గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, సెప్టెంబర్ 2023, గురువారం

శ్రీ యాదాద్రి లక్ష్మీనృసింహ శతకము 76వ పద్యము .... రచన. చింతా రామకృష్ణారావు. గానం. శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్.

76. ఓం సర్వయంత్రవిదారణాయ నమః.

ఉపజాతి వృత్త గర్భ సీసము.

తేజోమయుండనీ తేజముం జూచి పు - నీతునౌదున్ బ్రభూనిర్వికల్ప!

ధర్మస్వరూపాసతంబు నిన్  గాంతుఁ బ్ర - శాంతమొప్పన్. మహేశా! మనోజ్ఞ!

దాక్షిణ్యమునను చైతన్యముం గొల్పుము - సామ వేద్యాసత్య శాంతరూప!

ధర్మంబు నందు నితాంత సంతో షిగ - నిన్నె కందున్హరీనిష్కళంక.

గీ. ఉందువుపజాతులందునో సుందరాంగ. - *సర్వయంత్రవిదారణా*! సౌమ్య రూప!

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

76 సీస గర్భస్థ ఉపజాతి. (13పాదాలు    గగ {ఇంద్రవజ్ర}

                               24పాదాలు    గగ {ఉపేంద్రవజ్ర} .. యతి 8) 

నీ తేజముం జూచి పునీతునౌదున్. - సతంబు నిన్ గాంతుఁ బ్రశాంతమొప్పన్

చైతన్యముం గొల్పుము సామ వేద్యా! - నితాంత సంతో షిగ నిన్నె కందున్.

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! నిర్వికల్పా! తేజోమయా! నీ ప్రకాశమును చూచి

పునీతునగుదును. ధర్మ స్వరూపా! ప్రశాంతిగా ఉండుటకు ఎల్లప్పుడూ నిన్ను చూచెదను. సామ వేద్యా! నాలో

చైతన్యమును కొల్పుము. నిష్కళంకుఁడవైన హరీ! ఉపజాతివృత్త గర్భ సీసమందున్న సుందరాంగా!

సర్వయంత్రవిదారణా! సౌమ్య రూపా! ధర్మమునందు ఎనలేని సంతోష స్వరూపునిగా నిన్నే చూతును..

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.