గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

31, అక్టోబర్ 2012, బుధవారం

మేలిమి బంగారం మన సంస్కృతి 126.

0 comments

శ్లో:-
క్షణశః కణశశ్చైవ - విద్యామర్థంచ సాధయేత్.
క్షణ త్యాగే కుతోవిద్యా  -  కణ త్యాగే కుతో ధనమ్.
గీ:- 
విద్యనార్జించుక్షణమైన విడువకుండ.
ధనము నార్జించు కణమైన తప్పకుండ.
క్షణము పోయిన విద్య యే గతిని కలుగు?
కణము పోయిన ధనమెట్లు కలుగునయ్య?
భావము:-
క్షణ క్షణమూ ఉపయోగించుకొని విద్యను, కణము కణమూ చొప్పున సేకరించి ధనమును కూడబెట్ట వలెను. క్షణము  వ్యర్థ పరచినచో ఇక విద్య ఎక్కడ సంపాదించుట జరుగును? అటులనే కణమునైనను విడిచిపెట్టితిమేని మరి ధనమునెటుల సంపాదించుట జరుగును?   
విద్యా సముపార్జనాసక్తులు ఒక్క క్షణమైనను వ్యర్థము చేయ కూడదు. ధన సముపార్జనాసక్తులు ఒక్క కణమాత్రమైనను విడిచిపెట్ట కూడదు అని గ్రహింపనగును.
జైహింద్.

30, అక్టోబర్ 2012, మంగళవారం

“శాండీ'” పెనుతుపాను భీభత్సం నుండి తప్పించుకొని అమెరికాలో ఉన్న మిత్రులంతా క్షేమంగా ఉండాలని కోరుకొంటున్నాను.

0 comments

జైశ్రీరామ్.
అమెరికాను అతాకుతలం చెస్తున్న శాండీ తుపాను.
ఆర్యులారా! “శాండీ'”పెను తుపాను కారణంగా  ఏనాడూ కనీ వినీ యెఱుగని ప్రకృతి భీభత్సానికి అమెరికా లోనవడం విచారకరం. అక్కడ  మన ఆంధ్రులు, మన భారతీయులు ఎంతోమంది నివాసముంటున్నారు. వారంతా ఎక్కడున్నా మన మాత్రు భారతిఎడలా, మన ఆంధ్ర రాష్ట్రం ఎడల సౌవేధేయులై, నిష్కళంకమైన ప్రేమని ఎల్లప్పుడూ చూపిస్తూ, అమెరికాపై గౌరవభావంతో మెలగుతూ ఉభయ దేశాలకు వారధిలాగ ఉంటున్న విషయం మనకు తెలియనిది కాదు. తమ బంధువర్గానికి దూరంగా ఉంటూ కూడా అది మరచి, అమెరికనులతో మైత్రీభావంతో కలిసిపోయి ఎంతో ఆనందంగా జీవిస్తూ అక్కడున్నారు మనవారు.
ఇప్పుడు తుపాను రూపంలో వచ్చిన పెద్ద ఉపద్రవాన్నిఅమెరికా ఎదుర్కుంటోంది.
అమెరికా దేశము ఈ ఉపద్రవంనుండి సునాయాసంగా గట్టెక్కాలనీ, అక్కడున్న స్వదేశీయులు,అతిథులైన పరదేశీయులుక్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను.
మన భారతీయులిఉ, మన ఆంధ్రులు యావన్మందీ కూడా ధన మాన ప్రాణాలతో సురక్శ్కితంగా ఉండాలని ఆంధ్రామృతం కోరుకుంటోంది.
సర్వే జనాః సిఖినో భవంతు.
జైహింద్.

మేలిమి బంగారం మన సంస్కృతి 125.

1 comments

జైశ్రీరామ్.
శ్లో:-
విద్వత్వంచ నృపత్వంచ నైవ తుల్యం కదాచన
స్వదేశే పూజ్యతే రాజా, విద్వాన్ సర్వత్ర పూజ్యతే.
గీ:- పాండితికి సరికాదిల ప్రభుత చూడ
రాజు పూజింపఁబడు తన రాజ్యముననె,
పండితీయుతులెటనైన ప్రతిభ చేత
పూజలందుట నిక్కము భూమిపైన.
భావము:-
పాండిత్యము, రాచరికము ఒకదానితో మరొకటి పోల్చుటకు వీలు లేదు. రాజు స్వదేశమునందు మాత్రమే పూజింపఁబడును. పండితుఁడు మాత్రము లోకములో ఎక్కడికి వెళ్ళినా పూజింపఁ బడును.
కాబట్టి సాహిత్యపు విలువలు కలిగిన వాటిని పఠిస్తూ ఉండాలి. శోధించి తెలుసుకొంటూ ఉండాలి. అప్పుడు పాడిత్యము అలవడకుండా ఎలా ఉంటుంది. గ్రథాలు చదువుతూ ఉండండి.
జైహింద్.

28, అక్టోబర్ 2012, ఆదివారం

శ్రీ వల్లభవఝల వారి శోడశ దళ చక్రబంధము, చక్రబంధము.

0 comments

జైశ్రీరామ్.
ప్రియ పాఠక మిత్రులారా! చిత్ర కవితా వైచిత్రి తెలుసుకొనే కొద్దీ తెలుసుకోవాలనే ఉంటుంది. ఆధునిక కవి బ్రహ్మశ్రీ వల్లభ వఝల అప్పల నరసింహ మూర్తి కవి కృత శోఢశదళ చక్ర బంధమును, చక్ర బంధమును తిలకించండి
చూచారుకదండీ! మీరూ వ్రాయడానికి ప్రయత్నించండి.నమస్తే.
జైహింద్.

మేలిమి బంగారం మన సంస్కృతి 124.

0 comments

జైశ్రీరామ్.
శ్లో:- నచ విద్యా సమో బంధుః  -  నచ వ్యాధి సమో రిపుః
నచాపత్య సమస్స్నేహః  - నచ దైవాత్ పరం బలమ్.
లేదు విద్య సమాన బంధువు.  - లేదు వ్యాధి సమాన శత్రువు.
లేఁడు పుత్ర సమాన మిత్రుఁడు  - లేదు దైవ సమాన బలమున్.
భావము:-
విద్యతో సమానమైన బంధువు లేఁడు. రోగముతో సమానమైన శత్రువు లేఁడు. పుత్రునితో సమానమైన స్నేహితుఁడు లేఁడు. దైవముతో సమానమైన బలము వేరే లేదు.
మనము విద్యావంతులము కావలెననియు, రోగ దూరులమై యుండవలెననియు, సత్ సంతానమును కలిగి యుండవలెననియు, దైవభక్త్ని కలిగి యుండ వల్రెననియు భావము.
జైహింద్.

27, అక్టోబర్ 2012, శనివారం

మేలిమి బంగారం మన సంస్కృతి 123. నాలుక తెచ్చిపెట్టే మంచి చెడ్డలు.

2 comments


జైశ్రీరామ్.

శ్లో:-
జిహ్వాగ్రే వర్తతే లక్ష్మీః జిహ్వాగ్రే మిత్రబాంధవః
జిహ్వాగ్రే బంధన ప్రాప్తిః జిహ్వాగ్రే మరణం ధ్రువం.
క:-
నాలుక మూలము లక్ష్మికి. 
నాలుక సద్బంధు మిత్ర నవనాదులకున్
మూలము. బంధన ప్రాప్తికి
నాలుక మూలము. మరణము నాలుక తెచ్చున్.
భావము:-
లక్ష్మీ ప్రాప్తికి నాలుకయే మూలము.  మిత్రులు, బంధువులు కలుగుటకు కూడా నాలుకయే కారణము. బంధనాదులు ప్రాప్తించుటయు నాలుక వల్లనే జరుగును. తుదకు మరణ హేతువు కూడా నాలుకయే అనుటలో ఏమాత్రమూ సందేహము లేదు. 
అనగా మనము పొందే ప్రతీ ఫలితమునకు మూలము మనము మాటాడే మాటయే. మనము మాటాడడానికి ముఖ్యమైన ఆధనము నాలుకయే.  కావున ఆన్నిటికీ మూలము నాలుకయే  అగునని ఎఱుంగ వలయును. మనము పొందికగా అందముగా వినువారికి సంతోషము కలిగించునట్టులుగా మాటాడవలెనని గ్రహింప వలెను.
జైహింద్.

26, అక్టోబర్ 2012, శుక్రవారం

శ్రీ వల్లభ వఝల వారి రథ బంధ సీసము.

0 comments

జైశ్రీరామ్.
సాహితీ బంధువులారా! బ్రహ్మశ్రీ వల్లభ వఝల అప్పల నరసింహ మూర్తి గారు విరచించిన రథ బంధ సీసమును రథ చిత్రంలో మీరు చూడ గలరు.

ఎవరి కీర్తి పతాక రథముపై రెపరెపలాడుతోదో వారి పేరు ఆపతాకమునుండి క్రిందివరకు గల మధ్య వరుసలోని అక్షరములలో వ్యక్తమగుట ఇదలి ప్రత్యేకత.
మీరూ ఈ విధంగా వ్రాసే ప్రయత్నం ఎందుకు చేయ కూడదు? ఆఁహాఁ ఎందుకు ప్రయత్నం చేయకూడదూ అంటా!
నమస్తే.
జైహింద్.

25, అక్టోబర్ 2012, గురువారం

జై జగన్మాతా. జైజై జగన్మాతా!

2 comments

జైశ్రీరామ్.
సహృదయ సామాజికులారా!
జగదంబధ్యానంలో తాదాత్మ్యత పొందుతూ భక్తి పారవశ్యంలో ఉఱ్ఱూతలూగిపోతూ ఆ జగన్మాతను కొలిచి, ఆతల్లి కృపను పొందిన మీఅందరి పాదములకు నా అభివందనములు.
యా దేవీ సర్వ భూతేషు శక్తి రూపేణ సంస్తితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై  నమోనమః
అంటూ కనిపించే ప్రతీ స్వరూపంలోను జగదంబనే కంటూ, భక్తి పారవశ్యంతో పూజించాము. నవరాత్రులు నిన్నటితో పూర్తి కావటంతో దీక్షను ముగించుకోవటం కూడా జరిగి పోయింది. ఇక ఇప్పుడు చేయదగిన పని ఏమిటై ఉంటుంది?
ప్రతీ స్త్రీ మూర్తినీ జగన్మాతగా  ఈ పది రోజులూ కన్న మన కళ్ళు మన భావన, మన మనో నేత్రము ఇటుపైన కూడా అదే సాధన చేస్తూ ప్రతీ అణువునందూ, ప్రతీ క్షణమునందూ సంచరిస్తూ ఉండే ఆ జగన్మాతను నిరంతరమూకొలుస్తూ ఉండాలి కదా! ఆ విధంగా చూచుట కొఱకే గడిచిన పది రోజులు చేసిన సాధన అని మనం గ్రహించాలి కదా? మరి అలా గ్రహించి అలా నడచుకోవాలి కదా? మనమల్లాగే నడచుకోలేకపోతామా?
ప్రతీ అణువునందూ, ప్రతీ స్త్రీ మూర్తులలో ఆబాల గోపాలమునందూ ఆజగన్మాతనే ప్రత్యక్షం చేసుకొంటూ, కదలాడే జగదంబ దర్శనంతో పులకరించిపోతూ నిజమైన జ్ఞాన పరిణతి పొందిన సిద్ధులమై ప్రవర్తించేలాగ చేయమని ఆజగన్మాతనే వేడుకొంటూ, ప్రతీ స్త్రీ మూర్తియెడల ఆ జగన్మాత యొక్క తేజో మూర్తినే కనుగొందుము గాక.
ఆ జగన్మాత శుభాశీస్సులనందుదుము గాక.
జై జగన్మాతా.
జైజై జగన్మాతా.
జైహింద్.

24, అక్టోబర్ 2012, బుధవారం

విజయ దశమి సందర్భముగా ఆంధ్రామృత పాఠకులకు, భక్త జనాళికి శుభాకాంక్షలు.

5 comments

జైశ్రీరామ్.
సహృదయ శిరోమణులారా! ఈ నాడు పరమ పవిత్రమైన విజయ దశమి.  ఆ జగత్కారణ, సర్వ జగత్తుకు మూల విరాణ్మూర్తియైన జగదంబ పరిపూర్ణ కరుణా కటాక్ష వీక్షణా గవాక్షాలు తెరచుకొని  తనపై భక్తి పారవశ్యంతో పులకరించుకుపోయే భక్తులపై ఆమె చల్లని చూపుల వెన్నెలలు పీయూష వర్షమై ప్రసరించే శుభ ఘడియలు నిండి ఉన్నాయి. ఆ చల్లని తల్లి కరుణకు పాత్రులమై భవబంధాలకు అతీతముగా పరమానందాన్ని పొందుచూ పరవశించిపోదాము.
ఆజగదంబ శుభాశీస్సులు మీ అందరికీ లభించాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను.
దుర్గా ఆపదుద్ధారాష్టకం

నమస్తే శరణ్యే శివే సానుకంపే నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే |
నమస్తే జగద్వంద్యపాదారవిందే నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే || ౧ ||

నమస్తే జగచ్చింత్యమానస్వరూపే నమస్తే మహాయోగివిజ్ఞానరూపే |
నమస్తే నమస్తే సదానందరూపే నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే || ౨ ||

అనాథస్య దీనస్య తృష్ణాతురస్య భయార్తస్య భీతస్య బద్ధస్య జంతోః |
త్వమేకా గతిర్దేవి నిస్తారకర్త్రీ నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే || ౩ ||

అరణ్యే రణే దారుణే శత్రుమధ్యే జలే సంకటే రాజగ్రేహే ప్రవాతే |
త్వమేకా గతిర్దేవి నిస్తార హేతుర్నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే || ౪ ||

అపారే మహదుస్తరేజ్త్యంతఘోరే విపత్సాగరే మజ్జతాం దేహభాజామ్ |
త్వమేకా గతిర్దేవి నిస్తారనౌకా నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే || ౫ ||

నమశ్చండికే చండదోర్దండలీలాసముత్ఖండితా ఖండలాశేషశత్రోః |
త్వమేకా గతిర్విఘ్నసందోహహర్త్రీ నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే || ౬ ||

త్వమేకా సదారాధితా సత్యవాదిన్యనేకాఖిలా క్రోధనా క్రోధనిష్ఠా |
ఇడా పింగళా త్వం సుషుమ్నా చ నాడీ నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే || ౭ ||

నమో దేవి దుర్గే శివే భీమనాదే సదాసర్వసిద్ధిప్రదాతృస్వరూపే |
విభూతిః సతాం కాలరాత్రిస్వరూపే నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే || ౮ ||

శరణమసి సురాణాం సిద్ధవిద్యాధరాణాం
మునిదనుజవరాణాం వ్యాధిభిః పీడితానామ్ |
నృపతిగృహగతానాం దస్యుభిస్త్రాసితానాం
త్వమసి శరణమేకా దేవి దుర్గే ప్రసీద || ౯ ||   


శుభమస్తు.
జైహింద్.

16, అక్టోబర్ 2012, మంగళవారం

శ్రీ దేవీ నవరాత్రులు సందర్భముగా పాఠకాళికి శుభాకాంక్షలు.

4 comments

జైశ్రీరామ్.
వందే లోక మాతరమ్.
ఆదిపరాత్పరాకృతి, మహాద్భుత మూలవిరూప శక్తి, సం
పాదిత సర్వసృష్టి యుత సత్వ రజస్తమపూర్ణ తత్వ, సం
వేదిత భక్తగణ్య పరివేష్టిత సన్ముని, లోక రక్ష, స
మ్మోదము తోడ మిమ్ములను ముద్దుగ చూచుత దేవి యెల్లెడన్.
జైహింద్.

15, అక్టోబర్ 2012, సోమవారం

శ్రీ వల్లభ వఝల వారి శకట చక్ర బంధము, అష్ట దళ పద్మ బంధము.

2 comments

జై శ్రీరామ్.
సాహితీ ప్రియులారా! బ్రహ్మశ్రీ వల్లభవఝల అప్పల నరసింహ కవి గారు రచించిన శకట చక్ర,  అష్టదళ పద్మ బంధములను తిలకించండి.

మీ అభిప్రాయాలను తెలియ జేయ మనవి.
జైహింద్.
ఏల్చూరి మురళీధరరావు
ఇలా వ్యాఖ్యానించారు.
పుంభావసరస్వతి పూజ్యశ్రీ పండిత నేమాని గురుదేవులకు,
మధురకవి శ్రీ చింతా రామకృష్ణారావు గారికి,
విద్వన్మిత్రమండలికి,
విజయదశమీ పర్వదినాన సర్వ శుభాకాంక్షలు! 
భవదీయుడు,
ఏల్చూరి మురళీధరరావు.
మాన్యశ్రీ రామకృష్ణారావు గారు!
శ్రీ వల్లభవఝల వారి చిత్రకవితాప్రణయనం మనోహరంగా ఉన్నది. వారికి నా హృదయపూర్వకాభినందనలను తెలియజేయండి. మీవి, వారివి ముద్రితరచనలు ఏమేమున్నాయో తెలుపగలరని ప్రార్థన. 
కాగా; మీరు కాని, మీ మిత్రమండలి సదస్యులు కాని, శ్రీ వల్లభవఝల వారు కాని "నాగబంధము"లో ఏవైనా ప్రయోగాలను చేసినా, అటువంటి ప్రయుక్తాలను మీరెక్కడైనా చూసినా - దయచేసి తెలియజేయగోరుతున్నాను.
భవదీయుడు,
ఏల్చూరి మురళీధరరావు . 
వీరి కోరిక మేరకు కుమార సంభవమునందలి నాగబంధమును ఈ క్రింద చూపిస్తున్నాను.
ఏల్చూరి వారి ఈమెయిల్ ఐడీ ఇవ్వనందున ఆంధ్రామృతం ద్వారా వారికి తెలియ జేస్తున్నాను.
జైహింద్.

14, అక్టోబర్ 2012, ఆదివారం

శ్రీ వల్లభవఝలవారి గౌళికాబంధము, గోమూత్రికా బంధము.

0 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా!   బ్రహ్మశ్రీ వల్లభవఝల నరసింహ మూర్తి కవి వరులు రచించిన గౌళికా బంధము, గోమూత్రికా బంధము తిలకించండి.

పట్టుదలతో ఎంతో కృషి చేస్తూ తెలుగు భాషపట్ల వారికి గల అపారమైన గౌరవ భావము వ్యక్తంచేసుకొంటున్న శ్రీ వల్లభ వఝలవారికి  నా కైమోడ్పుకు.
జైహింద్.

13, అక్టోబర్ 2012, శనివారం

ఖడ్గం దూసిన బ్రహ్మశ్రీ వల్లభ వఝల నరసింహ మూర్తి కవి. 2.

0 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! నిన్నటి ప్రచురణలో కవిగారు చెప్పిన ఖడ్గ బంధం ఒకటి చూచాము కద్దా! ఈ ఒజు మరియొక ఖడ్గ బంధం చూద్దాము.
చూచారుకదండీ! ఆలోచించి చూడండి మీరు కూడా ఎందుకు వ్రాసే ప్రయత్నం చేయ కూడదో!
జైహింద్

12, అక్టోబర్ 2012, శుక్రవారం

ఖడ్గం దూసిన బ్రహ్మశ్రీ వల్లభవఝల నరసింహ మూర్తి కవి.

1 comments

జైశ్రీరామ్.
సాహితీ ప్రియ బంధువులారా!  యత్నే కృతే యది నసిధ్యతి కోz త్ర దోషః అన్న నానుడి ననుసరించి మన సాహితీ మిత్రులు, ప్రముఖ జ్యోతిశ్శాస్త్రవేత్త బ్రహ్మశ్రీ వల్లభవఝల నరసింహ మూర్తి కవి ఒక ఖడ్గ బంధాన్ని కవితలో బంధించి మనము కూడా ఆ ప్రక్రియ చూచే భాగ్యం కలిగిస్తూ మనముందుంచారు. సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నట్లు డా.దేవగుప్తాపు గణపతిరావుగారి బంధ కవితలను ఆంధ్రామృతంలో చూచి, స్పందించిన హృదయంతో తానూ బంధించారు తన కవితను ఖడ్గ బంధంగా. మరి మీరూ పరిశీలించండి. అవకాశం కల్పించుకొని మీరూ వ్రాసే ప్రయత్నం చెయ్యండి.
"దృష్టం కిమపి లోకేzస్మిన్ ననిర్దోషో న నిర్గుణః."   కాబట్టి
"యత్ సారభూతం తదుపాసితవ్యం హంసో యథా క్షీరమివాంబు మిశ్రం" 
శుభమస్తు.
జైహింద్.

10, అక్టోబర్ 2012, బుధవారం

స్వరమాంత్రికుల సహాయ సంస్కృతి.

0 comments

జైశ్రీరామ్.
ఈ ఫొటోపై క్లిక్ చెయ్యండి.
జైహింద్.

9, అక్టోబర్ 2012, మంగళవారం

ఘనంగా జరిగిన పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనము 1.

4 comments

జైశ్రీరామ్.
విజయనగరము మహారాజా ప్రభుత్వ సంస్కృత కళాశాల విశ్రాంత అధ్యక్షులు శ్రీ మానాప్రగడశేషశాయి గారి అపురూపమైన ఉపన్యాసము.
ప్రియ సహృదయ మిత్రులారా! 
తే.07-10-2012న విజయ నగరంలోఁ గల సుమారు 150 సంవత్సరాల అతి ప్రాచీన మహారాజా ప్రభుత్వ సంస్కృత కళాశాల పూర్వ విద్యార్థులమైన మా అందరి అపూర్వ అపురూప  సమ్మేళనము  అత్యంత వైభవముగా జరిగిందని తెలియ జేయుటకు చాలా ఆనందంగా ఉంది.
అతి తక్కువ వ్యవధిలో నిర్వహించిన యీ కార్యక్రమానికి పాతికమందో ఏభైమందో వస్తారని ఊహించాము. ఐతే సుమారు మూడువందలమంది హాజరు కావడంతో అత్యంత ఉత్సాహ భరితంగా  అనూహ్యమైన రీతిలో ఆనంద సంభరితమయింది.
అలనాటి నుండి నేటి వరకు అచ్చట బోధకులైన ఉపన్యాసకులు అనేక మంది మా ఆహ్వానాన్ని మన్నించి మా ఆతిథ్యాన్ని స్వీకరించి మేము చేసిన సన్మానాన్ని సహృదయంతో గ్రహించి, తమకు మాపై గల అపారమైన ప్రేమామృతం మాపై కురిపిస్తూ వారి అమృత వాక్కులతో మమ్ములనాశీర్వదించారంటే అది మాకు  శారదాంబ అనుగ్రహం వలన లభించిన అపూర్వమైన అవకాశంగా మేము భావిస్తున్నాము.
శ్రీ మానాప్రగడ శేషశాయి గురువుగారు, డా. ఏ. గోపాలరావు గురువుగారు, శ్రీ రామరాజు గురువు గారు శ్రీ గోవిందాచార్యులు గురువు గారు, ఆ సంస్కృత కళాశాల ప్రస్తుత అధ్యక్షులు శ్రీమతి డా.పెన్నేటి స్వప్నహైందవి గారు, వేద పండితులు, ఇంకా కొందరు గురువులు తమ అమూల్యమైన ఆశీస్సులందజేసారు మాకు.
ఈ సంస్కృత కళాశాల ప్రస్తుత అధ్యక్షులు శ్రీమతి డా.పెన్నేటి స్వప్నహైందవి గారు మాకు చక్కని జ్ఞాపికగా ఫైళ్ళను అందజేసారు. ఆమెకు మా ధన్యవాదములు.
శ్రీ మానాప్రగడశేషశాయిగారి అమృత వాక్కులను మనము పైనగల వీడియో ద్వారా చూస్తూ వినవచ్చును.
ఈ అసాధారణమైన అపురూపమైన ఈ పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనము మాహా కవిసమ్మేళనంగా పరిఢవిల్లింది.
మా గురుదేవులు శ్రీ ఏ. గోపాలరావుగారు కూడా ఒక పూర్వ విద్యర్థే అయిన కారణముగాను, మాతో మమైకమయే సహృదయులైన కారణంగాను ఆద్యంతము మాకు మార్గదర్శకులై ఈ కార్యక్రమం  నిర్వహింప జేసారు.
మా ఆనందానికి అవధులే లేవంటే అది ఏమాత్రం అతిశయోక్తి కాదు. 
తొలినాటి రాత్రికే మేమంతా ఒకచోట చేరటంతో ఆరాత్రంతా మాకు మహాశివరాత్రే అయిందంటేనమ్మండి. ఎన్ని మాటలాడుకున్నా తరగవు మా మాటలు. అలనాటి తీపిగురుతులను నెమఱు వేసుకొంటూ ఒకరి యోగక్షేమాలను మరొకరు తెలుసుకొంటూ, మధ్య మధ్య ఆశుకవితా లతలనల్లజేస్తూ, చెణుకులు విసురుకొంటూ, వయసులు మరచి అన్ని బాధలను ఏమరచి అనంద రస వాహినిలో ఓలలాడామంటే ఇది అపురూపమైన దివ్యావకాశం, మాటలతో చెప్ప నలవి కాని దివ్య మధురానుభూతి. 
విజయ నగరంలో ప్రాంతీయంగా ఉన్న పూర్వ విద్యార్థుల శ్రమ ఫలితంగానే సుదూరంలో ఉన్న వారికి, హైదరాబాదులో నివసిస్తున్న నాకు  యీ సదవకాశం లభించింది.
శ్రీ యుతులు పంతుల జోగారావు, P.V.B.శ్రీరామ మూర్తి, మంగిపూడి వేంకటరమణమూర్తి భాగవతార్, రాళ్ళపల్లి రామ సుబ్బారావు, సోమేశ్వర రావు, రాయప్రోలు సత్యప్రసాద్, KSR మూర్తి, Sista రామకృష్ణ, ప్రాత రాజేశ్వర రావు, అయ్యగారు సుబ్రహ్మణ్యమ్,  R.M.S.శాస్త్రి, మున్నగువారు ప్రణాళికా బద్ధంగా యీ కార్యక్రమానికి రూప కల్పన చేసి నడిపించి కృతకృత్యులయారు. కొందరి పేర్లు నాకు సరిగా తెలియక చెప్ప లేకపోతున్నాను కాని ఇంకా అనేకమంది యీ కార్యక్రమంలో భాగస్వాములై వారి జన్మలు చరితార్థం చేసుకున్నారు. 
వారందరికీ నా హృదయ పూర్వక అభినందనలు.
ఆద్యంతమూ కార్య నిర్వహణలో లొపమన్నదే లేకుండా యీ యజ్ఞాన్ని నిర్వహించ గలుగుట యీ నిర్వాహకుల శక్తియుక్తులకు తార్కాణము.
మరొక ముఖ్యమైన విషయం వింటే ఎవరికైనా ఆశ్చర్యం కలుగక మానదు. అదేమిటంటే
ఆంధ్రామృతం ద్వారా మా అపురూపమైన సమ్మేళన వార్తను చదివి స్పందిస్తూ, మన సాహితీ బంధువు పండిత నేమాని రామ జోగి సన్యాసిరావు గారు నాకు ఫోన్ చేసి, చూడడానికి నేను రావచ్చా అని అడిగారు. లబ్ధప్రతిష్టులైన వారి రాక మాకు అవాంఛనీయమెలాగౌతుంది.
అయ్యో ఎంత మాట? తప్పక రండి. అవకాశముంటే మీరు విరచించిన అధ్యాత్మ రామాయణ ప్రతులు మా పూర్వ విద్యార్తులకు అందచేయడం ద్వారా అది చదివే భాగ్యాన్ని కలిగించండి అని కోరాను.  అంతే వారు విశాఖపట్టణం నుండి కారు కట్టించుకొని మా సమావేశానికి రావటంతో మాలో ఆనందించనివారంటూ లేరు.
సుమారు 100 ప్రతులను ఆసక్తులైనవారిలో కొందరికి మాత్రమే అందజేయగలిగారు. పాపం ఎన్ని ప్రతులను తేగలరు. సరే ఈ ప్రతులు అందనివారు తన సెల్ కు ఫోన్ చేస్తే వారి చిఱునామా తెలుసుకొనిరామాయణ ప్రతిని  తప్పక పంపగలనని చెప్పారు. అత్యద్భుతమైన ఈ రామాయణం ఒక ఉద్గ్రంథము.భక్తిని మాత్రమే మూల్యంగా చెల్లించ గలిగిన వారీ ప్రతులు గ్రహింపనర్హులు అంటూ వారన్న మాటలకు సంతోషించనివారంటూ లేరు.
ఇంతటి నిర్మలాంతఃకరణులైన శ్రీ నేమాని రామ జోగి సన్యాసి రావు గురువులకు పాదభివందనములు తెలియ జేయమన్నారు వారి సహృదయతనుగ్రహించిన నా మిత్రులంతా.
వారికి మాపై గల అవ్యాజానురాగానికి నా కృతజ్ఞతలు తెలియజేసుకొంటున్నాను.
ఈ కార్యక్రమానికి సంబంధించిన ఛాయా చిత్రములను ఈ క్రింది సంకేతంపై క్లిక్ చెయ్యటం ద్వారా చూడ వచ్చును.
సహృదయులైన అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకొంటున్నాను.
జైహింద్.

5, అక్టోబర్ 2012, శుక్రవారం

ప్రభుత్వ మహారాజా సంస్కృత కళాశాల, విజయనగరం, పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనము.

2 comments

జైశ్రీరామ్.
సత్ సంప్రదాయ సాహితీ ప్రియ బంధువులారా!
నేను సన్మిత్రులతో కలిసి, సద్గురుదేవుల సుశిక్షణతో ప్రభుత్వ మహారాజా సంస్కృత కళాశాలలో 1968 - 69  నుండి 1971-72 వరకు భాషా ప్రవీణ అభ్యసించి యుంటిని. ఆ విద్యాభ్యసన సత్ ఫలముగా ఉపాధ్యాయ ఆచార్య పదవులు చేఁబట్టి సుమారు35 సంవత్సరములు బోధనా వృత్తిలో మమైకమై జీవనము విద్యార్థులమధ్య సాగించితిని.2008 జూన్ మాసాంతమున పదవీ విరమణ చేసి యున్న నాకు హృదయంలో చదువుకొనిన నాటి గుర్తులు లీలగా ఊగులాడుతున్నాయి.
ఐతే విజయ నగర వాసులైయున్న మా సతీర్థులు, మిత్రులు కొందరు పూర్వ విద్యార్థుల సమ్మేళనము గురు పూజ అనే మహాద్భుతమైన కార్యక్రమమును తే.07 - 10 - 2012 న  చేయ తలపెట్టి నాకు ఆహ్వానము పంపినారు. ఈ కార్యక్రమము చేయుచున్నారన్నంతనే నామనసు ఎంతగానో పొంగిపోయింది. మాకు జ్ఞాన భిక్షను పెట్టిన అలనాటి గురుదేవులను సేవించుకొనే సద్భాగ్యం నాకూ కలిగినందుకు,  హృదయంలో హృదయంగా మెలిగిన అలనాటి మిత్రులందరినీ ఒకేచోట ఒక్క సారి కలుసుకొనే భాగ్యం కలిగినందులకూ నాకెంతో ఆనందంగా ఉంది.ఈ మహదానందాన్ని నాలో దాచుకోలేక మీకూ పంచుతున్నందుకు నన్ను అన్యధా భావించకండి.
ఏ జన్మాంతర సద్గుణాళి ఫలమో యీ జన్మలో కల్గెనే!
తేజోరాశిగ నిల్చిలట్టి గురులన్ దీపించు జ్ఞాన ద్యుతుల్
రాజా సంస్కృత బోధనాలయమునన్ బ్రఖ్యాతిగా లభ్యమై
మా జన్మల్ తరియింపఁ జేసెను కదా! మా భాగ్యమే భాగ్యమౌన్.
మేమీ ప్రాంగణమందు సంచరిలుచున్ మేలైన సద్భావికిన్
నీమంబొప్పగ విద్య నేర్చితిమి సన్మిత్రాళితో గూడి. మా
క్షేమంబెప్పుడు చూచినారు గురువుల్, శ్రీశేషశాయాదులున్.
మేమాస్దద్గురు పాదదర్శనమునన్ మేల్గాంచగా కోరుచున్----
సోమేశ్వరాది మిత్రులు  -  ప్రేమామృత మొలుక మరల విద్యాజననిన్
మేమెల్లఁ గలియఁ బిలిచిరి  -  క్షేమంబులు తెలియ, గురుల సేవింప నటన్.
ప్రభుత్వ మహా రాజా సంస్కృత కళాశాల ప్రాంగణము.
ప్రభుత్వ మహా రాజా సంస్కృత కళాశాల ముఖ ద్వారము.
విద్యార్థులకు అన్నార్తిని పోకార్చే శ్రీసింహాచలవరాహ లక్ష్మీ నారసింహస్వామి దేవస్థానముసత్రవు.
కళాశాలలో తీర్చి దిద్దఁబడిన కొందరు సాహితీ మూర్తులు
అలనాడచ్చట విద్య నేర్చితిమి.  స్నేహార్ద్రంపు చిత్తంబులన్
నిలిచెన్ బ్రేమ సుమాధురుల్. గతములన్ నేడిట్లు మేల్కొల్పుచున్
కలగా నిల్చిన నాటి గుర్తు లెదుటన్ కన్పించు నన్నంతనే
తులలేనట్టి ముదంబు తోడ నెదయే తూలెన్ మనోజ్ఞంబుగా.
ఎంతట తెల్లవారునని, ఎప్పుడు మిత్రులఁ జేరుదంచు క
వ్వింతలతోడ నామనసు వేగిరపెట్టుచు నుండె నద్దిరా!
ఇంతటి లౌల్యమా మదికి? ఏమని చెప్పుదు నాటి మిత్ర, స
ద్భ్రాంతిగ నిల్చినట్టి గురుపాద సుదర్శన భాగ్యమెన్నుచున్.
సరే ఇంత వయసొచ్చినా నా ఆరాటంమాత్రం అంతా యింతా కాకపోవటం నాకు వింతగా ఉన్నా ఇది మాత్రం యదార్థం. సరే ఎల్లుండి జరుగబోయే మాపూర్వ విద్యార్థుల సత్సమ్మేళనము గురుదర్శనానుభూతి మున్నగు విషయములను నేను ఈ కార్యక్రమానంతరం పంచగలను. విజయనగరం వెళ్ళి వస్తానండి మరి. నమస్తే.
జైహింద్.

3, అక్టోబర్ 2012, బుధవారం

అత్యద్భుతమైన ప్రమాణములతో నిర్వహింపబడుతున్న వేద పాఠశాల

3 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! వేదమును గూర్చి సప్రమాణికముగా నిర్వచించి పలికిన భారాంబ యొక్క ముద్దుబిడ్డయైన ఒక పండితమ్మన్యుల వివరణ వారి మాటలలోనే వినండి. వారు నిర్వహించుచున్న వేద పాఠశాలను గూర్చిన వివరము కూడా తెలుసుకోండి
.http://www.youtube.com/watch?v=5wfCf8-h7hA&feature=relmfu


అత్యద్భుతమైన విషయాలను వేదాలను గూర్చినవి విన్నారు కదా? కర్తవ్యనిర్వహణానురక్తులై మెలకువతో ముందడుగు వెయ్యండి.
శుభమస్తు.
జైహింద్.

2, అక్టోబర్ 2012, మంగళవారం

నేడు గాంధీజీ144వ జయంతి.

1 comments

జైశ్రీరామ్.
అకుంఠిత దీక్షాతత్పర నిరాడంబర గాంధీ.
సోదర భారతీయులారా! ఈ రోజు అక్టోబరు 2వతేదీ. మోహన్దాస్ కరంచంద్ గాంధీ జయంతి. 
తే.02 - 10 - 1869.ని గుజరాత్ రాష్ట్రం పోర్బందర్ లో పుతలీబాయి కరంచంద్ గాంధీలకు జన్మంచి, తల్లి చెప్పే కథలకు ఉత్తేజితుఁడై పరిపూర్ణమైన వ్యక్తిత్వమును సంతరించుకొని, పాశ్చాత్యులచేతిలో బందీయైన మాతృభారతిని శృంఖలా విముక్తురాలిని చేయుటకొఱకు అకుంఠిత దీక్షా తత్పరుడై తన ఆలోచనకు పదును పెట్టి అహింసాయుత కార్య సాధనకు నడుంబిగించి, సత్యాగ్రహము అనే ఆయుధమును కనుగొని, తద్వారా కృతకృత్యుఁడయ్యాఁడు.
తే.30 - 01 - 1948. ని సైద్ధాంతిక విభేదాల కారణంగా నారాయణ ఆప్టే సహకారంతో నాథూరాం గాడ్సే తుపాకీతో కాల్చాఁడంతో గాధీ స్వర్గస్తుఁడయ్యాడు.
భారత జాతిపిత గా, మహత్మగా, బాపూజీగా కీర్తింపఁబడిన గాంధీ సిద్ధాంతాలను వల్లెవేస్తూ మేం గాంధీవాదులం గాంధేయులం అంటూసమాజంలో మనకు అనేకమంది కనిపిస్తూ ఉంటారు.
పైన నిరాడంబరుఁడైన గాంధీజీని ఫొటోలో చూడండి. ఎంత నిరాడంబరుఁడో! 
తన భజముపై ఒక కండువాతో ఉండే గాంధీకి ఒకచోట ఆచ్ఛాదనకు వస్త్రం లేక సిగ్గుతో కుంచించుకుపోతున్న ఒక మహిళ కనిపించింది. గాంధీ ఆమె దుస్థితికి చలించిపోయి తన భుజముపై ఉన్న కండువాను ఆమెపైకి విసిరేసాఁడు. భారత దేశములో గల ప్రజలందరూ సమానంగా వస్త్రాలు వేసుకుంటే ఒక్కొక్కరికి వేసుకోవడానికి అంగ వస్త్రం మాత్రమే లభిస్తుంది అని గాంధీ భావించి, ఆనాటి నుండి అంగవస్త్రం మాత్రమే ధరించేవాఁడు.అంతటి నిరాడంబరునియొక్క, అంతటి ఆదర్శజీవి యొక్క జీవితం నుండి గ్రహించవలసిన సల్లక్షణాలకు అంతేది? వాటిని గ్రహించి ఆచరించగలిగే సాహసమేది మనలో? ఈ గాంధేయులలో.
ఆ మహాత్ముని సిద్ధాంతాలలో మంచి ఉన్నది అనుకుంటే గ్రహించి ఆచరించే ప్రయత్నం చేయటం మన కర్తవ్యం. అతనికి ఒక పూలమాలవేయటంతోనో, ఘన నివాళులర్పించటంతోనో మన బాధ్యత తీరిపోయింది అనుకుంటే ఆపని మాత్రం ఎందుకు చేయాలి? వద్దు. లోకాన్ని మభ్యపెట్ట వద్దు. చేస్తే మనస్ఫూర్తిగా గాంధీ ఆదర్శాలను ఆదరించి, అనుసరించి ఆచరించ గలగాలి. అదే సరైన నివాళి గాంధీజీకి.
జై హింద్.