గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

30, మే 2011, సోమవారం

దండకం రచించడం సులభమేనా?

3 comments

ప్రియ పాఠకులారా! 
దండకమును మనము సులభముగా వ్రాయ గలమో లేదో అని ఆలోచించి ప్రయత్నించగా ఈ క్రింది విధంగా వ్రాయగలిగి, ప్రత్నం చేయుటకు ఈ శక్తి సరిపోతుందని నమ్ముతున్నాను.
మీరూ ప్రయత్నించి వ్రాసి చూడండి. 
మీకు నచ్చిన అంశమును తీసుకొని, 
అన్నీ తగణములే వచ్చేలా చూసుకొని చివర మాత్రం ఒక గురువునుంచి. ముగించాలని గ్రహించగలరు.
ఇక నేను ప్రథమ ప్రయత్నంలో వ్రాసిన దండకం చూడండి.
దివ్య ఓంకార రూపంబు నీవై ప్రకాశించు మాయమ్మ దుర్గమ్మ. కాపాడ రావమ్మ. నీ భక్త కోటిన్ దయా పూర్ణవై నీవు చూడంగ, లోకంబునన్ వారు క్షేమంబుతో వెల్గు చుండెంగదా తల్లి. నీ ప్రేమచే వారు నిత్యంబు వెల్గొందు. నీనామమే నిత్య పారాయణంబొప్ప చేయన్ గనుంగొంటి నమ్మా! కృపన్ గావ వమ్మా! దయం బ్రోవవమ్మా! ననుం దేల్చవమ్మా! మహోదార దివ్య ప్రభావంబు కల్పించి, నన్నుం గటాక్షించి, నా శక్తినే పెంచి, నీ యుక్తినే పంచి, కావ్యంబు సృష్టించు శక్తిం బ్రసాదించి, కాపాడుమోయమ్మ! లోకంబులో గల్గు దౌష్ట్యంబులెల్లన్ వినాశంబు చేయంగ శక్తిం బ్రసాదించి, నీ భక్త కోటిన్ సదా రక్ష సేయంగ నా లోన నీ శక్తినే నిల్పి, సద్భావనా శక్తి సద్బోధనా శక్తి, సద్భాషణా శక్తి, వాగ్భూషణాసక్తి నా లోన కల్పించి, నన్నుం గటాక్షించి, నా కావ్యమందీవు నిత్యత్వముం బొంది. స్తుత్యంబుగా నిల్చి, ఔన్నత్యమున్ బెంచి, విజ్ఞాన తేజో నిధిం జేసి, అజ్ఞాన మాయల్ విడం జేసి, దివ్యంబుగా వెల్గు దివ్యుం గనం జేసి, దివ్యత్వమున్ గొల్పి, నిత్యంబు నీ నామ పారాయణాసక్తి నా లోన కల్పించి, నీ భక్తు నైనట్టి నన్నున్ మదిన్ నిల్పి ఔన్నత్యమున్ గొల్పి కావంగదే! ఓ లసత్ జ్ఞాన మార్గా! ప్రదుష్టాపవర్గా! దయాపూర్ణ దుర్గా!  నమస్తే నమస్తే నమస్తే నమః.
జై శ్రీరాం.
జైహింద్.

17, మే 2011, మంగళవారం

శరజ్జ్యోత్స్న లో కవివతంస బులుసు తారాడిన క్షణాలు.

4 comments

శరజ్జ్యోత్స్న
ఈ శరజ్జ్యోత్స్న నన్ను బంధించివైచె.
ఔను. కాకున్న కుటిల గాఢాంధకార
పథ విలగ్న మూర్తిని నేను పరమ మృదు శ
శాంక దీధితిలో నెట్లు సాగు చుంటి.
ఈ శర జ్జ్యోత్స్న నాకు కన్పించు మాతృ
దేవతా స్నిగ్ధ దరహాస దీప్తి వోలె
కాక యుండిన యింతట కరుగునే మ
దీయ పాషాణ హృదయమ్ము దీనిని గని.
ఈ శరజ్జ్యోత్స్న నీల కంఠేశ జటల 
పొంగులెత్తిన గంగా ప్రపూరమటుల
నాకు తోచును. కొండ కోనలను కూడ
తాను చైతన్య సీమగా నొనర్చి.
ఈ శరజ్జ్యోత్స్నలో పులకించి పోవు
చుంటి మిర్వురము, కుటీరమంటిఁ బ్రాకు
మల్లికయు నేను, చైతన్య మంజులార్ద్ర
కలిత నిశ్శబ్ద భావ మూర్తులము మేము.
ఈ శరజ్జ్యోత్స్న నాకు ఱేయెల్ల నెన్ని
గీతములు పాడి విన్పించెనో తెలియదు.
మౌన గీతము లవి యెల్ల మఱల మఱల
ఎదను మొదలంట నూపి దహించు నెపుడు.
చూచారా కవి వతంస దివ్యానుభూతిని? మీకూ ఇటువంటి మధుర క్షణాలు దివ్యానుభూతులు సంభవించకపోవటము కాని, అది అక్షర రూపంలో పొంగకుండా ఉండడం కాని జరుగదు. అలా పొంగే కవితామృత ధారకు ఆడ్డుకట్ట వేస్తారెందుకు మీరు? మీ నుండి ఉప్పొంగే కవితకు అక్షర రూపమివ్వండి. ఆంధ్రామృతంగా అందరికీ అందించండి. మొహమాటమెందుకు?
జై శ్రీరాం.
జైహింద్.

15, మే 2011, ఆదివారం

పండిత నేమాని రచిత ఆంధ్ర శివ కేశవం.

1 comments

ఒక శివ స్తుతిచేసే శ్లోకములో ప్రతి నామములోను ఆద్యక్షరమును తీసి వేస్తే కేశవ స్తుతి వచ్చేటట్లుగా ఒక ప్రాచీన కవి వ్రాసిన శ్లోకము చూడండి:
గవీశ పత్రో నగజార్తి హారిః
కుమార తాతః శశిఖండమౌళిః
లంకేశ సంసేవిత పాదపద్మః
పాయాదనాదిః పరమేశ్వరో మాం

అర్థము:
గవీశ పత్రః: నంది వాహనుడు; వీశ పత్రః: గరుడ వాహనుడు 
నగజార్తి హారిః: పార్వతి ఆర్తిని పోగొట్టిన వాడు
గజార్తి హారిః: గజేంద్రుని ఆర్తిని పోగొట్టిన వాడు
కుమార తాతః: కుమారస్వామియొక్క తండ్రి;  మార తాతః: మన్మధుని తండ్రి
శశిఖండ మౌళిః: చంద్రధరుడు;  శిఖండమౌళిః:  శిఖిపింఛము ధరించినవాడు
లంకేశ సంసేవిత పాద పద్మః: రావణునిచేత సేవింపబడు వాడు
కేశ సంసేవిత పాద పద్మః: క (బ్రహ్మ) ఈశ (శివుడు) లచేత సేవింపబడు వాడు
అనాదిః (లేక) నాది(న+ఆది) = ఆదిలేని వాడు (పుట్టుక లేనివాడు/ఆది అక్షరము లేని వాడు)
పరమేశ్వరః: శివుడు;  రమేశ్వరః: విష్ణువు
నన్ను రక్షించును.
దీని భావమును అనుసరించి నేను చెప్పిన పద్యమును చూడుడు:
త్రిభువనాధీశ్వరుడు నగజ భయహారి
ప్రస్తుత దయానిధి గవీశ వాహనుండు
సారస పదయుగళుడు కుమార తాత
యగు ననాదిని పరమేశు నాత్మ దలతు
స్వస్తి.
పండిత నేమాని.

చూచారు కదండీ.
మీరూ ఇటువంటివి వ్రాసినట్లైతే ఆంధ్రామృతం ద్వారా వెలుగులోకి తేగలరు.
జైశ్రీరాం.
జైహింద్.

9, మే 2011, సోమవారం

పండిత నేమాని కృత "మాతృ వైభవం" దండకం.

1 comments
మాతృ వైభవం. 
పండిత నేమాని 
మాతృ దినోత్సవం సందర్భంగా 
భరత మాత వైభవాన్ని వర్ణిస్తూ చెప్పిన దండకం.

జయ జయ జనయిత్రి! శ్రీ భారత క్ష్మాధినేత్రీ! సదా సస్య సంపన్న సౌవర్ణధాత్రీ! జనానీక సంక్షేమ సంభావితార్థ ప్రదాత్రీ! సుగాత్రీ! మహోత్తుంగ శృంగాఢ్య శీతాద్రి వింధ్యాద్రి ముఖ్యాద్రి వర్యాంఘ్రి సామీప్య రమ్యాటవీ మధ్య సంజాత భాగీరథీ సింధు గోదావరీ ముఖ్య భవ్యాపగా తీర శోభాయమాన ప్రశాంతామలారామ రాజత్తపోభూ ప్రభావ ప్రభా భాసితాంగీ! శుభాంగీ!
సదా ధర్మ సంరక్షణోద్యోగ తాత్పర్య గంభీర భావాంకితాత్మ ప్రజానీక సంక్షేమ ధౌరేయ శ్రీరామ భూమీశ కౌంతేయ ముఖ్య క్షమానాథ శౌర్య ప్రతాపాది సల్లక్షణోద్భాసితానంత కీర్తీ! మహోదాత్త చారిత్ర సంతాన బాహుళ్య సంశోభితానందమూర్తీ!
శ్రీవిక్రమాదిత్య హర్షాధిపాశోక శ్రీకృష్ణరాజేంద్ర ఝాన్సీ శివాజీ ప్రధానాశయ స్థాపితోత్కృష్ట ధర్మార్థ వత్సంప్రదాయాన్వితా! విశ్వ విఖ్యాత వేదాంత విజ్ఞాన సంగీత సాహిత్య వాణిజ్య ముఖ్యాఖిలోద్యోగ నైపుణ్య రత్నావళీ భూషితా! నిత్య సంతోషితా!స్వాతంత్ర్య సంగ్రామ సీమోచితోత్సాహ ధైర్య ప్రకాశాఢ్య సత్యాగ్రహాద్యాయుధోపేత గాంధీ మహాత్మాది ధన్యాత్మ సంపాదితాపూర్వ సౌభాగ్య సంపద్విశేషాన్వితా! రమ్య వర్ణత్రయోద్గీత సద్భావ సంకేత సంయుక్త చారుధ్వజా! సుప్రజా!లోకవిఖ్యాత ప్రద్యోత ప్రజ్ఞామయానేక ధీర ప్రజానాయక శ్రేణి సంవర్ధితాశేష ఖండాంతర వ్యాప్త సౌభ్రాత్ర సౌహార్ద భావాంచితా! లోక సంపూజితా! జ్ఞాన వైరాగ్య భక్త్యాది సన్మార్గ వైవిధ్య సంశోభితా! సాధు సంభావితా! దివ్య తేజోన్వితా! భారత క్ష్మా మహా దేవతా! శాంతి సౌభాగ్య సంపన్మహా పారిజాతా!నమో వేద భూమే - నమః పుణ్య భూమే - నమో ధర్మ భూమే - నమో ధన్య భూమే - నమో వీర భూమే -
నమో మాతృ భూమే -

నమస్తే - నమస్తే - నమస్తే - నమ:. 
జైశ్రీరాం.
జైహింద్.

8, మే 2011, ఆదివారం

మాతృ దేవో భవ. మాతృ మూర్తులందరికీ శిరసు వంచి పాదభివందనం చేస్తున్నాను.

8 comments


సుమధుర భావనామృత సుశోభిత మాతృ హృదంతమ్మదో
మమతల మందిరమ్ము, తరమా పరమాత్మకునైననిట్టి త్యా
గమయ ప్రజానురంజనము? గౌరవ కల్పక కల్పకమ్మదే.
సమరస భావ శోభితము. సంతత సంతతి యోగ దాయి తాన్.

తల్లిని మించు నట్టి పర దైవము లేదిల సృష్టి నెందు. రా
గిల్లుచు, ముద్దు పెట్టుకొను, క్షేమము కోరును. దైవ సన్నిధిన్ 
జల్లగ కావుమంచు మనసార పదింబది మ్రొక్కు చుండు. నా
తల్లి పదాబ్జముల్ శిరము తాకి నుతింతును భక్తియుక్తునై.

తల్లి పాలు త్రాగి తనువును పెంచిన
ధర్మవృత్తి నున్న తనయుడెపుడు
తల్లి ఋణము తీర్చ తహ తహ పడునయ్య!
తల్లి కన్న గొప్పదైన దేది ?

మల్లె మరిమళమ్ము, మహనీయ కస్తూరి,
ఘనత కన్న యట్టి కప్పురమ్ము
తల్లి ఘనతఁ బోల తహ తహ పడునయ్య!
తల్లి కన్న గొప్పదైన దేది ?

తల్లి దండ్రి లేని దైవంబు భూమిపై
తల్లి ప్రేమ గ్రోల తనయుఁడగుచు
పుట్టు చుండె కాదె పొంగుచు పలుమార్లు.
తల్లి కన్న గొప్ప దైన దేది ?

మా అమ్మగారు దైవాంశ సంభూతురాలైన చింతా వేంకట రత్నం పాదారవిందములకు ప్రణమిల్లుతూ,
దైవాంశ విరాజితులైన పుడమిఁ గల మాతృ మూర్తులందరికీ శిరసు వంచి పాదభివందనం చేస్తున్నాను.
మాతృ దేవోభవ.
జై శ్రీరాం.
జై హింద్.

7, మే 2011, శనివారం

వేసవి శిక్షణా శిబిరాల ద్వారా మన సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతిబింబాలౌతున్న చిరంజీవులు.

1 comments

వేసవి శిక్షణా శిబిరము(సమ్మర్ కేంపు)లద్వారా మన సంస్కృతీ సంప్రదాయాలను మన చిరంజీవులకు వివిధ కళలలో శిక్షణను ఇవ్వడం,ఇప్పించడం ద్వారా వారిలో మనో వికాసం, తద్వారా ఆత్మ విశ్వాసం పెంపొందించ వచ్చు. చక్కని భావి భారత పౌరులుగా తీర్చి దిద్ద వచ్చు.
వివిధ సాంఘిక సంక్షేమ సంస్థలు వేసవి తాపానికి మూలకు చేరకుండా, వేసవి తాపాన్ని మరిపిస్తూ, పిల్లకూ, పెద్దలకు కూడా వేసవి శిక్షణా శిబిరాలు నిర్వహిస్తూ, తద్వారా భారతీయ అపురూప సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే కళలలో శిక్షణ నిప్పించడం చేస్తే బహుళ ప్రయోజనకరంగా ఉంటుంది. 
ఇప్పటికే ఇలాంటి కార్యక్రమాలు చేపట్టిన మహానుభావులనేకమంది ఉన్నారు. వారందరికీ నేను హృదయ పూర్వకంగా అభినందిస్తూ, అంజలిస్తున్నాను.
పిల్లలు నిరుపయోగమైన టీవీ సీరియల్స్ కు అతుక్కు పోయే ప్రమాదం ఈ సమ్మర్ లో చాలా ఎక్కువగా ఉంటుంది.
అట్టి ప్రమాదం నుండి తమ పిల్లలను కాపాడుకోవడానికి తల్లిదండ్రులు తప్పక ఇటువంటి వేసవి శిక్ష్ణా శిబిరము(సమ్మర్ కేంపు)లలో చేరేందుకు తమ పిల్లలను ఉత్సాహ పరచాలి. 
దయ చేసి తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కొన్ని స్వార్థ చింతనలకు స్వస్తి పలకాలి. తమ పిల్లలు భావి భారత పౌరులు. బాధ్యతా యుతమైన పౌరులుగా మీ పిల్లలు సిద్ధమవాలంటే అది తల్లిదండ్రుల, సామాజికుల, ఉపాధ్యాయుల, తోటి బాలుర క్రమశిక్షణపైన ఆధార పడి ఉంటుంది.మనయొక్క క్రమశిక్షణ, మనము  పిల్లలకు నేర్పుతున్న క్రమ శిక్షణ పైనా ఆధారపడి ఉంటుంది.
ముందు మీరు ఏహ్యమైన టీవీ సీరియల్స్ కు తప్పక   దూరంగా ఉండి, పిల్లలను సక్రమ మార్గంలో నడిపిస్తారు కదూ?
నా మాట మన్నిస్తున్నందుకు మీకు నా ధన్యవాదములు. మీ పిల్లలు ఆదర్శవంతమై భావి భారత పౌరులుగా తయారయి, మీకు, మీ కుటుంబానికి, వారుంటున్న సమాజానికి, మాతృ దేశానికీ తప్పక మంచి పేరు తేవాలని ఆశిస్తూ, నా ఆశలు పండాలని కోరుకొంటున్నాను.
జైశ్రీరాం.
జైహింద్.

కాలేజీ గడియారమా పద్యాలు.కవి కీ.శే. భోగరాజు నారాయణ మూర్తి గారు.విజయనగరం(1889-1944)

2 comments


ప్రత్యక్ష రాఘవము కావ్యకర్త ఐన కీ.శే. భోగరాజు నారాయణ మూర్తి గారు విజయనగర సంస్థానాస్థాన కవి. విజయనగరం మహారాజ కాలేజీ హైస్కూలులో తెలుగు పండితులుగా ఉండేవారు.
మహారాజ కాలేజీ గడియారం సరిగా పని చేయకపోవడంతో  వారానాడు వ్రాసిన పద్యాలివి
శా. తైలాభ్యంగన వాంఛ కల్గినదొ? వృద్ధత్వంబు సిద్దించుటో
నీలోనన్ జవసత్వముల్ తొలగెనో?నిక్కంబెరింగింప కీ
వేలా నిత్యము వక్రగామివయి మమ్మీలీల బాధింతువో
కాలేజీ గడియారమా! గమన వక్రత్వంబు వర్జింపుమా!
శా.  కాలంబెప్పుడు నొక్కరీతిని  చనంగా బోవదన్నీతి మీ
రాలోకింపు ” డటంచు తెల్పెదె యుపాధ్యాయాళికిన్?! నీతిశా-
స్త్రాలెన్నేనియు  మేమెరుంగుదుము నీడంబంబులన్ మానియో
కాలేజీ గడియారమా! గమన వక్రత్వంబు వర్జింపుమా!
శా. ఆలోకింపగ మేము వేళ కిటు రాకాలస్యమౌచుంటకున్
మూలంబీవె యటంచు నెంచక నయమ్మున్ బెట్టు చీవాట్లకుం
బాలై మా యధికార్ల దృప్తుల నొనర్పం జాల కున్నారమో
కాలేజీ గడియారమా! గమన వక్రత్వంబు వర్జింపుమా!
శా. ఏలా జూపెదు తప్పు వేళలను నీవీలీల ? నీ వేళనే
వేళం జూపక మౌసమూను మని మా విజ్ఞప్తి ! మాకున్న వా-
చీలా ధ్వంసము కాక యుండు! బయిగా చీవాట్లు లేకుండు ! నో
కాలేజీ గడియారమా! గమన వక్రత్వంబు వర్జింపుమా!
శా. కాలజ్ఞుల్ గ్రహతారకాది గతులన్ గన్‌పెట్టి వాక్రుచ్ఛి యే
కాలంబందును నీగతి క్రమములన్ గన్‌పట్టగాలేక, శా-
స్త్రాలెల్లం దిరుగంగవేయుచు బ్రయాసంబొందుచున్నార లో
కాలేజీ గడియారమా! గమన వక్రత్వంబు వర్జింపుమా!
శా. నీ లీలల్ మరి నీ గతిక్రమములున్, నిత్యంబు వీక్షింపగా
మాలో కల్గిన సంశయంబు తొలగింపన్నిన్ను ప్రార్థించెదన్
వాలాయంబుగ నీకు వావికల గంటస్తంభమేమౌనొ ? యో
కాలేజీ గడియారమా ! గమన వక్రత్వంబు వర్జింపుమా!
శా. పోలంగా దొలినాడె నీదు గమనంబున్ బెట్టుకొన్నట్టి వా-
చీలం జూచుచు వేళ యున్నదని నిశ్చింతం బయల్దేరి రా
నాలో నక్కట సంతకాల కడ ప్రత్యక్షంబు లేట్మార్కుతో
కాలేజీ గడియారమా ! గమన వక్రత్వంబు వర్జింపుమా!
శా. ఆలిందూలుచు, కోటగంట పది పైనయ్యెంగదాయంచు, చే
గాలంగా దిని, వేగ ప్రేవులు తెగంగా వచ్చి నిన్ జూచినన్
నీలోనన్ పదియైన గాదుకద, మా నిర్భాగ్యమేమందుమో
కాలేజీ గడియారమా ! గమన వక్రత్వంబు వర్జింపుమా!
శా. ఆలోకించిన మందగామి వగుదీవప్డప్పుడుద్వేగమౌ
కేళిన్ సల్పెదొకొక్క యప్పుడిది నీ ” కీ ” లోపమో?! తైల మం-
దే లోపంబొకొ? మాదు జాతకములందే లోపమో తెల్పుమా!
కాలేజీ గడియారమా ! గమన వక్రత్వంబు వర్జింపుమా!
శా. నీ  లీలాగమన ప్రభావములు వర్ణింపంగ నా శక్యమే?
లోలత్వంబున నీవు మమ్మమెరికాలో జేర్చి యూరోపు ఖం-
డాలం ద్రిప్పి స్వదేశమందు దిగ బెట్టంగల్గు చున్నావహో
కాలేజీ గడియారమా ! గమన వక్రత్వంబు వర్జింపుమా!
శా. పోలన్ సృష్టిని దేహధారులకు నెప్డున్ లేని స్వాతంత్ర్యముల్
మాలో కల్గునె? యెప్పుడే కరణి రామస్వామి నంద్రిప్పునో
యాలీలం జనుచుందు ” నందు విది హాస్యంబో నిజంబో కదా !
కాలేజీ గడియారమా ! గమన వక్రత్వంబు వర్జింపుమా!
శా. ఏలం గల్గితి వింత కాలమును మమ్మేకాత పత్రంబుగా
జాలున్నీవిక పింఛినీ గొనుము, తత్సందర్భమందేము చం-
దాలం గూర్చి యొనర్తుముత్సవము నుత్సాహంబుతో నీకు నో
కాలేజీ గడియారమా ! గమన వక్రత్వంబు వర్జింపుమా!
ఎంత అలవోకగా ఎంతటి అద్భుతమైన పద్యాలు రచించే శక్తి ఆనాటి కవులకెంతగా ఉండేదో చెప్పడానికి ఈ మహా కవి భోగరాజు నారాయణమూర్తి గారు రచించిన  పై పద్యాలే తెలియ జేస్తున్నాయి.
వీరు రచించిన ప్రత్యక్ష రాఘవము కావ్యము కూడా చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ విషయాన్ని ఇంతకు పూర్వం మనం ఆంధ్రామృతంలో ఉంచిన రామదాసు పద్యాలు చదివితే తెలుస్తుంది.
జైశ్రీరాం.
జైహింద్.

5, మే 2011, గురువారం

శ్రీ భోగరాజు నారాయణ మూర్తి కవి గారి ప్రత్యక్ష రాఘవము కావ్యమున రామదాసు పలుకులు.


 bhakta rAmadAsu
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం  ప్రాంతం వారయిన శ్రీ భోగరాజు నారాయణ మూర్తి కవి రచించిన ప్రత్యక్ష రాఘవం అనే పద్య కావ్యం అత్యంత అపురూపమైన రచన అని ఆ కావ్యం పఠించే వారికి అర్థమౌతుంది. 
భక్త రామదాసుగా ప్రసిద్ధి పొందిన శ్రీ కంచర్ల గోపన్నగోల్కొండ నవాబుల పాలనలో  తహసీల్దారుగా ఉన్న సమయంలో భక్తి పారవశ్యంతో చేపట్టిన భద్రాచల రామాలయ నిర్మాణం కొఱకు ప్రభుత్వ ఖజానా నుండి కూడా నిధిని వెచ్చించినందున ప్రభుత్వము విధించిన శిక్షను శారీరకముగా అనుభవిస్తూ, అది భరించ లేక ఆ శ్రీరామ చంద్ర మూర్తికీ, సీతమ్మకూ, హృదయం ద్రవించేలా మొర పెట్టుకొన్నాడు. 
ఆ సందర్భంలో శ్రీ భోగరాజు నారాయణ మూర్తి కవి రచించిన "ప్రత్యక్ష రాఘవము" పద్య కావ్యంలో నాల్గవ ఆశ్వాసంలోని పద్యాలు చూస్తే పాషాణ హృదయులకు సహితం హృదయం ద్రవించక మానదు.
ఆ పద్యాలు మీరూ చూడండి.
ఉ:-
శ్రీ రఘురామ చింతనము సేయగ నీ పదిరెండునాళ్ళు నీ
కార మహోపకార మగుఁ గాకని నమ్మిన విప్ర వర్యుఁ డా
క్రూరుల దుష్ట చేష్టలకుఁ గ్రుంగిన చిత్తముతోడ తా మహో
దార దయా సుధా శరధి దాశరథిన్ స్మరియించె నీ గతిన్.
మ:-
అలనాడక్కడ కోశ విత్తమున దేవాగార నిర్మాణమున్
సలుపన్ వచ్చు నటంచు స్వప్నమునఁ బ్రోత్సాహంబు కల్గించియున్
దొలుతం దొంగకుఁ దల్పులం దెఱచి తోడ్తోనం దొరన్ లేపున
ట్లలుకన్ రేపితివా నవాబులకు నాయం దీవు? రామ ప్రభూ!
చ:-
ప్రభువులకుం బరాకది స్వభావమ దేవరవా రయోధ్యకున్
బ్రభులయి మున్ను రాజ్య పరి పాలనమున్ వెలిగించినారు. నా
కభయమొసంగుటల్ మరచు టబ్రమె? నన్గృపనేలి మీ రఘు 
ప్రభులకు నీ కళంకమును బాఁపగ రాదె రఘుప్రభూత్తమా! 
ఉ:-
ప్రాకృత పాప కర్మమిది. పాపఁగ రానిది కాన నిట్లు భూ
లోకమునందె నాకు యమ లోకపు శిక్షలు గల్గఁ జేసి, స్వ
ర్లోక మొసంగ నెంచితివొ? రూఢిగ నీ చరసాల నీ దయా
లోకమొ? లేక దుర్నయ విలోకమొ? సంశయమయ్యె రాఘవా!
శా:-
నా భక్తుండిటు నా నిమిత్తమున నానా దుర్భర క్రూర శి
క్షా భార వ్యధలొందుచుండె నని లేశంబున్ విచారింప వీ
క్షోభల్వాయు తెఱంగు సేయవు.దయా శూన్యుండవై యిట్లుపే
క్షాభావంబున నూరకుండుట మహాశ్చర్యంబు రామ ప్రభూ!
సీ:-
వజ్రాల పతకంబు వైచితి నేను. నీ - మనసు వజ్రంబుగా మార్చితీవు.
రమణీయ మణి కంకణముల నుంచితి నేను. - నాకు సంకెల లుంచినాడ వీవు.
దేవాలయమ్ము ప్రతిష్ఠ చేసితిని నేను. - జెఱసాల నాకు నేర్పఱచితీవు. 
నిత్య నైవేద్యముల్ నిర్ణయించితి నేను. - నెంగిలంబలి నిర్ణయించితీవు.
గీ:-
దైవమవొ? ప్రభుఁడవొ? లేక నీవు నాకు
రాముఁడను పేర వెలసిన రాక్షసుఁడవొ?
యెవఁడవని యింక నిన్ను భావింతునయ్య?
ననుఁ గనుబ్రామినావయ్య. నల్లనయ్య.
సీ:-
నిఖిల దేవాలయ నిర్మాణములకయ్యె - మొత్తమ్మునన్నూట మూఁడు వేలు.
ప్రాకార గోపు రారామదులకునయ్యె - నించుమించుగ తొంబదేడు వేలు.
మంటప ప్రాసాద మహనీయ వాహనాం - దోళికాదులకయ్యె నూరు వేలు.
సంప్రోక్ష ణోత్సవాచార నిర్వహణమ్ము - నకునయ్యె నరువది నాల్గు వేలు.
గీ:-
వరుస మీ మువ్వురకు జవాహరీకి 
నయ్యె రెండు లక్షల ముప్పదారు వేలు.
వెరసి యార్లక్షలయ్యె నీ విత్తమెల్ల
నెవని తాత గడించిన దినకులేంద్ర?
ఉ:-
చేరిచినాడ నిన్నుఁ గడుఁ జీర్ణ కుటీరము నుండి వైభవో
దార వినూత్న హర్మ్యములఁ దమ్మునితోఁ బ్రియ కాంతతో నలం
కార సమగ్ర విగ్రహునిగా నొనరించితి నిట్టి నన్ను నీ
వారసి ప్రోవవిప్పుడిదెరా! నడుమంత్రపు కల్మి. రాఘవా!
మ:-
పరవిత్తంబను శంక లేశము వహింపం బోక భోగింతువ
గ్గిరిపై నెక్కడి రాచ బిడ్డడవు? పంకేజాప్త వంశోన్నతిం
జెరుపం బుట్టితి వారు లక్ష లిచటం జెల్లింపు చెల్లింపవా
గురుపాదంబులు తప్పినట్టులె సుమీ! కోదండ రామ ప్రభూ! 
మ:-
మృత పుత్రున్ బ్రతికించి యిచ్చితిని, బేర్మిన్ నాకు కట్టించి యి
చ్చితి వియ్యాలయ మిట్లు రెండింటికినిం జెల్లెం గదా యందువా?
యతి దీన స్థితి నున్న నాకు ఋణమి మ్మార్లక్ష లాపైకమే
గతినో దీరిచికొందునయ్య! త్రిజగత్కల్యాణ రామ ప్రభూ!
చ:-
కొడుకును నాఱులక్షలకుఁ గొన్నటులే యని నిశ్చయింతువా?
కొడుకులు లేకనేకు లెదఁ గుందుచు నుండెద రట్టి వారికిన్
గొడుకుల నిచ్చి విత్తముల గొంచు యధేచ్ఛగ నింకఁ గొండపై
నడుపుము వర్తకం బొకటి నల్వురు మెత్తురు నిన్ను రాఘవా!
మ:-
కరుణా సాగర! భక్త వత్సల జగత్కల్యాణ! దీనావనా!
వరదా! యంచిటులెన్ని నామముల నాహ్వానింతు నిన్నింటిలో
నరయన్నీవొక పేరు దాల్చుటకునేనర్హుండవౌదయ్య? యీ
బిరుదుల్ గూర్చిన బుద్ధి హీనుఁ డెవడో? పేర్కొమ్ము రామప్రభూ!
జై శ్రీరాం.
జిహింద్.

3, మే 2011, మంగళవారం

శ్రీ వల్లభ వఝల నరసింహ మూర్తి కవి కృత గూఢ చతుర్థ పాద చంపకమాల.

0 comments


1, మే 2011, ఆదివారం

మా మనుమరాలు చిరంజీవి శ్రీ విజయ లహరి కి మీ ఆశీస్సులంద జేసినందుకు ధన్యవాదములు

3 comments

సహృదయ పాఠకులారా! నాప్రార్థనలు విన్న జగన్మాత నాకు పౌత్రిగా మా కంటి వెలుగుగా తే.28.01-2011 న జనించింది.
తే.25-4-2011. న నా కుమారుడు చిరంజీవి వేంకట సన్యాసి రామ శర్మ, కోడలు చిరంజీవి సైభాగ్యవతి లక్ష్మీ శైలజల పుత్రిక యైన నా మనుమరాలికి నామకరణ జరిగింది.
శ్రీ విజయ లహరి 
అని పేరు పెట్టాము. అంతర్జాల మిత్రులు శ్రీమాన్ కంది శంకరయ్యగారు వారి శ్రీమతి ఆది దంపతుల వలె విచ్చేసి చిరంజీవిని దీవించారు.
శ్రీ గొల్ల పూడి రాజేశ్వర రావు గారు, శ్రీ పంతుల జోగారావు నాకు ప్రియ మిత్రులు. వారూ విచ్చేసి మా చిన్నారిని దీవించారు.
ప్రత్యక్షంగాను పరోక్షంగాను అందిస్తున్న మీ అందరి శుభాశీస్సులే మా మనుమరాలికి బంగారు బాట. అవ్యాజానురాగం మాపై చూపుతున్న మీ అందరికీ నేను ఋణ పడి ఉంటాను.
వ్యవహార నామకరణము చేయుచున్న సి.వి.యస్. రామ శర్మ.శైలజ దంపతులు

మా మనుమరాలికి శ్రీ విజయ లహరి అను వ్యవహార నామమును ఉచ్చరించుచు వ్రాయుచున్న మా కోడలు, మా అబ్బాయి. 

శ్రీ లంక గిరిధర్, శ్రీ శ్రీపతి సనత్, శ్రీ నేమాని అభిరామ్, .బ్లాగ్మిత్రుల ఆశీస్సులందుకొన్న మా మనుమరాలు శ్రీ విజయ లహరితో పాటు నేను, శ్రీ కంది శంకరయ్య, డాక్టర్ గన్నవరపు నరసింహ మూర్తి.
నా ఆహ్వానాన్ని మన్నించి ఎన్నో శ్రమ దమాదులకోర్చి తే.30-4-2011.న  మాయింటికి విచ్చేసి మా మనుమరాలికి వారి శుభాశీస్సులందించిన డాక్టర్ గన్నవరపు నరసింహ మూర్తి (అమెరికా)గారు, శ్రీ లంక గిరి, శ్రీమాన్ శ్రీపతి సనత్ కుమార్, శ్రీ కందిశంకరయ్య గారు, నా ప్రియ మిత్రులు శ్రీ నేమాని అభిరామ్.
ఇంకా దూర దేశాలలో ఉండి కూడా పండిత నేమాని రామ జోగి సన్యాసిరావు గారు, శ్రీమతి నేదునూరి రాజేశ్వరి అక్క గారు, శ్రీమతి మంగిపూడి సుబ్బ లక్ష్మి అక్క గారు ఇంకా  ఎందరో మిత్రులూ, సహృదయులూ మున్నగు వారు అనేక మంది తమ అమూల్యమైన సెల్ ఫోన్ ల ద్వారా ఆశీస్సులను అందించిన, అవ్యాజానురాగామృత వృష్టిని మా పై కురిపించినందుకు మాకు చాలా ఆనందం కలిగింది.మీ అందరికీ నేను, నాకుటుంబ సభ్యులందరమూ మా హృదయ పూర్వక కృతజ్ఞతలను తెలియ జేసుకొంటున్నాము.
సహృదయులైన మీ అందరి శుభాశీస్సులే మా మనుమరాలికి శ్రీరామ రక్ష. 
నమస్తే.
జైశ్రీరాం.
జైహింద్