గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, సెప్టెంబర్ 2023, గురువారం

శ్రీ యాదాద్రి లక్ష్మీనృసింహ శతకము 74వ పద్యము .... రచన. చింతా రామకృష్ణారావు. గానం. శ్రీ కుమార సూర్యనారాయణ.

జైశ్రీరామ్.

74. ఓం పరంతపాయ నమః.

ఇంద్రవజ్ర వృత్త గర్భ సీసము.

పాపాలఁ బాపు నీ రూపు నీ రేఖ  - ణింతు నేనేనాకు సంతసమది.

పుణ్య సద్భాస కారుణ్య నీ రూపు వి - కాసమిచ్చున్ జగత్కారకుండ!

శృంగార వీర! చేరంగ నే నిన్ను సు - చేతనంబున్ గొల్పు చిద్వలాస!

సత్వప్రకాశధీరత్వముం గొల్పుమ! - దీపితాక్షానీవె ప్రాపు మాకు.

గీ. ఇంద్ర వజ్ర మనోధైర్యసాంద్ర నృహరి! - దుష్టహారి *పరంతపా*! తోడు నీవె.!

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

74 సీస గర్భస్థ ఇంద్రవజ్ర వృత్తము. (   గగ .. యతి 8)

నీ రూపు నీ రేఖ గణింతు నేనే. - కారుణ్య నీ రూపు వికాసమిచ్చున్.

చేరంగ నే నిన్ను సుచేతనంబున్. -  ధీరత్వముం గొల్పుమ! దీపితాక్షా

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! పాప శమనము గావించు నీ రూపు రేఖలను నేను

సంతోషముగా గణింతును. పుణ్య సద్భాసా! జగత్కారకా! నీ రూపము మనోవికాసము కలిగించును. శృంగార వీరా!

చిద్విలాసా! నిన్ను నేను చేరగనే నాలో చైతన్యము కలుగును. సత్వగుణ ప్రకాశా! నాకు ధైర్యము కొలుపుము. ప్రకాశ

నయనా! మాకు నీవే ఆధారము.ఇంద్రవజ్రసమాన మనోధైర్యసాంద్రా! దుష్టహారివైన పరంతపా! నాకు తోడు నీవే

సుమా.!

జైహింద్. 

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.