గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

28, జూన్ 2011, మంగళవారం

ENV రవి కృత కూప బంధ ఆటవెలదులు.

0 comments

కూపబంధము లో గౌరీ, వాణీస్తుతులు.

గౌరీస్తుతి:
ద్రిరాజసూన అమ్బురుహానన
ర్కదీప్తిశోణ అమిత కరుణఁ
నన్ను గావుము హరిణవిశాలలోచనా
నమ్మి గొలుతు ప్రీణనము పనుగొన.





వాణీస్తుతి: 
వ్యయీనిధాన అమ్బురుహానన
అబ్జపీఠు జాణ అమిత కరుణఁ
నన్ను గావుము హరిణవిశాలలోచనా
నమ్మి గొలుతు ప్రీణనము పనుగొన.

చూచారా! మన రవి ఎంతటి సునాయాసంగా ఆటవెలదులను కూపబంధం చేసాడో! ఇటువంటి వినూత్న ప్రయోగాలు ఇంకా ఇంకా చేస్తూ సాటి రచయితలకు కవులకూ ఉత్తేజేత్సాహ కారకుడు కాగలడని ఆశిద్దాం.

జైశ్రీరాం.
జైహింద్.

26, జూన్ 2011, ఆదివారం

ENV రవి కృత తిలక బంధ ఆట వెలది తిలకిద్దామా?

2 comments

ఆ. వె ||

వేంకటేశ! శరణు! రమా వినుత! శుభద!
వేంకటేశ! శమము గూర్పు విబుధవరద!
వేంకటేశ! సురభి రూప వేద వేద్య!
వేంకటేశ! సురభిరూప వేద వేద్య!

లక్షణం ఇలా ఉందండి. (తెలుగులో చిత్రకవిత - గాదె ధర్మేశ్వరరావు గారు పేజి 456)

మధ్యే శ్లిష్టం పదం జ్ఞేయం పార్శ్వయోశ్చ పదద్వయమ్ |
కోణయో రక్షరం శ్లిష్టం తిలకం బన్ధసున్దరమ్ ||


చాలా గొప్ప ప్రయత్నం కదండీ. చాలా బాగుందికదండీ? 
చిరంజీవి రవికి నా అభినందనలు.
జై శ్రీరాం.
జైహింద్.

21, జూన్ 2011, మంగళవారం

కవితలో నారికేళ పాకంలోను, స్వయం పాకంలోను దిట్ట మన కవిసామ్రాట్.

7 comments

ఆంధ్రామృత పాన లోలులారా! చూచారా మన కవిసామ్రాట్ ని?  కనిపించాఁడు కాబట్టి అతనితో ప్రస్తావించడానికి తెగిస్తున్నాను.

ఆ.  విశ్వ నాధుఁడైన పృథ్వీశు రాముని,
కల్పవృక్షమందు గాంచ చేసి,
కవి వతంసు లెన్న కమనీయ కావ్యాన
వెలుగు చుంటివయ్య విశ్వనాధ.

చ. భరమగు నారికేళ పరిపాక కవిత్వ సుధా పయోధిగా
గురుతరమైన రామ కథ కోరి రచించిన భాగ్యశాలివే.
స్తిరముగ కీర్తి చంద్రికలు చిందులు వేయుచు భూ నభంబులన్.
సురుచిరమై వెలుంగును. విశుద్ధ కవిత్వ ఝరీస్వరూపుఁడా!

ఉ. పాకము నారికేళమది బ్రహ్మయు మెచ్చు విధాన గొల్పుటన్
నీకిక సాటి లేరనుట నిక్కము. కాంచగ చిత్రముల్. స్వయం
పాకము లోన కూడ సరి వారలు గల్గిరె? యన్న యట్లు యీ
లోకులు మెచ్చుతీరున సులోచన మైనను లేక చేయుదే?
( సులోచనము=కళ్ళజోడు)
ఆ. మనుమరాలు నేర్వ మహనీయ మగు వంట
చేయుచుంటి వీవు చేవ చూపి.
కవులు నేర్చునట్లు కల్పవృక్షము వ్రాసి
అంద జేసి తీవు విందు చేయ.
నశ్యం పండిత లక్షణం.
ఉ. నశ్యము పీల్చు పండితులు. నశ్యము కాని కవిత్వ సృష్టిచే
నశ్యము పీల్చ నీకగును నాసరి పండితు లేరటంచు. నీ
వశ్యము వాణి. పల్కెడిది బంగరు పల్కయి కావ్య రూపమై
దృశ్య కవిత్వమై పఱగు. దివ్య కవిత్వ విశిష్ట తేజుఁడా!
విశ్వ నాథ మనకు ఎదురుగానే ఉన్నారు కదా! మీరూ మీ అభిప్రాయాలను పద్యంలో గాని, గద్యంలో గాని తెలియ జేయండి.
జైశ్రీరాం.
జైహింద్.

16, జూన్ 2011, గురువారం

మద్రాసులో గల ఘంటసాల వారి ఇంటికి షష్ష్తి పూర్తి.

2 comments

త్యాగరాజు నగర్ మద్రాస్ లో నూతన గృహమును నిర్మించిన గానగంధర్వుడు శ్రీ ఘంటసాల వేంకటేశ్వర రావు గారు 21-4-1951 వ తేదీన  ఆ గృహ ప్రవేశం చేసారు. ఆ గృహానికి షష్ష్తి పూర్తయింది.
ఇప్పడా గృహం ఏ స్తితిలో ఉందో యేమో!
వారి వారసులే అందు నివసిస్తూ ఉంటే మాత్రం వారికి ఆంధ్రామృతం అభినందనలు తెలియ జేస్తోంది.
జై శ్రీరాం.
జైహింద్. 

4, జూన్ 2011, శనివారం

యది హాஉస్తి తదన్యత్ర, యన్నేహాஉస్తి న తత్ క్వచిత్!

5 comments

పాఠకావతంసులారా!
మహాభారత ప్రాశస్త్యమును భారతమున కవి వివరించి యున్నారు. 
మీరూ పరికింపుఁడు.
శ్లో:- 
ధర్మేచాஉర్థేచ కామేచ మోక్షేచ భరతర్షభ!
యది హాஉస్తి తదన్యత్ర, యన్నేహాஉస్తి న తత్ క్వచిత్!! (మహా భారతం)
క:-
ధర్మార్థ కామ మోక్షము
లర్మిలి భారతము చెప్పె నవియే కనగా
పేర్మిని పేర్కొని రితరులు.
ధర్మము లిట లేని వెచట తలపఁగ లేవోయ్!
భావము:-
ఓ భరత  శ్రేష్ఠుఁడా! ధర్మ, అర్థ, కామ, మోక్షములనే చతుర్విధ పురుషార్థములను బోధించే వచనములు ఏవి యీ భారతమున ఉన్నవో అవే సమస్తమైన ఇతర గ్రంథములలోను ఉన్నవి. ఇందు లేనివి మరెచ్చటను లేవు. 
చూచారు కదా!
జీవితంలో ఒక్కసారైనా సంస్కృత భారమగు జయమును కాని, కవిత్రయ భారతమును కాని, కడకు మూలానువాదమగు తెలుగు  వచన భారతమును కాని చదివి, పైన చెప్పిన విషయమునందలి ఔచిత్యమును గ్రహింతుము గాక.
జైశ్రీరాం.
జైహింద్.