గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

5, అక్టోబర్ 2022, బుధవారం

యదా భూతపృథగ్భావ - ...13 - 31...//..... అనాదిత్వాన్నిర్గుణత్వా - , , .13 - 32,,,//...త్రయోదశోధ్యాయః - క్షేత్రక్షేత్రజ్ఞవిభాగయోగః

0 comments

 జైశ్రీరామ్. 

|| 13-31 ||

శ్లో.  యదా భూతపృథగ్భావమేకస్థమనుపశ్యతి|

తత ఏవ చ విస్తారం బ్రహ్మ సమ్పద్యతే తదా.

తే.గీ.  మానవుండెప్పుడందరిన్ మనెడు వాడు

దైవమొక్కడంచెరుగునో  తత్వమరసి,

యతడెపో జ్ఞాని, బ్రహ్మం బునతడె చేరు.

పార్థ! నీవిది గ్రహియించి పరవసించు.

భావము.

ఎప్పుడైతే(మానవుడు)వేరు వేరుగా కనిపించే ప్రాణికోటి ఏకత్వము మీద

ఆధారపడి ఉన్నదని, అక్కడినుండే విస్తరించిందని నిరంతరము 

చూడగలుగుతాడో అప్పుడు బ్రహ్మాన్ని పొందుతాడు.

 || 13-32 ||

శ్లో.  అనాదిత్వాన్నిర్గుణత్వాత్పరమాత్మాయమవ్యయః|

శరీరస్థోపి కౌన్తేయ న కరోతి న లిప్యతే.

తే.గీ.  ఆది లేనట్టి యా బ్రహ్మ భవ్యయంబు,

దేహమందుండియున్ కర్మ మోహ రహితు

డతడు, కర్మలంటవతనికనుపమాను

డతడె బ్రహ్మంబు గ్రహియించు మర్జునాఖ్య!

భావము.

ఆది లేని వాడు నిర్గుణుడు కనుక, ఈ పరమాత్మ అవ్యయుడు. కౌంతేయా! 

శరీరంలో ఉన్నా అతడు కర్మ చెయ్యడు. ఆ కర్మ ఫలంతో మలినపడడు.

జైహింద్.

4, అక్టోబర్ 2022, మంగళవారం

సమం పశ్యన్హి సర్వత్ర - ...13 - 29...//..... ప్రకృత్యైవ చ కర్మాణి - , , .13 - 30,,,//...త్రయోదశోధ్యాయః - క్షేత్రక్షేత్రజ్ఞవిభాగయోగః

0 comments

 జైశ్రీరామ్.

|| 13-29 ||

శ్లో.  సమం పశ్యన్హి సర్వత్ర సమవస్థితమీశ్వరమ్|

న హినస్త్యాత్మనాత్మానం తతో యాతి పరాం గతిమ్.

తే.గీ.  సమముగా తాను సర్వత్ర నమరు హరిని

సమముగా గను పూజ్యుండు సన్నుతుడిల

తనను హింసించుకొననివా డనగవచ్చు,

పరమగతి బొందు నాతండు, పార్థవింటె?

భావము.

సర్వత్ర సమంగా ఉన్న ఈశ్వరుణ్ణి సమంగా చూసిన వాడే, తనని 

తాను హింసించుకోనివాడు. అతడు దానివలన పరమ గతిని చేరుకుంటాడు.

|| 13-30 ||

శ్లో.  ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః|

యః పశ్యతి తథాత్మానమకర్తారం స పశ్యతి.

తే.గీ.  కలుగువాటికి ప్రకృతే కారణమని

ఆత్మ యేమియు చేయబో దనుచు తలచు

నాతడే జ్ఞాని నిజము నీవరయుమిచట

పార్థ సత్యంబు నెరుగుము భవ్యమతిని.

భావము.

అన్ని విధాలైన కర్మలు ప్రకృతివలననే జరుగుతున్నాయని, ఆత్మ 

ఏమీ చెయ్యదనీ తెలిసినవాడే నిజమైన చూపు కలవాడు

జైహింద్.

3, అక్టోబర్ 2022, సోమవారం

యావత్సఞ్జాయతే కిఞ్చిత్స - ...13 - 27...//..... సమం సర్వేషు భూతేషు - , , .13 - 28,,,//...త్రయోదశోధ్యాయః - క్షేత్రక్షేత్రజ్ఞవిభాగయోగః

0 comments

 జైశ్రీరామ్

|| 13-27 ||

శ్లో. యావత్సఞ్జాయతే కిఞ్చిత్సత్త్వం స్థావరజఙ్గమమ్|

క్షేత్రక్షేత్రజ్ఞసంయోగాత్తద్విద్ధి భరతర్షభ.

తే.గీ.  స్థావరముజంగములనేది జగమునందు

కలదొ క్షేత్రముక్షేత్రజ్ఞులలిని నొప్ఫి

యున్నదేనని యెరుగుము మన్ననమున

పార్థ! నీవింక వినుతించు పథమునందు.

భావము.

భరతశ్రేష్టుడా ! స్థావర జంగమ రూపమగు ప్రాణికోటి ఏదైతే ఉందో అది 

క్షేత్ర క్షేత్రజ్ఞుల కలయిక వలననే పుడుతుందని తెలుసుకో.

|| 13-28 ||

శ్లో.  సమం సర్వేషు భూతేషు తిష్ఠన్తం పరమేశ్వరమ్|

వినశ్యత్స్వవినశ్యన్తం యః పశ్యతి స పశ్యతి.

తే.గీ.  చెడెడివాటిలోనున్నట్టి చెడని తత్వ

మన్ని భూతంబులన్ గల యసమ హరిని, 

చూడ గలిగును యోగియే వాడె ఘనుడు,

పార్థ! గ్రహియింపు మియ్యది భవ్యముగను. 

భావము.

నశించిపోయే వాటిలో నశించని తత్వముగా, అన్ని భూతాలలో సమంగా 

ఉన్నపరమేశ్వరుణ్ణి సమంగా చూసిన వాడే, నిజమైన దృష్టి కలవాడు.

జైహింద్.