస - మగుచు నిచ్చలుఁ దగు ప్రవరాఖ్యుఁడైన
వసు విభుం డార్య నుత శతాధ్వర గృహీత - భవ్య లక్షణుఁడగుచు శోభను వహించు. ౬.
గీః-
అందమల పద్మ సంతతి నలవరించి - దివ్య గుణమణులందు శుక్తిమతి నాఁగఁ!
గర్మ పావన మూర్తియై ఘనత నొప్పు - నది విబుధ హర్షమై మహోన్నతిని గాంచు. ౭.
గీః-
ఆత్మ భార్యానురాగుఁడై యవ్వ, సుప్ర - భుండు నాయన మిత మతిఁ బొరసి యుండ,
ఘన సమితిఁ బొంగు గాంచుచు ఘనత నెసఁగఁ - బారువాఁడెంత వాఁడైన వరలఁ గలఁడు? ౮.
వః-
ఆ ప్రవరాఖ్యుండగు వసురాజు. ౯.
గీః-
పాడి పంటలఁ దనరు జీవనము గల్గి - యింబడర, ఘన కోలాహలంబు పెఱిగి,
పైనఁ బడి శుక్తిమతి నాగ, దాని పని మ - దిని దలఁచి సచ్చరణ భవ ఘనత నెట్టె. ౧౦.
వః-
ఆ ద్విజ రాజ వంశజుఁడు దిగంతములఁ గను కీర్తిఁ గల్గి యుండునంత. ౧౧.
గీః-
అమర నాథానుమతి స్వస్థలమున కొకట -వచ్చి యుండినఁ బల్వురు పాక శాస
నత్వమునఁ బవిత్రప సదనమునఁ బొగడ - నాతి మోదానఁ బతి వసు నేతఁ గనును. ౧౨.
కః-
అతఁడీ విధమున నభ్యా - గత సేవాభిరతిఁ గొంత కాలము భాగ్యో
న్నతి నుండు నంత నభ్యా- గత వేళం గౌతుకంబు గడలు కొనంగన్. ౧౩.
సీ:-
ఎఱ్ఱని జటలతో నెసఁగు జొంపము గల - వి లసితమగు క మండలువు తోడ,
భస్మ గర్భామోద బంధుర రుద్రాక్ష - మాలికా సత్ కదంబముల తోడఁ
దళతళ ద్యుతులతో దళమెత్తు పోల్కి నెం - తయు వన్నె గల మృదు త్వక్కు తోడ,
నందమై కొనసాగు యర్జునంబున నొప్పు - కమనీయ మౌ తిలకంబు తోడ,
గీః-
ఎంతయును జెన్ను మీఱి వసంతుఁడనఁగఁ - బరగు నౌషధ సిద్ధుండు ప్రజల కెల్ల
నయన పర్వంబుగా మహోన్నతిని గాంచి - మించి యతని కొలమున కేతెంచె నొకట. ౧౪.
వః-
ఇట్లుండునంత నతి బలాధికుండు. ౧౫.
ఆః-
అతని రాకఁ జూచి, హర్షంబుతో నెదు - రేగి, గౌరవింప నెంచి తోడి
తెచ్చి యిష్ట వస్తు దృప్తిని దేలించి - మెలఁగు నా సమీర మెలసి యంత.౧౬
గీః-
చెలఁగ నీ రెందుఁ బోవుచు క్షితిని నిందు - రాక యయ్యెను సిద్ధ మహా కుతుకము,
తీర్థములఁ జూచు వేడుక దీర్ఘమయ్యె. - ననఁ బసరు పూసెనంతట ఘనము గాఁగ . ౧౭.
గీః-
వేఁడి వేలుపు మహిమంబు విపులమైన - హిమ నగము పాద లేపనముమిషగాఁగఁ
జేరె సంతోషమున మంచు, చేతఁ బాసి - యొండు చోటికిఁ బోలేక యుండు నచట. ౧౮.
మః-
పువులం బండ్లను, బల్లవంబులను నొప్పుల్ గుల్కి రంజిల్లఁగాఁ
దవు తీవల్ పొదలున్ దరుల్ బహుళమై దౌదౌల నేత్రోత్సవం
బవుచున్, దేటులుఁ జిల్కులున్ బికము లాహ్లాదంబుగా నంతటన్
రవళిన్ బల్కులఁ గూతలం జెవులకున్ రమ్యంబు గావింపఁగన్.౧౯.
గీః-
అటవి రక్షక చిత్తుఁడై యతఁడు తేరు - కొని కడుం ద్రిమ్మరుచుఁ జెంత గొనబు మీఱు
పాట నొప్పెడు కోనను బాఱఁ జూచి - తన ప్రధాన వర హృదయ మనుగమింప.౨౦.
వః-
అంతఁ జని దానిం గనుంగొనుమన మున. ౨౧.
చః-
కనె నవరత్న భాసితముఁ, గాంచన శోభిత, మార ఘట్ల మం
డన కదళీ వనాంతము, ఘన స్వన బంభరవా సిత ప్రఫు
ల్ల నవ సుమాతిగంధి మృదులచ్ఛదరాజి లతా ప్రతాన నీ
కనదురు కాయమాన పరి కల్పిత శీత మనోజ్ఞ హర్మ్యముల్. ౨౨.
కః-
కనుఁగొని హర్మ్యోపాంతం - బునకుం జని లోనికేఁగఁ బొలఁతి యొకతె వీ
ణను బూని కంఠ నాదం - బును మేళము సేసి గానము సలుపఁ జూచెన్. ౨౩.
ఆః-
అంత నాకె యంద మారసి వేవేగ - వచ్చి విభుని చాయ భావమంచు,
మెచ్చి మనుజ వర్య! మీర లేలిన నన్ను - మిన్న యంచు జనము నెన్నకుంద్రె? ౨౪.
కః-
అనిన నేకతంబుగను వనంబున నీవు - వచ్చి యుంటివ! బల!! యిచ్చటికిని
దారిఁదప్పిపోక నేరక యుంటి, మా - ర్గమ్ముఁ జూపుమన్న నెమ్మి ద్విజుఁడు. ౨౫.
కః-
మును వచ్చిన దారిని - నే - వినుత చరిత! చనఁగ వచ్చు, వేఱె యొరులు దా
రిని చూప వలెనె? పోవం - గను జూపెద, నంటి వచ్చి కనుఁగొనెదు గదా! ౨౬.
గీః-
అనుచుఁ దా వరూధిని నిల్వ నతని "ననఘ! - కొంత తడవోపి యుండినఁ గుతుక మొప్ప
నశ్రమంబున నేఁగంగ నగును గాదె?" - యంచుఁ గోరఁగ బోవఁగా నెంచి యతఁడు. ౨౭.
గీః-
పోవలయు వేగ, నా యింటి పువ్వుబోడిఁ - జూడవలె, నిత్య కృత్యముల్ చొప్పు దప్పి,
యుండె, నా మది దానిపై నొనర - నెపుడు  -  గాంతునని హిత! కార్య సంహటన కొఱకు. ౨౮.
కః-
అన, నను గూడఁగ నీకున్ - గననగు సౌఖ్యంబటంచుఁ గైకొని యాలిం
గన మును జేయఁదగ, దనియుఁ - జను పొమ్మని గెంటని హిత సంభ్రమ మొలయన్. ౨౯.
గీః-
పిలిచికొని పోయి చూపినఁ బ్రేమ మీఱ - నంగనను పెద్ద సేయఁగ నాత్మ - మాటు
సేసి కనుఁ బురుషవరుండు చిత్తమలరఁ - గా మముల నువిదల మించు కామ మున్నె! ౩౦.
వః-
అటులననివారిత మోహావేశముఁజూపి, తాను ౩౧.
కః-
ఎంత తపోధనులగుచున్ - సంతతముఁ జరించినను యశం బలవడునే
కాంత ననురూప లసితం - గాంతగఁ గైకొనక దూరఁగా నెవ్వరికిన్. ౩౨.
వః-
అనిన విని, ౩౩.
గీః-
నేన యతి మార్గమును బూని నియత వృత్తి - నాకె యుండిన గృహమున కేకతంబు
గాఁగఁ జనియెద సంతోష గరిమ మెఱయ - ననుచు శుచి వేడి చనిన నయ్యతివ యంత. ౩౪.
గీః-
ప్రియ సఖులతోడ మిక్కిలి ప్రేమ మీఱ - నతనిఁ గనుఁగొనఁ జని కనకాసన మర
గతిని గొనివెట్ట, వసియింపఁ గని ప్రియాళి - తోడ సేవింపఁ, గొనినట్టు గూడఁ జేసి. ౩౫.
గీః-
నీకు వసు విభుండొక్కఁడుచేకురెడి న - టంచు నన, వారు హర్షంబు నందు మునుఁగ
గొంత తడవుండి యందొక్క యింతి మంజు - వాణి యిట్లని పల్కె సర్వంబుఁ దెలియ. ౩౬.
గీః-
విమల మతి! యెందుఁ బోయెడు వేడ్క నిందు - వచ్చి రతుల మతిని ప్రేమ వరలఁ జేయఁ
దగును, గాన మురువు మీఱఁ దలిరుఁ బోడి - వెదక వచ్చినఁ గనఁ దగు విధి కొమరుల!?౩౭.
కః-
అన నను గౌతమ విఖ్యా - తిన బిలిచెద రేను గోపతిని గూర్చి తపిం
చిన దాననే యశము గల - ఘన పదముం బొందితి నని కడు ప్రేమమునన్. ౩౮.
గీః-
సు ఖగతిని నాయనను గాంచ సుదతి కేళి - వనమునకుఁ బద్మినీ జాతి వరలఁ దేఁగ
వచ్చి, ఛద్మ ప్రవరాగవార్థిఁ గాంచి - చెంతకుం జేరి, తనియని చెలువు మీఱ. ౩౯.
గీః-
అతివ పావనమౌ జన్మ మరయ, నాకు - నేడు సంతోషమయ్యెడు జాడఁ దెలియఁ
జెప్పి యొప్పింప వలె నని, చెలి మనమునఁ - దలఁచి యడిగినఁ బలికె నంతట నెలంత. ౪౦.
గీః-
నిత్య పూజా రతిని - తగు నెలవుఁ బాసి - విధి సమీపించి, యంతట వెడలి శుక్తి
మతి తిరుగరాఁ బథంబున మరలు కొనఁగ - నగవర ప్రాప్తి సంగతి మగువ కలిగె. ౪౧.
కః-
గిరికాంచితమగు ఖ్యాతిం - జరియించెడు నన్న, సంతసంబునఁ "దరుణీ!
కరమును మది నెంచితి - వసు - వరు నొక్కని గూడ నగును వనిత" యఁటన్నన్. ౪౨.
వః-
ఆ లతా తన్వి యిట్లనియె. ౪౩.
కః-
ఎన్నండిట కేతెంచెడి - నెన్నండిట మమ్ముఁ జూచు నెన్నఁడు మాతోఁ
గ్రన్నన మాఱాడెడినో - యన్నరవరుఁడనుచుఁ దలఁతు మయ్య మహాత్మా! ౪౪.
గీః-
అనినఁ గోరెదు గావున ననవరతము - పరుల కుపకృతిఁ గావించు పట్ల నెట్టి
కార్యములనైనఁ గావింపఁగా వలెఁ గద! - సమయమున మానినీ! తోడ సరఁగ నిపుడు. ౪౫.
గీః-
క్షితి విభునిఁ గను కోర్కెను జెలియ! తీర్తుఁ - గన్నుఁ గవ మూయనగునంతఁ గలియ వచ్చు.
ననిన నయ్యెడ నతని వచనము వినుచుఁ - గువరుఁడంతట రాఁ దన భవనమునకు. ౪౬.
గీః-
అతని రాకకు మెచ్చి మహా ముదంబు - గదుర రతి నుండఁగా స్వల్ప కాలముననె
యతఁడు చెలి జతనంబున హర్షమంది - చనఁగ - సఖి గాంచె సు కుమారు సార్వభౌము. ౪౭.
వ-
అతఁడు స్వరోచియై వెలయుచుండ, ౪౮.
కః-
కని ముదమందఁగఁ బెంచిన -  ఘన మతి సర్వంబెఱింగి, కడు పెంపడరం
గను, నవలఱేని తోడం - గని యెఱుక పడంగఁ గాంక్ష గారమున ననెన్. ౪౯.
సీః-
క్ష్మాతలాధిప! నేఁడుగా మామనోభీష్ట - ములు దీరఁ గల్గె నోములు ఫలించె.
గహ్వరీపతి! నేఁడుగా మా నయన పంక్తి - నిర్మలమయ్యెఁ బున్నెంబు సేసె.
భూమి పాలక ! నేఁడుగా మా తమః పట - లంబు విరిసెను చిత్తంబు మెఱసెఁ
గాశ్యపీ వర! నేఁడుగా మా వనస్థలుల్ - ధన్యంబులయ్యె శస్తతఁ జెలంగె.
గీః-
నీ హిత క్రియ నిల నేఁడ నెగడఁ గల్గెఁ - గాన నేమని చెప్పుదు మానవేంద్ర!
జంతుజాలంబులెల్ల నీ శరణమంది - యుండెఁ గాకున్నఁ జీవించి యుండఁగలవె? ౫౦.
గీః-
అనిన మోదంబు తోడ హితార్హ కార్య  - మునను జనియుండనొక్కెడ, ముదిత! యడరు
చాయఁదగ వినుచును, జేరి సకియ వార్తఁ - గనఁగ వచ్చితి ననిన నక్కాంత యంత. ౫౧.
కః-
అయ్య మనోరమ సఖి నే - నయ్యుపవని స్వైరవృత్తినమర, సఖులతో
నొయ్యన సుమాపదేశము - చయ్యనఁగాఁ జని ముదంబు సంధిల్లంగన్. ౫౨.
గీః-
చిన్నతనముననుండుటఁ జేసి, చేరి - యుండఁ బొడమెడుమతి నా మహోత్తమ "సుమ
నో విశేషత నంతటను ముని రాగ - దత్త శా ప క్రియను వచ్చితిత్తఱి" నని. ౫౩
వః- 
మఱియు ౫౪.
గీః-
అందు - చే, నను నీ యన నిం దగఁ గొనఁ - గర్చురాకార! సంబాధ్య కలనవేగఁ
బుచ్చ వచ్చితి. రా! జన్య యిచ్చ దీర్పు - మనుచు శాస్త్ర హృదయ మీయ ననఘబుద్ధి. ౫౫.
గీః-
అంత సమ్ముఖ మతిఁ గౌతుకాభిలాష - నట్టు చెంతకుఁ జని రస ముట్టి పడఁగ
మొనయ నాతఁడు ఖ చరుఁడైనను హితుండు - హయము నెక్కించి చనిన నయ్యబల వెనుక. ౫౬.
కః-
ఆ పెను వగతో నుద్యా - నోప శమముఁ బొంద డిగ్గ నొప్పున నంతన్
భూపుఁ గనను, పరిచర, మతి - యేపునఁ జనుదెంచి వృత్తమెఱిఁగింప వెసన్. ౫౭.
కః-
కొనిపోయి భవనమునకుం - దన యంగనఁ బెండ్లి సేయఁ దత్పర మతియై
చని మంజువాణి తోడనె - వినయంబున భూమి భృత్సవిధ దేశమునన్. ౫౮.
గీః-
నిలిచి వృత్తాంతమంతయుఁ దెలుప సుదతి! - కన్య కల నిచ్చమైఁ దోఁపగా ముదానఁ
బొంగి తనియని ప్రేమఁ దానుం గరంబు - నొసఁగఁ గొని సుఖమునఁ బోవనున్న నచట. ౫౯.
గీః-
చెంతవారాశయముఁ గాంచఁ జేరి యలస - గమన వచియించు పలుకుల గారవమున
విని విడువ లేని కూర్ముఁ దా వెలఁదుల నొగిఁ - గూడి యుంగరమును బూని కుతుకమునను. ౬౦.
వః-
ఇట్లుండునంత, ౬౧.
గీః-
ఒక్క తఱిఁ జారు లోచన యొప్పు మీఱ - రా నగుడు, సముచిత వాక్య రత్నములను
గారవించియు గురు మోహ కారణమున - మెలఁగ తెఱగంటి దొర కొమరుల నొగిఁ గని. ౬౨.
గీః- 
వారిఁ దగురీరిఁ జూడంగ వసుమతీత - లంబునుం గూర్చి వచ్చి, వనంబుఁ జొచ్చి,
యతఁడు గిరి భర్త నొప్పింప నాత్మఁ దలచి - యుండఁగాఁ జారు లోచన మెండుగఁ గని. ౬౩.
గీః-
తలచి "నా వసువును గొనఁ దగునయ" యని - "నాదు చిత్తముఁ దీర్చుట న్యాయ" మనుచు
వేడ్క హృదయస్థ భావము వెల్లడింప - నల్లు హాళినిఁ గోర్కెఁ దా నంటి యుండ. ౬౪.
గీః-
ముదిత - వన లక్ష్మి యై యుండ సదమల మతి - నాథుఁడయ్యింతి సంగతి నయమునఁ గని
కాంచ స్వారోచిషు నతఁడు కమ్ర భక్తిఁ - గొల్వ ముదమంది వసు భర్త కోర్కెఁ దీర్చి. ౬౫.
కః-
"రెండవ మనువనగా భూ - మండలి రక్షింప వలయు మనుజుల కోర్కెల్
పండగఁ జేయుచు నిరతం - బుండు" మనుచుఁ జనియె, శుభము లొదవె, ప్రజకిఁకన్. ౬౬
ఉః-
పాయమునందు మిత్తి, చలపాది గొనంబున సత్తి, తొచ్చెమౌ
రో యెలనాగ బత్తి, చెడు త్రోవను జేరిన బుత్తి, లేక - దీ
ర్ఘాయురనంత ధీ ప్రియ హితాఖిల మార్గగ భుక్తులేర్పడన్
బాయని కౌతుకంబును శుభంబును గల్గుత మెల్ల వేళలన్. ౬౭.
కః-
కుజన త్రి జగద్విలయా! - సుజన మనో నిలయ! తాప శోషణ మలయా!
వృజిన విపిన దహనా! వి - శ్వ జనీన ప్రకట కార్య వహన! సుసహనా!. ౬౮.
చిత్ర పద వృత్తముః-
భక్త జనావన దక్షా! - ప్రాక్తన శాసన పక్షా! - యుక్త విచారణ దీక్షా! - సక్త మహేశ్వర రక్షా! ౬౯.
గీః- 
కావ్యమొనరించి, భరత వాక్యమ్ము నొడివి, - తొలి పలుకులైన వ్రాయక కలిసె హరిని.
భారమెవ్వరొ గైకోక పోరటంచు, - ప్రథిత సంస్కారి, సుందర రామ సూరి.
కీ.శే. క్రొత్తపల్లి సుందర రామయ్య విరచిత వసు స్వారోచిషోపాఖ్యానము అను ద్వ్యర్థి కావ్యముసంపూర్ణము.
స్వస్తి.
జైశ్రీరామ్.
జైహింద్.

29, మార్చి 2012, గురువారం

గోవుమాలచ్మికీ కోటి దండాలు.

6 comments


శ్లోll 
సర్వ వేదమయీం వందే సర్వ దేవ స్వరూపిణీం.
గాం సర్వ లోక జననీం సర్వ ధర్మ స్వరూపిణీం.
భావముః-
సర్వ వేదములతో కూడుకొన్నదియు, సమస్త దేవతా స్వరూపిణియు, సమస్త లోకములకు తల్లియు, సమస్త ధర్మ స్వరూపిణియు అగు గో మాతకు నమస్కారము.
శ్లోll
నమో గోభ్యః, శ్రీమతీభ్యః సౌరభేయీభ్య యేవచ.
నమో బ్రహ్మ సుతాభ్యశ్చ పవిత్రాభ్యో నమో నమః.
శ్లోll
గవాం దృష్ట్వా నమస్కృత్య కుర్యాచ్చైవ ప్రదక్షిణం
ప్రదక్షిణీ కృతా తేన సప్త ద్వీపా వసుంధరా.
శ్లోll
సౌరభేయీ సర్వ హితే పవిత్రే పాప నాశిని,
సర్వ దేవమయే దేవీ సర్వ తీర్థమయే శుభే.
శ్లోll
యా లక్ష్మీ సర్వ లోకేషు యాచ దేవేష్వవస్థితా
ధేను రూపేణ, సా దేవీ మమ పాపం వ్యపోహతు.
శ్లోll
పితరో వృషభో జ్ఙేయా గావో లోకస్య మాతరః
తాసాం పూజయా రాజన్ పూజితా పిత్రు దేవతాః.
శ్లోll
గవామంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ.
యస్మాత్తస్మాచ్ఛివం మేశ్యా దతశ్శాంతిం ప్రయచ్ఛమే.
సీః- ఆననంబునను జిహ్వనుశృంగముల బల
వైరి రంధ్రంబుల మారుతుండు.
కకుదంబునందు శ్రీ కంఠుఁడు పదముల
యందు మరుద్గణ మనఘ కుక్షి
వహ్ని, చన్నుల సరస్వతి, పెండ బంచిత
మున లక్ష్మియును, గీర్తియును గ్రమమున
రుధిరంబునందు చంద్రుఁడు, హృదయంబున
భగుఁడను దేవత, పాల వేధ.
వెండ్రుకలయందనుష్ఠాన వితతి, దోక
ధర్ముఁడక్షుల సూర్యుండు, చర్మమున ద
పంబు సిద్ధి తేజము, సంధి పట్ల సిద్ధు
లునికి గల్దటె గోవునేమనగ వచ్చు. (మహా భారతం)
శ్లోll 
వరుణశ్చైవ గోమూత్రే,
గోమయే హవ్య వాహన:,
దధే వాయు:సముద్దిష్ట:,
సోమ:క్షీరే,ఘృతే రవి:.
గీః-
గోవు మూత్రాన వరుణుఁడు, గోమయమున
నగ్ని దేవుఁడు,  గోధధి నలరుననిలుఁ
డావు పాలలోచందురుఁడావు నేతి
లోన సూర్యుఁడుండును గన లోకమందు. 
భావముః-
గోమూత్రంలో వరుణుఁడున్నాఁడు. గోమయంలో అగ్ని దేముఁడున్నాఁడు.ఆవు పెరుగులో వాయువుఁడు న్నాఁడు. ఆవు పాలలో చంద్రుఁడున్నాఁడు.ఆవు నేతిలో సూర్యుఁడున్నాఁడు.
శ్లోll
సభా, ప్రపా, గృహాశ్చాపి దేవతాయతనానిచ.
శుద్ధ్యంతి శకృతా యాసాం కిం భూత మధికం తతః.
శ్లోll
కీర్తనం శ్రవణం దానం, దర్శనంచాపి పార్థివ
గవాం ప్రశస్యతే  లోకే సర్వ పాప హరం శివం.
శ్లోll
గవాంహి తీర్థే వసతీహ గంగా పుష్టిస్తధా తద్రజసి ప్రవృద్ధా.
లక్ష్మిః కరీషే ప్రణతౌచ ధర్మః తాసాం ప్రణామం సతతంచ కుర్యాత్. 
జైశ్రీరామ్.
జైహింద్.                                   

హైదరాబాదులోని నెక్లెస్ రోడ్డు దగ్గర ఉన్న పీపుల్స్ ప్లాజా లో మూడు రోజుల పాటు గోమాతోత్సవం

1 comments

నమస్తే
హైదరాబాదులోని నెక్లెస్ రోడ్డు దగ్గర ఉన్న పీపుల్స్ ప్లాజా లో మూడు రోజుల
పాటు గోమాతోత్సవం నిర్వహింపబడుతోంది. దాదాపు డా బి ఆర్ కే ఆర్ ప్రభుత్వ
ఆయుర్వేద కళాశాల,  చరక డెయిరీ వారు సంయుక్తంగా నిర్వహిస్తున్నారు.
ప్రస్తుతం మన దేశంలో లభ్యమవుతున్న 29 రకాల దేశవాళీ ఆవులను ఈ ప్రదర్శనలో
ఉంచారు. ముఖ్యమైన ఏడు రకాల ఆవులను ఒక చోట ఉంచి వాటి ప్రదక్షిణకుగానూ
ఏర్పాటు చేసారు. గోవు ద్వారా ఎలాంటి ఉపయోగాలున్నాయో వాటిని ఎలా
పెంచుకోవచ్చో వివిధ విశేషాలు వారు అక్కడ తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ సప్త
గో ప్రదక్షిణ బహు ఆకర్షణీయంగా ఉంది.
ఈ ప్రదర్శన "దేశీ కౌ ఉత్సవ్" పేరిట ఈ బుధ, గురు, శుక్ర వారాల్లో మాత్రమే
ఏర్పాటు చేసారు. (28,29,30 మార్చి 2012). ఇక్కడ గో ఉత్పత్తులను వాటిని
రోజువారీ జీవితంలో వాడుకునే విధానాలనీ ఇతర గో సంబంధ విషయాలనూ
తెలుపుతున్నారు.

గోమాతా విజయతామ్.

జైశ్రీరామ్.
జైహింద్.

25, మార్చి 2012, ఆదివారం

మాయింటికి వచ్చిన భైరవ భట్ల బ్రదర్స్.కి, సనత్ కి ధన్యవాదములు.

4 comments

శ్రీపతి సనత్, నేను, భైరవిభట్ల కామేశ్వర రావు,  వారి సోదరుఁడు విజయాదిత్య.
ప్రియ సాహితీ మిత్రులారా! ఈ రోజు శ్రీ భైరవ భట్ల కామేశ్వర రావు, వారి సోదరులు విజయాదిత్య,  శ్రీపతి సనత్ అభిమానంతో మాయింటికి వచ్చి మాకు ఆనందం కలిగించారు. వారితో కలిసి వివిధ సాహిత్యాంశాలతో ఇష్టాగోష్టి జరిపాము.
తదనంతరం శ్రీపతి సనత్ వారి ఎపార్ట్మెంట్కు తీసుకొని వెళ్ళి అక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేసి శ్రీ భైరవభట్ల కామేశ్వరరావుగారిచేత " తెలుగు కవుల వాగ్విలాసము " అనే అంశం పైనా,  నాచేత " చిత్ర కవిత్వము" అనే అంశం  పైనా ప్రసంగాలు ఏర్పాటు చేసారు. ఆసభకు అక్కడ ఆ " దివ్య కళాంజలి " అపార్ట్మెంటులో ఉన్న ఇరవై కుటుంబాలవారు అత్యంత శ్రద్ధాసక్తులతో వచ్చి, మా ఉపన్యాసములను విని, మమ్ములనెంతో గౌరవించారు.
ఈ సందర్భంగా అక్కడ నేను ఆసువుగా చెప్పిన పద్యాలు.
భైరవభట్ల వంశులును, భవ్య కవిత్వ విశిష్ట తత్వమున్
పారము జూచినట్టి ప్రతిభాయుత సత్కవి చక్రవర్తులున్,
చేరిరి నేడు మాదరికి, చెప్పగ నెంతటి భాగ్యమిద్ది? మం
దారవనంబయెన్  నగ ధన్యము దివ్యకళాంజలిద్ధరన్. 
కంద - గీత - గర్భ - ఉత్పల మాల. 
స్థిత సకలార్థమై, ప్రవర దివ్య కళాంజలి స్వర్గ మెన్న, హా
రతులు గొనుంగదా! సుజన ప్రాగ్వర భావ సుశోభితమ్ముగా!
నుత సుకవీశులన్, పరులు నొవ్వక పల్కెడి వాఙ్నిధాన భా
రతియిదియే యనన్ వినుత ప్రాంగణ మిద్ది భువిన్ గనంగనౌన్.
సకలార్థమై, ప్రవర ది
వ్య కళాంజలి స్వర్గ మెన్న, హారతులు గొనుం !
సుకవీశులన్, పరులు నొ
వ్వక పల్కెడి వాఙ్నిధాన భారతియిదియే !
ప్రవర దివ్య కళాంజలి స్వర్గ మెన్న,
సుజన ప్రాగ్వర భావ సుశోభితమ్ము!
పరులు నొవ్వక పల్కెడి వాఙ్నిధాన !
వినుత ప్రాంగణ మిద్ది భువిన్ గనంగ!
శ్రీపతి సనత్ ప్రభావిత
మీ పుణ్యభవంతి కన. సమీప్సితములు తా
నేపగిదినైనఁ గూర్చును.
దీపించును బాలునివలె దివ్యుండయ్యున్. 
దివ్యకళాంజలి వాస్తవ్యులు మాయెడ చూపిన ఆదరాభిమనాలకి వారికీ, మిత్రులు శ్రీపతి సనత్ గారికీ ధన్యవాదములు తెలియజేసుకొంటున్నాను.
జైశ్రీరామ్.
జైహింద్.

24, మార్చి 2012, శనివారం

అవధానమును గూర్చిన అవగాహన. జ్ఞాన వాణిFMలో ప్రసారితము.

1 comments

జైశ్రీరామ్.
అవధాని రాంభట్ల పార్వతీశ్వర శర్మతో జ్ఞాన వాణి FM చేసిన ఇంటర్వ్యూ! 31 నిమిషాల నిడివి గల ఈ అవధానమును గూర్చిన అవగాహన కనిగించే సంభాషణను వినగలరు.
జైహింద్.

శుక్ల యజుర్వేదము - అధ్యాయము 16.

0 comments

నమస్తే రుద్ర మన్యవ ఉతో తఇష వేనమః |
బాహుభ్యా ముత తేనమః ||
యాతే రుద్ర శివా తనూర ఘోరాపాపకాశినీ |
తయా నస్తన్వా శంత మయా గిరిశన్తాభిచా కశీహి ||
యామిషుం గిరిశన్తహస్తే బిభర్ష్యస్తవే |
శివాంగి రిత్రతాంకు రుమాహిగ్గ్ సీః పురు షంజగత్ ||
శివే నవచసాత్వా గిరిశాచ్ఛా వదామసి |
యథా నః సర్వమిజ్జగ దయక్ష్మగ్గ్ సుమనా అసత్ ||
అధ్య వోచదధివక్తా ప్రథమో దైవ్యో భిషక్ |
అహీగ్గ్ శ్చ సర్వాన్జమ్భయన్త్సర్వాశ్చ యాతుధాన్యో ధరాచీః పరా సువ ||
అసౌయ స్తామ్రో అరుణ ఉత బభ్రుఃసు మఙ్గలః |
యేచైనగ్గ్ రుద్రా అభితో దిక్షు శ్రితాః సహస్రశో వైషగ్గ్ హేడ ఈమహే ||
అసౌయో వసర్పతి నీలగ్రీవో విలోహితః |
ఉతైనం గోపా అదృశ్రన్నదృశ్రన్నుదహార్య స్స దృష్తో మృడయాతి నః ||
నమోస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ మీఢుషే |
అథోయే అస్య సత్వా నోహం తేభ్యో కరంనమః ||
ప్రముఞ్చ ధన్వనస్త్వముభయోరార్త్న్యోర్జ్యామ్ |
యాశ్చతే హస్త ఇషవః పరాతా భగవోవప ||
విజ్యంధనుః కపర్దినో విశల్యో వాణవాం ఉత |
అనేశన్నస్య యా ఇషవ ఆభురస్య నిషఙ్గధిః ||
పరి తే ధన్వనో హేతిరస్మాన్వృణక్తు విశ్వతః |
అథో య ఇషుధిస్తవారే అస్మన్నిధే హితమ్ ||
యాతే హేతిర్మీఢుష్టమహస్తే బభూవ తేధనుః |
తయాస్మాన్విశ్వతస్త్వమయక్ష్మయా పరి భుజ ||
అవతత్య ధనుష్ట్వగ్గ్ సహస్రాక్ష శతేషుధే |
నిశీర్య శల్యానాం ముఖా శివోనః సుమనా భవ ||
నమస్త ఆయుధాయానా తతాయ ధృష్ణవే |
ఉభాభ్యా ముతతే నమో బాహుభ్యాం తవ ధన్వనే ||
మానో మహాన్తముత మానో అర్భకం మాన ఉక్షన్తముత మాన ఉక్షితమ్ |
మానో వధీః పితరం మోత మాతరం మానః ప్రియాస్తన్వో రుద్ర రీరిషః ||
మానస్తోకే తనయే మాన ఆయుషి మానో గోషు మానో అశ్వేషు రీరిషః |
మానో వీరాన్రుద్ర భామినో వధీర్హవిష్మన్తః సదమిత్త్వా హవామహే ||

నమో హిరణ్యబాహవే సేనాన్యే దిశాంచపత యే నమో నమో 
వృక్షేభ్యో హరికేశేభ్యః పశూనాం పత యేనమః 
నమః శష్పిఞ్జరాయ త్విషీ మతే పథీనాం పతయే నమో నమో
హరికేశాయోపవీతినే పుష్టానాం పతయే నమః ||
నమో బభ్లుశాయ వ్యాధినే న్నానాం పతయే నమో నమో 
భవస్య హేత్యై జగతాం పతయే నమః 
నమో రుద్రాయా తతాయినే క్షేత్రా ణాం పతయే నమో నమః
సూతాయాహన్త్యైవనానాం పతయే నమః ||
నమో రోహితాయ స్థపతయే వృక్షాణాం పతయే నమో నమో 
భువన్తయే వారివస్కృతాయౌషధీనాం పతయే నమః 
నమో మన్త్రిణే వాణిజాయ కక్షాణాం పతయేనమో నమ 
ఉచ్చైర్ఘోషాయాక్రన్దయతే పత్తీనాంపత యేనమః ||
నమః కృత్స్నాయతయా ధావతే సత్వనాం పతయే నమో నమః 
సహమానాయనివ్యాధిన ఆవ్యాధినీనాం పత యేనమః 
నమః కకుభాయా నిషఙ్గిణే స్తేనానాంపతయే నమో నమో 
నిచేరవే పరిచరాయారణ్యానాం పతయే నమః ||
నమో వఞ్చతే పరివఞ్చతే స్తాయూనాం పతయే నమో నమో 
నిషఙ్గిణ ఇషుధిమతే తస్కరాణాం పత యేనమః 
నమః సృకాయిభ్యో జిఘాగ్గ్  సద్భ్యోముష్ణతాం పతయేనమో నమో 
అసిమద్భ్యో నక్తం చరద్భ్యో వికృన్తానాం పత యేనమః ||

నమ ఉష్ణీషిణే గిరిచరాయ కులుఞ్చానాం పతయే నమో నమ
ఇషుమధ్బ్యో ధన్వాయిభ్యశ్చ వో నమః 
నమ ఆతన్వానేభ్యః ప్రతిదధానేభ్యశ్చ వోనమోనమ 
ఆయచ్ఛద్భ్యో స్యద్భ్యశ్చ వో నమః ||
నమో విసృజద్భ్యో విధ్యద్భ్యశ్చ వో నమోనమః 
స్వపద్భ్యో జాగ్రద్భ్యశ్చ వో నమః 
నమః శయానేభ్య ఆసీనేభ్యశ్చ వో నమో నమ
స్తిష్ఠద్భ్యోధావద్భ్యశ్చ వో నమః ||
నమః సభాభ్యః సభాపతిభ్యశ్చ వో నమో నమో 
శ్వేభ్యో శ్వపతిభ్యశ్చవో నమః 
నమ ఆవ్యాధినీభ్యో వివిధ్యన్తీభ్యశ్చ వో నమో నమ
ఉగణాభ్యస్తృఁహతీభ్యశ్చ వో నమః ||
నమో గణేభ్యో గణపతిభ్యశ్చ వో నమో నమో 
వ్రాతేభ్యో వ్రాతపతిభ్యశ్చ వో నమః 
నమో గృత్సేభ్యో గృత్సపతిభ్యశ్చ వో నమో నమో
విరూపేభ్యో విశ్వరూపేభ్యశ్చ వో నమః ||
నమః సేనాభ్యః సేనానిభ్యశ్చ వో నమో నమో 
రథిభ్యో అరథేభ్యశ్చవో నమః 
నమః క్షత్తృభ్యః సంగ్రహీతృభ్యశ్చ వో నమో నమో 
మహద్భ్యో అర్భకేభ్యశ్చ వో నమః ||

నమస్తక్షభ్యో రథకారేభ్యశ్చ వో నమో నమః 
కులాలేభ్యః కర్మారేభ్యశ్చ వో నమో 
నమో నిషాదేభ్యః పుఞ్జిష్టేభ్యశ్చ వో నమో నమః
శ్వనిభ్యో మృగయుభ్యశ్చ వో నమః ||
నమః శ్వభ్యః శ్వపతిభ్యశ్చ వో నమో నమో 
భవాయ చ రుద్రాయ చ
నమః శర్వాయ చ పశుపత యే చ నమో నీలగ్రీవాయ చ శితికణ్ఠాయచ ||
నమః కపర్దినే చ వ్యుప్తకేశాయ చ నమః సహస్రాక్షాయ చ శతధన్వనేచ 
నమో గిరిశయాయ చ శిపివిష్టాయ చ నమో మీఢుష్టమాయ చేషుమతేచ ||
నమో హ్రస్వాయ చ వామనాయ చ నమో బృహతే చ వర్షీయసే చ 
నమోవృద్ధాయ చ సవృధే చ నమో గ్ర్యాయ చ ప్రథమా యచ ||
నమ ఆశవే చాజిరాయచ నమః శీఘ్ర్యాయ చ శీభ్యా యచ 
నమ ఊర్మ్యాయచావస్వన్యాయ చ నమో నాదేయాయ చ ద్వీప్యా యచ ||

నమో జ్యేష్ఠాయ చ కనిష్ఠాయ చ నమః పూర్వజాయ చాపరజాయ చ 
నమోమధ్యమాయ చాపగల్భాయ చ నమో జఘన్యాయ చ బుధ్న్యాయ చ ||
నమః సోభ్యాయ చ ప్రతిసర్యాయ చ నమో యామ్యాయ చ క్షేమ్యాయ చ 
నమఃశ్లోక్యాయ చావసాన్యాయ చ నమ ఉర్వర్యాయ చ ఖల్యా య చ ||
నమో వన్యాయ చ కక్ష్ణ్యాయ చ నమః శ్రవాయ చ ప్రతిశ్రవా య చ 
నమ ఆశుషేణాయ చాశురథాయ చ నమః శూరాయ చావభేదినే చ ||
నమో బిల్మినే చ కవచినేచ నమో వర్మిణే చ వరూథినే చ 
నమఃశ్రుతాయ చ శ్రుతసేనాయ చ నమో దున్దుభ్యాయ చాహనన్యాయ చ ||
నమో ధృష్ణవే చ ప్రమృశాయ చ నమో నిషఙ్గిణే చేషుధిమతే చ
నమస్తీక్ష్ణేషవే చాయుధినే చ నమః స్వాయుధాయ చ సుధన్వనే చ ||

నమః స్రుత్యాయ చ పథ్యాయ చ నమః కాట్యాయ చ నీప్యాయ చ 
నమఃకుల్యాయ చ సరస్యాయ చ నమో నాదేయాయ చ వైశన్తాయ చ ||
నమః కూప్యాయ చావట్యాయ చ నమో వీధ్ర్యాయచా తప్యాయ చ 
నమోమేఘ్యాయ చ విద్యుత్యాయచ నమో వర్ష్యాయ చావర్ష్యాయ చ ||
నమో వాత్యాయ చ రేష్మ్యాయ చ నమో వాస్తవ్యాయ చ వాస్తుపాయ చ
నమః సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చారుణాయ చ ||
నమః శంగవే చ పశుపత యేచ నమ ఉగ్రాయ చ భీమాయ చ 
నమో అగ్రేవధాయచ దూరేవధాయ చ నమో హన్త్రే చ హనీయసే చ 
నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ ||
నమ శ్శంభవేచ మయోభవేచ నమః శంకరాయ చ మయస్కరాయ చ 
నమఃశివాయ చ శివతరాయ చ ||
నమః పార్యాయ చావార్యాయ చ నమః ప్రతరణాయ చోత్తరణాయ చ
నమస్తీర్థ్యాయ చ కూల్యాయ చ నమః శష్ప్యాయ చ పేన్యాయ చ ||
నమః సికత్యాయ చ ప్రవాహ్యాయ చ నమః కిగ్ శిలాయచ క్షయణాయ చ 
నమఃకపర్దినే చ పులస్తయే చ నమ ఇరిణ్యాయ చ ప్రపథ్యాయచ ||
నమో వ్రజ్యాయ చ గోష్ఠ్యాయ చ నమస్తల్ప్యాయచ గేహ్యాయచ నమో
హృదయ్యాయ చ నివేష్యాయ చ నమః కాట్యాయ చ గహ్వరేష్ఠాయ చ ||
నమః శుష్క్యాయ చ హరిత్యాయ చ నమః పాగ్ సవ్యాయ చ రజస్యాయ చ నమో
లోప్యాయ చోలప్యాయ చ నమ ఊర్వ్యాయ చ సూర్వ్యాయ చ ||
నమః పర్ణాయ చ పర్ణశదాయ చ నమ ఉద్గురమాణాయ చాభిఘ్నతే చ 
నమఆఖిదతే చ ప్రఖిదతే చ నమ ఇషుకృద్భ్యో ధనుష్కృద్భ్యస్చ వో నమః 
నమో వఃకిరికేభ్యో దేవానాఁ హృదయేభ్యో నమో 
విచిన్వత్కేభ్యో నమో విక్షిణత్కేభ్యోనమః  ఆనిర్హతేభ్యః ||

ద్రాపే అన్ధసస్పతే దరిద్ర నీలలోహిత |
ఆసాం ప్రజానామేషాం పశూనాం మా భేర్మా రోఙ్మో చ నః కిం చనామమత్ ||
ఇమా రుద్రాయ తవసే కపర్దినే క్షయద్వీరాయ ప్రభరామహే మతీః |
యథా శమసద్ద్విపదే చతుష్పదే విశ్వం పుష్టం గ్రామే అస్మిన్ననాతురమ్ ||
యాతే రుద్ర శివా తనూః శివా విశ్వాహా భేషజీ |
శివ రుతస్య భేషజీ తయా నో మృడ జీవసే ||
పరి నో హేతి రుద్రస్య  ఋత్యాత్  పరి త్వేషస్యదుర్మతిర్మహీ గాత్త్ |
అవ స్థిరా మఘవద్భ్యస్తనుష్వ మీఢ్వస్తోకాయ తనయాయ మృడ ||
మీఢుష్టమ శివ తమ శివో నః సుమనా భవ |
పరమే వృక్ష ఆయుధం నిధాయ కృత్తిం వసాన ఆ చర పినాకం బిభ్రదా గహి ||
వికిరిద్ర విలోహిత నమస్తే అస్తు భగవః |
యాస్తే సహస్రగ్గ్ హేతయో న్యమస్మన్ని వపన్తు తాః ||
సహస్రాణి సహస్రశో బాహ్వోస్తవ హేతయః |
తాసామీశానో భగవః పరాచీనాముఖా కృధి ||
అసంఖ్యాతా సహస్రాణి యే రుద్రా అధిభూమ్యామ్ |
తేషాగ్గ్ సహస్రయోజనే వ ధన్వాని తన్మసి ||
అస్మిన్మహత్యర్ణవే న్తరిక్షే భవా అధి |
తేషాగ్గ్ సహస్రయోజనే వ ధన్వాని తన్మసి ||
నీలగ్రీవాః శితికణ్ఠా దివఁ రుద్రా ఉపాశ్రితాః |
తేషాగ్గ్ సహస్రయోజనే వ ధన్వాని తన్మసి ||
నీలగ్రీవాః శితికణ్ఠాః శర్వా అధః క్షమాచరాః |
తేషగ్గ్ సహస్రయోజనే వ ధన్వాని తన్మసి ||
యే వృక్షేషు శష్పిఞ్జరా నీలగ్రీవా విలోహితాః |
తేషగ్గ్ సహస్రయోజనే వ ధన్వాని తన్మసి ||
యే భూతానామధిపతయో విశిఖాసః కపర్దినః |
తేషాగ్గ్ సహస్రయోజనే వ ధన్వాని తన్మసి ||
యే పథాం పథిరక్షస ఐలబృదా ఆయుర్యుధః |
తేషాగ్గ్ సహస్రయోజనే వ ధన్వాని తన్మసి ||
యే తీర్థాని ప్రచరన్తి సృకాహస్తా నిషఙ్గిణః |
తేషాగ్గ్ సహస్రయోజనే వ ధన్వాని తన్మసి ||
యే న్నేషు వివిధ్యన్తి పాత్రేషు పిబతో జనాన్ |
తేషాగ్గ్ సహస్రయోజనే వ ధన్వాని తన్మసి ||
యే ఏతావన్తశ్చ భూయాఁసశ్చ దిశో రుద్రా వితస్థిరే |
తేషాఁ సహస్రయోజనే వ ధన్వాని తన్మసి ||
నమో స్తు రుద్రేభ్యో యే దివి యేషాం వర్షమిషవః |
తేభ్యో దశ ప్రాచీర్దశ దక్షిణా దశ ప్రతీచీర్దశోదీచీర్దశోర్ధ్వాః |
తేభ్యో నమో అస్తు తేనో మృడయన్తు తే యం ద్విష్మో
యశ్చ నో ద్వేష్టి తమేషాం జమ్భే దధ్మః ||
నమో స్తు రుద్రేభ్యో యే న్తరిక్షే యేషాం వాత ఇషవః |
తేభ్యో దశ ప్రాచీర్దశ దక్షిణా దశప్రతీచీర్దశోదీచీర్దశోర్ధ్వాః |
తేభ్యో నమో అస్తు తేనో మృడయన్తు తోనోవంతు 
తేందుష్వో యశ్చ నో ద్వేష్టి తమేషాం జమ్భే దధ్మః ||
నమో స్తు రుద్రేభ్యో యే పృథివ్యాం యేషామన్నమిషవః |
తేభ్యో దశ ప్రాచీర్దశ దక్షిణా దశః
ప్రతీచీర్దశోదీచీర్దశోర్ధ్వాః |
తేభ్యో నమో అస్తు తే నో మృడయన్తు తే యం ద్విష్మో
యశ్చ నో ద్వేష్టి తమేషాం జమ్భే దధ్మః ||

23, మార్చి 2012, శుక్రవారం

శ్రీ ఆనంద నందన నామ సంవత్సర పంచాంగమున ఫలితములు.

4 comments

ఉః- 
అందని భక్తి భావమది యందగఁ జేయగ నున్న పార్వతీ 
నందన! వందనంబు. కరుణాధన!  లోక ప్రసాధనంబుగా
నందన వచ్చె. నీ కరుణ నందనపై ప్రసరించి, సాహితీ  
నందన మందు సుందరపు నందనగా వరలింపఁ జేయుమా!
ఉః- 
వందనమమ్మ!శారద! సభాస్థలి నన్ వరలింప జేయు మీ
నందన నూతనాబ్ది శుభ నందనమై సుజనాళి కెల్ల నా
నంద నవోదయంబవ, ఘనంబుగఁ జేయుమ! లోకమందు ని
న్నందని వారు లేనటుల ఖ్యాతిగఁ జేయుమ! కల్పవల్లివై.
ప్రియ పాఠక మహాశయులారా!  
స్వస్తి శ్రీ చాంద్రమాన వ్యవహారిక శ్రీ నందన నామ సంవత్సర చైత్ర శుద్ధ పడ్యమీ శుక్ర వారం  తెలుగువారి ఉగాది పండుగ సందర్భంగా ఆంధ్రామృత పాఠకులైన మీ అందరికీ, యావదాంధ్రులకూ, యావద్భారతీయులకూ, యావజ్జనానీకానికీ శుభాకాంక్షలు తెలియ జేసుకొంటున్నాను.
శాః-
శ్రీకల్యాణ మనోజ్ఞ భావ విలసత్ శ్రీ నందనాఖ్యాబ్ధిలో
శోకాతీత విశిష్ట సౌఖ్య ఫలముల్ శోభిల్లఁ జేయున్ మిమున్.
లోకేశుండు మదిన్ వసించు కుమతిన్, లోలత్వమున్ బాపుచున్.
శ్రీకారంబును జుట్టఁ జేయు తమచే శ్రేయంబులన్ జేయగా.
ఉగాదినాడు నింబకుసుమ భక్షణం చేయాలి. 
అదే వేప పూవు పచ్చడి.
దానిలో షడ్రుచులు మేళవింప బడతాయి.
అవి. నింబ, గుడ, లవణ, ఆమ్ల, జీరక, చూతములు.

ఆరోగ్యం నయతీతి ‘నింబః’ - అనగా ఆరోగ్యము నిచ్చునది. వేప
గుడతి రక్షతీతి ‘గుడం’ - అంటే రక్షించునది. బెల్లం
లునాతివాతం జాడ్యంవా ‘లవణం’ - అంటేవాత జాఢ్యములను పారద్రోలునది. ఉప్పు
సహస్రరోగాన్ విధ్యతే ఇతి ‘సహస్రవేధి’ - అంటే అనేక రోగములఎఱుక కలది. చింతపండు
జీర్యతే అన్నమనే నేతి ‘జీరకః’ - అంటే ఆహారమును జీర్ణము చేయునది. జీలకర్ర
సహకారయతి మేళయతిస్ర్తి ‘సహకారః’ - అంటే మేళవింపు చేయునది. మామిడి.
శ్లోః-
శతాయుర్వజ్ర దేహాయ, సర్వసంపత్కరాయచ|
సర్వారిష్ట వినాశాయ, నింబ కందళ భక్షణా||
షడ్రసోపేతమైన ఈ ఉగాది పచ్చడి తినవలెను.
మరియు,
ఉగాది సందర్భముగా పంచాంగ  పఠన శ్రవణ ఫలము లసాధారణమైనవి.

శ్లోః-
చైత్రమాసి జగద్రహ్మ ససర్జ ప్రథమే అహని
వత్సరాదౌ వసంతౌదౌ రవి రాద్యే తథైవచ!
విధాతయైన బ్రహ్మదేవుడు తన సృష్టి కార్యక్రమాన్ని 60 సంవత్సరాల్లోని మొదటిదైన ప్రభవనామ సంవత్సరం, 12 మాసాల్లో మొద టిదైన చైత్రమాసం, ఆరు ఋతువుల్లో మొద టిదైన వసంతఋతువు, వారాల్లో ఆదివారం, 30 నిథుల్లో పాఢ్యమి తిథి, 27 నక్షత్రాల్లో మొదటిదైన అశ్వినీ, ఇలా అన్ని మొదటితోనే ప్రపంచాన్ని సృష్టించాడు. ఈ ఉగాది పండుగ మనకు, ప్రధానమైన పండుగ.
శ్లోః-
తిథిర్వారంచ నక్షత్రం - యోగః కరణ మేవచ.
పంచాంగమితి విఖ్యాతం - లోకోయం కర్మ సాధనం.
గీః-
తిథియు, వారంబు, ఋక్షము, దీప్త యోగ,
కరణము లిట పంచాంగము లరయ నగును
మనకు పంచాంగమందున. దిన ఫలాదు
లెఱిగి, కర్మ చేయగ నగు నెల్లరకును.
తిథి, వార, నఖత్ర, యోగ, కరణములు అను ఈ ఐదు అంగములు కలిగియున్నది పంచాంగము. కర్మసాధకులగు లోకులకిది అత్యంత ఆవశ్యకము.
అబ్దాదిని పంచాంగ శ్రవణ క్రమంబెట్టిదనిన.
శ్లోః-
అబ్దాదౌ ప్రాతరుద్ధాయ మంగళ స్నానమాచరేత్. 
వస్త్రై రాభరణై ర్దేహ మలంకృత్య తతః శుచిః.
నవ గ్రహాంశ్చ, పంచాంగం, శ్రీ గణేశంచ, భారతీం, 
దైవజ్ఞమపి సంపూజ్య స్సాన్వయస్య పురోహితః.
నత్వా కాలాత్మకం సూర్యం, పంచాంగం గణితోత్తమం 
తిథిర్వారాదికం సర్వం శృణుయా త్తత్ఫంచవై.
ఉగాదినాడు వేకువ జామునే లేచి, మంగళస్నానము చేసి, మంచి శుభ్రమైన వస్త్రములను, ఆభరణములను ధరించవలెను. శుచిగా నవగ్రహములను, పంచాంగమును, గణేశుని, సరస్వతిని, దైవజ్ఞుని, పురోహితుని, పూజించి, కాలాత్ముఁడగు సూర్యుని ఉపాసించి, పంచాంగ ఫలంబు విని అనుష్టాన పరుండు కావలెను.  
శ్లోః-
తిథేశ్చ శ్రియమాప్నోతి - వారా దాయుష్య వర్థనం,
నక్షత్రాత్ హరతే పాపం, - యోగాద్రోగ నివారణం,
కరణాత్ కార్య సిద్ధిశ్చ. - పంచాంగ ఫలముత్తమమ్.
కాలవిత్ కర్మకృత్ ధీమాన్ - దేవతానుగ్రహం లభేత్.
గీః-
తిథియ శ్రీలను కలిగించు దీప్యముగను,
వారమాయువు నొసగును,  ప్రగణితముగ
పాప హరణము నక్షత్ర మోపి చేయు
యోగమది రోగములు బాపి యోగ మొసగు,
కరణ మది కార్య సిద్ధిని కలుగఁ జేయు,
ఇట్టి పంచాంగమును విను దిట్టలకును.
కాల మెఱిగి కర్మలు చేయు ఘనుల కెపుడు
దేవతానుగ్రహము కల్గు దివ్యముగను.
పంచాంగ శ్రవణము చేయు వారికి తిథి వలన సంపద, వారము వలన ఆయుష్షు, కలుగును. నక్షత్రము వలన పాప హరణము, యోగము వలన రోగ నివారణ, కరణము వలన కార్య సిద్ధి సంభవించును. కనుక కాలము తెలిసి కర్మలు చేయువారు భగవదనుగ్రహము పొందుదురు.
మరియు,
శ్లోః-
కన్యావనీ కాంచన దిగ్గజానాం - గవాం సహస్రం సతతం ద్విజేభ్యః
దత్వా ఫలం యల్లభతే మనుష్య - తత్తత్ఫలం యజ్ఞ ఫలం సమృద్ధం.
ఆయుర్వృద్ధిం పుత్ర పౌత్రాభి వృద్ధిం - నిత్యారోగ్యం సంపదంచాzనపాయీమ్.
యచ్చిన్నానా ముత్సవానామహిప్తిం - యతం త్యే తే వత్సరాథీశ ముఖ్యాః.
ఉః- 
కన్నియ, కాంచనంబు, భువి, గంధ గజాదులు, గో సహస్రమున్
మన్నిక గన్న విప్రునకు మంచిగ చేసిన దాన సత్ఫలం
బెన్నగ వచ్చువిన్నను సమీప్సిత వత్సరనాయకాదులన్.
మిన్నగు యజ్ఞ సత్ఫలము మేలుగ కల్గు సునందనంబునన్.
కన్య, భూమి, బంగారము, ఏనుగులు,ఆవులు మొదలగునవి వేయింటిని ఉత్తములకు దానము చేసినంత ఫలము పంచాంగము యొక్క సంవత్సర ఫలము విన్నంత మాత్రముననే వచ్చును. 
మరియు, 
శ్లోః- 
''ఆయుర్వృద్ధిం పుత్ర పౌత్రాభివృద్ధిన్‌
నిత్యారోగ్యం సంపదం చానపాయీమ్‌
అచ్ఛిన్నానాముత్స వానామ వాప్తిం
యత్యం త్యేత వత్సరాధీశ ముఖ్యాః'' 
ఆయుర్వృద్ధిపుత్ర పౌత్రాభివృద్ధిఆరోగ్యాన్ని సంప దనుకళ్యాణ మహోత్సవాలను సుఖశాంతులనుఈ సంవత్స రాధీశులు ఇచ్చుచున్నారు.
శ్లోః-
సూర్యశ్శౌర్య మదేందు రింద్ర పదవీం సన్మంగళం మంగళః.
సద్బుద్ధించ బుధో, గురుశ్చ గురుతాం, శ్శుక్రస్సుఖం శం శనిః.
రాహుర్బాహు బలం కరోతు సతతం, కేతుః కులస్యోన్నతిమ్,
నిత్యం ప్రీతికరా భవంతు భవతాం సర్వే నుకూలా గ్రహాః.
మః- 
రవిసౌర్యంబును, చంద్రుఁడింద్రపదవిన్, ప్రఖ్యాత సన్మంగళం
బు విరాజిల్లగ జేయు మంగళుఁడు. సద్ బుద్ధిన్ బుధుండిచ్చు.నీ
భువిపై సద్గురుతన్ గురుండొసగు, సత్పూజ్యుండుశుక్రుండుతా
నవ సౌఖ్యంబు నొసంగు, శోభనము మిన్నం గొల్పు మందుం డిలన్.

భువిపై బాహు బలంబు రాహు వొసగున్. భూష్యంపు వంశోన్నతిన్
సవిధంబిచ్చును కేతువెన్నుచు. ప్రశంసార్హంపు పంచాంగమున్
సవిధేయంబుగ విన్న వారలకిలన్ సంవత్సరంబంతయున్
భువిసౌఖ్యంబగు. కన్న వారలిల సంపూర్ణాయురారోగ్యులౌన్.
శ్లోః-
తిథిర్వారంచ నక్షత్రం యోగః కరణమేవచ,
పంచాంగస్య ఫలం శృణ్వన్ గంగా స్నాన ఫలం లభేత్.
గీః-
తిథియు, వారంబు, ఋక్షము, దీప్త యోగ,
కరణ ములిట పంచాంగము లరయ నగును.
మనకు పంచాంగమందున. దినఫలాదు
వినిన గంగ మున్గుఫలము నిచ్చునిజము.
శ్లోః-
పంచాంగస్య శ్రవణాత్ సు పుణ్య జనకం, సంవత్సరః సాధ్యతామ్. 
రాజ్ఞాం రాజనుతౌ జయో విజయతే మంత్రే ఫలం బుద్ధిదం.
ధాన్యం ధాన్యపతే, సురపతే క్షేత్రేశ వృద్ధిస్తధా
సస్యం సర్వ సుఖంచ వత్సర ఫలం సంశృణ్వతాం సిద్ధిదమ్.
మరియు
శ్లోః-
శ్రీకల్యాణ గుణావహం, రిపుహరం, దుస్స్వప్న దోషాపహమ్,
గంగాస్నాన విశేష పుణ్యఫలదం, గోదాన తుల్యం నృణామ్,
ఆయుర్వృద్ధిద ముత్తమం, శుభకరం, సంతాన సంపత్ప్రదమ్,
నానాకర్మ సుసాధనం, సముచితం పంచాంగమాకర్ణ్యతామ్. 
శాః-
శ్రీ కల్యాణ గుణావహమ్ము. రిపులన్ ఛేదించు. దుస్స్వప్న మే
ధా కాలుష్యము బాపు. గంగ మునుగన్  దక్కేటి పుణ్యంబు, ప్ర
త్యేకంబావుల దాన సత్ఫలమిడున్. ధీయాయువుల్ పెంచు. శో
భా కార్యాన్వయ. సంతతిన్ గొలుపు. సంపన్నంబు చేకూర్చు. శో
భా కార్యాద్భుత సాధనమ్ముచితమౌన్ పంచాంగమున్ విన్నచో.
ప్రస్తుత కలియుగానికి 4,32,000 ఆయుష్షు కలిగియుగాన్ని నాలుగు పాదాలుగా విభజిస్తే, లక్షా ఎనిమిది వేల సంవత్సరాలు గల మొదటి పాదంలో ఈ నందననామ సంవత్స రం 5,113వ సంవత్సరం. ఈ కలియుగం ఇంకా 4 లక్షల సంవత్సరాలకు పైగా మిగిలి యున్నది.
ఈ రోజు తిథ్యాది పంచాగములం గూర్చి తెలుసుకొందము.
శ్రీ నందన నామ సంవత్సరం.
తిథి: చైత్ర శుద్ధ పాడ్యమి రాత్రి  గం.08.35 ని.ల వరకు.
వారము: శుక్ర వారము.
నక్షత్రం: ఉత్తరాభాద్ర నక్షత్రము. పగలు గం. 12.34ని.ల వరకు.
యోగము: బ్రహ్మ యోగము ఘ.౫౧.౨౦ వరకు.
కరణము: కింస్తు కరణము. ఘ.౦౭.౨౪. వరకు.
ఈ  నందన  సంవత్సర ఫలము.
శ్లోః- 
నందనాబ్దే ఖిలా పృథ్వీబహు సస్యార్ఘవృష్టిభి:
ఆనందాఖిలానాంచజంతూనాంచ మహాభుజామ్.
కః-
నందన సంవత్సరమా
నందము రాజులకు ప్రజకు. నయ వృష్టి. ధర 
ల్డెందము కందిల యుండును.
సుందరముగ పండు భూమి. శోభిల నొప్పున్.
నందన సంవత్సరమున భూమి అనేక పంటలతోను, వెలతోను, వర్షములతోను వర్ధిల్లును. అంతటా ప్రజలకూ, రాజులకూ ఆనందముగా యుండును. 
నవ నాయకులు - కలిగే ఫలితములు.
౧. రాజు. శుక్రుఁడు.  
శ్లోః- 

సమృద్ధ సస్యా వసుధాతివృష్టి: -  గావోహి సంపూర్ణ పయః ప్రదాస్స్యు:
స్త్రియ: ప్రియాణాం జనయంతి తోషం - కామోపచారైః భృగుజేబ్ధనాధే.
గీః-
రాజు శుక్రుఁడై యుండిన రమ్యముగను
పంటలను పండు భూములు. పాలనిచ్చు
ధేనువులు తుష్టిగా. కొల్పు  స్త్రీలు తుష్టి
పతుల కెనలేని  సుఖమిచ్చి, వరలఁజేయు.
మెండుగ పండునుభూములు.
దండిగ వానలును కురియు. ధరణిని గోవుల్
దండిగ పాలిచ్చును.మది
నిండగ పతులకు ముదంబు నింపును వనితల్.
భూమి సస్యములతో నిండి యుండును. వానలు అధికముగా కురియును. ఆవులు, పసువులు సమృద్ధిగా పాలనిచ్చును. స్త్రీలు కామోపచారములతో తమ ప్రియులను ఆనందపరచెదరు.
౨. మంత్రి. శుక్రుఁడు.
శ్లోః- 

సువృష్టి: సర్వ సస్యాని, - సర్వే ధర్మ రతాః ప్రజా:
క్షేమారోగ్యే  సుభిక్షం స్యాత్ - మంత్రణ్యబ్దే భృగౌ యది.   
గీః-
మంత్రి శుక్రుఁడైన మంచివానలు పడు. 
మంచి పంట పండు. మహిని ప్రజలు
ధర్మ నిరతులగుచు ధరణిపై ఆరోగ్య
వంతులగుచు సుఖము పడయు. నిజము.
సర్వ సస్యములకు అనుకూలముగా వర్షములు కురియును. ప్రజలు ధర్మమునందు ఆసక్తి కలిగి యుందురు. ప్రజలందరూ ఆరోగ్యముగా సుభిక్షముగా నుందురు.
రాజు మంత్రి ఒకరే. ఐనచో కలుగు ఫలము.
శ్లోః- 

స్వయం రాజా స్వయం మంత్రీ - యస్మిన్నబ్దే యదా భవేత్
చోరాగ్ని శస్త్ర బాధాచ - పీడ్యంతే భూభుజాదయః.

శుక్రుఁడే రాజు మాంత్రియై చొక్కి యున్న
అగ్ని, చోర, శస్త్ర విపత్తి నడలు ప్రజలు.
రాజు పీడింపఁ బడు భువిని. భూజనులకు
రాజుకును దుష్ట ఫలమిది. పాడు కలుగు.
రాజు మంత్రి ఒకే గ్రహమునకు సంభవించినచో రాజులు అగ్ని, చోర, శస్త్రములచే బాధింప బడుదురు.

౩. సేనాధిపతి. గురుఁడు 
శ్లోః- 

నృపాస్సదా సద్విధి సంప్రవృత్తా: - విప్రాస్సదా వేద విధి ప్రవృత్తా:
జనాస్సదా సంభృత ధర్మ వృత్తా: - సైన్యాధిపత్యే సురమంత్రిణశ్చ.
గీః-
సేనకధిపతి గురుఁడైన క్షేమమేను.
నృపులు సద్విధు లొనరింత్రు. ప్రీతిఁజేయు
బ్రాహ్మణులు వేద విధులను భక్తి తోడ.
జనులు సద్ధర్మ వర్తులై చక్కనుంద్రు.
పాలకులు సత్కర్మలయందు శ్రద్ధ చూపెదరు. బ్రాహ్మణులు వేద ప్రోక్త యజ్ఞ యాగాదులనాచరించెదరు.ప్రజలు ధర్మమునందు ఆసక్తి చూపెదరు.
౪. సస్యాధిపతి. చంద్రుఁడు.
శ్లోః- 

జల ధాన్యాని సర్వాణి స్థల ధాన్యాని యానిచ
వృక్ష జాతిస్సుఫలితా చంద్రే సస్యాధిపతే.
గీః-
చంద్ర సస్యాధిపత్యము సత్ఫలదము.
భువిని జలధాన్యముల పంట పొంగి పొరలు.
ఘనత సుస్థల ధాన్యముల్  కలియ పండు.
వృక్ష జాతులు ఫలియుంచు పెంపు మీర.
జల  ధాన్యములు, స్థల ధాన్యములు, వృక్ష జాతులు చక్కగా ఫలించును.
౫. ధాన్యాధిపతి. శని.
శ్లోః- 

కృష్ణ ధాన్యాని సర్వాణి సూక్ష్మ ధాన్యాని యానుచ
కృష్ణ భూమిస్సుఫలితా ధాన్యాధీశే శనైశ్చరే.
కః-
శని ధాన్యాధిపతి యయిన
ఘనముగ ఫలియించు నలుపు గల ధాన్యములున్,
తినదగు చిఱు ధాన్యంబులు,
మన నల్లని భూమి పండు మహనీయముగా.
నల్లని ధాన్యములు, చిఱు ధాన్యములు, నల్ల రేగడి భూములు చక్కగా ఫలించును.
౬. అర్ఘాధిపతిః గురుఁడు.
శ్లోః- 

సువృష్టి ర్ధాన్య ధనైర్విరాజితా - భూమిర్మహా యజ్ఞపరైర్మహీసురై:
నిత్యోత్సవైర్మంగలతూర్యనిస్వనై: - అర్ఘాధిపే దేవగురౌచ శశ్వత్.
కః-
గురుడర్ఘాధిపతి యయిన
ధర వృష్టిని, పంటనలరు. ధరసురలు మహ
ద్వరముగ క్రతువులు చేతురు.
ధర మంగళ వాద్య మెలయు ధాత్రిని శుభముల్.
భూమి వర్షముల చేత ధన ధాన్య సంపదల చేత నిండి యుండును. బ్రాహ్మణులు యజ్ఞ యాగాది క్రతువులు నిర్వహించుచుందురు. మంగళ వాయిద్యములచేత నిత్యము ఉత్సవముల్ జరుగు చుండును.
౭. మేఘాధిపతిః గురుఁడు.
శ్లోః- 

సస్యార్ఘ వృష్టిభిస్తుష్టా - భవేద్ధాత్రీ నిరంతరం.
వీత రోగ భాయాస్సర్వే - మేఘాధీశే బృహస్పతౌ.
గీః-
గురుఁడు మేఘాధిపతియైన కువలయమున
ప్రజలు రోగవిదూరులై భవ్యమైన
పంటపండింత్రు. చక్కని వానలుండు.
ధరలు తగినట్టులుండును. వరల జేయు.
రోగములు లేనివారై ప్రజలు నిరంతర సస్యముల చేత, వర్షముల చేత సంతోషముగా ఉందురు. ధరలు అందుబాటులో ఉండును.
౮. రసాధిపతి. బుధుఁడు.
శ్లోః- 

శశి తనయే రస నాధే సుపిప్పలీశొంఠి హింగులశునాని
ఘృత తైలాద్యం నిఖిలం దుర్లభ మిక్షూద్భవంశకలమ్.
గీః-
బుధుఁడిల రసాధిపుండైన భువిని శొంఠి,
పిప్ప లింగువ, నెయ్యియు, వెలలు పెరుగు.
ఉల్లిపాయలు, నూనెలు, బెల్ల మెన్న
దుర్లభంబయి యుండును. దునుకు కొలుపు.
పిప్పళ్ళు, శొంఠి, ఇంగువ, ఉల్లిపాయలు, నెయ్యి, నూనెలు, బెల్లము మున్నగు రస వస్తువులు దుర్లభముగా నుండును.
౯. నీరసాధిపతిః చంద్రుఁడు.
శ్లోః- 

ముక్తాఫలం రత్న బీజకాంస్యాది వస్త్రాభరణాని సర్వం
వృద్ధిం గత్యాశు భవన్తి లోకే చంద్రో యదా నీరస నాయకో భవేత్.
గీః-
నీరసాధీశ చంద్రుఁడు నిరుపమగతి
ముత్యములు, రత్నములు, స్వర్ణము, మరి కంచు
లోహ, వస్త్రాభరణములు,  లుప్త మవక
మనకు లభియించు ధర తగ్గి మానితముగ.
ముత్యములు, రత్నములు, సువర్ణము, కంచు, మున్నగు లోహములు వస్త్రములు, ఆభరణములు మున్నగునవి విరివిగా లభించును.
ఉప నాయకులు ౨౧ మంది.
౧.పురోహితుఁడు - చంద్రుఁడు.
౨. పరీక్షకుఁడు - రవి.
౩. గణకుఁడు - కుజుఁడు.
౪. గ్రామ పాలకుఁడు - శుక్రుఁడు.
౫. దైవజ్ఞుఁడు - గురుఁడు.
౬. రాష్ట్రాధిపతి - శుక్రుఁడు.
౭. సర్వ దేశోద్యోగపతి  - శుక్రుఁడు.
౮. అశ్వాధిపతి - శుక్రుఁడు.
౯. గజాధిపతి - చంద్రుఁడు.
౧౦. పశువులకధిపతి - గురుఁడు.
౧౧. దేవాధిపతి - చంద్రుఁడు.
౧౨. నరాధిపతి - గురుఁడు.
౧౩. గ్రామాధిపతి - రవి.
౧౪. వస్త్రాధిపతి - బుధుఁడు.
౧౫. రత్నాధిపతి - శుక్రుఁడు.
౧౬. వృక్షాధిపతి - శని.
౧౭. జంగమాధిపతి - చంద్రుఁడు.
౧౮. సర్పాధిపతి - కుజుఁడు.
౧౯. మృగాధిపతి - గురుఁడు.
౨౦. శుభాధిపతి - శుక్రుఁడు.
౨౧. స్త్రీలకధిపతి - గురుఁడు.
శుభ గ్రహములు ౧౮.
పాప గ్రహములు ౩.
క్రూరగ్రహ ఫలం క్రూరమ్ - శుభ గ్రహ ఫలం శుభం.
పురోహితాది సర్వేషాం - భవేదీశ సముద్భవమ్.
పురహితాద్యు పనాయక సరళి చూడ
క్రూర గ్రహములు కలిగించు క్రూర ఫలము.
శుభ గ్రహంబులు కలిగించు శుభ ఫలంబు.
ఈశునాధీనమున బుట్టుటెఱుగ దగును.
పురోహితాది ఉపనాయకులు గా ఉన్న క్రూరగ్రహములు ౩  క్రూర ఫలమును, శుభ గ్రహములుగా ఉన్న ౧౮  శుభ ఫలమును కలుగ జేయుదురు.
ఈ సంవత్సరము  పశు పాలకుఁడు, గోష్ట ప్రాపకుఁడు, గోష్ట బహిష్కర్త శ్రీ కృష్ణుఁడు. 
దాని ఫలితము.
శ్లోః- 
పశువృద్ధిస్సుభిక్షంచ బహు సస్యార్ఘసంపద:
సంపూర్ణ తృణ వృద్ధిశ్చ గోపాలే పశు నాయకే.
గీః-
గోవులకు పతి కృష్ణుఁడు, కువలయమున
పశువులకు వృద్ధియు, సుభిక్ష భాగ్యమొప్పు.
పంటలన్నియు పండును పచ్చి గడ్డి
వృద్ధి చేయును పశువుల పృథ్విపైన.
పశువులు ఆరోగ్యముగా నుండును.సుభిక్షముగా నుండి అభి వృద్ధినిపొందును. తృణ సమృద్ధి కలుగును. పసువులు సుఖముగా పాలను ఇచ్చును.  ధరలు అనుకూలముగా ఉండును.
మేఘనిర్ణయము.
ఆవర్తన అను మేఘము. ఆవర్తే మంద తోయం స్యాత్. అల్ప వృష్టి.
మేరు శిఖరమందు ఉత్పత్తి యగును. ఇందు వలన సువృష్టి, పూర్వ సస్యములు అభివృద్ధి.
సంవర్త నామక మేఘము. సంవర్తేచోత్తరా వృష్టిః. ఉత్తర వానలు.
సువహ నామక వాయువు. సువహో వృష్టికృత్ సదా. ఎల్లప్పుడూ వర్షములు పడును.
నిశ్చల అను మెఱుపు. నిశ్చలాతు మహార్ఘదా. ధరలు పెరుగును. 
స్కలిత అను ఉరుము. స్కలితాత్ ఉత్తమా వృష్టిః. వర్షములధికము.
క్షార నామక సముద్రము. క్షారః వాయు సమాయుక్తం. గాలితో కూడిన వానలు.
భూ వాహన శేష ఫలము.
అనంతుఁడు అను శేషుఁడు భూమిని మోయుచున్నాఁడుఅనంత వస్తు సంపూర్ణా భూమిఃస్వస్థా జనాస్తధా.  దీని ఫలితముగా భూమి అనంత సంపదలతో నిండి యుండును.ప్రజలు ఆరోగ్యముతో ఆనందముగానుందురు.
ఆఢక నిర్ణయము:
ఈ సంవత్సరము  కుంచముల వాన.  భాగములు సముద్రమున,  భాగములు పర్వతములందు, ౩ భాగములు భూమిపైన పడును.
కుంచము౨౩-౩-౨౦౧౨ నుండి ౧౬-౫-౨౦౧౨ వరకు బాల గోప హస్తమందు, ఫలితము వర్ష లేమి. గోప హస్తమగుటచే సుభిక్షము.
అప్పటి నుండి ౪-౮-౨౦౧౨ వరకు వృద్ధ బ్రాహ్మణుని చేతియందు, దుర్భిక్షము, సస్య నాశము.
నాటి నుండి ౮-౧౧-౨౦౧౨ వరకు బాల గోపకుని చేతి యందు, ఫలితము వర్ష లేమి. గోప హస్తమగుటచే సుభిక్షము.
నాటి నుండి వత్సరాంతము యౌవన గోపకుని చేతు యందు ఉండును. సుభిక్షము, ఆరోగ్యము, సంపదలు కలుగును.
పుష్కరములు.: 
౧౭-౪-౨౦౧౨ ఉదయం ౧౦.౩౬ నుండి శ్రీ నర్మదా నది పుష్కరములు ప్రారంభమగును.
ఆ ప్రాంతము వారికి శుభ కార్యములు నిషిద్ధము.
మూఢము:
వైశాఖ శు.౮ఆది వారము౨౯-౪-౨౦౧౨ నుండి జ్యేష్ట శు.౮మంగళవారం ౨౯-౫-౨౦౧౨ వరకు గురు మూఢము.
జ్యేష్ట శు.౧౧శుక్రవారం ౧-౫-౨౦౧౨ నుండి జ్యేష్ట బ.౭ ఆదివారం ౧౧-౬-౨౦౧౨ వరకు శుక్ర మూఢము.
మాఘ శు.౬ శనివారం ౧౬-౨-౨౦౧౩ నుండి వత్సరాంతము శుక్ర మూఢ్యమి.
వివాహాది శుభ కార్యములు నిషిద్ధము.
అధిక మాసముః-
ఈ సంవత్సరము తే.౧౮ - ౮ - ౨౦౧౨ నుండి తే. ౧౬ - ౯ - ౨౦౧౨ వరకు అధిక భాద్రపద మాసము.
మకర సంక్రాంతి: ౧౪.౧.౨౦౧౩ సోమ వారము, ధనిష్టా నక్శత్రమున మేష లగ్నమున పగలు గం.౧౨.౦౯ని.లకు రవి మకరమున ప్రవేశించును.
శ్లోః- 

అష్ట కర్ణో విశాలాక్షో లంబభ్రూర్దీర్ఘనాసికః - అష్ట బాహుశ్చరుర్వక్ర్త్ర స్సంక్రాంతి పురుష స్మృతః.
శత యోజనమౌన్నత్యం విస్తీర్ణం ద్వాదశ స్మృతం - ఏవం రూపంహి విజ్ఞేయం సంక్రాంతి పురుషాకృతిః.
ఈ సంక్రాంతి పురుషునకు ధ్వాంక్షాని పేరువిటులకు అరిష్టము.
చందనజలస్నానము చేయును. ఆరోగ్యప్రదము.
జొన్నలను అక్షతలుగా ధరించును. జొన్నలకు నాశనము.
నీలివస్త్రము ధరించును. గొప్ప భయ కారకము.
లక్క గంధముగా ధరించును. యుద్ధ భయము.
జపాపుష్పము ధరించును. కీర్తికి హాని.
గోమేధికమును ఆభరణముగా ధరించును. పసువులకు హాని.
సీస పాత్రమున భుజించును. ఆరోగ్యప్రదము.
పాలను త్రాగును. పసువులకు హాని.
రేగు పండు తినును. శుభప్రదము.
గజ వాహనము. రాజులకు హాని.
విల్లును ఆయుధముగా స్వీకరించును. యుద్ధము కలుగును.
కాంచన ఛత్రమును ధరించును. బంగారము వెల పెరుగును.(నశించును).
అస్త్రములను ధరించును. రోగ భయము.
ఆగ్నేయదిశగా ప్రయాణము తద్దేశారిష్టము.
విస్మయ చేష్ట.ప్రజావృద్ధి కలుగును.
నివిష్టుఁడుగా ఉండును. సస్య వృద్ధి.
శుక్ల పక్షమున వచ్చియున్నందున ప్రజలకు రోగ, రాజుకు యుద్ధ భయము.
తదియనాడు వచ్చును. సుఖప్రదము.
సోమవారము వచ్చును. సుభిక్షము.
ధనిష్ట యందు వచుచున్నందున గో హాని.
ప్రథమ ముహూర్తమున వచ్చు చున్నందున మధ్యమ వర్షములు.
మకర లగ్నమున వచ్చు చున్నందున జన క్షయము.
పూర్వాహ్నమున వచ్చుచున్నందున రాజులకుహాని.
గ్రహణములు:
తే.20-5-2012.దీని సూర్య గ్రహణము.ఈశాన్య భారతంలో ౭, ౮ నిమిషములే కనబడును.
౪-౬-౨౦౧౨ చంద్ర గ్రహణము.
౧౩-౧౧-౨౦౧౨ సూర్య గ్రహణము.
౨౮-౧౧-౨౦౧౨చంద్ర గ్రహణము.
మన దేశమున కనిపించవు.
ఆదాయ వ్యయములు:
మేషమునకు   ఆదాయము  2     వ్యయము   8
వృషభమునకుఆదాయము 11    వ్యయము 14.
మిధునానికి     ఆదాయము 14    వ్యయము 11. 
కర్కా టకానికి  ఆదాయము  8     వ్యయము 11.
సింహమునకు ఆదాయము 11    వ్యయము   5. 
కన్యకు             ఆదాయము 14    వ్యయము 11.
తులకు            ఆదాయము 11    వ్యయము 14.
వృశ్చికముకుఆదాయము 2     వ్యయము  8
ధనుస్సుకు   ఆదాయము 5    వ్యయము 14. 
మకరముకు  ఆదాయము 5    వ్యయము   5. 
కుంభముకు  ఆదాయము 5    వ్యయము   5. 
మీముకు    ఆదాయము 5    వ్యయము 14. 
రాజ పూజ్య అవమానములు: 
మేషం .        రాజపూజ్యము 1 అవమానము 7.
వృషభం       రాజపూజ్యము అవమానము 7.
మిధునం.    రాజపూజ్యము  అవమానము7.
కర్కాటకం    రాజపూజ్యము 3 అవమానము 3.
సింహం        రాజపూజ్యము  6 అవమానము 3.
కన్య             రాజపూజ్యము  2 అవమానము 6.
తుల            రాజపూజ్యము  5 అవమానము 6.
వృశ్చికం      రాజపూజ్యము  1 అవమానము 2
ధనుస్సు     రాజపూజ్యము  4 అవమానము 2.
మకరం        రాజపూజ్యము  7 అవమానము 2.
కుంభం        రాజపూజ్యము  అవమానము 5.
మీనం          రాజపూజ్యము  6 అవమానము 5.
కందాయ ఫలములు: 
అశ్విని            2  .   1   .   0.
భరణి              5  .  2   .   2.
కృత్తిక             0  .  0   .   4.
రోహిణి            3   .  1   .   1.
మృగశిర         6   .  2   .   3.
ఆరుద్ర            1  .   0   .   0.
పునర్వసు      4  .   1   .   2.
పుష్యమి         7  .   2  .    4.
ఆశ్లేష              2   .  0   .   1.
మఖ               5   .  1   .   3.
పుబ్బ             0   .  2   .  0.
ఉత్తర              3    .  0  .   2.
హస్త               6    .  1   .   4.
చిత్త                1    .  2  .    1.
స్వాతి             4    .  0  .   3.
విశాఖ            7   .   1   .  0.
అనూరాధ      2   .   2  .   2.
జ్యేష్త               5   .   0  .   4.
మూల            0   .   1   .  1.
పూర్వాషాఢ   3   .   2   .  3.
ఉత్తరాషాఢ     6   .   0   .  0.
శ్రవణం          1   .   1   .  2.
ధనిష్ట             4  .    2    . 4.
శతభి              7  .   0    .  1.
పూర్వాభాద్ర   2  .    1    .  3.
ఉత్తరాభాద్ర     5  .    2    .  0.
రేవతి.             0  .    0    .  2.
బేసి సంఖ్య ధన లాభము
సమ సంఖ్య  సమ ఫలము.
సున్న శూన్య ఫలము.
ఒకటి, రెండు సున్నలు భయము.
మూడవ సున్న  హాని.
సంవత్సర ఫలము:
అశ్విని . పుష్యమి . స్వాతి . అభిజిత్తు వారలకు యుద్ధ భయము.
భరణి . ఆశ్రేష . విశాఖ .  శ్రవణం వారలకు అలంకార ప్రాప్తి.
కృత్తిక . మఘ . అనూ . ధనిష్ఠ వారలకు రోగ భయము.
రోహిణి . పుబ్బ . జ్యేష్ఠ . శతభిషం వారలకు ఆయుర్వృద్ధి.
మృగశిర . ఉత్తర . మూల . పూర్వాభాద్ర వారలకు అర్థ లాభము.
ఆర్ద్ర . హస్త . పూర్వాషాఢ . ఉత్తరాభాద్ర వారలకు మనస్తాపము.
పునర్వసు . చిత్ర . ఉత్తరాషాఢ . రేవతి వారలకు రాజ పూజ్యము.
సర్వాణి సన్మంగళాని భవంతు.
గమనిక
ఆన్ లైన్ రేడియో జోష్ లో ఈ రోజు మధ్యాహ్మ ఒంటిగంటన్నరకు, మరల రాత్రి తొమ్మిదిన్నరకు పంచాంగ శ్రవణం చేయాలంటే ఈ క్రింది లింక్ తెరవండి.
స్వస్తి