గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, సెప్టెంబర్ 2023, గురువారం

శ్రీ యాదాద్రి లక్ష్మీనృసింహ శతకము 75వ పద్యము .... రచన. చింతా రామకృష్ణారావు. గానం. శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్.

75. ఓం సర్వమంత్రైకరూపాయ నమః.

ఉపేంద్రవజ్ర గర్భ సీసము.  

అచ్యుతాత్ముండ! మురారి! నీ సాటి ప్ర - మోద దాతల్ సత్వపూర్ణ తేజు

లిద్ధర నింక మరేరి చూడంగను? - మా మహేశా! నీవె మాకు దిక్కు.

ఇంపుగా నీవు చరింపుమా మా మది - శాంతరూపా! మాకు శాంతినిమ్ము.

శాంతంబు నీయ తరింతుమయ్యా! సుఖ - దా! యనంతా! వరదాయి నృహరి!  

గీ. వాసిగనుపేంద్ర వజ్రస్థ సీసవాస! - యీప్సితములిచ్చు  *సర్వమంత్రైకరూప*!

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

75 సీస గర్భస్థ ఉపేంద్రవజ్ర. ( గగ  ..  యతి 8)  

మురారి నీ సాటి ప్రమోద దాతల్

మరేరి చూడంగను? మా మహేశా!

చరింపుమా మా మది శాంత రూపా!

తరింతుమయ్యా! సుఖదా! యనంతా!

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! భూమిపై నీవలె ప్రమోదమును కూర్చు దాతలు మరి

కానరారు. మా దైవమా! మాకు దిక్కు నీవే. మా మనస్సులలో ఇంపుగా సంచరింపుము. శాంత రూపా! మాకు శాంతిని

ప్రసాదింపుము. అప్పుడు మేము తరించ గలము. ఉపేంద్ర వజ్రవృత్తము గర్భమందు కలిగిన సీసవాసా!

సర్వమంత్రైకరూపా! మా ఆర్తి పోకార్పుము.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.