జైశ్రీరామ్.
66. ఓం సూర్యజ్యోతిషే నమః.
జలద వృత్త గర్భ సీసము.
శ్రీహృదయేశ్వరా! క్షితి వసింపగ రా, ప - రాత్పరా! నీవు నా రక్షకుఁడుగ,
నా హృది నుండు సన్మణి! సనాతనుఁడాత్మ - సాక్ష్యాకృతిన్ గొల్పి సాక్షివగుము.
మోహముఁ బాపరా! భువిని మోక్షదుఁడాత్మ - నీవే కదా! యేల నీవు రావు?
నీ హృది నన్నికన్ నిలుపు నీ కృపతోడ - నీ ధర్మ మది. నాదు బాధ బాపు.
గీ. జలద గర్భ సుసీసస్థ! బలము నిమ్ము - జయనిధాన! *సూర్యజ్యోతిషా*! నమామి.
భక్త జన పోష! భవశోష! పాపనాశ! - శ్రితజనోద్భాస! యాదాద్రి శ్రీనృసింహ!
66వ సీస గర్భస్థ జలద వృత్తము. (భ ర న భ గ .. యతి 10)
శ్రీహృదయేశ్వరా! క్షితి వసింపగ రా! - నా హృది నుండు సన్మణి! సనాతనుఁడా!
మోహముఁ బాపరా! భువిని మోక్షదుఁడా! - నీ హృది నన్నికన్ నిలుపు నీ కృపతో.
భావము.
భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున
ప్రకాశించువాఁడా! శ్రీ లక్ష్మీ హృదయేశ్వరా! నాకు
రక్షకుఁడుగా భూమిపై నివసించుట కొఱకు రమ్ము. ఓ
యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! నా మదిలో ఉండు ఓ మణీ! ఓ సనాతనా! ఆత్మలో సాక్షాత్కరించి సాక్షిగా
నిలుము. నాలోని మోహమును పోగొట్టుము. మోక్షప్రదా! భూమిపై మాలో ఉండే ఆత్మవు నీవే కదా, ఐనప్పటికీ నీవు రావేల?
జలద వృత్తగర్భ సీసముననున్నవాఁడా! నాకు శక్తిని ప్రసాదించు.జయమునకు నిధివయిన ఓ సూర్యజ్యోతిషా! నీకు
నమస్కరించుచున్నాను.!
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.