గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

30, జూన్ 2009, మంగళవారం

కవిసమ్రాట్ విశ్వనాథ భావుకత 25

1 comments

శ్రీ విశ్వనాధుని భావుకత వ్యక్తమయే మరో పద్యాన్ని గూర్చి శ్రీ బులుసు వేంకటేశ్వర్లు గారి వివరణ చూద్దాం.

చ:-
తునుకలు కొట్టుచున్ చెఱకు తోటల వింటికి విత్తనాలు పా
తిన తఱి కర్షకుండయిన తియ్యని విల్దు ముదారి సీత గై
కొని చనుదెంచి మైథిలుల కోటకు పంపమ యింతదాక బం
పునదియికేమి యున్న యది పోవుట నేనును లే దయోధ్యకున్. {వి.ర.క.కి.నూ. ౨౫}

రామునకు తన పెళ్ళి నాటి ముగ్ధ యైన తన సీత రూపము తలపునకు వచ్చినది. " చిన్న పిల్లగా అమాయకమైన చూపులతో ముగ్ధ మనోహర రూపముతో తన యింట అడుగు పెట్టిన సీత మరల పుట్టినింటికి పోయినదే లేదు. { వాల్మికమున అట్టి ఆధారము లేదు.} యింక అమె పుట్టింటికి వెళ్ళెడు ఘట్టమూ లేదు. నేను అయోధ్యకు పోవుటయూ లేదు. " ఇది శ్రీరాముని ఆవేదన.

సీత ఏమైనదని అడిగినచో రాముడు జనక మహారాజాదులకు ఏమని చెప్పగలడు? అయోధ్య లోని ముగ్గురు తల్లులకు ఏమని చెప్ప గలడు? ఈ ప్రశ్నలు రాముని హృదయమును కాల్చివేయు చున్నవి. ఇది శ్రీరాముని ఆవేదన.

విశ్వనాధ యిక్కడ ఒక అందమైన కల్పనతో వివాహము నాటి సీత అందమైన మౌగ్ధ్యమును బాల్య యౌవన దశా సంధి గతమైన అచ్చమైన హృదయమును నిరూపించినాడు. సీతా రాముల పెండ్లి సమయానికి మన్మధుడు చెఱకు విల్లు పట్టుకొని హడావిడి పడ లేదుట. వారిపై పూల బాణములు వేయుటకు యింకను చాల సమయ మున్నదని అప్పటికి కొత్త చెఱకు విల్లులు తయారు చేసుకో వచ్చునని, భావించి, ఆ మన్మధుడు ఒక చెఱకు రైతుగా అవతార మెత్తినాడట. చెఱకు తోట పెంచుటకు విత్తనాలుగా చెఱకు ముక్కలను కొడుతూ తియ్యని వెల్దుముదారు అనగా ఇక్షు ధన్వుడైన మన్మధుడు కర్షకుడుగా మారిన సమయములో సీతను అయోధ్యకు తీసుకు వచ్చాముఅంటాడు రాముడు. ఎంత అందమైన కల్పన! చిన్న వయసున పెండ్లి కూతురై అత్తవారింట అడుగు పెట్టిన సీతయే ఒక చెఱకు తునకగా స్ఫురించు చున్నది కదా! మన్మధ భావ బీజారోపములు అయినను లేని సీత యొక్క ముగ్ధాకృతి పాఠకుల మనస్సుకు సాక్షాత్కరించు చున్నది కదా!

ఉత్తర రామ చరితమున భవభూతి పెండ్లి నాటిసీతమ్మ ముగ్ధాకృతిని రామునిచే వర్ణింపజేసినాడు. పాల పండ్లు ఊడి ఆ స్థానమున మల్లె మొగ్గల వంటి దంతములు కొంచెము కొంచెము వచ్చుచున్నంత బాల్యమున సీత ఉన్నదని భవభూతి వర్ణించినాడు. " పతన విరళ ప్రాంతోన్మూలన్మనోహర కుట్మలైః " ఇత్యాది శ్లోకము.

విశ్వనాధ సీత ముగ్ధాకృతిని వర్ణించుట తెలుగు నేలయందలి వ్యవసాయిక భూమికను స్వీకరించి వర్ణనను రమ్యతరము చేసినాడు.

ఇంతవరకూ శ్రీ బులుసు వేంకటేశ్వర్లుగారు వెశదీకరించిన ఆహ్లాద భరిత మైన విశ్వ నాధ రచనలోని భావుకతను చూచాంకదండి. మరొక పర్యాయం మరొక పద్యంలోని భావుకతను మీ ముందుంచే ప్రయత్నం చేయ గలను.
జైహింద్.

28, జూన్ 2009, ఆదివారం

కవిసమ్రాట్ విశ్వనాథ భావుకత 24

0 comments

ప్రియ సాహితీ బంధువులారా!

విశ్వనాధ సత్యనారాయన గారి రామాయణ కల్ప వృక్షము నందు గల భావుకతను శ్రీ బులుసు వేంకటేశ్వర్లు గారి ఉపన్యాసము నుండి ఇప్పుడు ౨౪ వ భాగమును తెలుసుకొందాం.

" కామార్తాహి ప్రకృతి కృపణా శ్చేతనాశ్చేతనేషు " అని కాళిదాసు చెప్పినట్లు తీవ్రమైన సీతా విరహ క్లేశమును పొందిన శ్రీరాముడు చెట్టును పుట్టను సీత గురించి అడుగుతూ దురంగా కనిపిస్తున్న చిగిర్చిన రేల చెట్టును చూచి, అది సీత చీర చెరగుగా భావిస్తాడు.
ఆ:-
అదిగొ! సీత అంబుజాప్త కరోద్దీప్త
మైన చీర చెఱగు లాఱ నేగు.
దవ్వు భ్రాంతిదంబు దగ్గఱకును. చిగి
ర్చినదియిద్ది లేత రేల కొమ్మ. { వి.రా.క.కి.కాం.నూ.౨౪ }

అదిగో నాసీత. ఎండకు ప్రకాశిస్తున్న చీర చెఱగులో వెళ్తున్నది. అయ్యో దూరమునకు సీత వలె భ్రమింప జేసిన యిది ఒక చిగిర్చిన రేల చెట్టు కొమ్మ. దూరంగా గాలికి ఊగుతున్న రేల కొమ్మ తన కొమ్మ అయిన సీతమ్మగా భ్రమించాడు శ్రీరాముడు. ఇది కూడ ఉన్మాద అవస్థయే. విప్రలంభ మహాపద వలన పుట్టిన భ్రాంతి యందు ఒక దానిని చూసి మరొక దానిగా భ్రమ పడు చిత్త వృత్తి విశేషము కూడ ఉన్మాదమే.

రస పోషణ యందు మహా కవులు అనుసరించు పద్ధతినే విశ్వనాధ యనుసరించుచు తన ప్రతిభ చేత ప్రతి పద్యమును వినూత్నముగా సృష్టించినాడు యీ ఘట్టములో. రసాస్వాదనము వలన పాఠకునికి ఆనందము పుట్టును. ఆ రసానందము అనుభవించు వానికి తక్కిన ప్రపంచము తెలియదు. శృంగారాది రసముల వలన ఆనందము కలుగును కాని కరుణ భీభత్స భయానక రసముల వలన ఏ వీధముగా ఆనందము కలుగును? అని కొందరు శంకించ వచ్చును. కాని ఈ శంక సరి కాదు. రసములన్నిటి వలన ఆనందమే కలుగును.

ఇంకను ఆలంకారికులు ఏమన్నారంటే సముద్రంలో అలలు పుట్టుచు అడగుచు, మరల పుట్టుచు నశిస్తూ ఉంటాయి. అలాగే విభావానుభావ సాత్విక భావములచే స్తాయీ భావము సువ్యక్తము కాగా సంచారీ భావములు రసమునకు సహాయ పడును. అట్టి భావములతో కూడిన రసము తొలుత నాయికా నాయకులందు ఉండును. వారి చరిత్రను అభినయించు నటీ నటుల ద్వారా ఆ రసము (భావము) ప్రేక్షకులకే కలుగును. నాయికా నయకుల సుఖ దుఃఖములు ప్రేక్షకుడు తనవిగా భావించు కొనును. సరిగా యిట్టి యవస్థయే కావ్య పఠనమున సహృదయునకు సంభవించును. అదే కావ్యానందము. ఆ ఆనందము బ్రహ్మానంద సహోదర మన్నారు పెద్దలు. ఆ ఆనందమును విశ్వనాధ రామాయణ కల్ప వృక్షమున సహృదయుడగు పాఠకునకు అపారముగా లభించు ననుటలో ఏమాత్రము సందేహము లేదు.

చూచాం కదండి. సమయం చిక్కి నప్పుడు మళ్ళీ కలుదాం.
జైహింద్.

27, జూన్ 2009, శనివారం

కవిసమ్రాట్ విశ్వనాథ భావుకత 22 & 23

2 comments

సన్మిత్రులారా! స్వాగతం.
ప్రస్తుతం మనం కవి వతంస శ్రీ బులుసు వేంకటేశ్వర్లు గారి ఉపన్యాసములనుండి శ్రీ విశ్వనాధ రచన లోని భావుకతను ౨౧ వ భాగం వరకు తెలుసుకొన్నాం కదా! ఇప్పుడు ౨౨ మరియు ౨౩ భాగాలు తెలుసుకొందామా? ఐతే ఆలస్య మెందుకు పరికించండి.

సీతను రాక్షసులు ప్రాణాలతో ఉంచుతారా? అని నిరాశ పడిన శ్రీరాముడు మరు క్షణమే ఆశావహుడై తనను తాను సమాశ్వాసించుకొంటున్నాడు.

క:-
ఇది యొక ఆశా వృక్షము
మొదలు మొదలు చివరిదాక భువి ప్రాణులకున్
బ్రదుకుల జగత్తు కట్టిన
యది. నేనిందొక్క రెమ్మనై యారతముల్. { వి. రా. క. వృ. కి. నూ. ౨౨ }

భూమి యందలి ప్రాణులకు వాటి బ్రతుకు జగత్తు కట్టిన ఆశా వృక్షము ఈ సృష్టి. ఈ మహా వృక్షము లోని అనేక శాఖల పైని గల అనేకానేక రెమ్మలలో నేను ఒక రెమ్మను. కనుక ఈ ఆశా నిరాశల నడుమ నాకీ ఆరాటము తప్పదు.
విష్ణ్వవతారముగ భువియందవతరించిన శ్రీరాముడి ఈహ నిరీహల మధ్య, ఆశ నిరాశల నడుమ ఊగిసలాడు సామాన్య మానవుడు అను శ్రీరామ అవతార రహస్యమును విశ్వనాధ రాముని మాటలలో ధ్వనింప జేయుచున్నాడు.

వాల్మీకి రామాయణమున ‘నాలం వర్తయితుం సీతా సాధ్వీమద్విరహంగతా ’ అని నైరాశ్యమును పొందిన శ్రీరాముడు -ఒక కాకి కూతను ఆలంబనముగా పొంది సీతలభించగలదని పక్షికూయుచున్నదని సంతోషపడును. ‘పక్షీమాంతు విశాలాక్ష్యాః సమీపముపనేష్యతి!!

కానీ విశ్వనాధ ఒక చిన్న పద్యముతో శ్రీరాముడు తనను తాను ఊరడించుకొను మాటలలో సృష్టి రహస్యము మానవ ప్రకృతిని తెలిపినాడు్.

మానవుడు ఆశాజీవి. దురంతమైన కష్టముల నుండి, వేదనల నుండి- ఇడుములనుండి భాధలనొందుచునే ఆశాతంతువుల ఆధారముచే లోకయాత్రను నడుపుకొనును. పతనం నుండి ఉత్ధానంవైపు నడిపించేది ఆశ! ఆశ లేనిచో ఈ సృష్టి ఎక్కడిది?

ఎప్పుడైతే శ్రీరాముడు ఆశావహుడైనాడో ఆయన సీతకై అన్వేషణ ప్రారభించును!

తే:-
‘నష్టసారంగపతి సమాకృష్టయామె
సంగతాకృష్టముగ్ధ సారంగ వీవు
విప్రతీప దశాగత పృథ్వి తనయ
నీకు కన్పించెనా! చెప్పవే! కదంబ! (కిష్కింధ. నూపురఖండం-23)

" అపాయన్ని తెచ్చిపెట్టేలేడిని చూసి ముచ్చట పడినది సీత - లేళ్ల చేత సేవించబడుతున్నావు నీవు! కష్టదశలో ఉండి విలపిస్తున్న సీత నీకు కన్పించిందా?" అని శ్రీరాముడు జాలిగా కడిమి చెట్టును అడుగుతాడు!

సీతాపహరణము వల్ల కలిగిన కష్టము. సీతా విరహము వల్ల కలిగిన సేగివల్ల చేతనా చేతనములందు బేధమును
గుర్తిం చ లేని వాడయ్యాడు రాముడు. లేళ్లు కడిమి చెట్టునీడను ఆశ్రయించి విశ్రాంతి పొందుచుండగా్ మాయలేడిచేత కష్టమును పొందిన సీత గుర్తుకు వచ్చి. ఆచెట్టునే సీతాదేవిని చూచితివా? అని అడుగును.

ఇది విరహావస్థలోని సంచారీ భావమునకు ఉప లక్షణము. " అనయంబు చేతనాచేతన సదృశ మనో భ్రమంబు ధర ఉన్మాదము ". అని కావ్యాలంకార సంగ్రహము నిర్వచనము. చేతనా చేతనములందు సమానమైన చిత్త భ్రాంతి ఉన్మాదము. శ్రీరాముని ప్రస్తుత అవస్థ ఇది.

విరహావస్థయందలి ఈ సంచారి భావమునే ప్రాతిపదికగా చేసుకొని మేఘసందేశము మొదలగు రసవత్కావ్యములు పుట్టినవి.

ఇట్టి (ఉన్మాద) స్థితిలోని రాముని దైన్యము రసహృదయులను కంటతడిపెట్టించును.

శ్రీ బులుసు కవీశ్వరుల భావనా పటిమచే విశ్వనాధ భావుకత మనకు ప్రస్ఫుటము అవడం ముదావహం.
జైహింద్.

23, జూన్ 2009, మంగళవారం

సాహితీ మిత్రులారా! నేనిప్పుడు సౌ భాగ్య నగర వాసిని.

17 comments

శ్రీమదాంధ్రామృత పాననాసక్త చిత్తులారా! సుమనర్నమస్సులు. కొంత కాలంగా అంతర్జాలం అందుబాటులో నాకు లేక పోయిన కారణంగా నేను మీ అందరికీ దూరమవ వలసి వచ్చింది. మన్నింప మనవి. నేను ప్రస్తుతం చోడవర గ్రామము నుండి సకుటుంబంగా మన సౌభాగ్య నగరానికి మకాం మార్చానని తెలియఁజేయుటకు ఆనందంగా వుంది. ఆనంద కారణ మేమిటంతారా! మన బ్లాగ్మిత్రుల కాలవాలమై భాగ్య నగరం సౌభాగ్య నగర మైందని నేను భావిస్తున్నాను. అట్టి సౌభాగ్య నగరాన మీ అందరికీ అత్యంత సమీపంగా నే నుండ గలగడమే నా ఆనంద కారణం. మీ అందరి నుండి అనేకసాహిత్యాంశములు బ్లాగుల ద్వారానే కాక ముఖాముఖీగా కూడా తెలుసుకొనే సదవకాశం నాకు లభించి నట్లుగా భావిస్తున్నాను. మీ అందరి సహకారం తప్పక నేను పొందగలనని నేను భావిస్తున్నాను. నా సెల్ నెమ్బరు 9247272960.

జైహింద్.

2, జూన్ 2009, మంగళవారం

శ్రీ షిరిడీశ దేవ శతకము. కవితాభినందనం.

2 commentsతెలుగు సాహిత్యంలో శతక రచన అగ్ర స్థానం పొంది యున్నది. కవులు తమ అనుభవాల్ని - ఆశల్ని - ఆర్తితో - ఆనందంతో చెప్పుకొనడానికి చక్కని వీలుంది శతక రచన లోనే! లౌకిక అలౌకిక భావాలు ప్రక్క ప్రక్కనే చెప్పుకోడానికి ఒక్క శతక ప్రక్రియలోనే అవకాశం కలుగుతుంది.

పూర్వం అంటే ఇప్పటికి ముప్ఫై నలభై ఏళ్ళ క్రితం పల్లెల్లో సాధారణ రైతులు కూడా సమయోచితంగా శతక పద్యాల్ని తమ సంభాషణల్లో ఉదహరిస్తూ మాటలాడేవారు. అలాగే అప్పటి గృహ లక్ష్ములు కూడా చక్కని తెలుగులో జాతీయాల సౌరభాలు గుబాళించే లాగ మాటలాడే వారు. ఇప్పటి తరం పిల్లలకి అనివార్యంగా సంకర తెలుగు మాటలాడే దౌర్భాగ్యం వచ్చింది.

సాధారణంగా ఉద్యమమైనా ప్రజలనుంచి వస్తేనే అది కార్య రూపం ధరిస్తుంది. కొందరు విద్యావంతుల ఆశల్ని ముందుగా పసిగట్టి రాజకీయ నాయకులు వారిని సంతృప్తి పరచడం కోసం ఆయా విషయాల్ని ఉద్యమాలుగా ప్రచారం చేస్తారు. దానితో అది రాజకీయ అజెండాలో చేరి ఒక పార్టీ ప్రణాళికలో అంశంగా చేరిపోతుంది. అంతే ఇంక అది ఎక్కడ వేసిన గొంగళీ అక్కడే అన్నట్లు తయారు అవుతుంది. పది మందిలో పాము చావదు అన్నట్లు కాలంలో బడి నలుగుతూ ఉంటుంది. ప్రస్తుతం తెలుగు భాష ఔజ్వల్యం అలాగే తయారయింది. అందుకనే మాతృ భాషలో విద్యా బోధన అనే విప్లవం ప్రజల్లోంచి రావాలి. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మాధ్యమం ప్రవేశ పెట్టినప్పుడు ప్రజల్లోంచి తగినంత స్పందన రాలేదు.

నేపథ్యం అంతా ఎందుకంటే ప్రస్తుతం అధునిక కవులు కూడా శతకాలు వ్రాస్తున్నారు. శతక ప్రక్రియ వెనక బడ లేదు. కొంచెం తన ప్రణాళీకను మార్పు చేసుకొని, అనేకానేక అంశాలు స్పృశిస్తూ ముందుకు సాగుతోంది. భక్తి శతకమే అయినా అనివార్యంగా సమాజం లోని అనేక కోణాల్ని చూపుతోంది ఈనాటి శతకం. శ్రీ షిరిడీశ దేవరా! అన్న మకుటంతో 108పద్యాల్లో సాగిన శతకం మిత్రులు శ్రీ చింతా రామ కృష్ణా రావు గారు రచించారు.వీరు తెలుగు అధ్యాపకునిగా పని చేసారు. సాహిత్య మిత్రులు. ఆంధ్ర, ఆంగ్ల సాహిత్యాలను ఆపోశన పట్టిన పండితులు. సమాజాన్ని నిశితంగా పరిశీలించే హృదయం కలవారు. దీనులయెడ సహానుభూతి కలిగిన ఉత్తమ సంస్కారవంతులు. అందుకే శతకం నిండా సమాజం లోని చీకటి కోణాల నుండి అనేకానేక అసమంజస విషయాలపై కవి తీర్పు లుంటాయి. వేదన లుంటాయి. ఆశావహ దృక్పథంతో కూడిన సందేశాలుంటాయి. ఏతావాతా శ్రీ చింతా రామ కృష్ణా రావు గారి శతకం భక్తితో పాటు లోకజ్ఞతను కూడ పంచి పెడుతుంది పాఠకులకు.

పద్య నిర్మాణంలో కూడా ఈ కవి చాలా
సిద్ధ హస్తులు. పద్యం గోదావరిలా సాగి పోతుంది. భావ కూలంకషయై మనల్ని నివ్వెఱ పరుస్తుంది. అభ్యుదయ భావాలు, దేశ భక్తి ప్రపూర్ణమైన భావనలూ ఈ శతకంలో దర్శనమిస్తాయి.
యువ తరాన్ని ఎంతగా శ్లాఘించారో ఈ కవి.
ఉ:-
భారత మాత రక్షణము భవ్య మహోజ్వల భావిఁ గొల్పగా,
ధీరులు, సజ్జనావళి విధేయులు, మా యువ భారతీయులే
కారణ భూతు లయ్య. కలి కల్మష దూరులఁ జేయుమయ్య. నీ
వారికి శక్తి నీయుమయ భవ్యుడ! శ్రీ షిరిడీశ దేవరా! 47

యువతకు దేశ భక్తి - రక్షణా శక్తి - యీయుమని సాయిని ప్రార్థించడం హర్షణీయం.

అలాగే స్త్రీలను వేధించే వారిని వీరు చాలా గర్హించారు.
"
అద్వైతం సుఖ దుఃఖయోః" అంటూ దాంపత్య బంధాన్ని ఎంత గొప్పగా భవభూతి చెప్పాడో. అట్టి దాంపత్య బంధాల్ని తృణీకరించే "పురుష పుంగవుల్ని" వీరు చాలా సూటిగా, కరుకుగా విమర్శించారు. " కన్నులఁ బెట్టి కావుమయ! కాంతల" నంటూ సాయి దైవాన్ని ప్రార్థిస్తారు. చాలా పద్యాల్లో వీరి సంస్కార హృదయం దర్శనమిస్తోంది. చక్కని పోలికలు కూడా కనిపిస్తాయి.
" శరీరము గుమ్మడి పండులా గుట్టుగా కుళ్ళి నశిస్తుంది" అని అంతారు. ఎంత మంచి పోలిక! గుమ్మడి పండు కంటికి బాగానే కనిపిస్తున్నట్లుంటుంది. కాని లోపల కుళ్ళిన సంగతి మనకు తెలియదు దానిని తాకేదాకా!

ఉ:-
నీ దరి చేరు వాడనయ! నీ శతకంబుఁ బఠించు వాడ. స
మ్మోదము తోడఁ గాంచుమయ! మూలము నీవయి కావుమయ్య! యా
వేదనఁ బాపుమయ్య! నినుఁబ్రీతిగ చూడగ చేయుమయ్య. యీ
మేదిని పైన నన్ గనుమ మేలుగ. శ్రీ షిరిడీశ దేవరా! 98

పద్యం వీరి భక్తి, మోక్షము యెడల వీరికి గల కాంక్ష, సాయిపై గల ప్రేమనూ ప్రత్యక్షరం ప్రత్యక్షం చేస్తున్నది.

ఇలా శతక మంతా ఉదహరించ వలసి వస్తుంది మంచి మంచి పద్యాల కోసం. పాఠకులుగా మీరు శతకంలో ఎలాగూ ప్రవేశిస్తారు. కాబట్టి ఈ ముందు మాటను ముగిస్తున్నాను.

శ్రీ చింతా రామ కృష్ణా రావు గారు తమ చిక్కని, చక్కని భావాల్ని పద్య రూపంగా మలచి, శిరీష కుసుమ పేశలంగా సాయి శతకంగా రచించి, ఆ దేవ దేవునకు సమర్పించి, మనకు చక్కని మాధుర్య కవిత్వ ప్రసాదం పెట్టారు. ఈ శతకాన్ని కన్నుల కద్దుకొని ఆస్వాదించ వచ్చును.

మిత్రులు శ్రీ చింతా రామ కృష్ణా రావు గారు ఇతోధికంగా సాహిత్య సేవ చేస్తూ - పరిణతి చెందిన తమ కవితా ధోరణిని మంచి కావ్యాలు రచించాలని, మనసారా ఆకాంక్షిస్తూ - అభినందిస్తున్నాను.
బులుసు వేంకటేశ్వర్లు,
కల్ప వృక్షం,
చిట్టివలస.

1, జూన్ 2009, సోమవారం

కవిసమ్రాట్ విశ్వనాథ భావుకత 20 & 21

0 comments

క:-
ఆవిష్కృత్యబిముఖ నవ
భావజ సుమనో మనోజ్ఞబంధుర హేలా
జీవన వసంత వేళా
యౌవతమును బోలు కాననాంతర వల్లుల్. (వి. ర. క.వృ. కి. నూ. 20)

శ్రీరాముని
దృష్టి కాననాంతర వల్లుల పై ప్రసరించినది. ఆ అడవి యందలి పూల తీగలు ఎట్లున్నవి? యువతీ సమూహము వలె ఉన్నవట. ఆ తీగల యందలి పువ్వులు తమ యందు పుట్టు చున్న మన్మధ భావములను తెలుపుచున్న హేలల వలె ఉన్నవట.

శృంగార భావోద్దీప్తుడైన రాముని యందు సీతా స్పృహ నిర్నిమిత్తముగానే కలుగు చున్నది. పూల తీగలు అంగమైన యువతుల వలె కనిపింపగా పూవులు బాల్య యౌవన దశాంతర పరిణాహములైన ఆ యువతుల హేలా విలాసములుగా భావించుట రమ్యతరమైన కల్పన. యౌవనమును జీవన వసంత వేళగా విశ్వనాధ రూపించినాడు. హేల యనునది ఒక శృంగార చేష్ట. బాల్య యౌవన దశల సంధి యందు పుట్టిన అంతః కరణ వికారమును వ్యక్తమును చేయు చేష్ట అని ఆలంకారికుల నిర్వచనము.

ఇట్లు సీతా సంబంధమైన ఊహ చేసిన మరు క్షణమే శ్రీరాముడు " సీత జీవించి ఉన్నదా? జీవించి యుండుట నా భ్రాంతియా?" అని వితర్కించుకొనును. ఎందువల్లననగా శ్రీరాముని మన్మధ స్పృహకు ఆలంబనము సీత. ఆమె లేనిచో ఇక స్పృహ ఎక్కడిది? నాయికా నాయకులు వ్యవస్తితులై ఉన్నప్పుడే రస నిర్వహణ కదా!

ఇక్కడ కవి చాల గడుసుగా విప్రలంభ శ్రుంగార రసనిర్వహణ చేయుచున్నాడు. ప్రతి భావమును ప్రతిభావంతముగా తీర్చి దిద్దిన కవి విశ్వనాధ.

సీత జీవించి యున్నదో? లేదో? అన్న వితర్కము రాముని మనస్సులో ఉద్భవించిన మరుక్షణము ఆయన వ్యాకుల హృదయముఇట్లు ఘోషించినది.
మ:-
ఉదితే దృఙ్మధు మాస వంచితుడనేమో సీత జీవించి యు
న్నదటన్నాశయు లేదు నాకును అరణ్యానీ సమాసన్న సం
పదయౌ బాల రసాల సూన విభవ ప్రాకృష్ట సృష్ట్యాదిమో
హ దళత్కామము గాక దైత్యులు సతిన్ ప్రాణాలతో నుంతురా? (వి. రా. క. వృ. కి. నూ. 21)

ఈ వసంతం నన్ను వంచించడం వల్ల సీత జీవించి యున్నదని అనుకొంటున్నానేమో! అసలామె ప్రాణాలతో ఉన్నదా! ఈ అదవికి కొత్తగా వచ్చిన సంపద యైన ఈ గున్న మామిడి పూత నాలో సృష్ట్యాది సహజమైన కామమును రెచ్చ కొట్టినది కాని రాక్షసులు సీతను అసలు ప్రాణాలతో ఉంచి ఉండరు, అని రాముడు నిస్పృహుడై సీత యునికినే శంకించును. అడవికి కొత్తగా వచ్చిన సంపద గున్న మమిడి పూత యొక్క సౌందర్యము రాముణ్ణి మిక్కిలి మోహ పరచినవి. చైత్ర వైశాఖ మాసము లందు అడవి అంతయు వసంత శోభతో వెలిగిపోవుతున్నది.

ఈ పద్యంలో అడవికి కొత్తగా వచ్చిన సంపద అనగా వసంతముతో పాటు సీతయు స్ఫురించును. మరియు సీత లేత గున్న మావి పూవు వలె అత్యంత సుకుమారి. సౌందర్యవతి. అట్టి సీత కాముకులైన రాక్షసుల చేతిలో పడినది. అసలు సీతను రాక్షసులు బ్రతుకనిత్తురా! అన్నది రాముని ఆవేదన.

బాల రసాల సూనము నాలో మన్మధ వాంఛను రెచ్చగొట్టినదని రాముడు పలుకు చున్నాడు. అరవిందం - అశోకం - చూతం - నవమల్లిక - నీలోత్పలం , ఇవి మన్మధుని బాణాలు. ఈ బాణాలలో చూత మనగా మావి పూత. సమ్మోహనము కలిగిస్తుంది. అందుకే విశ్వనాధ ఈ మధు మాసము చేత నేను వంచింప బడుచున్నానేమో అని రాముని చేతనే అనిపించెను.

పద్యములను పదే పదే పఠించి, భావించగా సహృదయుని మనస్సులో అనేకానేక ఆలోచనలు ఉద్భవించి, ఆనందము కలిగించును. అప్పుడే కదా సాహిత్యం ఆలోచనామృతం అన్న మాట సార్థకం అవుతుంది!

చూచాం కదండి శ్రీ బులుసు వేంకటేశ్వర్లు వెలువరించిన విశ్వనాధ కల్ప వృక్షంలో నిబిడీకృతమై యున్న భావుకతని? మరో పర్యాయం మరో పద్యం తెలిపే ప్రయత్నం చేయగలను.

జైహింద్.