గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, సెప్టెంబర్ 2023, గురువారం

శ్రీ యాదాద్రి లక్ష్మీనృసింహ శతకము 97వ పద్యము .... రచన. చింతా రామకృష్ణారావు. గానం. శ్రీ కుమార సూర్యనారాయణ.

జైశ్రీరామ్

97. ఓం ద్విరూపభృతే నమః.

తురగవల్గిత వృత్త గర్భ సీసము.

జయము గొలుపఁగ విజయ పథమున చక్క - గా నడిపింతువేకమల నయన!

భయము తొలఁగగ విభవమొలయఁగ భక్తి - నే కలిగింతువేనిష్కళంక!

ప్రియముఁ గొలిపెడి భవిత నిలిపెడి విశ్వ - తేజము నీవెగాపూజనీయ

నయముఁ గొలుపుచు వినయమొసగుచు నన్ను - బ్రోవుమ దేవరామోదమునను.

గీతురగవల్గిత వృత్త సచ్చరణ యుక్త - సీస *ద్విరూపభృతా* విశేష తేజ!

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

97 సీస గర్భస్థ తురగవల్గిత వృత్తము. ( .. యతి 15)

జయము గొలుపగ విజయ పథమున చక్క గానడిపింతువే

భయము తొలగగ విభవమొలయగ భక్తినే కలిగింతువే

ప్రియముఁ గొలిపెడి భవిత నిలిపెడి విశ్వతేజము నీవెగా

నయముఁ గొలుపుచు వినయమొసగుచు నన్ను బ్రోవుమ దేవరా

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! కమల నయనా! నాకు జయము కలిగించు నిమిత్తము

నన్ను చక్కగా నడిపించుదువే, అకళంకుఁడా! నాలో భయమును బాపి, వైభవము కలిగించదలచి నాకు భక్తిని

ప్రసాదింతువే. తురగవల్గితవృత్త చరణములతోనొప్పు సీసపద్యమున ప్రకాశించు సర్విరూపభృతా! విశేషమైన తేజస్సు

కలవాడా! పూజనీయా! ప్రేమను కొలుపుచు, భవితను నిలుపెడి విశ్వతేజము నీవే. దేవరా! నీతిని కొలుపుచు, నాకు

వినయము కొలుపుచు మోదముతో నన్ను కాపాడుము.

జైహింద్. 

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.