గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, సెప్టెంబర్ 2023, గురువారం

శ్రీ యాదాద్రి లక్ష్మీనృసింహ శతకము 105వ పద్యము .... రచన. చింతా రామకృష్ణారావు. గానం. శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్.


105. ఓం లక్ష్మీనృసింహాయ నమః

దండక - భుజంగప్రయాత వృత్త చతుష్టయ - స్రగ్విణి వృత్త గర్భ సీసమాలిక.                  

(1) నారాయణా! నీదు నామంబు నేఁ బల్కి - నాలోన నిన్ గాంచి నయమునొప్పి,

నీ దివ్య రూపంబునే యాత్మలో నిల్పి - నీ పూజలంజేసి నియతి నుండి,

ప్రార్థించినంతన్ శుభంబుల్ వరించున్ బ్ర - భావంబునే జూపు పరమ పురుష.

నీవుండి నాలోన నిత్యత్వమున్ గొల్పి - దీపింపుమాలోన దివ్య తేజ!

(2) నీ పాద పద్మంబు లేపార జూడన్  - దిన్ నిల్చి నన్నేలు దీనబంధు.!

నీ నామ రూపంబులే నాకు జీవంబు - నన్నేలుమా నీవె నాకు రక్ష.

నీ భావనంబే పునీతంబు చేయున్ - నో నాయకుండాప్రణుతులఁ గొలుతు.

భావ ప్రభాసా! స్వభావంబు నీవేను. - సాక్షాన్నృసింహాఖ్యసత్స్వరూప!

(మత్స్యావతారము)

(3) నిద్రించగా బ్రహ్మ నిత్యంబులౌ వేద - ముల్ పైకి కన్పించ మూర్ఖుఁడైన

యా రాక్షసుండౌ హయగ్రీవుఁడే వాటి - నన్నింటినిన్ బట్టి మిన్నకుండ

చౌర్యంబు చేయంగ సద్వేద సంరక్ష - ణంబీవు గావించ నంబుజాక్ష!

క్రూరాత్మునిం జంప క్షోణిం బ్రభూతంపు - మత్స్యంబు నీవేర మహిత దేవ!

 (కూర్మావతారము)

(4) దైత్యాళియున్ దేవతల్ వ్యాప్తమైయున్న క్షీరాబ్ధినే చిల్కఁ జేరి యచట

కవ్వంబుగా కొండఁగైకొంచు నా త్రాడు - గా వాసుకిన్గొంచు కవ్వమట్లు

చిల్కంగ నవ్వేళఁ జిత్రంబుగా నీవు - కూర్మంబువై కాచికూర్మిఁ జూపి

శ్రీ కూర్మ రూపాన శ్రీకూర్మమందుండి - రక్షింతువే నీవు ప్రాణ నాథ.

(వరాహావతారము)

(5) భూదేవి బాధించు మూర్ఖున్ హిరణ్యాక్షు - నింజంపిభూమిన్ సునీతినొప్ప

రక్షించు దీక్షన్ వరాహంబుఁగాఁ బుట్టి - దుష్టాత్మునిన్ జంపి సృష్టిలోన

దీనార్తులం గాంచి ప్రాణంబుగా నిల్చి - భక్తాళినే బ్రోచిప్రతిభనొప్పి,

భూమిన్ వరాహంబు పూజ్యంబుఁగాఁ జేసి - వర్ధిల్లి తీవేగ ! వశమునుండు.

(నరసింహావతారము)

(6) రక్షింప శిక్షింపఁ బ్రహ్లాదునిన్ దండ్రి - నిన్నీనృసింహంబు నేర్పు తోడ

రూపంబుగాఁ దాల్చి పాపాత్మునిం ద్రుంచి - ప్రహ్లాదు రక్షించిప్రభను జూప

చిద్రూపమొప్పార సింహాచలంబింక, - యాదాద్రి యందీవు హ్లాదమొదవ

తేజంబుతోనిల్చిదీపింతువే పెక్కు - చోట్లన్ నృసింహాఖ్యశోభఁ గూర్ప.

(వామనావతారము)

(7) యజ్ఞాదులం జేయు ప్రజ్ఞాన్వితుండౌ - లిం గాంచి పాతాళ ప్రాంగణమున

లోకాధిపుం జేయ శ్రీకారముం జుట్టి - శ్రీవామనుండౌచుఁ జేర వచ్చి,

దానంబుగా కోరి ధాత్రిం ద్రిపాదంబు - లీయన్ వరాకాశ హృన్మనోజ్ఞ

భూభాగముల్గొంచు మూడున్ గొనన్ శీర్ష - మున్ ద్రొక్కితీవేగప్రోవ నెంచి

 (పరశురామావతారము)

(8) భూపాలకుల్ సృష్టిఁ బాపాత్ములై మంచి - చెడ్డల్ విడన్ గాంచియడ్డగించి

నీ గొడ్డలిన్ బట్టి వేగంబుగాఁ జేసి - తే రాజ నాశంబుదేవ దేవ!

రాముండవైకాన రావయ్య నేడున్ దు - రాత్ముల్ విజృంభించి  యవని పైన

దౌష్ట్యంబులన్ జేయుదండించు వారిన్  - ముం గావ రావేర పుణ్య ఫలమ!

(శ్రీరామావతారము)

(9) కామాతురుండై మృగంబట్లు వర్తించు - చున్ రావణ బ్రహ్మ శోభ చెదర

సీతాపహారంబు సేయంగ వానిన్  - ధించంగ సుగ్రీవు పంచఁ జేరి

స్నేహంబునే చేసి శ్రీలంకనే చేరి - యారావణుం జంపి యచట నున్న

సీతమ్మతోఁ జేరి శ్రీరామ.! రాజ్యంబు - పాలించితీవేరపరమ పురుష!

 (శ్రీకృష్ణావతారము)

(10) శ్రీమన్మహా గీతఁ జేకొండటంచున్ బ్ర - బోధంబు సేయంగ భూమిపైన

కృష్ణుండుగాఁ బుట్టితృష్ణన్ నినున్ జూచు - భక్తుండు పార్థుండు భయముఁ గొల్పు

యుద్ధంబులో భీతినొద్దంచు యుద్ధంబు - మానంగ నచ్చోట మహిమఁ జేసి

గీతన్ బ్రబోధించి చైతన్యముం గొల్పి - చేయించితీవేర చిద్విభాస!

(బుద్ధావతారము)

(11) భూమీశులున్ మానవుల్ యజ్ఞ యాగాదు - లన్ జేయుచున్ నందు లక్ష్యమొప్ప

జీవాళినే జంపజీవంబులన్ దీయు - యాగంబులన్ మాన్ప నవనిపైన

సిద్ధార్థుఁడై పుట్టి బుద్ధుండుగామారి, - బౌద్ధంబు బోధించిప్రస్ఫుటముగ

హింసా విధిన్ మాన్పిహృత్సీమలో శాంతి - నే గొల్పితీవేర నిత్య శుభద!

 (కల్క్యవతారము)

(12) దుష్టుల్ విజృంభించిశిష్టాత్ములన్ బాధ - లన్ ముంచుటం జేసి లక్ష్యమైన

ధర్మంబు క్షీణింపమర్మాత్ములం జంపి - ధర్మంబు రక్షింపఁ దప్పదంచు

కల్యంతమున్ ఘోర ఖడ్గంబునే దాల్చి - భూభారమే తగ్గ దుష్ట నిహతిఁ

జేయంగ జన్మించు శ్రీమన్మహా కల్కి - దేవా నమస్తేస్తు దీప్త నృహరి!

(13) హే మా రమానాథప్రేమార రమ్మన్న - రావేర వేగంబు రార దేవ!

నే నేరనా? వల్లభానేర్పరానా వి - ధిన్ శ్రీ నృసింహాఖ్యదీప్తిఁ గొలుప,

ధీరారమోద్ధాముఁడారారరక్షింప - రారాకృపాసాంద్ర రక్షనీవె!

నిన్ నా రమన్ గొల్చెదన్ నమ్మరాకాంచు -  మాతండ్రి నిత్యాత్మమమ్మునింక.

(14) సత్యంబు నీవేభుజంగేశు పర్యంక - పూర్ణానురాగాఢ్య! బోధ వీవె.

సత్వంబు నీవేప్రజాళిన్ గనంగా  - రంబీవె నిత్యాత్మ రాగులకును.

జాడ్యంబుఁ బాపన్నిజంబెన్ని చూపంగ - నిన్ గొల్తుమయ్యాసునేత్ర భాస!

సాంతంబు నిన్నున్ భజింతున్ మదిన్ నిల్పి - భక్తిన్ నృసింహాస్వ భక్త పాల!

(15) హర్షావహంబౌ మహత్పూజ్య యాదాద్రి - మాన్యంబు కానన్  మహిమఁ గొలుపు

నాత్మన్ స్థిరంబై యిహంబున్ బరంబెన్ని -  యిష్టాప్తినీయంగ శిష్టులకిల.

నచ్చోట నీవుంటి వర్ధిన్ నృసింహుండ! - మమ్మేలు నిన్నేను సమ్ముదమున

నాత్మన్ గనన్ నీ సహాయంబు నర్థింత్రు - సన్మార్గవర్తుల్.  స్వ సత్వ నిధులు.

(16ధర్మంబు నిల్పన్ సదా నన్ను రక్షించు - సర్వేశ్వరా! నా సుపర్వమీవె!

ధీశక్తిఁ గొల్పన్ హృదిన్నిల్చి దీక్షన్  - హిన్వెల్గరాదా! ప్రభన్వెలుంగ!

హర్షంబుఁ గంల్పన్ సదానంద రూపుండ! - సత్వ ప్రకాశాఢ్యశాంత తేజ!

ఆత్మ ప్రకాశాచిదానందమూర్తీ! నృ - సింహా! నమస్తేస్తు శిష్ట రూప!

(17) ప్రహ్లాద రక్షాప్రభా పూర్ణ సాక్షీప్ర - పంచ ప్రసిద్ధాత్మ! బ్రహ్మ తేజ!

భావంబు నీవే సు భద్రాత్మనీవేవి - శుద్ధాత్మ నీవేరచూడ రార!

పాపాత్ములందున్సు భక్తాళి యందున్ బ్ర - శోభింతు వీవేరసుప్రకాశ!

భవ్యాత్మతే జః ప్రభావంబుతో మమ్ము - రక్షీంపరావేరరార నృహరి!

(18) యాదాద్రిపై నీవు మోదంబుతో నుండి, - బాధార్తులన్ బ్రోచ, బాధఁ బాపి,

భక్తాళినే గాంచి శక్తిం బ్రసాదించి, - కర్తవ్యమున్ గొల్పి, కరుణఁ జూపి,

నిత్యత్వ మీయన్, మనీషాళిఁ బ్రోవన్, గృ - పన్ నిల్చితీవేర! పరమ పురుష!

మా హృన్నృసింహా నమస్తే నమస్తే - మస్తే నమస్తే నమామి నృహరి!

గీ. దండకోద్దండ సీసస్థ! దండములయ - శ్రీశ! *లక్ష్మీనృసింహ*! నన్ జేదుకొనుమ

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

105  సీస మాలిక గర్భస్థ దండకము.

(1) నారాయణా నీదు నామంబు నేఁ బల్కినాలోన నిన్ గాంచి,

నీ దివ్య రూపంబు నే యాత్మలో నిల్పినీ పూజలంజేసి ,

ప్రార్థించినంతన్ శుభంబుల్ వరించున్, భావంబునే జూపు .

నీవుండి నాలోన నిత్యత్వమున్ గొల్పి దీపింపుమాలోన.

(2) నీ పాద పద్మంబు లేపార జూడం మదిన్ నిల్చి నన్నేలు 

నీ నామ రూపంబులే నాకు జీవంబు నన్నేలుమా నీవె 

నీ భావనంబే పునీతంబు చేయున్మనో నాయకుండాప్ర 

భావ ప్రభావా! స్వభావంబు నీవేనుసాక్షాన్నృసింహాఖ్య!

(మత్స్యావతారము)

(3) నిద్రించగా బ్రహ్మ నిత్యంబులౌ వేదముల్ పైకి కన్పించ

యా రాక్షసుండౌ హయగ్రీవుఁడే వాటినన్నింటినిన్ బట్టి 

చౌర్యంబు చేయంగ సద్వేద సంరక్షణంబీవు కావించ 

క్రూరాత్మునిం జంప క్షోణిం బ్రభూతంపు మత్స్యంబు నీవేర. 

(కూర్మావతారము)

(4) దైత్యాళియున్ దేవతల్ వ్యాప్తమైయున్న క్షీరాబ్ధినే చిల్క 

కవ్వంబుగా కొం డఁ గైకొంచు నా త్రాడుగా వాసుకిన్గొంచు 

చిల్కంగ నవ్వేళఁ జిత్రంబుగా నీవు కూర్మంబువై కాచి

శ్రీ కూర్మ రూపాన శ్రీకూర్మమందుండి రక్షింతువే నీవు . 

(వరాహావతారము)

(5) భూదేవి బాధించు మూర్ఖున్ హిరణ్యాక్షు నింజంపిభూమిన్ సు 

రక్షించు దీక్షన్ వరాహంబుఁగాఁ బుట్టి దుష్టాత్మునిన్ జంపి 

దీనార్తులం గాంచి ప్రాణంబుగా నిల్చి భక్తాళినే బ్రోచి

భూమిన్ వరాహంబు పూజ్యంబుఁగాఁ జేసి వర్ధిల్లి తీవేగ?.

(నారసింహావతారము)

(6) రక్షింప శిక్షింపఁ బ్రహ్లాదునిన్ దండ్రి నిన్నీనృసింహంబు 

రూపంబుగా తాల్చి పాపాత్మునిం ద్రుంచి ప్రహ్లాదు రక్షించి

చిద్రూపమొప్పార సింహాచలంబింకయాదాద్రి యందీవు 

తేజంబుతోనిల్చిదీపింతువే పెక్కు చోట్లన్ నృసింహాఖ్య

(వామనావతారము)

(7) యజ్ఞాదులం జేయు ప్రజ్ఞాన్వితుండౌ బలిం గాంచి పాతాళ 

లోకాధిపుం జేయ శ్రీకారముం జుట్టి శ్రీవామనుండౌచు 

దానంబుగా కోరి ధాత్రిం ద్రిపాదంబు లీయన్ వరాకాశ 

భూభాగముల్గొంచు మూడున్ గొనన్ శీర్షమున్ ద్రొక్కితీవేగ?

(పరశురామావతారము)

(8) భూపాలకుల్ సృష్టిఁ బాపాత్ములై మంచి చెడ్డల్ విడన్ గాంచి

నీ గొడ్డలిన్ బట్టి వేగంబుగాఁ జేసితే రాజ నాశంబు

రాముండవైకాన రావయ్య నేడున్ దురాత్ముల్ విజృంభించి  

దౌష్ట్యంబులన్ జేయుదండించు వారిన్ మముం గావ రావేర. 

(శ్రీరామావతారము)

(9) కామాతురుండై మృగంబట్లు వర్తించుచున్ రావణబ్రహ్మ 

సీతాపహారంబు సేయంగ వానిన్ వధించంగ సుగ్రీవు 

స్నేహంబునే చేసి శ్రీలంకనే చేరి యా రావణుం జంపి 

సీతమ్మతోఁ జేరి శ్రీరామరాజ్యంబు పాలించితీవేర.

(శ్రీకృష్ణావతారము)

(10) శ్రీమన్మహా గీత చేకొండటంచున్ బ్రబోధంబు సేయంగ 

కృష్ణుండుగాఁ బుట్టితృష్ణన్ నినున్ జూచు భక్తుండు పార్థుండు 

యుద్ధంబులో భీతినొద్దంచు యుద్ధంబు మానంగ నచ్చోట 

గీతన్ బ్రబోధించి చైతన్యముం గొల్పి చేయించితీవేర.

(బుద్ధావతారము)

(11) భూమీశులున్ మానవుల్ యజ్ఞ యాగాదులన్ జేయుచున్ నందు 

జీవాళినే జంపజీవంబులన్ దీయు యాగంబులన్ మాన్ప 

సిద్ధార్థుఁడై పుట్టి బుద్ధుండుగామారిబౌద్ధంబు బోధించి

హింసా విధిన్ మాన్పిహృత్సీమలో శాంతినే గొల్పితీవేర.

(కల్క్యవతారము)

(12) దుష్టుల్ విజృంభించిశిష్టాత్ములన్ బాధ - లన్ ముంచుటం జేసి 

ధర్మంబు క్షీణింపమర్మాత్ములం జంపి ధర్మంబు రక్షింప

కల్యంతమున్ ఘోర ఖడ్గంబునే దాల్చి భూభారమే తగ్గ 

జేయంగ జన్మించు శ్రీమన్మహా కల్కిదేవా నమస్తేస్తు.

(13) హే మా రమానాథప్రేమార రమ్మన్న రావేర వేగంబు

నే నేరనా? వల్లభానేర్పరానా విధిన్ శ్రీ నృసింహాఖ్య

ధీరారమోద్ధాముఁడారారరక్షింప రారాకృపా సాంద్ర !

నిన్ నా రమన్ గొల్చెదన్ నమ్మరాకాంచు మా తండ్రి నిత్యాత్మ!

(14) సత్యంబు నీవేభుజంగేశు పర్యంక పూర్ణానురాగాఢ్య!

సత్వంబు నీవేప్రజాళిన్ కనంగా వరంబీవె నిత్యాత్మ!       

జాడ్యంబుఁ బాపన్నిజంబెన్ని చూపంగ నిన్ గొల్తుమయ్యాసు

సాంతంబు నిన్నున్ భజింతున్ మదిన్ నిల్పి భక్తిన్ నృసింహాస్వ 

(15) హర్షావహంబౌ మహత్పూజ్య యాదాద్రి మాన్యంబు కానన్గ 

నాత్మన్ స్థిరంబై యిహంబున్ బరంబెన్ని యిష్టాప్తినీయంగ 

నచ్చోట నీవుంటి వర్ధిన్ నృసింహుండమమ్మేలు నిన్నేను

నాత్మన్గనన్నీ సహాయంబున ర్థింత్రు సన్మార్గవర్తుల్. స్వ 

(16)  ధర్మంబు నిల్పన్ సదా నన్ను రక్షించు సర్వేశ్వరా! నా సు

ధీశక్తిఁ గొల్పన్ హృదిన్నిల్చి దీక్షన్ మహిన్వెల్గరాదా! ప్ర

హర్షంబుఁ గంల్పన్  సదానంద రూపుండ! సత్వ ప్రకాశాఢ్య!

ఆత్మ ప్రకాశా! చిదానందమూర్తీనృసింహా! నమస్తేస్తు.

(17) ప్రహ్లాద రక్షాప్రభా పూర్ణ సాక్షీప్రపంచ ప్రసిద్ధాత్మ!

భావంబు నీవే సు భద్రాత్మనీవేవిశుద్ధాత్మ నీవేర!

పాపాత్ములందున్సు భక్తాళి యందున్ బ్రశోభింతు వీవేర!

భవ్యాత్మతేజః ప్రభావంబుతో మమ్ము రక్షీంపరావేర?

(18) యాదాద్రిపై నీవు మోదంబుతో నుండి, బాధార్తులన్ బ్రోచ,

భక్తాళినే గాంచి శక్తిం బ్రసాదించి, కర్తవ్యమున్ గొల్పి,

నిత్యత్వ మీయన్, మనీషాళిఁ బ్రోవన్, గృపన్ నిల్చితీవేర!

మా మార్గమీవే. సమస్త ప్రకాశా! నమస్తే నమస్తే

105 సీస (మాలిక) గర్భస్థ భుజంగప్రయాత వృత్త చతుష్టయము. (యయయయ .. యతి 8

(1)రమానాథప్రేమార రమ్మన్న రావే!

రమా వల్లభానేర్పరానా విధిన్ శ్రీ. 

రమోద్ధాముఁడారారరక్షింప రారా

రమన్ గొల్చెదన్ నమ్మరాకాంచు మాతన్!

(2)భుజంగేశు పర్యంక పూర్ణానురాగా!

ప్రజాళిన్ గనంగా వరంబీవె నిత్యా!

నిజంబెన్ని చూపంగ నిన్ గొల్తుమయ్యా!

భజింతున్ మదిన్ నిల్పి భక్తిన్ నృసింహా!               

(3)మహత్పూజ్య యాదాద్రిమాన్యంబు కానన్.

యిహంబున్ బరంబెన్ని యిష్టాప్తినీయన్

మహచ్ఛ్రీ నృసింహుండ!  మమ్మేలు నిన్నే 

సహాయంబు నర్ధించు సన్మార్గవర్తుల్.                

(4) సదా నన్ను రక్షించు సర్వేశ్వరా! నా

హృదిన్నిల్చి దీక్షన్ మహిన్వెల్గరాదా!

సదానంద రూపుండ! సత్వ ప్రకాశా!

చిదానందమూర్తీ నృసింహా నమస్తే.

105 సీస(మాలిక) గర్భస్థ స్రగ్విణి వృత్తము. (   ..  యతి 7)                       

మా రమానాథప్రేమార రమ్మన్న రా! - నేరనా? వల్లభానేర్పరానా విధిన్,

రారమోద్ధాముఁడారారరక్షింప రా! - నా రమన్ గొల్చెదన్ నమ్మరాకాంచుమా!

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా!

(1) నీ పేరునునేనుపలికి ఋజుమార్గములో ఒప్పియుండి, నీ స్వరూపమునాత్మలో నిలిపి, నీ పూజలు చేసి నీతిగా ఉండి,

నిన్ను ప్రార్థించినంతలో నన్ను శుభములు చేరును. వాటి ప్రభావమును చూపును సుమా. నీవు నాలో ఉండి

నిత్యత్వమును నాకు కలిగింపుము.

(2) నీ పాదపద్మములను కనులువిప్పరి చూచినచో నా మనసులో నిలిచి నన్నేలుము. నీ నామ రూపములే నాకు

జీవము. నన్నేలెడి మా నీవే నాకు రక్షణ. నిన్ను భావించినంతనే పవిత్రులమగుదుము. మనోనాయకా వందనము

లందుకొమ్ము. నా భావమున ప్రభాసించువాఁడా! సత్వరూపా! నరసింహా! నా భావము నీవే సుమా

(3) బ్రహ్మ నిదురించు సమయమున హయగ్రీవరాక్షసుడు వేదములనపహరించుకొనిపోగా వానిని సంహరించి

వానినుండి వేదములను కాపాడుటకు మత్స్యవతారమెత్తినది నీవే కదా.

(4) దేవదానవులు క్షీర సాగర మథనము చేయు సమయమున కవ్వముగా చేయబడిన మందర పర్వతమును

మ్రోయుటకు కూర్మావతారమెత్తినది నీవే కదా. శ్రీకూర్మమున వెలసి మమ్ములను రక్షింపనుంటివి. 

(5) హిరణ్యాక్షుఁడు తన రాక్షసబలిమి చూపి భూమిని చాపగా చుట్టిపట్టుకొనిపోవుచున్న సమయమున భూదేవిని

రక్షించుట కొరకు నీవు వరాహరూపమున నవతరించి ఆ రాక్షసుని సంహరించితివి కదా.ఆర్తితోనున్న ప్రాణులను నీవు

కాపాడుచుంటివి కదా.

(6) ప్రహ్లాదుని రక్షించుట కొఱకు, అతని తండ్రియగు హొరణ్యకశ్యపుని శిక్షించుట కొఱకు, నరసింహావతారమెత్తితివి నీవే

కదా. సింహాచలము, యాదాద్రి మున్నగు అనేక ప్రదేశములలో నీవు భక్తులను రక్షించుటకై వెలసి యుంటివికదా..

(7) యజ్ఞములు చేయు బలిని చూచి అతనిని పాతాళ లోకాధిపతిని చేయు తలపుతో వామనునిగా వచ్చి మూడడుగులు

దానముగా పొంది మూడవ అడుగు అతని శిరమున మోపి అతనిని పాతాళమునకు ద్రొక్కితివి నీవేకదా.

(8) భూమిపై రాజుల దురాగతములు గాంచి ధర్మరక్షణకై గొడ్డలి పట్టి వారిని సంహరించిన పరశురాముఁడవు నీవే కదా.

నేడునూ దురాత్ములు చెలరేగిపోవుచున్నారు. వారిని సంహరింప వేగమే రమ్ము.,

(9) కామాతురుఁడై రావణుండు సీతనపహరించగా నీవు సుగ్రీవునితో మైత్రి చేసి, లంకచేరి రావణ సంహారము చేసి సీతతో

అయోధ్యలో పట్టాభిషిక్తుఁడవయిన రామావతారము నీదే కదా.

(10) అర్జునుఁడు బంధు వ్యామోహమున చిక్కి యుద్ధ విముఖుడు కాగా మాయ చేసి వానికి గీత బోధించి యుద్ధము

చేయించితివి. విధముగ భూజనులకు గీతను బోధింప నవతరించిన కృష్ణుఁడవు నీవే కదా. .

(11) భూ జనులు యజ్ఞాదులు చేయుచు జంతువులను బలియిచ్చుచుండ, నీవు సిద్ధార్థుఁడుగా పుట్టి తపస్సు చేసి

బుద్ధుఁడుగా మారి అహింసను బోధించితివి.  అట్టి బుద్ధునిగా అవతరించినది నీవే కదా.

(12) భూమిపై జనులు సకల పాపప్రవర్తనలు చేయుట గాంచి కలికాలమునందలి కల్మషులను సంహరించి ధర్మ పరిరక్షణ

చేయుట కొఱకు చేత ఖడ్గమును ధరించి దుష్ట సంహారము చేయుటకవతరించబోవు కలికివి నీవే కదా.!

(13) హరీ! పిలుచుచుంటిని వేగముగా రమ్ము. నేను నా ధర్మమెఱుఁగనా? ఐనచో నీవే నాకు నేర్పుము. రమోద్ధామా! నీవే

రక్షకుఁడవు రమ్ము.నిన్ను మా తల్లి లక్ష్మిని కొలిచెదము.మమ్ము చక్కగ చూచి కాపాడుడు.

(14) శేషశయనముపై పూర్ణానురాగముతో నిండినవాఁడానీవే నిత్యుఁడవు. మాకు కలుగు బోధవు నీవే సుమా. ప్రజలను

కాచుటకు సత్వస్వరూపము నీవే కదా. రాగులకు నీవే వరము సుమా. మా జాఢ్యము పోఁ గొట్టుటకు,నిజమెన్ని చూపుటకు

నిన్ను కొలిచెదము. భక్త పాలా! మా జీవితాంతము నిన్ను భజింతుము..

(15) యాదాద్రి సంతోషమునకాలవాలము., చూడ గొప్పది, అది మహిమ చేయునది..ఆత్మలందు నిలిచి,

ఇహపరములనొసగునది. అచ్చట మంచివారికి మేలు చేయ వెలసిన నృసింహా! మమ్ములనేలు నిన్ను ఇష్టముతో

తమయాత్మలందు నిన్ను చూచుకొనునట్లు చేయుట కొఱకు నీ సహాయమును సన్మార్గవర్తులు కోరుదురు.

(16ధర్మపరిరక్షణార్థము నన్ను రక్షించు పరమేశా! నీవు నాకు పండుగవే. నాలో ధీశక్తిని ప్రభవింపఁ జేయుటకు, దీక్షతో నా

మదిలో నిలిచి, జగతిలో నీవు ప్రకాశించ వచ్చును కదా. సంతోషకారకా! సదానందరూపా! సత్వ ప్రకాశా! శాంతి

స్వరూపా! ఆత్మను ప్రకాశించువాడా! చిదానంద స్వరూపా! శిష్టులరూపముననుండువాడా! నీకు వందనములు..

(17) ప్రహ్లాద రక్షకా! కాంతిరూపమున సాక్షిగా ఉండు దేవా! ప్రసిద్ధ ఆత్మస్వరూపా! బ్రహ్మ తేజా! ఆత్మలందుప్పొంగు

భావము నీవే. సుభద్ర యొక్క ఆత్మవు నీవే. విశుద్ధాత్మవు నీవే. మమ్ము చూడ రమ్ము. అందరియందూ ప్రకాశించెడివాడవు

నీవే. భవ్యమయిన ఆత్మ తేజస్సు యొక్క ప్రభావముతో మమ్ము రక్షింప రమ్ము.

(18) బాధార్తులను కాపాడుటకు యాదాద్రిని మోదముతో వసించుచు, బాధలు పోగొట్టి, భక్తులను చూచి శక్తి ప్రసాదించి,

కర్తవ్య నిర్దేశము చేసి,నీ కరుణ చూపి, శాశ్వతత్వమిచ్చుట కొఱకు, గొప్పవారిని కాచుట కొఱకు, కృపతో అచ్చట

నిలిచితివి. మా హృదయములందు ప్రకాశించు మా నారసింహా! నీకు శతకోటి నమస్కారములు.

దండకముతో నొప్పు సీసపద్యమున ప్రకాశించు శ్రీశా! లక్ష్మీ నరసింహా! నీకు వందనములు. నన్ను నీవు చేరుకొనుము.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.