గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

31, అక్టోబర్ 2022, సోమవారం

ఉత్తమః పురుషస్త్వన్యః - ...15 - 17...//....యస్మాత్క్షరమతీతోహమక్షరా- , , .15 -18,,,//.....పురుషోత్తమయోగము

0 comments

 జైశ్రీరామ్

|| 15-17 ||

శ్లో.  ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మేత్యుధాహృతః|

యో లోకత్రయమావిశ్య బిభర్త్యవ్యయ ఈశ్వరః.

తే.గీ.  ఉత్తమంబైనపూరుషుండుండె నతడె

చూడ పరమాత్మ, యుండి తా నీడవోలె

నంతటన్ మ్రోయు జగతిని సాంతమతడె

కలడు లేడన్యుడెరుగుమా యిలను పార్థ!

భావము.

ఉత్తమ పురుషుడు వేరే ఉన్నాడు. అతడిని పరమాత్మ అంటారు. నాశనము 

లేని ఆ ఈశ్వరుడు మూడు లోకాలలో ప్రవేశించి వాటిని భరిస్తాడు.

|| 15-18 ||

శ్లో.  యస్మాత్క్షరమతీతోహమక్షరాదపి చోత్తమః|

అతోస్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః.

తే.గీ. క్షరముకన్ననతీతుడక్షరముకన్న

మిన్న నేనేను కనుకనే మన్ననమున

వెలుగుదున్ వేదములను నేన్ సులలితముగ

నీవు గ్రహియించు నా కీర్తి నేర్పు మీర.

భావము.

నేను క్షరానికి అతీతుడిని మరియు, అక్షరుడికన్నా కూడా ఉత్తముడినికనుక 

ఈ లోకములోనూ వేదములోనూ పురుషోత్తముడిగా కీర్తింపబడ్డాను.

జైహింద్.

30, అక్టోబర్ 2022, ఆదివారం

అనంతచ్ఛంద సమూహసారథిబ్రహ్మశ్రీ తోపెల్లబాలసుబ్రహ్మణ్యశర్మ గారికి సువర్ణ సింహతలాట సత్కారము...

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి 13వ శతావధానం-విశ్వవ్యాప్తంగా 108మహిళ...ధారణాఘట్టము.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

సర్వస్య చాహం హృది - ...15 - 15...//....ద్వావిమౌ పురుషౌ లోకే- , , .15 -16,,,//.....పురుషోత్తమయోగము

0 comments

 జైశీరామ్.

|| 15-15 ||

శ్లో.  సర్వస్య చాహం హృది సన్నివిష్టో

మత్తః స్మృతిర్జ్ఞానమపోహనఞ్చ|

వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో

వేదాన్తకృద్వేదవిదేవ చాహమ్.

తే.గీ.  జనుల మదులలోనుందును, జ్ఞానము, మరు

పు, తలపులు, జ్ఞాపకములును పొలయజేయు

దు, విదుడన్ వేదముల నేనె,  ప్రవిమలమతి

నరయుమర్జునానీవిది యహము విడిచి.

భావము.

ఇక నేను అందరి హృదయాలలో ప్రవేశించి ఉన్నాను. నానుండే జ్ఞానము, 

జ్ఞాపకము, మరుపూ కలుగుతాయి. అన్ని వేదాల ద్వారా తెలియబడవలసిన 

వాడిని నేనే, వేదాంతాన్నిచేసిన వాడిని, వేదాన్ని తెలుసుకునే 

వాడిని కూడా నేనే.

|| 15-16 ||

శ్లో.  ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ|

క్షరః సర్వాణి భూతాని కూటస్థోऽక్షర ఉచ్యతే.

తే.గీ.  పార్థ!క్షరుడునక్షరుడిల వరలుచుంద్రు,

కూటవర్తియక్షరుడెన్న, కూర్మిని గను

క్షరుడు నశియించిపోవును, ధరను నిజము.

నిరుపముండక్షరుండుడు నిత్యముగను.

భావము.

లోకములో క్షరుడూ, అక్షరుడు అనే ఇద్దరు పురుషులు ఉన్నారు. అన్ని 

ప్రాణులు క్షరమైనవి. కూటస్థుణ్ణి అక్షరుడంటారు.

జైహింద్.

29, అక్టోబర్ 2022, శనివారం

గామావిశ్య చ భూతాని ధార - ...15 - 13...//....అహం వైశ్వానరో భూత్వా- , , .15 -14,,,//...14వ అధ్యాయము. ...పురుషోత్తమయోగము

0 comments

జైశ్రీరామ్.

 || 15-13 ||

శ్లో.  గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజసా|

పుష్ణామి చౌషధీః సర్వాః సోమో భూత్వా రసాత్మకః.

తే.గీ.  పృథ్విలోనికి నే జొచ్చి పుడమి జీవ

కోటినే మోయుచుంటిని  మేటిగాను,

శశిగ నోషధులిచ్చుచుచక్కగాను

వృక్షవృద్ధిని చేసెడి వెన్నుడనయ.

భావము.

భూమిలోనికి ప్రవేశించి ప్రాణులందరిని నేను నా శక్తితో భరిస్తాను. ఇంకా 

రసాత్మకుడైన చంద్రుడిని అయి ఓషధులన్నింటికీ పుష్టి ని ఇస్తాను.

|| 15-14 ||

శ్లో.  అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః|

ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్.

తే.గీ.  నేను వైశ్వానరుండను, ప్రాణికోటి

నాశ్రయించి యపానప్రాణమొదల

యినటువంటివానినిగూడుచునలవిధము

లుగను నారగింతును భుక్తి జగతిలోన.

భావము.

నేను వైశ్వానరుణ్ణి అయి ప్రాణుల శరీరాన్ని ఆశ్రయించి, ప్రాణ ఆపానములతో 

కలిసి నాలుగు రకముల అన్నాన్ని ఆరగిస్తాను.

జైహింద్.

28, అక్టోబర్ 2022, శుక్రవారం

యతన్తో యోగినశ్చైనం - ...15 - 11...//....యదాదిత్యగతం తేజో- , , .15 -12,,,//...14వ అధ్యాయము. ...పురుషోత్తమయోగము

0 comments

 జైశ్రీరామ్

|| 15-11 ||

శ్లో.  యతన్తో యోగినశ్చైనం పశ్యన్త్యాత్మన్యవస్థితమ్|

యతన్తోऽప్యకృతాత్మానో నైనం పశ్యన్త్యచేతసః.

తే.గీ.  సాధనముచేత యోగికి సాధ్యపడును

ఆత్మలోన్నదైవంబునరయువిధము,

జ్ఞాన హీనులకునసాధ్యమౌను కనుట

సాధనముచేయుచున్నను సద్గుణాడ్య!

భావము.

సాధన చేసే యోగులు తమ ఆత్మలో ఉన్న భగవదంశను చూడకలరు. 

మనస్సు పరిపక్వము కాని వారు వివేకహీనులు సరైన జ్ఞానము 

లేనందువలన సాధన చేసినా చూడలేరు.

|| 15-12 ||

శ్లో.  యదాదిత్యగతం తేజో జగద్భాసయతేऽఖిలమ్|

యచ్చన్ద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకమ్.

తే.గీ.  చంద్రసూర్యాగ్నులరయుచు జగతికిడెడి

తేజమంతయు నాదని ధీవరేణ్య!

తెలుసుకొనుమయ్య, నా శక్తి, దీప్తి, యుక్తి

తెలివిగా నీవు శ్రద్ధతో తెలుసుకొనుము.

భావము.

జగత్తు నంతటినీ వెలిగించే సూర్యునిలో, చంద్రునిలో, అగ్నిలో ఉన్న 

తేజస్సు ఏదో అది నాదని తెలుసుకో.

జైహింద్.

27, అక్టోబర్ 2022, గురువారం

శ్రోత్రం చక్షుః స్పర్శనం చ - ...15 - 9...//....ఉత్క్రామన్తం స్థితం వాపి- , , .15 -10,,,//...14వ అధ్యాయము. ...పురుషోత్తమయోగము

0 comments

జైశ్రీరామ్. 

 || 15-9 ||

శ్లో.  శ్రోత్రం చక్షుః స్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ|

అధిష్ఠాయ మనశ్చాయం విషయానుపసేవతే.

తే.గీ. ఇంద్రియమ్ములషట్కమ్మునెక్కి జీవి

విషయలోలుడై జీవించు విలువ మరచి,

ప్రకృతి ధర్మమునకు జీవి పట్టుబడును

తెలియుమిది సత్యమును గను తెలివిగాను.

భావము.

చెవీ, ముక్కూ, కన్నూ, నాలుకా, చర్మమూ, మనస్సు వీటిని అధిష్టించి 

జీవుడు విషయాలను అనుభవిస్తాడు.

|| 15-10 ||

శ్లో.  ఉత్క్రామన్తం స్థితం వాపి భుఞ్జానం వా గుణాన్వితమ్|

విమూఢా నానుపశ్యన్తి పశ్యన్తి జ్ఞానచక్షుషః.

తే.గీ.  దేహముననున్న, పోయినన్ మోహమగ్న

మూఢులెన్నరు దైవమున్ పూజ్యులయిన

జ్ఞానులెన్నుదురునిజంబు, కాన, కనుము‌

సత్యపథమున నడువుము చక్కగాను.

భావము.

శరీరము నుండి నిష్క్రమించేటప్పుడు కానీ, శరీరంలో ఉన్నప్పుడు కానీ 

విమూఢులు ఈయనను చూడరు. జ్ఞానులు మాత్రమే చూస్తారు.

జైహింద్.

26, అక్టోబర్ 2022, బుధవారం

శతాధిక పురస్కారగ్రహీత్ రాధాశ్రీ తన సాహెతీ జీవిత స్వర్ణోత్సవం సందర్భంగా నన్ను సత్కరించుచున్నసన్నివేశం.

0 comments

 జైశ్రీరామ్.

జైశ్రీరామ్.

 

రాధశ్రీ సాహిత్య స్వర్ణోత్సవము సందర్భముగా సమర్పించిన

అభినందన పంచ రత్నావళి.తే.16 . 10 . 2022

రచన…సమర్పణ …చింతా రామకృష్ణారావు.

రాధశ్రీ

శా.  శ్రీమన్మంగళ భారతీ జనని! రాశీభూత కందప్రభా

      ధాముండై వెలుగొందుచున్న మన రాధాశ్రీ కవిన్ బ్రేమతో

      క్షేమంబొప్పగ కావుమమ్మ సతమున్, శ్రేయంబులన్ గూర్చుచున్,

      ధీమంతుండగు వీరి సేవ గొనుచున్ దీవించు మీ సత్కవిన్.


శ్రీ రాధాశ్రీ నామ గోపన చిత్రము.

ఉ.  శ్రీమధురంపు సత్కవన చిద్వర తేజమదెట్లు కల్గె? ధా

      రా మధురార్ణవంబె యన వ్రాయక చెప్పుటదెట్లు వచ్చె? రా

      ధా మధురాక్షర ప్రభయె ధారణ శక్తిని గొల్పుటేట్లగున్?

      శ్రీమహనీయ మీ కృషియె చెప్పగ,  వీటికి నుత్తరంబగున్.


మ.శతవర్షంబులు సాహితీ సుధలకున్ సంకల్పమున్ జేయ నే

     డతులంబై యిట నిర్వహింపఁబడె ధ్యేయంబొప్ప  స్వర్ణోత్సవం

     బతి సామాన్యులు విన్న గాని పొగడంగా కందధారార్ణవం

     బతిలోకోత్తరమై స్రవించు మహితంబై వీరి కంఠప్రభన్.


మ. గతినావేశము నాప సాధ్యమగునా కందప్రభావృష్టిగా

     మతిమంతుల్ గణియించి మెచ్చునటులన్ గానంబుగా వెల్వడన్

     క్షితి, మీ సేవలనెన్నలేముకద మీ కీర్తిన్ దెసల్ నిండెగా,

     కృత పుణ్యుల్ కద మీరలెన్న భువిపై  క్షేమంబుగా వెల్గుడీ!

 

ఉ.మంగళ మౌత మీకునిల, మాన్యమహోదయ! కందభాస్కరా!

    మంగళమౌత మీ కవన మాధురికిన్, పరమార్థ సేవకున్,

    మంగళముల్ సుధామధుర మాన్య కవిత్వ కవీశ్వరాళికిన్,

    మంగళమౌత శ్రీ భరత మాతకు నిత్య సుమంగళంబులౌన్.

   

మంగళమ్           మహత్         శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ

జైహింద్.

మమైవాంశో జీవలోకే - ...15 - 7...//.... శరీరం యదవాప్నోతి- , , .15 - 8,,,//...14వ అధ్యాయము. ...పురుషోత్తమయోగము

0 comments

 జైశ్రీరామ్

|| 15-7 ||

శ్లో.  మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః|

మనఃషష్ఠానీన్ద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి.

తే.గీ.  నా సనాతనాంశయె జీవి, యాశ గొలిపి

ప్రకృతి నుండి యాకర్షించు భ్రమనుచెంది

యింద్రియంబులవశమయి యిలను చెలగు

జీవి ననుచూడజాలమిన్ చేరలేడు.

భావము.

సనాతనమైన నా అంశే జీవలోకములో జీవుడిగా మారి, ప్రకృతినుండి 

మనస్సుతో కూడిన ఆరు ఇంద్రియాలను ఆకర్షిస్తుంది.

|| 15-8 ||

శ్లో.  శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరః|

గృహీత్వైతాని సంయాతి వాయుర్గన్ధానివాశయాత్.

తే.గీ. దేహమీశుండు పొందినన్, దేహమువిడి

పోయినప్పుడునింద్రియ మాయఫలము

లంది గొనిపోవుచుండుననవరతము,

నీవు గ్రహియింపుమర్జునా నేర్పుమీర.

భావము.

ఈశ్వరుడు శరీరాన్ని పొందినప్పుడూ, విడిచినప్పుడూ వాయువు పూలలోంచి 

వాసనను తీసుకుపోయే విధముగా ఈ ఆరింటిని తీసుకొని ప్రయాణిస్తాడు.

జైహింద్.

25, అక్టోబర్ 2022, మంగళవారం

మా యింటికి వచ్చి మాకానందం కలిగించిన డా.సంగనభట్ల నరసయ్య మహోదయులు.

0 comments

 జైశ్రీరామ్.

డా.సంగనభట్ల నరసయ్య మహోదయులు ఈ రోజు అభిమానంతో 

మాయింటికి వచ్చి మాకందరికీ ఆనందం కలిగించారు. 

వారికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియఁజేసుకొంటున్నాను.

ఉ.  సంగనభట్లవంశ నరసయ్య మహోదయ! సంతసంబు, మీ

సంగతి, పుణ్య సత్ఫలము, సౌమ్యగుణాలయ! దివ్యమైన సం

పంగి మహత్వతావియగు పల్కులు మీవి  శుభావహంబులే

బెంగలు లేని జీవితము ప్రీతినిమీకు నృసింహుడిచ్చుతన్.

జైహింద్.

నిర్మానమోహా జితసఙ్గదోషా - ...15 - 5...//....న తద్భాసయతే సూర్యో న- , , .15 - 6,,,//...14వ అధ్యాయము. ...పురుషోత్తమయోగము

0 comments

 జైశ్రీరామ్

|| 15-5 ||

శ్లో.  నిర్మానమోహా జితసఙ్గదోషా

అధ్యాత్మనిత్యా వినివృత్తకామాః|

ద్వన్ద్వైర్విముక్తాః సుఖదుఃఖసంజ్ఞైర్-

గచ్ఛన్త్యమూఢాః పదమవ్యయం తత్.

తే.గీ.  దూర మానమోహు లసంగులారయాత్మ

జ్ఞాన పూర్ణులవాంఛులున్ కనగ నేర్త్రు

రవ్యయానందమున్ మూఢరహితులగుచు

నీవు గ్రహియింపుమర్జునా నేర్పుమీర.

భావము.

మానవ మోహాన్ని త్యజించిన వాళ్ళూ, సంగదోషాన్ని జయించిన వాళ్ళూ, 

సదా ఆత్మ జ్ఞానంలో నిమగ్నమైన వారు, విషయ వాంఛలన్నీ వెనుకకు 

మరలించిన వాళ్ళూ, సుఖ దుఃఖాలనే ద్వందాలనుండి విముక్తులైన వారు, 

మూఢత్వము పోయి అవ్యయ పదాన్ని చేరు కుంటారు.

|| 15-6 ||

శ్లో.  న తద్భాసయతే సూర్యో న శశాఙ్కో న పావకః|

యద్గత్వా న నివర్తన్తే తద్ధామ పరమం మమ.

తే.గీ.  ఆ పరమగు పథము నాది, యదిగనినను

ముక్తులగుదురు, వెలిగింప పోల రెరుగ

రవి,శశియు,నగ్నియున్, మార్గమవగతమగు

నీవు గ్రహియింపగల్గినన్ నేర్పుమీర.

భావము.

ఆ పదాన్ని సూర్యుడు, చంద్రుడు, అగ్ని వెలిగించరు. ఎక్కడకు వెళితే 

తిరిగి రారో అది నా పరమ ధామము

జైహింద్.

24, అక్టోబర్ 2022, సోమవారం

ఒకప్పుడు మల్లయోధుడు ! నేడు నడిచే మంత్రం - Kurtala Peetadhipathi Sri Sidd...

0 comments

జైశ్రీరమ్.
జైహింద్.

గణపతి తాళమ్.....Ganapathi Thalam #mantras

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

న రూపమస్యేహ తథోపలభ్యతే - ...15 - 3...//....తతః పదం తత్పరిమార్గితవ్యం- , , .15 - 4,,,//...14వ అధ్యాయము. ...పురుషోత్తమయోగము

0 comments

 జైశ్రీరామ్

|| 15-3 ||

శ్లో.  న రూపమస్యేహ తథోపలభ్యతే

నాన్తో న చాదిర్న చ సమ్ప్రతిష్ఠా|

అశ్వత్థమేనం సువిరూఢమూలం

అసఙ్గశస్త్రేణ దృఢేన ఛిత్త్వా.

తే.గీ.  దాని రూపముండదటుల తలచిచూడ,

దాని తుదిమొదల్ కనరావు, దాని నిల న

సంగభావంబుతో చెండి,  పొంగదగును.

నీవు గ్రహియింపుమర్జనా! నేర్పుమీర.

భావము.

దాని రూపము ఆ ప్రకారము(తల క్రింద ఉండే చెట్టులా)ఇక్కడ కనిపించదు. 

దాని మొదలూ, తుదీ, ఆధారము ఏవీ కనిపించదు. గట్టిగా పాతుకు పోయిన 

ఈ అశ్వత్థానిని దృఢమైన అసంగ భావమనే ఆయుధంతో ఛేధించి,

|| 15-4 ||

శ్లో.  తతః పదం తత్పరిమార్గితవ్యం

యస్మిన్గతా న నివర్తన్తి భూయః|

తమేవ చాద్యం పురుషం ప్రపద్యే|

యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణీ.

తే.గీ.  ఎక్కడికిపోవనికరారొ యెరిగి వెతుక

వలయు, సృష్టి యెవరినుండి వరలు నతని

నాదిపురుషుని శరణంబు ననుపమగతి

వేడుదును నేను ముక్తికై వేల్పతండె.

భావము.

ఆ తరవాత ఎక్కడికి పోతే మరలా తిరిగి రారో ఆ స్థానాన్ని వెదకాలి. 

ఎవరినుండి ఈ పురాతన సృష్టి కార్యము ప్రారంభము ఐనదో , 

ఆ ఆది పురుషుణ్ణే నేను శరణు వేడుతాను

జైహింద్.

మీకు దీపావళి శుభాకాంక్షలు.

0 comments

 

జైశ్రీరామ్.

ఒం నమో నారాయణాయ.

ఈ రోజు దీపావళి పర్వదినము మనలో ఉన్నజీవాత్మ పరమాత్మలనే 

సత్యాకృష్ణులు షట్ శతృవులూ ఏకమై ఉన్న నరకుని సంహరించి 

అనంత తేజస్సు అనే దీపావళిని ప్రకాశింప చేసిన దినము. ఈ సందర్భముగా 

 సత్యా కృష్ణుల దివ్య ఆశీస్సులు మనందరికీ లభించాలని ఆకాంక్షిస్తూ 

మీకు నా శుభాకాంక్షలు తెలియఁజేస్తున్నాను.

జైశ్రీకృష్ణ.

జైహింద్.

23, అక్టోబర్ 2022, ఆదివారం

అనంత చ్ఛందము అపురూప గ్రంథావిష్కరణ...Dr.Nanduri Ramakrishnama charya's Sata jayanti Celebrations ||

0 comments

జైశ్రీరామ్.

జైహింద్.

ఊర్ధ్వమూల మధఃశాఖ - ...15 - 1...//....మాంచయోవ్యభిచారేణ- , , .15 - 2,,,//...14వ అధ్యాయము. ...పురుషోత్తమయోగము

0 comments

జైశ్రీరామ్. 

అథ పఞ్చదశోధ్యాయః - పురుషోత్తమయోగః

శ్రీభగవానువాచ|.

భావము.

శ్రీ భగవానుడన్నాడు:

|| 15-1 ||

శ్లో.  ఊర్ధ్వమూల మధఃశాఖ మశ్వత్థం ప్రాహురవ్యయమ్|

ఛన్దాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్.

తే.గీ.  మొదలు పైకి, శాఖలుక్రిందికి దలప నుండు

నందురశ్వత్థమును ఘనులరసిచూడ

నాకులే ఛందములు, దీని నరయువారు

వేదవిదులర్జునా, కాంచు ప్రీతితోడ.

భావము.

మొదలు పైకి శాఖలు క్రిందకు ఉన్న అశ్వత్థమును అవ్యయమైనదని పె

ద్దలు చెప్తారు. దాని ఆకులు ఛందస్సులు. దీనిని ఎరిగినవాడు వేదాలను 

ఎరిగినట్లే.

|| 15-2 ||

శ్లో.  అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖా

గుణప్రవృద్ధా విషయప్రవాలాః|

అధశ్చ మూలాన్యనుసన్తతాని

కర్మానుబన్ధీని మనుష్యలోకే.

తే.గీ.  క్రిందికిన్ బైకి బెరుగుచు బంధనములు

భూమిపై పెంచు, నీశాఖ లేమనందు,

మాయలోముంచి మనలను మదనపరచు,

నీవు గ్రహియింపుమర్జునా నేర్పు మీర.  

భావము.

దానికొమ్మలు క్రిందికి పైకి విస్తరించుకొని ఉన్నాయి. గుణాలచే పెరుగుతాయి. 

విషయ వస్తువులనే చిగుళ్ళు కలవి. కర్మలలో బంధిస్తాయి. దాని వేళ్ళు క్రింద 

బాగా పాతుకొని మనుష్య లోకం అంతా వ్యాపించి కర్మలతో బంధిస్తాయి.

జైహింద్.

22, అక్టోబర్ 2022, శనివారం

బ్రహ్మణో హి ప్రతిష్ఠాహమమృత - ...14 - 27...//....చతుర్దశోధ్యాయః - గుణత్రయవిభాగయోగః

0 comments

 జైశ్రీరామ్

|| 14-27 ||

శ్లో.  బ్రహ్మణో హి ప్రతిష్ఠాహమమృతస్యావ్యయస్య చ|

శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాన్తికస్య చ.

తే.గీ.  అవ్యయామృత, శాశ్వత, భవ్య ధర్మ

రూపము, నఖండ, సద్ఫ్రహ్మ రూపమునకు

నునికిపట్టు నేనర్జునా!కనుము మదిని,

నీవు గ్రహియింపుమియ్యది నేర్పు మీర.

భావము.

అవ్యయమైన, అమృతమైన, శాశ్వతమైన, ధర్మ స్వరూపమైన, అఖండానంద 

స్వరూపమైన బ్రహ్మస్వరూపమునకు ఉనికిపట్టుగ మూలాధార్ముగ నున్నది 

నేనే కదా.

ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు

బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే

గుణత్రయవిభాగయోగో నామ చతుర్దశోऽధ్యాయః

జైహింద్.

21, అక్టోబర్ 2022, శుక్రవారం

మానావమానయోస్తుల్య - ...14 - 25...//....మాంచయోవ్యభిచారేణ- , , .14 - 26,,,//...చతుర్దశోధ్యాయః - గుణత్రయవిభాగయోగః

0 comments

 జైశ్రీరామ్.

|| 14-25 ||

శ్లో.  మానావమానయోస్తుల్యస్తుల్యో మిత్రారిపక్షయోః|

సర్వారమ్భపరిత్యాగీ గుణాతీతః స ఉచ్యతే.

తే.గీ.  ఎవడు మానావమానము లెంచు సమము

శత్రుమిత్రులన్ సమముగ ధాత్రి గనుచు

సర్వకర్మలారంభముల్ చక్కగ విడి

చిమెలగు నతడు జితగుణుడు మహి పార్థ!

భావము.

మానావమానములందు సమచిత్తముతోనుండి, శత్రుమిత్రులందు సముడై 

సర్వ కర్మలను పరిత్యజించి ఎవడు సర్వదా చిదాకాశ దైవప్రఙ్ఞతో 

ప్రకాశించుచుండునో వాడే త్రిగుణాతీతుడని చెప్పబడుచున్నాడు.

|| 14-26 ||

శ్లో.  మాంచయోవ్యభిచారేణ భక్తియోగేన సేవతే|

స గుణాన్సమతీత్యైతాన్బ్రహ్మభూయాయ కల్పతే.

తే.గీ. భక్తితోనన్నెవడిలను పరవశించి

కొలుచు త్రిగుణంబులన్  దాను గెలుచి, బ్రహ్మ

తత్వ మెరుగుచున్ బొందును ధరను నిజము,

నీవు గ్రహియింపుమర్జునా నేర్పుమీర.  

భావము.

ఎవడు అచంచలమైన భక్తియోగముతో నన్నే సేవించుచున్నాడో వాడే 

ఈ త్రిగుణములను సులభముగ నతిక్రమించి బ్రహ్మాకాశ విశ్వగర్భస్వరూపమును 

పొందుట కర్హుడగుచున్నాడు.

జైహింద్

20, అక్టోబర్ 2022, గురువారం

ఉదాసీనవదాసీనో - ...14 - 23...//.....సమదుఃఖసుఖః స్వస్థః - , , .14 - 24,,,//...చతుర్దశోధ్యాయః - గుణత్రయవిభాగయోగః

0 comments

 జైశ్రీరామ్.

|| 14-23 ||

శ్లో.  ఉదాసీనవదాసీనో గుణైర్యో న విచాల్యతే|

గుణా వర్తన్త ఇత్యేవం యోవతిష్ఠతి నేఙ్గతే.

తే.గీ. తెలియు నెవ్వడు చర్యలు త్రిగుణములవ

నుచును, తానుదాసీనుడై యచలితమతి

నుండునో చిదాకాశ మందుండు వాడు, 

త్రిగుణములనుజయించిన ధీరుడతడు.

భావము.

ఎవడు ప్రకృతిగుణములే ప్రవర్తించుచున్నవని తెలిసి, ఉదాసీనుడై ఉండి, 

త్రిగుణములచే చలింపక చిదాకాశ స్వరూపస్థితిలో సదా విలసిల్లుచుండునో 

వాడే త్రిగుణాతీతుడు.

|| 14-24 ||

శ్లో.  సమదుఃఖసుఖః స్వస్థః సమలోష్టాశ్మకాఞ్చనః|

తుల్యప్రియాప్రియో ధీరస్తుల్యనిన్దాత్మసంస్తుతిః.

తే.గీ.  దుఃఖ సుఖములన్ సమముగా, తోచు నెవని

కిలను మట్టియు పుత్తడి నెంచ నొకటి

గా కనునెవండు, తిట్లుపొగడ్తలొక్క

టిగనె నెన్ను గుణాతీతునిగగణించు.

భావము.

సమ దు:ఖ అనంత చిదాకాశ స్వరూపమందు స్థిరుడై, సుఖదు:ఖములందు 

సమముగనుండి, మట్టిని, రాతిని, బంగారమును సమముగ జూచుచు, ఇష్టానిష్ట 

వస్తుప్రాప్తితో సమచిత్తమునే కలిగి దూషణభూషణములందు చలింపక, ధీరుడై 

ఎవడు విలసిల్లునో వాడే త్రిగుణాతీతుడు.

జైహింద్.

19, అక్టోబర్ 2022, బుధవారం

కైర్లిఙ్గైస్త్రీన్గుణానేతానతీతో - ...14 - 21...//.....ప్రకాశం చ ప్రవృత్తిం చ - , , .14 - 22,,,//...చతుర్దశోధ్యాయః - గుణత్రయవిభాగయోగః

0 comments

 జైశ్రీరామ్

అర్జున ఉవాచ

భావము.

అర్జునుడిట్లనియెను:

|| 14-21 ||

శ్లో.  |కైర్లిఙ్గైస్త్రీన్గుణానేతానతీతో భవతి ప్రభో|

కిమాచారః కథం చైతాంస్త్రీన్గుణానతివర్తతే.

తే.గీ.  త్రిగుణ దూరుడెట్లుండును? దీనబంధు!

యెట్లు వర్తించునోయాత?డెట్లతండు

త్రిగుణములనుజయించును? దేవదేవ

తెలియ జెప్పుమా నాకిల తెల్లమవగ.

భావము.

హే ప్రభో! సత్త్వరజస్తమోగుణములను మూడింటిని అతిక్రమించినవాడు 

ఏ లక్షణములతో నుండును? వాని వర్తన ఎట్లుండును? ఈ త్రిగుణములను 

వాడెట్లు అతిక్రమించుచున్నాడు?

శ్రీభగవానువాచ|

భావము.

శ్రీ భగవానుడిట్లనియెను

|| 14-22 ||

శ్లో.  ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహమేవ చ పాణ్డవ|

న ద్వేష్టి సమ్ప్రవృత్తాని న నివృత్తాని కాఙ్క్షతి.

తే.గీ. త్రిగుణ సంభవ ఫలములన్ దిట్టడెవడొ,

విడిచిపెట్టిన వాటిపై ప్రీతి వీడి

మరలనాశింపడో, వాడె మహితుడిలను,

త్రిగుణ దూరుడై వర్ధిల్లు ప్రగణితముగ.

భావము.

హే పాండవా! సంప్రాప్తములైన సత్త్వగుణ సంబంధమగు ప్రకాశమును, 

రజోగుణ సంబంధమగు కర్మప్రవృత్తిని, తమోగుణ సంబంధమగు 

మోహమును ఎవడు ద్వేషింపడో, ఇవి విడిచిపోయినచో వీటిని 

తిరిగి కోరడో అట్టివాడు త్రిగుణాతీతుడగును.

జైహింద్.

18, అక్టోబర్ 2022, మంగళవారం

నాన్యం గుణేభ్యః కర్తారం - ...14 - 19...//.....గుణానేతానతీత్య త్రీన్దేహీ - , , .14 - 20,,,//...చతుర్దశోధ్యాయః - గుణత్రయవిభాగయోగః

0 comments

 జైశ్రీరామ్.

|| 14-19 ||

శ్లో.  నాన్యం గుణేభ్యః కర్తారం యదా ద్రష్టానుపశ్యతి|

గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోధిగచ్ఛతి.

తే.గీ.  కర్మలన్ ద్రిగుణప్రకృతి కాంక్ష గొలిపి

చేయజేయును, నేన గాదు చేయువాడ

నాత్మ నాకాశమేనంచు నాత్మనెన్ను

వాడు సన్ముక్తుడై తాను వరలగలడు.

భావము.

ఎవడు సర్వకర్మలను ప్రేరేపించి చేయునది త్రిగుణాత్మిక ప్రకృతితప్ప 

అన్యమెవరూ కాదనియు, తానీప్రకృతికంటె వేరైన గగనాత్మ స్వరూపునిగ 

నెపుడు తెలియునో అపుడు వాడు నా అనంత చిదాకాశ విశ్వగర్భస్వరూపమునే 

పొందుచున్నాదు.

|| 14-20 ||

శ్లో.  గుణానేతానతీత్య త్రీన్దేహీ దేహసముద్భవాన్|

జన్మమృత్యుజరాదుఃఖైర్విముక్తోమృతమశ్నుతే.

తే.గీ.  త్రిగుణ దూరుడౌ జీవుడు  ప్రగణితముగ

నైహికంబగు బాధలనధిగమించి

జననమరణముల్ లేనట్టి చక్కనైన

ముక్తిసన్మార్గమందున పొలుపుగాంచు.

భావము.

దేహోత్పత్తికి కారణభూతములైన ఈ త్రిగుణముల నతిక్రమించి జీవుడు 

జనన మరణ వార్ధక్య దు:ఖములనుండి విముక్తుడై జననమరణములులేని 

అమృత చిదాకాశ దైవస్వరూపమును పొంది శాశ్వతముగ శోభిల్లుచున్నాడు.

జైహింద్.

17, అక్టోబర్ 2022, సోమవారం

తే.22 - 10 - 2022న విశాఖపట్టణంలో అనంత ఛందస్సౌరభము.

0 comments

 జైశ్రీరామ్.

జైహింద్.

కొప్పరపు కవుల విషయమై డా.ధూళిపాళ మహాదేవమణి మహోదయుల స్పందన.

0 comments

జైశ్రీరామ్.
కొప్పరపు కవుల విషయమై   డా.ధూళిపాళ మహాదేవమణిమహోదయుల స్పందన.
జైహింద్.

సత్త్వాత్సఞ్జాయతే జ్ఞానం - ...14 - 17...//.....ఊర్ధ్వం గచ్ఛన్తి సత్త్వస్థా - , , .14 - 18,,,//...చతుర్దశోధ్యాయః - గుణత్రయవిభాగయోగః

0 comments

జైశ్రీరామ్

 || 14-17 ||

శ్లో.  సత్త్వాత్సఞ్జాయతే జ్ఞానం రజసో లోభ ఏవ చ|

ప్రమాదమోహౌ తమసో భవతోజ్ఞానమేవ చ.

తే.గీ.  సద్వివేక సుజ్ఞానము సత్వమిచ్చు

ఘన దురాశ, లోభము, రజోగుణమొసంగు,

తమమె యజ్ఞానమున్ బ్రమాదములనిడును,

నీవు గ్రహియింపుమర్జునా నేరైపుమీర.

భావము.

సత్త్వగుణమువలన వివేకముతో కూడిన ఙ్ఞానము కలుగుచున్నది. 

రజోగుణమువలన తరగని ఆశయను లోభము జనించుచున్నది.

తమోగుణముచే అఙ్ఞాన ప్రమాదములు కలుగుచున్నవి.

 || 14-18 ||

శ్లో.  ఊర్ధ్వం గచ్ఛన్తి సత్త్వస్థా మధ్యే తిష్ఠన్తి రాజసాః|

జఘన్యగుణవృత్తిస్థా అధో గచ్ఛన్తి తామసాః.

తే.గీ.  సత్వమూర్థ్వలోకములిచ్చు సన్నుతముగ,

రాజసంబున భూమిపై ప్రజననమగు,

నీచజననంబు తమముననేలభించు

నీవు గ్రహియింపుమర్జునా నేర్పుమీర.

భావము.

సత్వగుణమందున్నవారు స్వర్గాది ఊర్ధ్వలోకములను పొందుచున్నారు. 

రజోగుణము కలవారు మధ్యమమగు మనుష్యలోకమును పొందుచున్నారు. 

నీచగుణవృత్తులు గల తమోగుణము కలవారు అధోలోకమును అనగా 

మనుష్యులలో హీనులుగాగానీ పశుపక్ష్యాదులుగగానీ జన్మించుచున్నారు.

జైహింద్.

16, అక్టోబర్ 2022, ఆదివారం

రజసి ప్రలయం గత్వా - ...14 - 15...//.....కర్మణః సుకృతస్యాహుః - , , .14 - 16,,,//...చతుర్దశోధ్యాయః - గుణత్రయవిభాగయోగః

0 comments

 జైశ్రీరామ్.

|| 14-15 ||

శ్లో.  రజసి ప్రలయం గత్వా కర్మసఙ్గిషు జాయతే|

తథా ప్రలీనస్తమసి మూఢయోనిషు జాయతే.

తే.గీ.  కర్మ సంగిగా జన్మంబు కలుగజేయు

మృతి రజోవృద్ధిలోగాంచ క్షితిని పార్థ!

తమవివృద్ధిలో మృత్యువు ధర్మహీన

మూఢునింటనో పశువుకో పుట్టజేయు.

భావము.

రజోగుణము అభివృద్ధిలో నున్నపుడు మరణించినచో కామ్య కర్మాసక్తులగు 

మనుష్యుల కుటుంబములందు తిరిగి జన్మించుచున్నాడు. తమోగుణము 

అభివృద్ధిలోనున్నపుడు మృతినొందినచో ఙ్ఞానహీనులైన మూఢుల 

వంశమునందుగానీ, పశుపక్ష్యాదులలోగానీ పుట్టుచున్నాడు.

|| 14-16 ||

శ్లో.  కర్మణః సుకృతస్యాహుః సాత్త్వికం నిర్మలం ఫలమ్|

రజసస్తు ఫలం దుఃఖమజ్ఞానం తమసః ఫలమ్.

తే.గీ. సాత్వికంబది కలిగించు సత్ఫలంబు,

రాజసంబున దుఃఖంబు ప్రాప్తమగును,

తామసంబున నజ్ఞాన తమము కలుగు,

నీవు గ్రహియింపుమర్జునా నేర్పుమీర.

భావము.

సాత్త్వికములైన మంచి కర్మలను చేయుటచే నిర్మల శాంతిసుఖములే 

ఫలమనియు, రజోకర్మలను చేయుటచే సాంసారిక సుఖదు:ఖములే 

ఫలమనియు, తామసి కర్మలచే అఙ్ఞానమే ఫలమనియు తత్వవేత్తలు చెప్పిరి.

జైహింద్.

15, అక్టోబర్ 2022, శనివారం

అప్రకాశోప్రవృత్తిశ్చ - ...14 - 13...//.....యదా సత్త్వే ప్రవృద్ధే తు - , , .14 - 14,,,//...చతుర్దశోధ్యాయః - గుణత్రయవిభాగయోగః

0 comments

 జైశ్రీరామ్.

|| 14-13 ||

శ్లో.  అప్రకాశోప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ|

తమస్యేతాని జాయన్తే వివృద్ధే కురునన్దన.

తే.గీ.  మది తమోగుణవృద్ధిచే మందమతియు,

భ్రమయు, దానిచే నష్టము, వరలుచుండు

పతనమార్గాన పడిపోయి యతులితమగు

జీవితమువ్యర్థమయిపోవు జీవులకును.

భావము.

హే కురునందనా! తమోగుణము వృద్ధిలో నున్నపుడు బుద్ధి

మాంద్యము, అఙ్ఞాన భ్రమతో కూడిన ప్రమాదములు కలుగుచున్నవి.

|| 14-14 ||

శ్లో.  యదా సత్త్వే ప్రవృద్ధే తు ప్రలయం యాతి దేహభృత్|

తదోత్తమవిదాం లోకానమలాన్ప్రతిపద్యతే.

తే.గీ.  సత్వగుణవృద్ధిలోనుండి మహత్వమయిన

మృత్యు వొందినన్ ఘనులట్లు మేల్తరమగు 

ముక్తినొందుదురర్జునా యుక్తమదియె

జీవమొందినవానికి జీవితమున.

భావము.

దేహధారియగు జీవుడెపుడు సత్త్వగుణము అభివృద్ధిలో నుండగా 

మరణించునో, అపుడు ఉత్తమ ఙ్ఞానులు పొందెడు నిర్మలమైన 

లోకములను పొందుచున్నాడు.

జైహింద్.

14, అక్టోబర్ 2022, శుక్రవారం

సర్వద్వారేషు దేహేస్మి - ...14 - 11...//.....లోభః ప్రవృత్తిరారమ్భః - , , .14 - 12,,,//...చతుర్దశోధ్యాయః - గుణత్రయవిభాగయోగః

0 comments

 జైశ్రీరామ్

|| 14-11 ||

శ్లో.  సర్వద్వారేషు దేహేస్మిన్ప్రకాశ ఉపజాయతే|

జ్ఞానం యదా తదా విద్యాద్వివృద్ధం సత్త్వమిత్యుత.

తే.గీ.  ఈ శరీరమందున్న సర్వేంద్రియముల

ను నయ విజ్ఞానమే ప్రసరణము జరుగు

చున్న సత్వసంవర్ధన మున్నదనుచు

మదిని భావింపుమర్జునా! మాన్యవర్య!

భావము.

ఈ దేహమందున్న సర్వేంద్రియముల ద్వారా విఙ్ఞాన ప్రకాశమే 

ప్రసరించుచున్నప్పుడు సత్త్వగుణము బాగా వృద్ధి చెంది శోభిల్లిచున్నదని 

తెలియవలెను.

|| 14-12 ||

శ్లో.  లోభః ప్రవృత్తిరారమ్భః కర్మణామశమః స్పృహా|

రజస్యేతాని జాయన్తే వివృద్ధే భరతర్షభ.

తే.గీ.  మది రజోగుణవృద్ధిచే మహితమయిన

లోభమును, కామ్యకర్మలలోన మునిగి

శాంతి నశియించుచుండి యాశ పెరుగుచును

పతనమార్గంబుపట్టుట క్షితిని జరుగు.

భావము.

ఓ అర్జునా! రజోగుణము వృద్ధిలోనున్నపుదు లోభత్వము, కామ్యకర్మల 

నారంభించి వాటిలో మునిగి వర్తించుట, ఇంద్రియనిగ్రహము, 

మనశ్శాంతిలేకుండుట, మిక్కుటమైన ఆశ మొదలైనవి కలుగుచున్నవి.

జైహింద్.

13, అక్టోబర్ 2022, గురువారం

సత్త్వం సుఖే సఞ్జయతి రజః - ...14 - 9...//.....రజస్తమశ్చాభిభూయ సత్త్వం - , , .14 - 10,,,//...చతుర్దశోధ్యాయః - గుణత్రయవిభాగయోగః

0 comments

 జైశ్రీరామ్.

 || 14-9 ||

శ్లో.  సత్త్వం సుఖే సఞ్జయతి రజః కర్మణి భారత|

జ్ఞానమావృత్య తు తమః ప్రమాదే సఞ్జయత్యుత.

తే.గీ.  సత్వగుణమది కలిగించు శాంతి, సుఖము,

కొల్పు డాంబికంబులు రజోగుణము తెలియ,

చెడ్డనెన్నుచు గూర్చుచున్ జెరచు తమము,

అర్జనా గ్రహియింపుమీవనవరతము.

భావము.

ఓ అర్జునా! సత్త్వగుణము శాంతిసుఖములను కలిగించుచున్నది. రజోగుణము 

భోగములకై బాహ్య కర్మాడంబరములను కలిగించుచున్నది. తమోగుణమన్నచో 

మంచిపనిని చేయించక చెడును చేయించి ప్రమాదమును కలిగించుచున్నది.

 || 14-10 ||

శ్లో.  రజస్తమశ్చాభిభూయ సత్త్వం భవతి భారత|

రజః సత్త్వం తమశ్చైవ తమః సత్త్వం రజస్తథా.

తే.గీ.  సత్వ మధికంబుగానున్న జరుపు మంచి,

అధికమై యొప్పు రజముతా నైహికమిడు,

తమమెబలమైన చెరచును తలచిచూడ

దైవబలముచే సత్వమున్ నీవు కనుము.   

భావము.

హే భారతా! సత్త్వగుణము రజస్తమోగుణముల కంటే శక్తితోనున్నపుడు వాటిని 

అణచి ఙ్ఞానసుఖాదులను కలిగించును. అట్లే రజోగుణము సత్త్వతమస్సులకంటే

 బలముగనున్నపుడు వాటిని అణచి అనేక కర్మలయందు ఆశక్తిని కలిగించును. 

అట్లే తమోగుణము సత్త్వరజోగుణములకంటే అధికముగ నున్నపుడు ఙ్ఞాన 

శూన్యతతో ప్రమాదములను కలిగించును.

జైహింద్.

12, అక్టోబర్ 2022, బుధవారం

24వ తేదీన దీపావళి | లక్ష్మీ నరసింహాచార్యులుయాదాద్రి క్షేత్ర ప్రధానార్చకు...

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

రజో రాగాత్మకం విద్ధి - ...14 - 7...//..... తమస్త్వజ్ఞానజం విద్ధి - , , .14 - 8,,,//...చతుర్దశోధ్యాయః - గుణత్రయవిభాగయోగః

0 comments

 జైశ్రీరామ్.

|| 14-7 ||

శ్లో.  రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసఙ్గసముద్భవమ్|

తన్నిబధ్నాతి కౌన్తేయ కర్మసఙ్గేన దేహినమ్.

తే.గీ.  కన రజోగుణమాశలన్ గలుగజేయు

ధనముగా గలవానిపై దానివలన

బంధనము కల్గునాత్మకు, బౌతికేచ్ఛ

పెరిగి కర్మబందంబునన్ జిక్కు పార్థ! వినుము.

భావము.

ఓ అర్జునా! రజోగుణము ఆశాపాశముచే కలిగి ధనాది లోకవిషయములయెడ 

రాగము కలుగజేయునని ఎరుంగుము. అందుచే రజోగుణము దేహమందున్న 

ఆత్మను ఐహిక సుఖములందాసక్తిని కలిగించి వాటికై అనేక కర్మలను చేయించి 

బంధించుచున్నది.

 || 14-8 ||

శ్లో.  తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినామ్|

ప్రమాదాలస్యనిద్రాభిస్తన్నిబధ్నాతి భారత.

తే.గీ.  తమమె యజ్ఞాన జనితము, దానివలన

నాత్మ నిద్రాదులన్ మున్గు ననవరతము

బద్ధకము హెచ్చి నిత్యమున్ పడుకొనుటను

జీవుడజ్ఞాన తమమున చెలగి మయు.

భావము.

హే భారతా! తమోగుణమన్నచో అఙ్ఞానముచే జనించిన దానినిగ నెరుంగుము. 

అది సర్వజీవులకు మోహమును, భ్రమను కలిగించి, అజాగ్రత్త, సోమరితనము, 

అతినిద్ర అనువానిచె ఆత్మను బంధించుచున్నది.

జైహింద్.

11, అక్టోబర్ 2022, మంగళవారం

సత్త్వం రజస్తమ ఇతి గుణాః - ...14 - 5...//..... తత్ర సత్త్వం నిర్మలత్వాత్ప్రకాశ - , , .14 - 6,,,//...చతుర్దశోధ్యాయః - గుణత్రయవిభాగయోగః

0 comments

 జైశ్రీరామ్

|| 14-5 ||

శ్లో.  సత్త్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతిసమ్భవాః|

నిబధ్నన్తి మహాబాహో దేహే దేహినమవ్యయమ్.

తే.గీ.  ప్రకృతి సిద్ధత్రిగుణములు, వరలుచుండి

దేహినివినాశరహితుని దేహదృష్టి 

నాశమగుదానిబంధించు, నయనిధాన!

నీవు గ్రహియింపుమియ్యది నేర్పు మీర.

భావము.

ఓ అర్జునా! ప్రకృతివలన బుట్టిన సత్త్వము, రజస్సు, తమస్సు అను 

మూడు గుణములును నాశరహితుడైన గగనాత్మను అనగా దేహిని నశించు 

దేహదృష్టిలోనే బంధించుచున్నది.

|| 14-6 ||

శ్లో.  తత్ర సత్త్వం నిర్మలత్వాత్ప్రకాశకమనామయమ్|

సుఖసఙ్గేన బధ్నాతి జ్ఞానసఙ్గేన చానఘ.

తే.గీ.  సత్త్వగుణమది మంచిది, సద్విషయము

లందు బంధించు నాశన మొందు దేహ

మునిల నర్జునుండా కనుము, నిజమీవు,

సత్యమరయగ యత్నించు నిత్యమరయ.

భావము.

పాపరహితుడవగు ఓ అర్జునా! సత్త్వరజస్తమోగుణములలో మొదటిదగు 

సత్త్వగుణము నిర్మలమైనదగుటచేతను ప్రకాశింపజేయునదై, 

ఆరోగ్యకరమైనదై,ప్రపంచసుఖములలో సంగమము కలిగించుటచేతను, 

శాస్త్రఙ్ఞానములో ఆసక్తిని, తృప్తిని కలిగించుటచేతను అంతవరకే ఉంచి 

బంధించుచున్నది.

జైహింద్.

10, అక్టోబర్ 2022, సోమవారం

భ భా భి భీ భు భూ.....చమత్కార శ్లోకము.

0 comments

 

జైశ్రీరామ్.
*భ భా భి భీ భు భూ....?*

*ధారానగరం లో భుక్కుండుడు  అనే ఓ గజ దొంగ వుండే వాడు. నగరంలో దొంగతనాలు చేసి చేసి వేరే రాజ్యానికి వెళ్లి పోయి మరీ సంవత్సరం తర్వాత తిరిగి వచ్చి మరీ దొంగతనాలు చేసే వాడు. కానీ వాడు ధన వంతుల ఇళ్ళలోనే దొంగతనం చేసే వాడు. ఆ సొమ్ములో చాలా భాగం బీదలకు పంచె వాడు. రాజ సైనికులు ఎంత ప్రయత్నించినా అతనిని పట్టుకొన లేక పోయే వారు. ఒకసారి ఒకరింటికి కన్నం వేస్తూ దొరికి పోయాడు. భటులు వాడిని రాజ సభ లో ప్రవేశ పెట్టినారు  యిన్ని సంవత్సరాలుగా దొంగతనాలు    చేసిన భుక్కుండుడికి మరణ శిక్ష విధించాలి అని మంత్రి, యితర సభ్యులు రాజును కోరారు. తనకు రాజు  మరణ శిక్ష వేస్తారేమో నని వాడికి భయం వేసింది. యుక్తిగా ఈ శ్లోకం చెప్పాడు.*

  *"భట్టిర్నష్టః, భారవి శ్చాపి నష్టః*
*భిక్షుర్నష్ట:. భీమసేనోపి నష్టః*
*భుక్కుండో హం భూపతి: త్వం  రాజన్*
*భబ్భావళ్యామ్   అంతక:  సం నివిష్ట:*
 
అర్థము:-- *రాజా! నన్ను శిక్షించండి. కానీ నాకు ఒక్కటే భయం. మీరు గమనించారో లేదో భట్టి చనిపోయాడు, భారవి కవి కీర్తి శేషుడయ్యాడు, ఆ వెనకే భిక్షుకవి కూడా మరణించాడు, ఇటీవలే భీమకవి కూడా కాల ధర్మం చెందాడు, మరి నేను భుక్కుండుడిని. ఈ యమధర్మ రాజు 'భ' గుణింతాన్నే పట్టుకొని భట్టినీ, భారవిని, భిక్షు కవినీ, భీమ కవినీ తీసుకెళ్ళి పోయాడు. తర్వాత వాడిని నేను భుక్కుండుడిని. నన్ను తీసుకొని  పొతే భ భా భి భీ భు తర్వాత భూపతివి  నీవు, నీ పేరులో కూడా 'భ' కారం వుంది నా తర్వాత నీ వంతే నేమోనని, యింత మంచి రాజు మరణిస్తే ప్రజలకు గతి ఏమి? అని నేను భయ పడుతున్నాను. (పైన చెప్పిన కవులంతా  భోజుడి ఆస్థానం లోని కవులే) అన్నాడు.*

*రాజ దండన పొంద బోతూ కూడా ఇలా చమత్కారంగా శ్లోకం చెప్పడం రాజుకు నచ్చింది, నవ్వు వచ్చింది. నవ్వు ఆపుకుంటూ సరే!భుక్కుండా  ఈ సారికి నిన్ను వదిలేస్తున్నాను.  అని వాడికి కావలిసి నంత ధనం  యిచ్చి యిక ముందు దొంగతనాలు చేయ కుండా మంచిగా బ్రతుకు అని మందలించి వదిలేశాడు.*

*(భబ్భావళి అంటే 'భ' గుణింతం అంతక= యమ ధర్మరాజు సంవిష్ట: అంటే దృష్టి పెట్టిన వాడు)*       .  


జైహింద్.

యథా సర్వగతం సౌక్ష్మ్యా - ...14 - 3...//..... యథా ప్రకాశయత్యేకః కృత్స్నం - , , .14 - 4,,,//...చతుర్దశోధ్యాయః - గుణత్రయవిభాగయోగః

0 comments

 జైశ్రీరామ్

|| 14-3 ||

మమ యోనిర్మహద్ బ్రహ్మ తస్మిన్గర్భం దధామ్యహమ్|

సమ్భవః సర్వభూతానాం తతో భవతి భారత.

తే.గీ.  నే మహద్బ్రహ్మ, నా చేతనిరుపమాన

ప్రకృతి యోనిని చైతన్యభాసమాన

బీజ రూపమౌ జీవుని వేయుదునయ.

సృష్టి వర్ధిల్లు దీనిచే సహజముగనె.

భావము.

ఓ అర్జునా! మహద్బ్రహ్మయని చెప్పబడు నామూల ప్రకృతి యోనియందు 

నేను చైతన్య బీజ రూపమున జీవుని ఉంచుచున్నాను. అందువలన 

సర్వ భూతముల ఉత్పత్తి కలుగుచున్నది.

|| 14-4 ||

శ్లో.  సర్వయోనిషు కౌన్తేయ మూర్తయః సమ్భవన్తి యాః|

తాసాం బ్రహ్మ మహద్యోనిరహం బీజప్రదః పితా.

తే.గీ. పుట్టు జీవకోటికి తల్లి మూల ప్రకృతి,

బీజమునునాటు నేనౌదు పితృదేవు

ననుచు గ్రహియింపుమర్జునా! యనితరమగు

పురుష ప్రకృతులమీ సృష్టి మూలమయ్య.

భావము.

ఓ కౌంతేయా! దేవమానవ పశు పక్ష్యాది సకల యోనులందు పుట్టు 

దేహములన్నింటికిని, మహద్బ్రహ్మయగు మూల ప్రకృతి తల్లి యనియు, 

పరమేశ్వరుడనైన నేను అందు బీజమునుంచు తండ్రిననియు 

తెలియుము.

జైహింద్.

9, అక్టోబర్ 2022, ఆదివారం

యథా సర్వగతం సౌక్ష్మ్యా - ...14 - 1...//..... యథా ప్రకాశయత్యేకః కృత్స్నం - , , .14 - 2,,,//...చతుర్దశోధ్యాయః - గుణత్రయవిభాగయోగః

0 comments

జైశ్రీరామ్. 

చతుర్దశోధ్యాయః - గుణత్రయవిభాగయోగః

శ్రీభగవానువాచ|

భావము.

శ్రీభగవానుడిట్లనియెను

|| 14-1 ||

శ్లో.  పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమమ్|

యజ్జ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః.

తే.గీ.  వర చిదానంద సుజ్ఞానమెరుగుమీవు

మునులు దీనిన్ చిదానందఫూర్ణులగుచు

సిద్ధిపొందుదు రర్జునా!  సిద్ధమిదియె,

నీకు తెలిపెద వినుమీవు నేర్పుతోడ.

భావము.

సర్వ మునీశ్వరులును ఏ ఙ్ఞానమునెరుంగుట చేత సర్వోత్కృష్ఠమైన 

చిదానంద స్వరూప సిద్ధిని పొందిరో అట్టి అనంతమైన ఙ్ఞానములన్నిటిలో 

నుత్తమమైన చిదాకాశఙ్ఞానమును మరల చెప్పుచున్నాను.

 || 14-2 ||

శ్లో.  ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః|

సర్గేపి నోపజాయన్తే ప్రలయే న వ్యథన్తి చ.

తే.గీ.  పొంది యీ జ్ఞాన మెవరు నన్ పొందకలుగు

దురొమరలపుట్టబోరింక నిరుపమమగు

ముక్తిసామ్రాజ్యమున్ బొంది పొంగగలరు.

నీవు గ్రహియింపుమియ్యది నేర్పుతోడ.

భావము.

ఈ ఙ్ఞానమును పొంది నాలో నేకమై శోభిల్లువారు సృష్టికాలమున 

జన్మించరు. ప్రళయ కాలమున దు:ఖ పడరు. అనగా మృతినొందరు.

జైహింద్.

8, అక్టోబర్ 2022, శనివారం

క్షేత్రక్షేత్రజ్ఞయోరేవమన్తరం - ...13 - 35...//....త్రయోదశోధ్యాయః - క్షేత్రక్షేత్రజ్ఞవిభాగయోగః

0 comments

జైశ్రీరామ్ 

|| 13-35 ||

శ్లో.  క్షేత్రక్షేత్రజ్ఞయోరేవమన్తరం జ్ఞానచక్షుషా|

భూతప్రకృతిమోక్షం చ యే విదుర్యాన్తి తే పరమ్.

తే.గీ.  క్షేత్రమున మరి క్షేత్రజ్ఞు జెలగు భేద

మరసి భూతప్రకృతినుండి నిరుపమమగు

మోక్షమునుపొందు దృష్టితో పూజ్యులెవరు

తెలుసుకొందురో వారికి కలుగు ముక్తి.

భావము.

ఈ ప్రకారంగా క్షేత్రక్షేత్రజ్ఞుల భేదాన్ని, భూత ప్రకృతి నుండి మోక్షం పొందే 

పద్ధతిని జ్ఞాన దృష్టితో ఎవరు తెలుసుకుంటారో వాళ్ళు పరమ పదాన్ని 

చేరుకుంటారు. 

ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు

బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే

క్షేత్రక్షేత్రజ్ఞవిభాగయోగో నామ త్రయోదశోऽధ్యాయః

జైహింద్.

7, అక్టోబర్ 2022, శుక్రవారం

యథా సర్వగతం సౌక్ష్మ్యా - ...13 - 33...//..... యథా ప్రకాశయత్యేకః కృత్స్నం - , , .13 - 34,,,//...త్రయోదశోధ్యాయః - క్షేత్రక్షేత్రజ్ఞవిభాగయోగః

0 comments

 జైశ్రీరామ్.

 || 13-33 ||

శ్లో.  యథా సర్వగతం సౌక్ష్మ్యాదాకాశం నోపలిప్యతే|

సర్వత్రావస్థితో దేహే తథాత్మా నోపలిప్యతే.

తే.గీ.  వ్యాప్తభయియున్న నభమెట్టు లంటబఠదొ

దేని చేతను నట్టులే దేహికూడ

యంటబడదెందునున్నను నఖిలభతడె

యయియునర్జునాగ్రహియించు మనుపమముగ

భావము.

ఎలాగైతే అంతటా వ్యాపించి ఉన్న ఆకాశం సూక్ష్మ తత్వం వలన దేనిచేతా 

అంటబడదో, అలాగే దేహమంతటా వ్యాపించి ఉన్న ఆత్మ అంటబడదు.

 || 13-34 ||

యథా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకమిమం రవిః|

క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత.

తే.గీ.  సూర్యుడొక్కడే జగతికి శోభగూర్చు

కాంతినిచ్చుచు నట్టులే ఘనతరముగ

క్షేత్ర మంతనునొక్క యా క్షేత్రధారి

సత్ప్రకాశంబుతో నొప్ప  జక్కగ గను.

భావము.

ఓ భారతా! ఎలాగైతే సూర్యుడు ఒక్కడే ఈ యావత్తు లోకాన్ని 

ప్రకాశింప చేస్తాడో, 

అలాగే ఈ యావత్తు క్షేత్రాన్ని క్షేత్రధారి ఒక్కడే ప్రశింప చేస్తాడు.

జైహింద్.

6, అక్టోబర్ 2022, గురువారం

ప్రజాపత్రికలో నా లక్ష్మీసహస్రనామ పద్యావళిని గూర్చిన వార్త.

0 comments

 జైశ్రీరామ్.

ఇందు లక్ష్మీసహస్రమునకు బదులు పొరపాటున లలితా సహస్రము అని ప్రచురితమయియున్నది. గ్రహింప గలరు.

జైహింద్.

ఈ రోజు నా పుట్టిన తేదీ అని SRVD elight సీనియర్ సిటిజన్స్ వచ్చి నన్ను అభినందించిన సందర్భంగా...

0 comments

 జైశ్రీరామ్.

జైహింద్.

5, అక్టోబర్ 2022, బుధవారం

యదా భూతపృథగ్భావ - ...13 - 31...//..... అనాదిత్వాన్నిర్గుణత్వా - , , .13 - 32,,,//...త్రయోదశోధ్యాయః - క్షేత్రక్షేత్రజ్ఞవిభాగయోగః

0 comments

 జైశ్రీరామ్. 

|| 13-31 ||

శ్లో.  యదా భూతపృథగ్భావమేకస్థమనుపశ్యతి|

తత ఏవ చ విస్తారం బ్రహ్మ సమ్పద్యతే తదా.

తే.గీ.  మానవుండెప్పుడందరిన్ మనెడు వాడు

దైవమొక్కడంచెరుగునో  తత్వమరసి,

యతడెపో జ్ఞాని, బ్రహ్మం బునతడె చేరు.

పార్థ! నీవిది గ్రహియించి పరవసించు.

భావము.

ఎప్పుడైతే(మానవుడు)వేరు వేరుగా కనిపించే ప్రాణికోటి ఏకత్వము మీద

ఆధారపడి ఉన్నదని, అక్కడినుండే విస్తరించిందని నిరంతరము 

చూడగలుగుతాడో అప్పుడు బ్రహ్మాన్ని పొందుతాడు.

 || 13-32 ||

శ్లో.  అనాదిత్వాన్నిర్గుణత్వాత్పరమాత్మాయమవ్యయః|

శరీరస్థోపి కౌన్తేయ న కరోతి న లిప్యతే.

తే.గీ.  ఆది లేనట్టి యా బ్రహ్మ భవ్యయంబు,

దేహమందుండియున్ కర్మ మోహ రహితు

డతడు, కర్మలంటవతనికనుపమాను

డతడె బ్రహ్మంబు గ్రహియించు మర్జునాఖ్య!

భావము.

ఆది లేని వాడు నిర్గుణుడు కనుక, ఈ పరమాత్మ అవ్యయుడు. కౌంతేయా! 

శరీరంలో ఉన్నా అతడు కర్మ చెయ్యడు. ఆ కర్మ ఫలంతో మలినపడడు.

జైహింద్.

4, అక్టోబర్ 2022, మంగళవారం

సమం పశ్యన్హి సర్వత్ర - ...13 - 29...//..... ప్రకృత్యైవ చ కర్మాణి - , , .13 - 30,,,//...త్రయోదశోధ్యాయః - క్షేత్రక్షేత్రజ్ఞవిభాగయోగః

0 comments

 జైశ్రీరామ్.

|| 13-29 ||

శ్లో.  సమం పశ్యన్హి సర్వత్ర సమవస్థితమీశ్వరమ్|

న హినస్త్యాత్మనాత్మానం తతో యాతి పరాం గతిమ్.

తే.గీ.  సమముగా తాను సర్వత్ర నమరు హరిని

సమముగా గను పూజ్యుండు సన్నుతుడిల

తనను హింసించుకొననివా డనగవచ్చు,

పరమగతి బొందు నాతండు, పార్థవింటె?

భావము.

సర్వత్ర సమంగా ఉన్న ఈశ్వరుణ్ణి సమంగా చూసిన వాడే, తనని 

తాను హింసించుకోనివాడు. అతడు దానివలన పరమ గతిని చేరుకుంటాడు.

|| 13-30 ||

శ్లో.  ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః|

యః పశ్యతి తథాత్మానమకర్తారం స పశ్యతి.

తే.గీ.  కలుగువాటికి ప్రకృతే కారణమని

ఆత్మ యేమియు చేయబో దనుచు తలచు

నాతడే జ్ఞాని నిజము నీవరయుమిచట

పార్థ సత్యంబు నెరుగుము భవ్యమతిని.

భావము.

అన్ని విధాలైన కర్మలు ప్రకృతివలననే జరుగుతున్నాయని, ఆత్మ 

ఏమీ చెయ్యదనీ తెలిసినవాడే నిజమైన చూపు కలవాడు

జైహింద్.

3, అక్టోబర్ 2022, సోమవారం

యావత్సఞ్జాయతే కిఞ్చిత్స - ...13 - 27...//..... సమం సర్వేషు భూతేషు - , , .13 - 28,,,//...త్రయోదశోధ్యాయః - క్షేత్రక్షేత్రజ్ఞవిభాగయోగః

0 comments

 జైశ్రీరామ్

|| 13-27 ||

శ్లో. యావత్సఞ్జాయతే కిఞ్చిత్సత్త్వం స్థావరజఙ్గమమ్|

క్షేత్రక్షేత్రజ్ఞసంయోగాత్తద్విద్ధి భరతర్షభ.

తే.గీ.  స్థావరముజంగములనేది జగమునందు

కలదొ క్షేత్రముక్షేత్రజ్ఞులలిని నొప్ఫి

యున్నదేనని యెరుగుము మన్ననమున

పార్థ! నీవింక వినుతించు పథమునందు.

భావము.

భరతశ్రేష్టుడా ! స్థావర జంగమ రూపమగు ప్రాణికోటి ఏదైతే ఉందో అది 

క్షేత్ర క్షేత్రజ్ఞుల కలయిక వలననే పుడుతుందని తెలుసుకో.

|| 13-28 ||

శ్లో.  సమం సర్వేషు భూతేషు తిష్ఠన్తం పరమేశ్వరమ్|

వినశ్యత్స్వవినశ్యన్తం యః పశ్యతి స పశ్యతి.

తే.గీ.  చెడెడివాటిలోనున్నట్టి చెడని తత్వ

మన్ని భూతంబులన్ గల యసమ హరిని, 

చూడ గలిగును యోగియే వాడె ఘనుడు,

పార్థ! గ్రహియింపు మియ్యది భవ్యముగను. 

భావము.

నశించిపోయే వాటిలో నశించని తత్వముగా, అన్ని భూతాలలో సమంగా 

ఉన్నపరమేశ్వరుణ్ణి సమంగా చూసిన వాడే, నిజమైన దృష్టి కలవాడు.

జైహింద్.

2, అక్టోబర్ 2022, ఆదివారం

బోయినపల్లి బోళాశంకర దేవాలయంకో డాఱామశర్మగారి అష్టావధానం సందర్భంగా ఛాయా చిత్రాలు.02 . 10 . 2022.

0 comments

జైశ్రీరామ్.
బోయినపల్లి బోళాశంకర దేవాలయంకో డాఱామశర్మగారి అష్టావధానం సందర్భంగా ఛాయా చిత్రాలు.
శ్రీమన్మంగళ సద్వధానచణులౌ శ్రీ రామశర్మాఖ్యులన్,
ధీమంతుల్ గని పొంగిపోవునటులన్, ధీపించుతన్ సత్సభన్,
శ్రీమాతా వర శంకరుల్ దయగనన్ జిద్భాస సన్మార్గమున్
మామీదన్ గృపజూపి పల్కు ఘనునిన్ మాన్యున్ బ్రశంసించెదన్.

నేనిచ్చిన సమస్య్. అవధానిగారి పూరణ.
భార్యకు మీసముల్ మొలువ బాపురెయంచును పొంగె భర్తయున్,

సూర్యసహస్రరూప సు యశోరుచి శాంభవి భీకరాంగయై,
నిర్యదమందసౌర్య రసనిర్భరయై మహిషాసురోగ్రునిన్,
ధైర్యముతోడ జంప సముదమ్ముగ శంభుడు యుద్ధరంగ శో
భార్యకు మీసముల్ మొలువ బాపురెయంచును పొంగె భర్తయున్,
జైహింద్.

Dr ఆచార్య మానాప్రగడ శేషసాయి గళం.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

ధ్యానేనాత్మని పశ్యన్తి - ...13 - 25...//..... అన్యే త్వేవమజానన్తః - , , .13 - 26,,,//...త్రయోదశోధ్యాయః - క్షేత్రక్షేత్రజ్ఞవిభాగయోగః

0 comments

జైశ్రీరామ్.

 || 13-25 |

శ్లో. ధ్యానేనాత్మని పశ్యన్తి కేచిదాత్మానమాత్మనా|

అన్యే సాఙ్ఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే|

తే.గీ.  ధ్యానమున గాంతు రాత్మను ధన్యులరసి

యాత్మలో నాత్మనే గాంతు రమలినులిల,

సాంఖ్య యోగంబులన్ గాంత్రు సాధు మహితు

లాత్మ దర్శనమున్ ముక్తి యమరు మనకు.

భావము.

కొందరు ధ్యానము ద్వారా తమలోనే తమ ఆత్మని ఆత్మ ద్వారా చూస్తారు. 

కొందరు జ్ఞాన యోగము ద్వారాను, మరి కొందరు కర్మ యోగము ద్వారాను 

ఆత్మను చూస్తారు.

|| 13-26 ||

శ్లో. అన్యే త్వేవమజానన్తః శ్రుత్వాన్యేభ్య ఉపాసతే|

తేపి చాతితరన్త్యేవ మృత్యుం శ్రుతిపరాయణాః.

తే.గీ.  ఇట్టు లెరుగలేకున్నచో పట్టుపట్టి

తెలిసినట్టివారికడను తెలుసుకొనియు

ముక్తి పొందగవచ్చు నాసక్తియున్న,

నీవు గ్రహియింపుమర్జనా నేర్పు మీర.

భావము.

ఈ ప్రకారంగా తెలుసుకోలేని వారు కూడా అన్యుల ద్వారా విని, అలా విన్న 

దానిపై గురి ఉంచిన వారు కూడా సంసారాన్ని తప్పక తరిస్తారు.

జైహింద్.

చి. లక్ష్మీ అహల మొదటి అష్టావధానం ప్రణవపీఠం(ఏలూరు)

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

నేడు సరస్వతీ పూజ సందర్భనుగా మీకు నా శుభాకాంక్షలు.

0 comments

జైశ్రీరామ్ 

ఓం శ్రీమాత్రే నమః.

ఓం శ్రీ సరస్వత్యై నమః.

శ్రీవాణీ కృప లభ్యమై వెలుగుతన్ శ్రీశారదోపాసకుల్,

భావతీత మనోజ్ఞ శాంభవిని సంభావించుచున్ గావ్యముల్

సేవాదృక్పథమొప్ప లోకమునకున్ శ్రీజ్ఞాన సంపత్ప్రదం

బై వాసిన్ గన వ్రాయుగాత కృతు లాహాయంచు మెచ్చన్ జనుల్.


నేడు సరస్వతీ మాత అనుగ్రహప్రాప్తికై పూజించుకొను 

పుణ్యప్రదమయిన దినము. ఈ 

సందర్భముగా మీకందరికీ నా శుభాకాంక్షలు.

ఆ తల్లి అనుగ్రహముశాంభవీ సత్ కృప లభించాలనీ 

మనసారా కోరుకొనుచున్నాను.


సద్విధేయుఁడు

చింతా రామకృష్ణారావు.

జైహింద్.

1, అక్టోబర్ 2022, శనివారం

శ్రీ చక్రబంధ అష్ట లక్ష్మీ స్తోత్ర గీతావళి.

1 comments

 జైశ్రీరామ్.

శ్రీ చక్రబంధ అష్ట లక్ష్మీ స్తోత్ర గీతావళి.

౧. లక్ష్యమును జేర్చు శ్రీ గజలక్ష్మి మ్రోల
మనసు నిల్పుదు. శ్రీదేవి మమ్ము చేదఁ
గవన మత్తేభ శ్రీ కల్గి కాంక్ష తీర్- చు
లక్ష్య మది గని, లబ్ధి దలంచుమేల.
౨. రక్ష ధన లక్ష్మి శ్రీఁ గొల్పు నక్షయంబు
వర్ధనము చేయుశ్రీ శుభ భావశ్రీని
కొలుచు వారికి శ్రీ లక్ష్మి కొల్పు భాతి
రక్షవయి కొల్పు బుద్ధిని భ్రాంతి తీర!
౩. లక్ష్య నరునికి శ్రీ ధాన్య లక్ష్మి ప్రాపు
దయను పోషించు శ్రీకివే దండి పూలు
లేమి విడనాడ శ్రీ సేవలే సురక్ష
లక్ష్మి దరి లేని పుష్పాలు లక్షలేల?
౪. లక్ష శుభములు శ్రీ ధైర్య లక్ష్మిఁ జేర
లక్ష్మిలసమాన  శ్రీ ధైర్య లక్ష్మి వెంట
నమరు వారలు శ్రీ దీప్తి కంక మాల్య
లక్ష్మిలభినవరక్షట లౌల్యమేల
౫. కలిత సంతాన శ్రీలక్ష్మి. జ్ఞాన పుత్రు
లక్ష్యముననిచ్చు శ్రీముక్తిలాభమౌను
చపలతన్ బాపు. శ్రీజ్ఞాన శక్తిఁ దేల్చు
కమలలోచన త్రుళ్ళును కాల్చు గాక!
౬. విద్య యనఁబడు శ్రీ లక్ష్మి! విశ్వ మాత !
నశ్వరముఁ బాపు శ్రీదివ్య జ్ఞాన ధామ !
రుచిరసన్నుత శ్రీ విద్య రోచిఁ గొల్పు!
విద్యనమరుచు తల్లి! మద్వేల్పు దేవి!
౭. లక్ష్యములఁ గూర్చు శ్రీ ఆది లక్ష్మి జ్ఞాన
ముద్ర ధరియింతు శ్రీభక్త పూజ్య మ్రోల
గొప్ప కవిఁ జేసి శ్రీ లక్ష్మి కొల్పు భాతి
లభ్యమునుఁగొల్పినన్నేల లాఁతి యేల
౮. సత్కవులపాలి శ్రీకర చంద్ర వంక
జగతి సద్రూప శ్రీలిచ్చు,చక్కఁ గాచు
శ్రీ విజయ లక్ష్మి.శ్రీ జన సేతుచంద్ర.
సద్విజయ శ్రీని కల్పించుచంద్రభాస!

అష్ట లక్ష్మీమాతలకూ నమస్కరించుచు 
చింతా రామకృష్ణారావు.
జైహింద్.

ఉపద్రష్టానుమన్తా చ భర్తా - ...13 - 23...//..... య ఏవం వేత్తి పురుషం ప్రకృతింఙ్క్తే - , , .13 - 24,,,//...త్రయోదశోధ్యాయః - క్షేత్రక్షేత్రజ్ఞవిభాగయోగః

0 comments

 జైశ్రీరామ్

|| 13-23 ||

శ్లో. ఉపద్రష్టానుమన్తా చ భర్తా భోక్తా మహేశ్వరః|

పరమాత్మేతి చాప్యుక్తో దేహేऽస్మిన్పురుషః పరః.

తే.గీ.  సాక్షి దేహాన పురుషుడు, సన్నుతుడగు

భారవహుడును, భోక్తయున్, వర మహేశు

డు, పరమాత్మయు, భోగియు, స్వపర భేద

రహితుడనుమంతయును తానె మహిత! కనగ.

భావము.

ఈ శరీరంలో పరమ పురుషుడు సాక్షి అనీ, అనుమతించేవాడనీ, 

భరించేవాడనీ, భోగించేవాడనీ, మహేశ్వరుడనీ పరమాత్మ అనీ 

చెప్పబడుతున్నాడు.

|| 13-24 ||

శ్లో. య ఏవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణైః సహ|

సర్వథా వర్తమానోऽపి న స భూయోऽభిజాయతే.

తే.గీ.  సగుణ ప్రకృతిని, పురుషుని, చక్కగనెవ

రెరుగుదురొ వారు ముక్తిని నిరుపమముగ

కనుదురర్జునా  యెట్లున్న గాని, నిజము.

ముక్తిపథమది భువిపైన పూజ్యులకును.

భావము.

పూర్వము చెప్పిన విధంగా పురుషుణ్ణీ, గుణాలతో సహా ప్రకృతినీ ఎవరు 

తెలుసుకుంటారో, అతడు ఎలా ప్రవర్తించినా తిరిగి పుట్టడు.

జైహింద్.