జైశ్రీరామ్
68. ఓం సహస్రబాహవే నమః.
అజితప్రతాప గర్భ సీసము.
శ్రీకరుఁడా! నరసింహుఁడా! శుభద! నన్ - గనుమా! కృపాసాంద్ర కరుణతోడ.
నురు గుణాలయుఁడ! నిరుపమాన కృప నీవు - చూపుమా. నాకిలఁ బ్రాపు నీవె.
యసమాన! నీ చరణాంబుజంబులకు సా - గిలనీయుమా నన్ సుకృతునిఁ జేయ.
నుత దివ్య తేజ! నిరతమున్మదిని నిన్నె - గొల్చెదన్ మహనీయ కోర్కె తీర.
గీ. సుప్రసిద్ధా! నృహరి! యజితప్రతాప! - యరసి పాపులన్ బాపు *సహస్రబాహు*!
భక్త జన పోష! భవశోష! పాపనాశ! - శ్రితజనోద్భాస! యాదాద్రి శ్రీనృసింహ!
68వ సీస గర్భ అజితప్రతాపము. (1.3పాదములకు స జ స స .. యతి 9. /
2.4 పాదములకు న భ జ ర .. యతి 8)
నరసింహుఁడా! శుభద! నన్ గనుమా! - నిరుపమాన కృప నీవు చూపుమా. .
చరణాంబుజంబులకు సాగిలనీ. - నిరతమున్మదిని నిన్నె గొల్చెదన్.
భావము.
భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా!
ఆశ్రిత జనమున
ప్రకాశించువాఁడా!
ఓ యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! ఓ మంగళప్రదుఁడా! శుభదా! కృపాసాంద్రా! నన్ను
కరుణతో చూడుము. గొప్పగుణములకు స్థానమైనవాడా! నాపై కృప చూపుము. నాకాధారము నీవే సుమా. ఓ సాటి లేనివాడా!
నన్ను సుకృతునిగా చేయుటకు నీ పాదములపై నన్ను సాగిలబడనీ. నా కోరిక తీరునట్లుగా ఎల్లప్పుడూ నిన్నే మనసులో
తలంతును ఓ అజితప్రతాపా! ఓ సహస్ర బాహూ పాపులనెంచి అణచివేయుము.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.