గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

31, డిసెంబర్ 2018, సోమవారం

7వ పద్యపక్షము మాదక ద్రవ్యాల మత్తులో యువత - నాశనమవుతున్న భవిత. రచన. చింతా రామ కృష్ణా రావు

1 comments

జైశ్రీరామ్.
7వ పద్యపక్షము
మాదక ద్రవ్యాల మత్తులో యువత - నాశనమవుతున్న భవిత.
రచన. చింతా రామ కృష్ణా రావు
౧. అటవెలది త్రయ గర్భ సీసము. 
శ్రీనివాసుఁడవని చిక్కుంచుకొన నిన్ను - చేయి పట్టి తరికి చేఁదుకొనవొ?
మానవాళి మరిగె మాదక ద్రవ్యముల్ - భవిత భ్రష్టమవదె? పాహి కృష్ణ!
అతిప్రమాదకరము లగును మాదకద్రవ్య - ములవి మరిగి ప్రాణములకు ముప్పు
తెచ్చుకొనుచునున్న వచ్చునెవ్వఁడు కావ, - మాన్పి కావుమఖిల మాన్య కృష్ణ!
ఆ.వె. పెద్దవారు పలుకు సుద్దులు వినఁజాల - రిట్టి మాదకములనెఱిఁగిరేని.
పిన్నవారి భవిత పీకుకుపోవును - జాగు వలదు.కావ జాలు కృష్ణ!     ౧.
౨. అటవెలది త్రయ గర్భ సీసము. 
నీతి నెఱుఁగ నేర్పి భాతిని పెంచినన్ బాలురెపుడు నేర్వజాలరిట్టి
మత్తు కలుగఁ జేయు మాదక ద్రవ్యముల్ గొనుట. నేర్పునటుల కనుము కృష్ణ!
మంచి చెడులనెన్న మరతురు మత్తులో భవిత శూన్యమగుట భువిని కనరు.
మత్తుమందు మరిగి చిత్తగుచున్నట్టి వారి మదులు మార్చవేర? కృష్ణ!
ఆ.వె. తల్లిదండ్రులపయి దయన్నదే వీడు, తనను తాను కనడు గుణము చెడును.
మరిగిరేని జనులు మాదక ద్రవ్యముల్ మరుగకుండ సుగతి మనుపు కృష్ణ!
౩. అటవెలది త్రయ గర్భ సీసము. 
చదువు సంధ్యలు విడు సద్భావనలు వీడు సుగతి వీడు తనదు ప్రగతి వీడు
వీడ జాలక తను వాడు మాదకద్రవ్య ములను. కావుమతని పూజ్య కృష్ణ!
చేయ రాని పనులు చేయఁబూను యువత, ప్రాయముడుగునాడు పనికి రారు.
జ్ఞేయములను నేర్చి శ్రేయంబు గనుమార్గ గాములవగఁ జేసి కాచు కృష్ణ!
ఆ.వె. తల్లిదండ్రులెపుడు తమ పిల్లలను కని పొంగఁ జూతురుకద? ముదిమి కదిసి
మూల్గుచున్న తరిని పోషింపఁదగు సంతు మత్తు వీడి కనఁగ మలచు కృష్ణ!
చం. భవితకు మూలమౌ యువత బానిసలైనను మత్తుమందుకున్
భువినిక కల్గునెవ్వరు ప్రపూజ్య మహాద్భుత భావి గొల్పగా?
సవరణ చేయగావలెను చట్టములన్, భువి మత్తు మందులిం
కెవరును తీసుకో వెరవనెంతటి దండననైన వేయుచున్.
మ. ధనసంపాదనకై దురాత్ములిల సంస్థాపించి రీద్రవ్యముల్
జనులెల్లం గొననమ్ముచుండిరకటా! జాఢ్యంబుగా మారెనే
డినవంశోత్తమునైనమార్చ గలిగే యా మాదకద్రవ్యముల్
గొనకుండన్, నశియించకుండ మనగా కూర్మిన్ జనుల్ కోరెదన్.
స్వస్తి.
జైహింద్.

30, డిసెంబర్ 2018, ఆదివారం

6వ పద్య పక్షమ్. విచ్ఛిన్నమౌతున్న వివాహ వ్యవస్థ - సంతానంపై దాని ప్రభావం. రచన. చింతా రామ కృష్ణా రావు.

2 comments

జై శ్రీరామ్.
6 వ పద్య పక్షమ్.  
విచ్ఛిన్నమౌతున్న వివాహ వ్యవస్థ - సంతానంపై దాని ప్రభావం.
రచన. చింతా రామ కృష్ణా రావు.
౧.ఆటవెలదిత్రయ గర్భ సీసము
శ్రీకరంబనుచును జీవన సరళికి - పెండ్లితంతు కొలిపిరిండ్లు వెలుఁగ
దాని వలన వారు తమదైన సంతతి - సుఖముపొందిరపుడు, శుభద కృష్ణ!
దంపతులగువారు తమరిద్దరొక్కటై - కలిసి మెలిసి బాధ్యతలు వహించు.
నొకరికొకరుతోడు సకల శుభములిచ్చు - ననుచునేర్పరచిరి వినుము కృష్ణ!
ఆ.వె. ఇట్టిచక్కనిదగు నీ సంప్రదాయము - మట్టిఁగలియుచుండె మహిని నేడు.
స్వేచ్ఛ పెఱిగి వారలిచ్ఛానుసారము - గొడవలు పడుచుండ విడరె కృష్ణ!
౨.ఆటవెలదిత్రయ గర్భ సీసము
ఆలుమగల మధ్యనన్యోన్యతయె సంతు - హేతువన్నదెఱిఁగి నీతి తోడ
మెలఁగుచున్నఁ గలుగు మేలైన సంతతి - మెలగకున్న జనత కలఁగు కృష్ణ!
ధర్మమార్గము విడి దంపతులున్నచో - కలుగు సంతు దురిత గతుల నడచు
దురితులయిన సంతు దుర్గతిపాలౌను. - చేయరాని పనులు చేసి కృష్ణ!
ఆ.వె. తల్లిదండ్రులొసఁగు ధనము ప్రేమయె కనఁ - బ్రేమ లేని బ్రతుకు బీడువారు.
లోకకంటకులగు లోకాన బిడ్డలు - తల్లిదండ్రుల విడు ధరను కృష్ణ!
౩.ఆటవెలదిత్రయ గర్భ సీసము
భర్తమాట వినని భార్యలుండగరాదు - భార్య మాట వినని భర్తలటులె.
వారసత్వ గతిని వర్ధిలఁ జేసిన - బాగు పడును పృథ్వి బాల కృష్ణ!
వారి సంతు వెలుఁగు భక్తిప్రపత్తులన్ - వరలఁ గలరు వారు వసుధ కృష్ణ!
కానినాడు జగతి గాఢాంధకారాన - కుములు నిజము కాంచ, గోప కృష్ణ!
ఆ.వె. ధర్మబద్ధమయిన దాంపత్య బంధమున్ - గౌరవింపవలెను కాపురమున,
గౌరవింతుమేని ఘనులైన పెద్దలన్ - దైవశక్తి మనకుఁ దక్కు కృష్ణ!
౪. చ. అహము, మదంబు, కామము, గయాళితనంబున నుండు స్త్రీలచే,
మహి ఘన పుంస్త్వ గర్వమున మత్తిలి వర్తిలు పూరుషాళిచే
నిహతమగున్ సుసంస్కృతి. నివృత్తియె లేని దురంత దుస్స్థితుల్
స్పృహను దహించు, ఛిన్నమగు శ్రీకర బాంధవ బంధనాళియున్.
౫. చ. వరలెడి ధర్మ సన్నుత వివాహ వ్యవస్థయె ఛిన్నమైనచో
తెరువిక లేదు. సంతతియు తీరుగ వర్ధిలఁ జాలరిద్ధరన్.
పరమ దురాత్ములౌన్, వినుత భారతి కీర్తి నశించు, వీరిచే.
మరువకుడయ్య వర్తిలుఁడు మన్ననతో ఘన సంస్కృతీప్రభన్.!
స్వస్తి.
జైహింద్.

29, డిసెంబర్ 2018, శనివారం

5వ పద్య పక్షమ్. సర్కారు బళ్ళు చదువుల గుళ్ళు. రచన. చింతా రామ కృష్ణా రావు.

1 comments

జై శ్రీరామ్.
5వ పద్య పక్షమ్.  సర్కారు బళ్ళు చదువుల గుళ్ళు.
రచన. చింతా రామ కృష్ణా రావు.
ఆటవెలది త్రయ గర్భ సీసము. 
శ్రీకరంబు చదువు, చిత్జ్ఞాన సుఫలద. జీవితేశునఱయఁ జేయునిదియె.
జీవ శక్తినొసఁగు జీవికకిదిప్రాపు,  భావి భాగ్యమిదియె, దేవ! కృష్ణ!
చదువు సంద్యలరయ, సన్మార్గమరయంగ, గురుకులంబులమరఁ గొలుప నాడు
నేడు బ్రతుకు బాట నేర్పాటు సర్కారు బడులు చేయు నవియె గుడులు కృష్ణ!
ఆ.వె. గుడులలోన శిలను కూర్మిని గను దైవ
మనుచు నేర్పు బడులు మనకు గుడులు.
సత్యమెన్నిచూడ సర్కారు బడి మేలు
కొలుపు, మదిని మేలుకొలుపు కృష్ణ!
ఆటవెలది త్రయ గర్భ సీసము. 
ఓనమాలనరయ నోర్పుతో సర్కారు బడులు నేర్పి కొలుపు భక్తి మనకు
ఆంగ్లవర్ణములనె యరయమంచును నేర్పు నట్టివేల విను మహాత్మ కృష్ణ!
పెక్క సొమ్ములొసఁగి పేరున్న బడులంచు నాంగ్ల భాషనరయనంప శిశువు
చిక్కులందుపడుచు చీకాకు పొందునే? క్షేమమేల కలుగు శ్రీశ! కృష్ణ!
అ.వె. భాగ్యమంతపోవు, భవిత శూన్యంబగు,
తెలుఁగు భాష మరచు, నలిగిపోవు
నెట్టి కష్ట మనున దిలఁ గన సర్కారు
బడుల నుండదు కద! ప్రనుత కృష్ణ!
ఆటవెలది త్రయ గర్భ సీసము. 
ఆటపాటలకును, మేటి విద్యలకును సాటిలేని ప్రగతి బాట నడుపు
సద్విభాసితమగు సర్కారు బడి సాటి లేదు చూడ భువిని లేదు కృష్ణ!
నిరుపమానులయిన నిష్ణాత బోధకుల్  నేర్పు విద్యలిచట నేర్పు మీర.
అటకు నిటకుపోయి ఆయాస పడనేల భావి జీవితమున వరల కృష్ణ!
ఆ.వె. అమ్మపాల సాటి యవనిని లేదుగా!
కమ్మ తెలుగు సాటి కనఁగ లేదు.
సదయ బోధనమున సర్కారు బడి సాటి
లేదు లేదు లేదు లేదు కృష్ణ!
చం. చదువుల దేవళమ్ములని సన్నుతి చేయుచు తల్లిదండ్రులిం
పొదవగ చేర్చు బిడ్డల మహోన్నతి కోరుచు పాఠశాలలన్.
మదులఁ దలంచి బోధకులు మాన్యతనొప్పుచు బోధఁ జేయమిన్
వదలఁడు దైవమెన్నఁడును, వారిని శిక్షలఁ గుంజునిద్ధరన్.
కం. మన్ననఁ బొందెడి బోధన,
సన్నుత సత్ప్రాంగణంబు, సద్బోధకులున్,
జెన్నుగ నుండిన మనలకు
సన్నుత సర్కారు బళ్ళు చదువుల గుళ్ళౌన్.
స్వస్తి.
జైహింద్.

28, డిసెంబర్ 2018, శుక్రవారం

4వ పద్య పక్షమ్. తొలకరి చినుకులు తైతుల తలపులు. రచన. చింతా రామ కృష్ణా రావు.

1 comments

జై శ్రీరామ్.
4వ పద్య పక్షమ్.  తొలకరి చినుకులు తైతుల తలపులు.
రచన. చింతా రామ కృష్ణా రావు.
1. ఆటవెలది త్రయ గర్భ సీసము. 
ఋతువులారు కలిపి వృత్తంబుగా చేసి - కాల గతిని కూర్చి కదిపినావు.
ధర్మబద్ధమయిన తరియన్నదే లేని - కాల గమనమందు కలుగు కృష్ణ!
ఋతువులందు సహజ ఋతు ధర్మముం గూర్చ - గ్రీష్మఋతువు లోని కీల చేత
భూమిమాడు చుండి బగబగల్ పుట్టించ - రైతు మనసులోన రగులు కృష్ణ.
ఆ.వె. అట్టి సమయమందు నాశలు పుట్టించ - తొలకరింపువగుచు పలుకుదీవు
ప్రకృతి రక్షకుఁడగు పరమాత్మగా నెంచి, - దానిఁ గనిన రైతి తనియు కృష్ణ!
2. ఆటవెలది త్రయ గర్భ సీసము. 
గ్రీష్మ ఋతువు తాను భీష్మ కీలల మాడ్చ - వేగుచున్న ధరణి బీడువారు.
పైరుపచ్చలవని పై నెండిపోవగా - పసరములవియెట్లు బ్రతుకు కృష్ణ?
పసుల జీవికకయి పలుపలు విధముల - యత్నములను చేసి యలసిపోవు
నంతలో తొలకరి నంతసమ్మునుఁ గూర్చ - వచ్చు రైతు జనులు మెచ్చ కృష్ణ!
అ.వె. తొలకరి పొడఁ గాంచి తుది లేని యానంద మొదవరైతు మదిని వ్యధను వీడి
భూమిదున్నుటకయి పూజలు చేయుచు పొంగిపోవునతఁడు. పూజ్య కృష్ణ!
3. ఆటవెలది త్రయ గర్భ సీసము. 
చిఱు చిఱు వడగళ్ళు చెలరేగు పెనుగాలి, కారుమబ్బుల గతి కనిన రైతు
వర్షధార తడువ పరువెత్తు హర్షంబు మిన్నుముట్ట భవిత నెన్ని కృష్ణ!
చిటపట చిఱు జల్లు కటిక నేలను పడి నంతనావిరయి, నయ పరిమళము
జగతిని వెదజల్లు, సొగసైన కలవాపి నటన చేయ వలచునచట కృష్ణ!
ఆ.వె. తొలకరింపవనిని పలకరింపఁగ కవి కలము పట్టు రయితు హలము పట్టు
కలము హలములందు కలవునీవని నమ్మ, కలిగి శుభములీయఁ గలవు కృష్ణ!
4. ఉ. నేలను బుట్టి నేలపయి నిత్యము తా కృషి చేయునే క్షుధా
పీడిత మానవాళికయి ప్రీతిని గొల్పెడి భుక్తికోసమై.
శ్రీలను గొల్పు రైతు సహ జీవనమార్గ విధాత, తొల్కరిన్
జూడఁగనే ముదంబొదవ శోభిలు నాగలి చేతఁ బట్టుచున్.
5. తేట గీతి దృతవిలంబిత గర్భ చంపక మాల. 
ముదమగు తొల్కరిన్ హలము పూజ్యమహానిధి హాలికాళికిన్
వ్యధలకు దూరమై పొలము హాయిగ బ్రోవుచు పొంగుచుంద్రుగా!
సుధను స్రవించెడున్ దొలుత సుందర తొల్కరి తోడుగానగన్!
సుధ వర తర్పణన్ పృథివి శోభిలు రైతుల స్వేదమేనుగా!
స్వస్తి.
జైహింద్.

27, డిసెంబర్ 2018, గురువారం

3వ పద్య పక్షమ్. వృద్ధాప్యం కష్ట సుఖాలు. రచన. చింతా రామ కృష్ణా రావు.

1 comments

జై శ్రీరామ్.
౩వ పద్య పక్షమ్. వృద్ధాప్యం కష్ట సుఖాలు.
రచన. చింతా రామ కృష్ణా రావు.
ఆటవెలది త్రయ గర్భ సీసము. 
శ్రీ రమా రమణుఁడ! శేషశాయిగనుండి - చింత చేయ వసలు జీవితాన
మానవునిఁగ బుట్టి మనుజుఁడెంతటి బాధ - లనుభవించుననుచు, కనవు కృష్ణ.
బాల్య యౌవనములు పరుగిడి పోవగా - వృద్ధ దశకుఁ జేర విస్తు గొల్పు
చింతలెల్ల మదిని చీకాకు పరచెడు. - శాంతి మార్గమగుము చాలు కృష్ణ!
ఆ.వె. కన్నులుండియు నిను మిన్నకుందురు కనన్, - కంటి చూపు తొలఁగ కలత చెంది,
కన్నతండ్రివగుచు కనులలో నిలువుమా - యనుచు నేడ్తు రపుడు వినుము కృష్ణ!    1.
ఆటవెలది త్రయ గర్భ సీసము. 
పిన్న వయసులోన కన్ను గానక, నాడు - చేయరాని పనులు చేసి యుండి,
తనువు మాయు సమయమున నిన్నుఁ దలచినన్ - బాప ఫలితమెటులఁ బాయు కృష్ణ!
వృద్ధ వయసు తానె పిలవకనే వచ్చి - పైనఁ బడుచునుండ బాధపడుచు
బిడ్డలతని బాధ పెడచెవిన్ బెట్టుటన్ - నడ్డి విరిగినట్లు నడచు కృష్ణ!
ఆ.వె. దేహమతని మాట తిన్నగా వినకుండ - మూలఁబడుచు నుండ కూలిపోవు.
వృద్ధుఁడపుడు జ్ఞాన వృద్ధుఁడై చింతించి - నీవె దిక్కనునయ. నిజము కృష్ణ!    2.
ఆటవెలది త్రయ గర్భ సీసము. 
దాన గుణము వీడి, దాయాదులను వీడి - ధనము నిలువఁ జేసి తనయులకిడ,
వారలతని వీడి పైదేశములనుండ - చూడరంచు వగచుచుండు కృష్ణ!
పుణ్యమొసగు కార్యములు జేయనైతినే, - సన్యసించనయితి ధన్యుఁడనవ
జన్య జనక మర్మజంబగు మూర్ఖతన్ - తప్పు చేసితినని తలఁచు కృష్ణ!
ఆ.వె. ప్రగతిఁ గొలుప పద్య పక్షాన నిలనైతి - రచన చేసి కృతిని ప్రబలనైతి
ఇప్పుడేమి చేతు నీశ్వరా యని, వృద్ధు - డేడ్చుచుండి కరము మోడ్చి కృష్ణ!,     3.
శా. మా యానందము కోరి మేము సుతులన్ మానుండి దూరంబుగా
శ్రేయంబిచ్చెడి పాఠశాలలనుచున్ చేర్పించ, వారచ్చటన్
మాయందున్ మమకారమున్ విడిచి సంభావించుటే మానిరే!
మా యీ దుస్థితి హేతువయ్యదె కనన్. మా కర్మ మా దోషమే.     4.
శా. ఈ వృద్ధాశ్రమ జీవితంబు కనఁగా హేయంబు. దౌర్భాగ్యమున్.
జీవంబుండగ పాతిపెట్టుటిది. చూచేవారికిన్ జాలియౌన్.
నావారైన సుతుల్, సుతల్ మనుమలున్ నా వారలున్ కానమిన్
జీవంబున్న శవంబులైతిమనుచున్ జీవింత్రు కృష్ణా! వ్యధన్.      5.
స్వస్తి.
జైహింద్.

26, డిసెంబర్ 2018, బుధవారం

2వ పద్య పక్షమ్. జీవనాధార జలవనరుల సద్వినియోగం. రచన. చింతా రామకృష్ణా రావు

1 comments

జైశ్రీరామ్.
౨వ పద్య పక్షమ్. జీవనాధార జలవనరుల సద్వినియోగం.
రచన. చింతా రామకృష్ణా రావు
ఆటవెలది త్రయ గర్భ సీసము. 
శ్రీకరమగు ధాత్రి జీవకోటికి నిత్య - జీవ జలమునిచ్చు, క్షేమమిచ్చు.
యుగ యుగాలుగనిది జగతిని నిత్యమున్ - సాగుననుట కీవె సాక్షి కృష్ణ
కలుషమైన జలము కలుషంబు లెటు పాపు? - కావ వలయు నీటి జీవన గతి
నీరు లేక జగతి నిలుచుటెట్టులు? కాన - నీటి నిలువ పెంచు మేటి కృష్ణ!
ఆ.వె. ప్రాణులకిల నీరు ప్రాణవాయువటులే. - నీటి నిలువ భువిని నిలుప వలయు.
సలిల రక్షణమును జరుపకుండిన జల - మంతరించు కద యనంత కృష్ణ!                     1
ఆటవెలది త్రయ గర్భ సీసము.
మానవుల్ జలమును మన్నించి రక్షించు - పూనికఁ గొని చేయఁ బుణ్యమొదవు.
నీరు వ్యర్థ పరచు నీచులు పాపులై - యంతరింత్రుకద యనంత కృష్ణ!
ధనము ఖర్చయినను దానినార్జింపగా - వచ్చు. భువిని నీరు మచ్చుకయిన
మిగులనీక మితికి మించి వెచ్చించిన - మృగ్యమౌన్. గొలుపు పరిణతి కృష్ణ!
ఆ.వె. జ్ఞాన మొసగుమయ్య సద్భావనము నిమ్ము - మానవాళినిలను మనఁగనిమ్ము.
నీటి నిలువఁ బెంచు నేర్పరులుగఁ జేయ - నేలతల్లి మెచ్చు నిన్ను కృష్ణ!                        2
ఆటవెలది త్రయ గర్భ సీసము. 
బ్రతుకనెంచు జనులు పరమాత్మ సృష్టి యీ - నీరమనుచు దాని పారఁబోయ
వలవ రిలను జలము వర్ధిల్లఁ జేయఁగాఁ - వలచి యింకఁ జేయఁ దలచు కృష్ణ!
పూర్వ కాలమునను భూమి పీల్చుటఁ జేసి - నీటి మయము భూమి నిత్యమపుడు.
రాళ్ళ కట్టడములు వేళ్ళూనుటను చేసి - భూమి పీల్చునెటుల పూజ్య కృష్ణ!
ఆ.వె. ఇలకు నింక జలము నింకుడు గోతులన్ - గొలుపుటుత్తమమయ జలలు పెరుగు
సహజ వనరులందు సలిలంబు మృగ్యమౌన్ - కావకున్న దానిఁ గనుము కృష్ణ.!             3
మత్తకోకిల - ద్విపదద్వయ - తరువోజ - గర్భ సీసము. 
నీరు జీవన ధార, నిల్పుము నీవు ని - త్యుఁడ! భూమిపై నేర్పుతోడవగను.
పారఁ బోయక కోరువారికి పంచి వ - ర్ధిలఁ జేయుమా! భవ్య తేజమున/ను.
నీరమే రమ. వాడ నేర్పుము నిత్యని - ర్మల చిత్తమున్ నేర్చు రాజిలఁగ/ను
నీరు తక్కువ వాడు నేర్పరి నిల్పుని - త్యము నన్యులన్. నిత్య ధార్మికుఁడు/ను
తే.గీ. నీరు వ్యర్ధము చేసినన్ నిలువదు రమ. - నీరు పొదుపుగా వాడిన నిలుచునామె.        4
భావి జీవన గతికయి జీవ జలలఁ - బెంచు, నీటిని భూమినింకించు కృష్ణ!
సీ. గంగను తలఁ దాల్చె గౌరీశుడే. యట్టి - గంగను చూడరే గౌరవముగ?
నింగిని వీడి మీ ముంగిలికొచ్చు నా - యంగన నింకనీరా పృథివిని ?
పొంగారు భూమిపై నింగినంటెడి యిండ్లు - నిర్మించి నీటిని నిలుపఁ తగునె?
కొంగుబంగారమీ పొంగెడి జలము మీ - ముంగిట నింకించి పొంగరేల?
తే.గీ. నీటికింకుడు గోతులే నెలవు కాన - వాటి నిర్మాణములు చేసి వరలనిండు
భూమి ననువైన నీటితో పూజ్యులార! - గంగ మీ కోరికల్ తీర్చి కాచునిలను.
చ. జనులకు విన్నవింతునిల జక్కఁగ నీటిని వాడుకొండు మీ
రనవసరంబుగా జలము వ్యర్థము చేయక, నీరు భూమిలో
ఘనముగ నింకునట్టులుగ కట్టడిఁ జేసి చరింపఁ జేయుడీ!
జనులిక నీటి లోటు కనఁ జాలరు వారి మితవ్యయంబునన్.                                      5
స్వస్తి.
జైహింద్.

25, డిసెంబర్ 2018, మంగళవారం

1వ పద్య పక్షమ్. కార్మిక సంక్షేమమ్. రచన. చింతా రామకృష్ణారావు.

1 comments

జైశ్రీరామ్.
శ్రీరస్తు.
 (ప్రథమ)పద్య పక్షమ్.  కార్మిక సంక్షేమమ్.
రచన. చింతా రామకృష్ణారావు.

శా. శ్రీలన్ దేల్చ మనోజ్ఞ భారతిని సచ్చీలంబుతోఁ గార్మికుం
డాలోచించి, దురంత కర్మగతి మోహాదుల్ విసర్జించి, తా
నేలున్ యంత్ర కబంద రాక్షసుల, మోహించున్ ప్రమాదంబులన్.
చాలం గల్గెడివారు లేరు తనతోన్ సద్భాష్యమై యొప్పుటన్.   1.
ఆటవెలదిత్రయ గర్భసీసము. 
కార్మిక జనపాళి కష్టంబు మరిపించి - గౌరవమును గొల్పు కార్యములను
చేయునటులఁ జేసి చేయూత నీయుమా - నమ్మి కొలుతు నిన్ననంత కృష్ణ.
తగిన వసతి, భుక్తి, ప్రగణిత వైద్యము, - చదువు నేర్ప బడులు సముచితముగ
వారి వారికొఱకు వర్ధిల్ల కల్పించు - భక్తిగ నినుఁ గొల్తు భవ్య కృష్ణ.
ఆ.వె. కష్ట జీవులకును కర్మ వీరులకును - కామితములు తీర్చి కరుణఁ జూపు.
పద్య సద్రచనను పటువర్ధనము చేయు - పద్య పక్ష మధుర భావ కృష్ణ.   2.
ఆటవెలదిత్రయ గర్భసీసము. 
నీరజాక్ష! యతని భారము కనవేల - నిత్య సంతసమును నిలుప వేల?
యతని జీవితమున వెతలు బాపినఁ జాలు. - పద్య పక్షమటుల వరలుఁ గృష్ణ!
జీవితాన సుఖము, భావిపై నాశయు, - కలుగునటులఁ జేసి కనఁగ లేవ?
భావి లేని యతని జీవితమ్మది యెట్లు - వరలునయ్య? కనుమ వరలఁ గృష్ణ.
ఆ.వె. బంధు హితుల తోడఁ  బకపక నవ్వుచు - పండుగలను వెలుఁగ నిండు మదిని
చేయువాఁడవనుచు చేయంగ కోరుదు - నిష్టఁ గొలిచి నిన్ బ్రకృష్ట కృష్ణ! !    3.
ఆటవెలదిత్రయ గర్భసీసము. 
పద్య పక్షమునను ప్రబలెడి శ్రీకృష్ణ! - కార్మికులకు నీవు కావె రక్ష?
వారి జీవితమును వర్ధిల్లఁ జేయుమా! - భక్త సులభ దివ్య భాగ్య కృష్ణ!
యంత్రరాక్షసులను మంత్ర ముగ్ధులఁ జేసి - నేర్పు మీర ప్రగతి నిత్యమొసఁగు
సాధనమున దేశ సంపద పెంతురా - కార్మికులను నీవె కలవు కృష్ణ!
ఆ.వె. కార్మికులను కాచు ఘనులు కర్మాగార - ప్రభువులందు నిలిచి వరలు కృష్ణ!
కార్మికులను బ్రేమఁ గనఁ జేయుమా! వారి - గౌరవమును నిల్పి కాచు కృష్ణ!   4.
బహు ద్వివిధ కంద గీత గర్భ చంపకమాల. 
ధర క్షమ వేల్పులై, శ్రమను ధర్మము చేయుచు క్రాలుచుంద్రు ప్రా
గ్వర సుమతుల్ లసత్ క్షమజ వర్గము కార్మిక శక్తి వీవెగా!
వర ప్రముదాస్పదా! వసుధ పై శ్రమఁ గాంచుము. పద్య పక్ష స
ద్భర విమలాత్మలన్ యతుల ధైర్యము నీవ యనంత కృష్ణయా!  5.           స్వస్తి.
జైహింద్.

23, డిసెంబర్ 2018, ఆదివారం

మాతృనిందా,రస,మృదుమానస,హానినా,రసయా,యశశ్వినీ,పఠిమా,జాతిమోసక,తుప్పువట్టు,అభిదా,గర్భ"-ధాతు వర్గ"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.

0 comments

జైశ్రీరామ్.
మాతృనిందా,రస,మృదుమానస,హానినా,రసయా,యశశ్వినీ,పఠిమా,జాతిమోసక,తుప్పువట్టు,అభిదా,గర్భ"-ధాతు వర్గ"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.                    

"-ధాతు వర్గ"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.స.య.ర.స.య.ర.స.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
మోస,ప్రకృతి,ధాతువర్గం!ముప్పుతిప్పలు పెట్టు గాదే!మూట,లీయదుజాతికిన్
దోసమగు వికార చేష్టల్!తుప్పు నలము భావి ఖ్యాతిం!తోటి వారికి కీడునౌ!
హాస మగు సురాళి కెల్లం!అప్పు లలరు దేశ మెల్లా!ఆటలాడకుస్వార్ధతన్!
దాసి తన మదేల?కోరం!తప్పు నడత వీడ మేలౌ!తాటి నీడవు గాకుమా!

భావము:-

మోసపూరిత బుద్ధితోప్రకృతి ధాతు వర్గమును పాడుచేయగా,లోకమును
ముప్పు తిప్పలు పెట్టును.ధనసంచులీయదు.దోషపూరిత వికార చైదములు
భావిఖ్యాతికి తుప్పు పట్టించును.అనగా ఖ్యాతి నశించును.సాటివారికి
అపకారము కలిగించును.దేశమంతాఋణగ్రస్తమగును.స్వార్ధముతో
ఆటలాడకుమ.ఇదే ప్రక్రియకొనసాగించి,బానిసత్వము కోరుటెందులకు?
తప్పుడు ప్రవర్తన వీడినచో! మేలుకలుగును.తాటిచెట్టు నీడ తనకుపయోగ
పడదు.పరులకు నుపయోగముకాదు.అనునట్లు తయారవకుమ.

1.గర్భగత"మాతృనిందా"-వృత్తము.
బృహతీ ఛందము.భ.స.య.గణములు.వృ.సం,95.ప్రాసగలదు.
మోస ప్రకృతిధాతు వర్గం!
దోసమగు వికార చేష్టల్!
హాసమగు సురాళి కెల్లన్?
దాసి తనమదేల? కోరన్!

2.గర్భగత"-రస"-వృత్తము.
బృహతీఛందము.ర.స.య.గణములు.వృ,సం,91.ప్రాసగలదు.
ముప్పు తిప్పలు పెట్టు గాదే?
తుప్పు నలము భావి ఖ్యాతిన్!
అప్పు లలరు దేశ మెల్ల!
తప్పునడత వీడ మేలౌ?

3.గర్భగత"-మృదుమానస"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.స.లగ.గణములు.వృ.సం.91.ప్రాసగలదు.
మూటలీయదు జాతికిన్!
తోటివారికి కీడునౌ!
ఆటలాడకు స్వార్ధతన్!
తాటి నీడవు గాకుమా!

4.గర్భగత"-హానినా"-వృత్తము.
ధృతిఛందము.భ.స.య.ర.స.య.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
మోస ప్రకృతి ధాతువర్గం!ముప్పు తిప్పలు పెట్టుగాదే?
దోసమగు వికార చేష్టల్!తుప్పు నలము భావి ఖ్యాతిన్!
హాసమగు సురాళి కెల్లం?అప్పు లలరు దేశ మేల్లా!
దాసితన మదేల?కోరం!తప్పు నడత వీడ మేలౌ?

5.గర్భగత"-రసయా"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.స.య.ర.స.లగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
ముప్పు తిప్పలు పెట్టు గాదే?మూటలీయదు జాతికిన్!
తుప్పు నలము భావి ఖ్యాతిం!తోటి వారికి కీడునౌ?
అప్పు లలరు దేశ మెల్లా!ఆటలాడకు స్వార్ధతన్!
తప్పు నడత వీడ మేలౌ?తాటి నీడవు గాకుమా!

6.గర్భగత"-యశశ్వినీ"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.సయ.ర.స.య.న.జ.గగ.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
ముప్పు తిప్పలు పెట్టు గాదే?మూటలీయదు జాతికిం!మోస ప్రకృతిధాతువర్గమ్!                                                                                    
తుప్పు నలము భావిఖ్యాతిం!తోటి వారికి కీడునౌ!దోసమగు వికార చేష్టల్!
అప్పులలరు దేశ మెల్లా!ఆటలాడకు స్వార్ధతం!హాసమగు సురాళి కెల్లన్?
తప్పు నడత వీడ మేలౌ?తాటి నీడవు గాకుమా!దాసి తనమదేల?కోరన్!

7.గర్భగత"-పఠిమా"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.స.య.న.జ.గగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
మూట లీయదు జాతికిం!మోస ప్రకృతి ధాతు వర్గమ్?
తోటి వారికి కీడునౌ!దోస మగు వికార చేష్టల్!
ఆటలాడకు స్వార్ధతం! హాసమగు సురాళి కెల్లన్?
తాటి నీడవు గాకుమా!దాసితనమదేల?కోరన్!

8.గర్భగత"-జాతిమోసక"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.స.య.న.జ.త.జ.జ.గగ.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
మూటలీయదు జాతికిం!మోసప్రకృతి ధాతు వర్గం?ముప్పుతిప్పలు పెట్టుగాదే?
తోటివారికి కీడునౌ!దోసమగు వికార చేష్టల్!తుప్పు నలము భావి ఖ్యాతిన్!
ఆటలాడకు స్వార్ధతం!హాసమగు సురాళి కెల్లం?అప్పు లలరు దేశ మెల్లా!
తాటి నీడవు గాకుమా!దాసి తనమదేల?కోరం!తప్పు నడత వీడ మేలౌ?

9.గర్భగత"-తుప్పువట్టు"-వృత్తము.
ధృతిఛందము.ర.స.య.భ.స.య.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
ముప్పుతిప్పలు పెట్టుగాదే?మోసప్రకృతి ధాతు వర్గమ్?
తుప్పు నలము భావి ఖ్యాతిం!దోసమగు వికార చేష్టల్!
అప్పులలరు దేశ మెల్లా!హాసమగు సురాళి కెల్లన్?
తప్పు నడత వీడ మేలౌ?దాసితన మదేల?కోరన్!

10,గర్భగత"-అభిదా"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.స.య.భ.స.య.ర.స.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
ముప్పు తిప్పలు పెట్టు గాదే?మోస ప్రకృతి ధాతు వర్గం?మూట లీయదు జాతికిన్!                                                                                        
తుప్పు నలము భావిఖ్యాతిం!దోసమగు వికార చేష్టల్!తోటివారికి కీడునౌ!
అప్పులలరు దేశమెల్లా!హాసమగు సురాళి కెల్లం?ఆటలాడకు స్వార్ధతన్!
తప్పునడత వీడ మేలౌ?దాసితనమదేల?కోరం!తాటి నీడవు గాకుమా!
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.

22, డిసెంబర్ 2018, శనివారం

ఆర్యులారా! నేడు దత్తజయంతి. ఈ సందర్భముగా మీకు శుభాకాంఖ్షలు. శ్రీ అజ్జాడ కామేశ్వర శర్మగారు రచించిన దత్తోదాహరణ కావ్యాన్ని చూడండి.

0 comments

  జైశ్రీరామ్.
ఆర్యులారా! నేడు దత్తజయంతి. ఈ సందర్భముగా మీకు శుభాకాంఖ్షలు.
శ్రీ అజ్జాడ కామేశ్వర శర్మగారు రచించిన దత్తోదాహరణ కావ్యాన్ని చూడండి.
జైహింద్.

21, డిసెంబర్ 2018, శుక్రవారం

సమాశ్రీ,ధారా,మహత్వ,గంథానిల,రసిజా,చెట్టపట్టు,మాంగళ్య, ప్రాభవ,భావస్ఫురణ,సాంగత్య,గర్భ"-జ్ఞాన దీన"-వృత్తము. రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

0 comments

జైశ్రీరామ్.
సమాశ్రీ,ధారా,మహత్వ,గంథానిల,రసిజా,చెట్టపట్టు,మాంగళ్య, ప్రాభవ,భావస్ఫురణ,సాంగత్య,గర్భ"-జ్ఞాన దీన"-వృత్తము.
    రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
                       జుత్తాడ.
    జ్ఞాన దీన"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.న.జ.ర.భ.ర.లగ,గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
జ్ఞాన కన్య చెట్ట పట్టె!జాతి వరుని నిచ్ఛనంది!సాంగత్యపు ప్రాభవమ్మునన్?
మాన హీన ఖ్యాతి నొప్పె!మాత పరువు మట్టిగల్పి!మాంగళ్యము నొందె
                                                                                               నేలనో?
తూనికేమి లేకపోయె!దూతజనుల పాలనాన!దొంగాటక మాయజాలమున్?
బానిసాయె!దిక్కుమాలి!పాతువడగ నీతిజేసె!భంగంబుల నెట్ట జాలకన్?

జాతిప్రాభవము మిక్కుటముగా నున్న,నేటి స్వాతంత్ర్యము నందు జాతి
ప్రాపు నేపు మాత్రమేయెంచి,జ్ఞానపు విలువలుదిగుడు జేసి,అనర్హతకు
పెద్దపీట వేసి,అజ్ఞానము జ్ఞానముగాపరిగణించి,జ్ఞానులను నీటముంచి
దేశవైభవాన్ని పట్టుపట్టి దిగజార్చు నేటి దుస్తితికి,చింతించుచు,నామనో
భావమును గర్భకవితయందు భావితరములకు తెలుపునూహమాత్రమే!

1.గర్భగతసమాశ్రీ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.జ.గల.గణములు.వృ.సం.171.ప్రాసగలదు.
జ్ఞాన కన్య చెట్ట పట్టె!
మానహీన ఖ్యాతి నొప్పె?
తూనికేమి? లేక పోయె?
బానిసాయె!దిక్కు మాలి!

2.గర్భగత"-ధారా"-వృత్తము.
బృహతీఛందము.ర.స.జ.గణములు.వృ.సం.347.ప్రాసగలదు.
జాతి వరుని నిచ్ఛ నంది!
మాత పరువు మట్టి గల్పి!
దూత జనుల పాలనాన?
పాతువడగ నీతి జేసె?

3.గర్భగత"-మహత్వ"-వృత్తము.
బృహతీఛందము.త.జ.ర.గణములు.వృ.సం.173.ప్రాసగలదు.
సాంగత్యపు ప్రాభవమ్మునన్?
మాంగళ్యము నొందె నేలనో?
దొంగాటక మాయ జాలమున్!
భంగంబుల నెట్ట జాలకన్?

4.గర్భగత"-గంధానిల"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.ర.న.జ.గల.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
జ్ఞాన కన్య చెట్ట పట్టె!జాతి వరుని నిచ్ఛ నంది!
మాన హీన ఖ్యాతి నొప్పె!మాత పరువు మట్టిగల్పి!
తూనికేమి?లేక పోయె!దూత జనుల పాలనాన!
బాని సాయె!దిక్కు మాలి!పాతు వడగ నీతి జేసి!

5.గర్భగత"-రసిజా"-వృత్తము.
ధృతిఛందము.ర.స.జ.త.జ.ర.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
జాతి వరుని నిచ్ఛ నందె?సాంగత్యపు ప్రాభవమ్మునన్?
మాత పరువు మట్టి గల్పి!మాంగళ్యము నొందె నేలనో?
దూత జనుల పాలనాన!దొంగాటక మాయ జాలమున్?
పాతువడగ నీతి జేసె!భంగంబుల నెట్ట జాలకన్?

6.గర్భగత"-చెట్టపట్టె"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.స.జ.త.జ.ర.ర.జ.గల.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
జాతి వరుని నిచ్ఛ నందె!సాంగత్యపు ప్రాభవమ్మునం?జ్ఞానకన్య చెట్టపట్టె!
మాత పరువు మట్టిగల్పి!మాంగళ్యము నొందె నేలనో?మానహీన ఖ్యాతి                                                                                                       నొప్పె?
దూతజనుల పాలనాన!దొంగాటక మాయజాలముం?తూనికేమి లేకపోయె?
పాతు పడగ నీతి జేసి!భంగంబుల నెట్టజాలకం?బానిసాయె!దిక్కు మాలి!

7.గర్భగత"-మాంగళ్య"-వృత్తము.
అత్యష్టీఛందము.త.జ.ర.ర.జ.గల.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
సాంగత్యపు ప్రాభవమ్మునం?జ్ఞానకన్య చెట్ట పట్టె?
మాంగళ్యము నొందె నేలనో?మానహీన ఖ్యాతి నొప్పె!
దొంగాటక మాయ జాలముం?తూనికేమి లేక పోయె?
భంగంబుల నెట్ట జాలకం?బాని సాయె! దిక్కు మాలి!


8.గర్భగత"-లఘ్వంత ప్రాభవ"-
ఉత్కృతిఛందము.త.జ.ర.ర.జ.ర.న.జ.గల.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
సాంగత్యపు ప్రాభవమ్మునం?జ్ఞాన కన్య చెట్ట పట్టె?జాతి వరుని నిచ్ఛనంది!
మాంగళ్యము నొందె నేలనో?మానహీన ఖ్యాతి నొప్పె!మాత పరువు మట్టిగల్పి!
దొంగాటక మాయ జాలముం?తూనికేమి లేకపోయె?దూత జనుల పాలనాన?
భంగంబుల నెట్ట జాలకం? బాని సాయె!దిక్కు మాలి! పాతు పడగ నీతి జేసి!

9.గర్భగత"-భావస్ఫురణ"-వృత్తము.
 అత్యష్టీఛందము.భ.స.జ.ర.జ.గల.గణములు.యతి10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
జాతివరుని నిచ్ఛ నంది!జ్ఞాన కన్య చెట్ట పట్టె?
మాత పరువు మట్టి గల్పి!మానహీన ఖ్యాతి నొప్పె!
దూతజనుల పాలనాన!తూనికేమి?లేక పోయె!
పాతు పడగ నీతి జేసి!బానిసాయె దిక్కు మాలి!

10,గర్భగత"-సాంగత్య "-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.స.జ.ర.జ.రభ.ర.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనీమము గలదు.
జాతి వరుని నిచ్ఛనంది!జ్ఞాన కన్య చెట్ట పట్టె?సాంగత్యపు ప్రాభవమ్మునన్?
మాత పరువు మట్టిగల్పి!మానహీన ఖ్యాతి నొప్పె?మాంగళ్యము నొందె
                                                                                               నేలనో?
దూత జనుల పాలనాన!తూనికేమి?లేకపోయె!దొంగాటక మాయజాలమున్?
పాతుపడగ నీతిజేసి!బానిసాయె దిక్కుమాలి!భంగంబుల నెట్ట జాలకన్?
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.

20, డిసెంబర్ 2018, గురువారం

భస్మభూ,భ్రమక,మత్తరజినీ,నీతిపంచు,రనజారజ,సంచితాల ,రజరయరా,మసలు,రాణిజ,నడతా,గర్భ"-త్రికరణ"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహమూర్తి.జుత్తాడ.

0 comments

జైశ్రీరామ్.
భస్మభూ,భ్రమక,మత్తరజినీ,నీతిపంచు,రనజారజ,సంచితాల ,రజరయరా,మసలు,రాణిజ,నడతా,గర్భ"-త్రికరణ"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహమూర్తి.జుత్తాడ.
                 
"-త్రికరణ"-వృత్తము.
ఉత్కృతిఛందము.య.ర.య.జ.న.ర.జ.ర.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
మనో వాక్కాయ కర్మలం!మంచి నెంచి మసలు కొమ్ము! మాధవుండె దిక్కుమానవా!                                           చనం మోక్షంబు చేకురుం!సంచితాలు వెనుక రావు!సాధనాన దక్కు వెన్నుడున్?
మనీషీ వంచు  నొప్పుమా!మంచి జేయు నరులకీవు!మాదకాల ముట్ట కెన్నడున్?                                                 వనాలం దృంచబోకుమా!పంచి నీతి సమత కోరు!వాదులాడ మానిమెల్గుమా!                                                                                    
1,గర్భగత"-భస్మభూ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.య.ర.లగ.గణములు.వృ.సం.82.ప్రాసగలదు.
మనో వాక్కాయ కర్మలన్?
చనం మోష్కంబు చేకురున్!
మనీషీ వంచునొప్పుమా!
వనాలం దృంచ బోకుమా!

2.గర్భగత"-భ్రమక"-వృత్తము.
బృహతీఛందము.ర.న.జ.గణములు.వృ.సం.371.ప్రాసగలదు.
మంచి నెంచి మసలు కొమ్మ!
సంచితాలు వెనుక రావు!
మంచి జేయు నరుల కీవు!
పంచి నీతి సమత కోరు!

3.గర్భగత"-మత్తరజినీ"-వృత్తము.
బృహతీఛందము.ర.జ.ర.గణములు.వృ.సం.171.ప్రాసగలదు.
మాధవుండె దిక్కు మానవా!
సాధనాన దక్కు వెన్నుడున్!
మాదకాల ముట్ట కెన్నడున్?
వాదులాడ మాని మెల్గుమా!

4.గర్భగత"-నీతిపంచు"-వృత్తము.
అత్యష్టీఛందము.య.ర.య.జ.న.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
మనో వాక్కాయ కర్మలం!మంచి నెంచి మసలు కొమ్మ!
చనం మోక్షంబు చేకురుం?సంచితాలు వెనుక రావు!
మనీషీవంచు నొప్పుమా!మంచి జేయు నరులకీవు!
వనాలం దృంచ బోకుమా! పంచి నీతి సమత కోరు!

5.గర్భగత"-రనజారజ"-వృత్తము.
ధృతిఛందము.ర.న.జ.ర.జ.ర.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
మంచి నెంచి మసలు కొమ్మ!మాధవుండె దిక్కు మానవా!
సంచితాలు వెనుక రావు!సాధనాన దక్కు వెన్నుడున్?
మంచి జేయు నరుల కీవు!మాదకాల ముట్ట కెన్నడున్?
పంచి నీతి సమత కోరు!వాదులాడ మాని మెల్గుమా!

6.గర్భగత"-సంచితాలు"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.న.జ.ర.జ.ర.య.ర.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
మంచి నెంచి మసలు కొమ్మ!మాధవుండె దిక్కు మానవా!మనో వాక్కాయ కర్మలన్!                                             సంచితాలు వెనుక రావు!సాధనాన దక్కు వెన్నుడుం?చనం మోక్షంబుచేకురున్?                                                 మంచి జేయు నరుల కీవు!మాదకాల ముట్ట కెన్నడుం?మనీషీవంచునొప్పుమా!                                                     పంచి నీతి సమత కోరు!వాదులాడ మాని మెల్గుమా!వనాలం దృంచ బోకుమా!                                                                                
7.గర్భగత"-రజరయరా"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.ర.య.ర.లగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
మాధవుండె దిక్కు మానవా!మనో వాక్కాయ కర్మలన్!
సాధనాన దక్కు వెన్నుడుం!చనం మోక్షంబు చేకురున్?
మాదకాల ముట్ట కెన్నడుం?మనీషీవంచు నొప్పుమా!
వాదులాడ మాని మెల్గుమా!వనాలం దృంచ బోకుమా!

8.గర్భగత"-మసలు"-లఘ్వంతము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.య.ర.యజ.న.గల.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
మాధవుండె దిక్కు మానవా!మనో వాక్కాయ కర్మలం!మంచి నెంచిమసలు కొమ్మ!                                               సాధనాన దక్కు వెన్నుడుం!చనం మోక్షంబు చేకురుం?సంచితాలు వెనుక రావు!                                                 మాదకాల ముట్ట కెన్నడుం?మనీషీవంచు నొప్పుమా!మంచి జేయునరుల కీవు!                                                     వాదులాడ మాని మెల్గుమా!వనాలం దృంచ బోకుమా!పంచి నీతిసమత కోరు!                                                                          
9.గర్భగత"-రాణిజ"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.న.జ.య.ర.లగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
మంచి నెంచి మసలు కొమ్మ!మనో వాక్కాయ కర్మలన్!
సంచితాలు వెనుక రావు!చనం మోక్షంబు చేకురున్?
మంచి జేయు నరుల కీవు!మనీషీవంచు నొప్పుమా!
పంచి నీతి సమత కోరు!వనాలం దృంచ బోకుమా!

10,గర్భగత"-నడత"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.న.జ.య.ర.య.జ.ర.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
మంచి నెంచి మసలు కొమ్మ!మనో వాక్కాయ కర్మలం!మాధవుండె దిక్కుమానవా!                                               సంచితాలు వెనుక రావు!చనం మోక్షంబు చేకురుం?సాధనాన దక్కువెన్నుడున్!                                                 మంచి జేయు నరుల కీవు!మనీషీవంచు నొప్పుమా!మాదకాల ముట్ట కెన్నడున్?                                                   పంచి నీతి సమత కోరు!వనాలం దృంచ బోకుమా!వాదులాడ మాని మెల్గుమా!                                                     స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.

19, డిసెంబర్ 2018, బుధవారం

అష్టార చక్ర బంధము శార్దూలము. రచన. హరి వీయెస్సెన్మూర్తి కవి

1 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా!
అష్టార చక్ర బంధము శార్దూలమును హరి వీయెస్సెన్మూర్తి కవి ఎంత అద్భుతంగా విరచించిరో చూడుడు. అభినందించుడు.
రామా నీదయ జూపి నన్ను స తమున్ రక్షించగా గోరెదన్
క్షేమంబుల్ గలిగించి పాపసమితిన్ క్షీణింపగా జేసి నీ
నామంబున్ స్మరియించ నా కసదృశానందంబు నందించి యీ
భూమిన్ సద్యశ మంద జూపు సదయా భో జానకీవల్లభా !
స్వస్తి.
హరి.వీయెస్సెమూర్తి.
మూర్తి కవికి అభినందనలు.
జైహింద్.

18, డిసెంబర్ 2018, మంగళవారం

సాధన సాహితీస్రవంతి ఆహ్వానము.

1 comments

 జైశ్రీరామ్.
జైహింద్.

17, డిసెంబర్ 2018, సోమవారం

బ్రహ్మశ్రీ మంగిపూడి వేంకటరమణమూర్తి భాగవతార్.

2 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! పండితోత్తముఁడు, పేరెన్నిక కన్న కవి, గొప్ప పౌరాణికుఁడు, ఘనతఁగన్న హరికథకుఁడు, 
పరమ భాగవతోత్తముఁడైన  నా మిత్రుఁడు 
బ్రహ్మశ్రీ మంగిపూడి వేంకటరమణమూర్తి భాగవతార్ సుగుణ రాశిని కొలుచుటకు 
నా మాటలు చాలవు.
 .(తిరుపతో జరిగిన నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలలో)
బ్రహ్మశ్రీ కట్టమూరి చంద్రశేఖర్ అష్టావధాని, బ్రహ్మశ్రీ ఎంవీరమణమూర్తి నడుమ నేను
తిరుపతి ప్రపంచ తెలుగు మహాసభలలో ఉపన్యసించుచున్న బ్రహ్మశ్రీ ఎంవీరమణమూర్తి
హరికథ చెప్పుతూవిజృంభించిన  బ్రహ్మశ్రీ ఎంవీరమణమూర్తి భాగవతార్. 
ఘనముగా సత్కృతుఁడగుచున్న బ్రహ్మశ్రీ ఎంవీరమణమూర్తి భాగవతార్. 
జైహింద్.

16, డిసెంబర్ 2018, ఆదివారం

పిల్లల పెంపకము. శ్రీ పాలకుర్తి రామమూర్తి కవి.

1 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా. శ్రీ పాలకుర్తి రామమూర్తి కవిత్వము ఎంత చక్కగా ఉందో  చూడండి.
పిల్లల పెంపకము

ఇరుగు పొరుగు నుందు రిరువురు మిత్రులు
యొకరు వృద్ధు లందు యువకు డొకరు
ముదము మీర గృహము ముంగిట మొక్కలు
బెంచి రమితమైన ప్రేమ తోడ!

అవసరమ్ము మించి అత్యంత నాణ్యమౌ
యెరువు నీరు యువకు డిచ్చి పెంచ
కొద్ది యెరువు మరియు కొద్దిగా నీరిడి
పెంచె వృద్ధు డంత బెరిగె నవియు!

ఒకనాటి రాతిరి యుద్ధతి జూపించె
ప్రకృతి భీభత్సమై వడక జేసె
గాలి వానలతో కకావిక లంబయ్యె
యూరు వాడ కలగె దారుణముగ
ప్రాభాత మందున ప్రకృతి శాంతింపంగ
ఇరువురు జేరిరి ఇండ్ల ముందు
గనుచున్న యువకుని మనమందు నుదయించె
ఆశ్చర్యయుతమునై నట్టి ప్రశ్న

అహరహమ్మును నాణ్యమై నట్టి నీరు
యెరువు లిచ్చి జాగ్రత్తగా యేను బెంచ
వేళ్ళతో గూడ మొక్కలు పెకిలి పోయె
శ్రద్ధ నంతగా జూపని వృద్ధు నింట
నిశ్చలంబుగా మొక్కలు నిలిచి యుండె!

అటుల చింతించి, కారణ మడగ దలచి
యువకు డిట్లనె వృద్ధుని కోమహాత్మ;
పెడితి శ్రద్ధను మీకన్న వేయి గతుల
చెక్కు చెదరవు మీపెంచు మొక్క లేమొ
యేల నాకడ మొక్కలు కూలె నవని!

అనవిని వృద్ధు డిట్లనియె నయ్యరొ; నీ వధికంపు ప్రేమ లా
లనల సమృద్ధిగా నవసరమ్మును మించి యొసంగ; వాడు చా
వనరులు విస్తరిల్లె నవి పైపయి, భూమిని జీల్చి లోనికిన్
జనుట యెరుంగ లేమి నిల సంకటముల్ భరియింప జాలమిన్!

నీదు మొక్కలు వేళ్లతో నేల కూలె
తమకు అవసర మెంతయో తగిన రీతి
యేను సమకూర్చ మొక్కలు యిలను జీల్చి
యేగె లోనికి స్థిరమునై యిపుడు నిలిచె!

అన్వయింపంగ నిది యుక్త మగును నేడు
మనము మన పిల్లలను పెంచు మాత్ర యందు
అవసరమ్ముకు మించిన యంత ప్రేమ
వనరులు సదుపాయములును వసతు లిచ్చి

కష్ట మెయ్యదొ యెరుగని కరణి బెంచ
సహజ సామర్ధ్యములు ప్రజ్ఞ సన్నగిల్లు
తగిన విధమున యిడకున్న తగిన రీతి
ఆత్మ విశ్వాస మవ్వారి కంత రించు!

అవసరమెంతయో యెరిగి యవ్విధి వారికి నంత మాత్రమే
సవిధిని అందజేయ, మది జాగృతి బొందును ప్రజ్ఞ; బుద్ధియున్
వివృతమునౌ, వివేకమెద విస్తృతమై చెలువారు; బాధ్యతా
ప్రవరులునై జెలంగెదరు బాలకులీ భువనమ్ము లోపలన్!

శ్రీ చింతా రామకృష్ణా రావు గారి "బాలభావన" పద్యాలు మరియు ఒక ప్రవచన కర్త ప్రసంగం ఆధారంగా వ్రాసుకున్న పద్యాలు యివి.
స్వస్తి
పాలకుర్తి రామమూర్తి.
కవిగారికి ధన్యవాదములు.
జైహింద్.

15, డిసెంబర్ 2018, శనివారం

సప్తపర్ణ మండప బంధము రచన:=వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.

1 comments

జైశ్రీరామ్
సప్తపర్ణ మండప బంధము
రచన:=వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.
                 
గంధినీవృత్తము.
అతిశక్వరీఛందము.ర.జ.ర.జ.ర.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.వృ.సం.10,923.

నావ నీవ గావ దేవేనా వరా వశం వరా!
భావ మీవ రావ మీవ!భావనా వరీవయా!
దైవ మీవ నేవ మీవ!తావళా వనీవ శ్రీ?
పావనా వరీవ?సేవ భావ మీవ?శ్రీవరా!
సప్తపర్ణము=అరటియాకు,పర్ణము=తమలపాకు,
తమలపాకు ఈనెల నాధారముగా పైబంధమునిర్మించడమైనది.
మంటపము నాలుగు ప్రక్కలానాలుగు తమలపాకులు చతురస్రాకారము
గా పేర్చిమండపమేర్పరచితిని.
1.నైరుతి,వాయవ్య.దిశయందుంచిన తమలపాకునందు ఈనెలప్రాప్తికి
పద్యమందలి రెండుచరణములు వ్రాసితిని.
2.వాయవ్య,ఈశాన్యములకు పరచిన తమలపాకు నందు,పద్యమున
మిగిలిన రెండు పాదములు,వ్రాసితిని.
3.నైరుతి,ఆగ్నేయములకు పరచిన తమలపాకు నందు,మరల పద్యము
రెండు చరణములు వ్రాసితిని.
4.ఆగ్నేయ,ఈశాన్యములకు పరచిన తమలపాకు నందు పద్యము3,4.
చరణములు వ్రాసితిని.
ఈమండప నిర్మాణములో పద్యముపునరావృతమైనది.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.

13, డిసెంబర్ 2018, గురువారం

అమరఁగ నాఱు వర్ణముల నర్జును పేరు ప్రహేళికా చిత్రము.

1 comments

జైశ్రీరామ్.
ప్రహేళిక!
తెలుఁగున దీనిని పొడుపు అందురు.మనకు తెలియని విషయములు పద్యములో గుంభనముగా పొందుపరచి ఆవిశేషమును మనలను తెలుపమని కోరుట ఈపొడుపులలోని విశేషము.మనతెలుఁగు సాహిత్యములో దీనినిగూడా చిత్రకవిత్వముగా భావించుట జరుగుచున్నది. ఈ క్రింది పద్యంలో ఉన్నచమత్కారమేదో తెలిసికొందుము..
"అమరఁగ నాఱు వర్ణముల నర్జును పేరు లిఖి౦చి చూడ, న 
య్యమర విభుండు, షణ్ముఖుడు, పక్షి, పయోరుహవైరి, మేదినీ,
సుమశరులయ్యెడిన్. మఱియుఁ జోద్యము దాని తుదాది చేసినన్
గమలయు, భూమిసంభవుఁడు, కాంతియు, స్వర్గముగా గనంబడున్.

అర్జనుని పేరువచ్చు విధముగా ఆరు అక్షరముల పదము వ్రాసిన ఆపదము వలన, వరుసగా "ఇంద్రుఁడు, కుమారస్వామి,పక్షి, చంద్రుడు, భూమి, మన్మధుడు, రావలయును.
పదము వెనుక నుండి విడదీసినచో, లక్ష్మి, కుజుడు, కాంతి, స్వర్గము అనునవి రావలయును.
పై ప్రహేళికకు సమాధానము " గోరాజకుమార" అనెడి ఆరు అక్షరముల పదము.
గో శబ్దానికి దేవతల పరంగా నానార్ధవివేచన వున్నది.
అప్పుడు
గోరాజకుమారుడు = ఇంద్రసుతుడు". అర్జునుడు
జకు = జక్కవ పక్షి
కుమార = షణ్ముఖుడు
రాజ = చంద్రుడు (పయోరుహవైరి)
గోశబ్దమునకు = భూమియనెడి అర్ధము కూడా ఉన్నది
మార = సుమశరుడు
ఇంక క్రిందినుండి:
రమా = లక్మి
కు = భూమి
కుజ = కుజుడు
రాజ = కాంతి
గో = స్వర్గము
ఇదండీ సమన్వయము
(దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి చాటుపద్యరత్నాకరము నుండి)
ఓంనమోనారాయణాయ.
జైహింద్. 

12, డిసెంబర్ 2018, బుధవారం

శ్రీ కోట రాజశేఖరవధాని సమస్యాపూరణములు.

1 comments

జైశ్రీరామ్.
శ్రీ కోట రాజశేఖరవధాని సమస్యాపూరణములు.

జైహింద్.

11, డిసెంబర్ 2018, మంగళవారం

సమాశ్రీ,గతికా,మత్తరజినీ,పొన్నొదవు,నీతిగా,జ్ఞానజీవ,రజోరంజిత,అమలకీర్తి,అంతఃకరణ,కీర్తిగామిని,"-గర్భ"-శోధకా,వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.

0 comments

 జైశ్రీరామ్.
సమాశ్రీ,గతికా,మత్తరజినీ,పొన్నొదవు,నీతిగా,జ్ఞానజీవ,రజోరంజిత,అమలకీర్తి,అంతఃకరణ,కీర్తిగామిని,"-గర్భ"-శోధకా,వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.
                         
శోధకా"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.భ.స.జ.ర.జ.ర.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
జంతుజాతికున్న నీతి!జగతియందు చూడ లేదు?జాతిమార్పు సంకరం బవున్?                                                                                          
పంతమూనిమార్పు జేయ!ప్రగతి మాపుటూహ గాదె?పాతకాల కాలవాలమౌ?
వింతతీరు సంచరించు!బిగువుతగ్గు సంకటాల!భీతినింపు జీవ సంతతిన్?
శాంతి వీడినిచ్ఛ మీర?జగపు నీతి బుగ్గి నిల్చు!జాతకాలు మారిపోవు లే?

1.గర్భగసమాశ్రశ్రీ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.జ.గల.గణములు.వృ.సం.171.ప్రాసగలదు.
జంతు జాతి కున్న  నీతి!
పంతమూని మార్పు జేయ!
వింత తీరు సంచరించు!
శాంతి వీడి నిచ్ఛ మీర?

2.గర్భగత"-గతికా"-వృత్తము.
బృహతీఛందము.న.ర.జ.గణములు.వృ.సం.344.ప్రాసగలదు.
జగతియందు చూడ లేదు?
ప్రగతిమాపు టూహ గాదె?
బిగువు తగ్గు సంకటాల!
జగపు నీతి బుగ్గి నిల్చు!

3.గర్భగత"-మత్తరజినీ"-వృత్తము.
బృహతీఛందము.ర.జ.ర.గణములు.వృ.సం.171.ప్రాసగలదు.
జాతిమార్పు సంకరంబవున్?
పాత కాల కాల వాలమౌ?
భీతినింపు జీవసంతతిన్?
జాతకాలు మారిపోవు లే!

4.గర్భగత"-పొన్నొదవు"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.భ.స.జ.గల.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
జంతుజాతి కున్న నీతి?జగతియందు చూడ లేధు?
పంతమూని మార్పుజేయ!ప్రగతి మాపు టూహ గాదె?
వింతతీరు సంచరించు!బిగువు తగ్గు సంకటాల!
శాంతి వీడి నిచ్ఛ మీర!జగపు నీతి బుగ్గి నిల్చు!

5.గర్భగత"-నీతిగా"-వృత్తము.
ధృతిఛందము.న.ర.జ.ర.జ.ర.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
జగతియందు చూడ లేదు?జాతిమార్పు సంకరంబవున్?
ప్రగతిమాపు టూహ గాదె? పాతకాల కాలవాలమౌ?
బిగువు తగ్గు సంకటాల!భీతి నింపు జీవ సంతతీన్?
జగపునీతి బుగ్గి గాదె? జాతకాలు మారి పోవులే?


6.గర్భగత"-లఘ్వంత,జ్ఞానజీవ"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.జ.ర.జ.ర.ర.జ.గల.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
జగతియందు చూడలేదు?జాతి మార్పు సంకరంబవుం?జంతుజాతికున్ననీతి?                                                                                               ప్రగతిమాపు టూహగాదె?పాతకాల కాలవాలమౌ?పంతమూని మార్పుజేయ
బిగువుతగ్గు సంకటాల!భీతినింపు జీవ సంతతిం?వింత తీరు సంచరించు!
జగపు నీతి బుగ్గి గాదె?జాతకాలు మారి పోవులే?శాంతివీడి నిచ్ఛ మీర?

7.గర్భగత"-రజోరంజినీ"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.ర.ర.జ.గల.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
జాతిమార్పు సంకరంబవుం?జంతుజాతి కున్న నీతి?
పాతకాల కాలవాలమౌ?పంతమూని మార్పు జేయ?
భీతినింపు జీవ సంతతిం?వింత తీరు సంచరించు!
జాతకాలు మారి పోవులే?శాంతి వీడి నిచ్ఛమీర?

8.గర్భగత"-లఘ్వంత అమలకీర్తి"'-
ఉత్కృతిఛందము.ర.జ.ర.ర.జ.భ.స.జ.గల.గణములు.యతులు.10,18.
జాతిమార్పు సంకరంబవుం?జంతుజాతికున్ననీతి?జగతియందు చూడ
                                                                                                  లేధు?
పాతకాల కాలవాలమౌ?పంతమూని మార్పుజేయ!ప్రగతిమాపుటూహగాదె!
భీతినింపు జీవసంతతిం?వింతతీరు సంచరించు!బిగువు తగ్గు సంకటాల!
జాతకాలు మారిపోవులే?శాంతివీడి నిచ్ఛమీర !జగపు నీతి బుగ్గి గాదె?

9.గర్భగత"-అంతఃకరణ"-వృత్తము.
అత్యష్టీఛందము.న.ర.జ.ర.జ.గల.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
జగతియందు చూడలేదు?జంతుజాతి కున్న నీతి!
ప్రగతిమాపుటూహగాదె?పంతమూని మార్పుజేయ!
బిగువు తగ్గు సంకటాల!వింత తీరు సంచరించు!
జగపు నీతి బుగ్గి గాదె?శాంతి వీడి నిచ్ఛ మీర?

10.గర్భగత"-కీర్తిగామినీ"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.జ.ర.జ.ర.జ.ర.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
జగతియందు చూడ లేదు?జంతుజాతికున్న నీతి!జాతి సంకరంబవున్?
ప్రగతిమాపు టూహగాదె?పంతమూని మార్పుజేయ!పాతకాల కాలవాలమౌ?
బిగువుతగ్గు సంకటాల!వింతతీరు సంచరించు!భీతినింపు జీవ సంతతిన్?
జగపు నీతి బుగ్గి గాదె?శాంతి వీడి నిచ్ఛమీర?జాతకాలు మారిపోవులే?
స్వస్తి
మూర్తి.జుత్తాడ.
జైహింద్.

10, డిసెంబర్ 2018, సోమవారం

కోట రాజశేఖర్ అవధాని దత్తపదులు

0 comments

జైశ్రీరామ్.
కోట రాజశేఖర్ అవధాని దత్తపది.

జైహింద్.

9, డిసెంబర్ 2018, ఆదివారం

శ్రీ కోట రాజశేఖర అవధాని పద్యములు. నిషిద్ధాక్షరి. చూడండి.

1 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీ కోట రాజశేఖర అవధాని పద్యములు. నిషిద్ధాక్షరి. చూడండి.
జైహింద్.

8, డిసెంబర్ 2018, శనివారం

ఆర్యులారా! అమెరికా పౌరులు బ్రహ్మశ్రీ నేమాని సోమయాజిగారు చేయుచున్న అష్టావధానమునకు స్వాగతమ్.

1 comments

  జైశ్రీరామ్.
ఆర్యులారా! అమెరికా పౌరులు బ్రహ్మశ్రీ నేమాని సోమయాజిగారు చేయుచున్న అష్టావధానమునకు స్వాగతమ్.
వీరు కీ.శే.నేమాని రామజోగిసన్యాసిరావుగారి సహోదరుల పుత్రులు.
తప్పక చూడఁదగినది.
జైశ్రీమన్నారాయణ.
వందే భారతమాతరమ్.


7, డిసెంబర్ 2018, శుక్రవారం

ఆచినోతిహి శాస్త్రాణి, .. .. .. మేలిమి బంగారం మన సంస్కృతి,

1 comments

జైశ్రీరామ్.
శ్లో. ఆచినోతిహి శాస్త్రాణి ఆచారే స్థాపయత్యపి
స్వయం ఆచరతే యస్మాత్తస్మాదాచార్య ఉచ్యతే.

క. శాస్త్రంబులనుసరించుచు,
శాస్త్రాంబులు బోధఁ జేసి, చక్కఁగ ప్రజలన్
శాస్త్రంబులాచరింపఁగ
శాస్త్రజ్ఞులు చేయుదురిల సత్యాచార్యుల్.

భావము. శాస్త్రము ఆకళింపు చేసుకొని వారు ఆచరించుచుారి బోధనల ద్వారా యితరులను ఆచరింప చేసేవారేఆచార్యులు అని చెప్పఁబడినది.
జైహింద్.

6, డిసెంబర్ 2018, గురువారం

భూతాని దుర్గా. భువనాని దుర్గా. . . . మేలిమి బంగారం మన సంస్కృతి,

1 comments

జైశ్రీరామ్.
శ్లో. భూతాని దుర్గా. భువనాని దుర్గా. స్త్రీయో నరశ్చాపి పశుశ్చ దుర్గా.
యద్యద్ధి దృశ్యం ఖలు నైవ దుర్గా. దుర్గాస్వరూపదపరం నకించిత్.
క. దుర్గయె భూతావళి కన.
దుర్గయె భువనాళి తెలియ. తోయజ ముఖి యా
దుర్గయె స్త్రీ పురుష పశులు.
దుర్గయె కనఁబడునవెల్ల.దొరకవపరముల్.
భావము. ప్రాణికోటి దుర్గా స్వరూపమే. లోకములన్నియు దుర్గా స్వరూపమే. స్త్రీలు, నరులు, పశువులును దుర్గా స్వరూపమే.ంటికి కనిపించునవన్నియు దుర్గా స్వరూపమే. దుర్గా స్వరూపము కంటే వేరే మరేదీ లేదు.
జైహింద్.

5, డిసెంబర్ 2018, బుధవారం

నయద్వయ,గర్భ"-షణ్ణగ యుగళీ"-త్ర్యక్షరీ.రచన:-వల్లభ వఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.

2 comments

జైశ్రీరామ్.
నయద్వయ,గర్భ"-షణ్ణగ యుగళీ"-త్ర్యక్షరీ.రచన:-వల్లభ వఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.
               
"-షణ్ణగ యుగళీ"-త్ర్యక్షరీ
ధృతిఛందము. న.న.న.న.న.న.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.వృ.సం.2,62,144.
1.
కులము తిలక మలమె! కొలకు కులుకు లొలుక?
కలికి చెలికి! ములుకు, కలన కలి వికలత!
కలచె తొలుత తెలివి!కలిలొ?పులులు చెలగ!
బలుపు నిలుపు తొలగు!వల నొలవని శిలగ?
భావము:-కులుకు లొలుకు కలియుగ చెలికి,కులమే!తిలకము తీర్చి
దిద్దెను.కులపోరాట సంగ్రామమునందు,వికలత్వము వలన,మొట్ట మొదటిగా
నిజమైన తెలివికి దెబ్బతీసి మనసులు కలచివైచెను.అందింది మ్రింగుటే
తత్వమైన పులులు విజృంభిచగా!అడ్డగుగా బలిసిన వారి బలుపు నిలువక
క్షీణించును.పనికిరాని రాతి తీరగును.
2.
కొలకు కులుకు లొలుక!కులము తిలక మలమె?
కలన!కలి వికలత!కలికి చెలికి ములుకు!
కలిలొ! పులులు చెలగ!కలచె తొలుత తెలివి!
వల నొలవని శిలగ! బలుపు నిలుపు తొలగు!

1.గర్భగత"-నయ"ద్వయ"-వృత్తములు.
బృహతీఛందము.న.న.న.గణములు.వృ.సం.512.ప్రాసగలదు.
1.          
కులము తిలక మలమె!  
కలికి చెలికి ములుకు!
కలచె తొలుత తెలివి!
బలుపు నిలుపు తొలగు!
2.
కొలకు కులుకు లొలుక!
కలన కలి వికలత?
కలిలొ!పులులు చెలగ!
వల నొలవని శిలగ!
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.  
జైహింద్.

4, డిసెంబర్ 2018, మంగళవారం

ధర్మరాజును పరీక్షించుటకు యమధర్మరాజు యక్షుడి రూపంలో 72 చిక్కు ప్రశ్నలు వాటికి ధర్మరాజు ఇచ్చిన జవాబులు:

1 comments

జైశ్రీరామ్.
ధర్మరాజును పరీక్షించుటకు యమధర్మరాజు యక్షుడి రూపంలో 72 చిక్కు ప్రశ్నలు
వాటికి ధర్మరాజు ఇచ్చిన సమాధానములు:

1. సూర్యుణ్ణి ఉదయింప చేయువారు ఎవరు? (బ్రహ్మం)

2. సూర్యుని చుట్టూ తిరుగువారెవరు? (దేవతలు)

3. సూర్యుని అస్తమింపచేయునది ఏది? (ధర్మం)

4. సూర్యుడు దేని ఆధారంగా నిలచియున్నాడు? (సత్యం)

5. మానవుడు దేనివలన శ్రోత్రియుడగును? (వేదం)

6. దేనివలన మహత్తును పొందును? (తపస్సు)

7. మానవునికి సహాయపడునది ఏది? (ధైర్యం)

8. మానవుడు దేనివలన బుద్ధిమంతుడగును? (పెద్దలను సేవించుటవలన)

9. మానవుడు మానవత్వమును ఎట్లు పొందును? (అధ్యయనము వలన)

10. మానవునికి సాధుత్వాలు ఎట్లు సంభవిస్తాయి? (తపస్సువలన సాధుభావము,
శిష్టాచార భ్రష్టత్వం వల్ల అసాధుభావము సంభవించును.)

11. మానవుడు మనుష్యుడెట్లు అవుతాడు? ( మృత్యు భయమువలన)

12. జీవన్మృతుడెవరు? (దేవతలకూ, అతిధులకూ పితృసేవకాదులకు పెట్టకుండా తినువాడు)

13. భూమికంటె భారమైనది ఏది? (జనని)

14. ఆకాశంకంటే పొడవైనది ఏది? (తండ్రి)

15. గాలికంటె వేగమైనది ఏది? (మనస్సు)

16. మానవునికి సజ్జనత్వం ఎలావస్తుంది? ( ఇతరులు తనపట్ల ఏపని చేస్తే, ఏ
మాట మాట్లాడితే తన మనస్సుకు బాధ కలుగుతుందో తాను ఇతరుల పట్ల కూడా ఆ మాటలు
మాట్లాడకుండా ఎవడు ఉంటాడో అట్టి వానికి సజ్జనత్వం వస్తుంది)

17. తృణం కంటే దట్టమైనది ఏది? (చింత)

18. నిద్రలో కూడా కన్ను మూయనిది ఏది? (చేప)

19. రాజ్యమేలేవాడు దైవత్వం ఎలా పొందుతాడు? ( అస్త్రవిద్యచే)

20. రాజ్యాధినేతకు సజ్జనత్వం ఎలా కలుగుతుంది? ( యజ్ఞం చేయుటవలన)

21. జన్మించియు ప్రాణంలేనిది (గుడ్డు)

22. రూపం ఉన్నా హృదయం లేనిదేది? (రాయి)

23. మానవుడికి దుర్జనత్వం ఎలా వస్తుంది? (శరణుజొచ్చిన వారిని రక్షించక పోవడంవలన)

24. ఎల్లప్పుడూ వేగం గలదేది? (నది)

25. రైతుకు ఏది ముఖ్యం? (వాన)

26. బాటసారికి, రోగికి, గౄహస్ధునకూ, చనిపోయిన వారికి బంధువులెవ్వరు?
(సార్ధం, వైద్యుడు, శీలవతి అనుకూలవతి అయిన భార్య, సుకర్మ వరుసగా
బంధువులు)

27. ధర్మానికి ఆధారమేది? (దయ దాక్షిణ్యం)

28. కీర్తికి ఆశ్రయమేది? (దానం)

29. దేవలోకానికి దారి ఏది? (సత్యం)

30. సుఖానికి ఆధారం ఏది? (శీలం)

31. మనిషికి దైవిక బంధువులెవరు? (భార్య/భర్త)

32. మనిషికి ఆత్మ ఎవరు? ( కుమారుడు)

33. మానవునకు జీవనాధారమేది? (మేఘం)

34. మనిషికి దేనివల్ల సంతసించును? (దానం)

35. లాభాల్లో గొప్పది ఏది? (ఆరోగ్యం)

36. సుఖాల్లో గొప్పది ఏది? (సంతోషం)

37. ధర్మాల్లో ఉత్తమమైనది ఏది? (అహింస)

38. దేనిని నిగ్రహిస్తే సంతోషం కలుగుతుంది? (మనస్సు)

39. ఎవరితో సంధి శిథిలమవదు? (సజ్జనులతో)

40. ఎల్లప్పుడూ తృప్తిగా పడియుండునదేది? (యాగకర్మ)

41. లోకానికి దిక్కు ఎవరు? (సత్పురుషులు)

42. అన్నోదకాలు వేనియందు ఉద్భవిస్తాయి? (భూమి, ఆకాశములందు)

43. లోకాన్ని కప్పివున్నది ఏది? (అజ్ఞానం)

44. శ్రాద్ధవిధికి సమయమేది? (బ్రాహ్మణుడు వచ్చినప్పుడు)

45. మనిషి దేనిని విడచి సర్వజనాదరణీయుడు, శోకరహితుడు, ధనవంతుడు,
సుఖవంతుడు అగును? ( వరుసగా గర్వం, క్రోధం, లోభం, తృష్ణ విడచినచో)

46. తపస్సు అంటే ఏమిటి? ( తన వృత్తి, కుల ధర్మం ఆచరించడం)

47. క్షమ అంటే ఏమిటి? ( ద్వంద్వాలు సహించడం)

48. సిగ్గు అంటే ఏమిటి? (చేయరాని పనులంటే జడవడం)

49. సర్వధనియనదగు వాడెవడౌ? ( ప్రియాప్రియాలను సుఖ దు:ఖాలను సమంగా ఎంచువాడు)

50. జ్ఞానం అంటే ఏమిటి? (మంచి చెడ్డల్ని గుర్తించ గలగడం)

51. దయ అంటే ఏమిటి? ( ప్రాణులన్నింటి సుఖము కోరడం)

52. అర్జవం అంటే ఏమిటి? ( సదా సమభావం కలిగి వుండడం)

53. సోమరితనం అంటే ఏమిటి? (ధర్మకార్యములు చేయకుండుట)

54. దు:ఖం అంటే ఏమిటి? ( అజ్ఞానం కలిగి ఉండటం)

55. ధైర్యం అంటే ఏమిటి? ( ఇంద్రియ నిగ్రహం)

56. స్నానం అంటే ఏమిటి? (మనస్సులో మాలిన్యం లేకుండా చేసుకోవడం)

57. దానం అంటే ఏమిటి? ( సమస్తప్రాణుల్ని రక్షించడం)

58. పండితుడెవరు? ( ధర్మం తెలిసినవాడు)

59. మూర్ఖుడెవడు? (ధర్మం తెలియక అడ్డంగావాదించేవాడు)

60. ఏది కాయం? ( సంసారానికి కారణమైంది)

61. అహంకారం అంటే ఏమిటి? ( అజ్ఞానం)

62. డంభం అంటే ఏమిటి? (తన గొప్పతానే చెప్పుకోవటం)

63. ధర్మం, అర్ధం, కామం ఎక్కడ కలియును? (తన భార్యలో, తన భర్తలో)

64. నరకం అనుభవించే వారెవరు? (ఆశపెట్టి దానం ఇవ్వనివాడు, వేదాల్నీ, ధర్మ
శాస్త్రాల్నీ, దేవతల్నీ, పితృదేవతల్నీ, ద్వేషించేవాడు, దానం చెయ్యనివాడు)

65. బ్రాహ్మణత్వం ఇచ్చేది ఏది? (ప్రవర్తన మాత్రమే)

66. మంచిగా మాట్లాడేవాడికి ఏమి దొరుకుతుంది? (మైత్రి)

67. ఆలోచించి పనిచేసేవాడు ఏమవుతాడు? (అందరి ప్రశంసలుపొంది గొప్పవాడవుతాడు)

68. ఎక్కువమంది మిత్రులు వున్నవాడు ఏమవుతాడు? (సుఖపడతాడు)

69. ఎవడు సంతోషంగా ఉంటాడు? (అప్పులేనివాడు, తనకున్న దానిలో తిని తృప్తి చెందేవాడు)

70. ఏది ఆశ్చర్యం? (ప్రాణులు ప్రతిరోజూ మరణిస్తూ ఉండడం చూస్తూ మనిషి తానే
శాశ్వతంగా ఈ భూమి మీద ఉండి పోతాననుకోవడం)

71. లోకంలో అందరికన్న ధనవంతుడెవరు? (ప్రియయూ అప్రియమూ, సుఖమూ దు:ఖమూ
మొదలైన వాటిని సమంగా చూసేవాడు)

72. స్ధితప్రజ్ఞుడు అని ఎవరిని ఆంటారు? (నిందాస్తుతులందూ,
శీతోష్ణాదులందూ, కలిమి లేములందూ, సుఖదు:ఖాదులందూ సముడై, లభించిన దానితో
సంతృప్తుడై అభిమానాన్ని విడచి, అరిషడ్వర్గాలను జయించి
స్ధిరబుద్ధికలవాడుగా ఎవరైతే ఉంటాడో వానినే స్థితప్రజ్ఞుడంటారు)
 జైహింద్.

3, డిసెంబర్ 2018, సోమవారం

మదనాగరు,శ్రీశుభా,సుధారస,. గర్భ "-ఆహ్లాదినీ"-వృత్తము. రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

1 comments

జైశ్రీరామ్.
మదనాగరు,శ్రీశుభా,సుధారస,. గర్భ "-ఆహ్లాదినీ"-వృత్తము.
  రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
    జుత్తాడ.
ఆహ్లాదినీ వృత్తము.
ఉత్కృతిఛందము.న.న.య.స.స.భ.స.స.గగ.గణములు.యతులు.10,21.
ప్రాసనీమముగలదు.
మదిమెదలు సుధ వీవే! మదనాగరు కస్తూరి తిలక!మాధవకృష్ణా!శ్రీ
ముదమున ననుగనున్లే!మధుసూదన!గోపాల!మధురమాధురి!తానౌచున్!
సదమల!నయన!శ్రీశా!సదయానిధి!వైకుంఠనిలయు!సాదరమేర్పంగా!
పదిపదుల!వరదాలన్!పధగాముడు!గీతార్ధవిభుడు!బాధలనాపున్లే!

1.గర్భగత"-భుజగ శిశురుత"-వృత్తము.
బృహతీఛందము.న.న.య.గణములు.వృ.సం.128.ప్రాసగలదు.
మదిమెదలు!సుధవీవే!
ముదమున!నను!కనున్లే!
సదమలనయన!శ్రీశా!
పదిపదుల!వరదాలన్!

2.గర్భగత"-శోభా"-వృత్తము.
గాయిత్రీఛందము.భ.మ.గణములు.వృ.సం.07.ప్రాసగలదు.
మాధవ!కృష్ణా ! శ్రీ!.
మాధురి! తానౌచున్!
సాదర! మేర్పంగా!
బాధలు!మాపున్లే!

3.గర్భగత"-కలిగుణ"- వృత్తము.
అనుష్టుప్ఛందము.స.స.గల.గణములు.వృ.సం.156.ప్రాసగలదు.
మదనాగరు!కస్తూరి!
మధుసూదన!గోపాల!
సదయానిధి!వైకుంఠ!
పధగాముడు!గీతార్ధు!


4.గర్భగత"-కస్తూరి "-వృత్తము. 
అత్యష్ష్టీ ఛందము.స.స.భ.స.స.గగ.గణములు!
యతి12.యక్షరము.
మదనాగరు!కస్తూరితిలక! మాధవకృష్ణా! శ్రీ !
మధుసూదన!గోపాల!మధుర మాధురి!తానౌచున్!
సదయానిధి!వైకుంఠనిలయు!సాదరమేర్పంగా!
పధగాముడు!గీతార్ధు!విభుడు!బాధలు మాపున్లే!

5.గర్భగత"-కస్తూరి తిలక"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.స.భ.స.స.త.న.స.గగ.గణములు.యతులు.12,18.
ప్రాసనీమముగలదు.
మదనాగరు కస్తూరి తిలక!మాధవ!కృష్ణా! శ్రీమదిమెదలు సుధ!వీవే!మదుసూదన!గోపాల!మధుర!మాధురితానౌచున్!ముదమున!ననుగనున్లే!
సదయానిధి!వైకుంఠనిలయు!సాదర మేర్పంగా!సదమలనయన!శ్రీశా!
పధగాముడు!గీతార్ధు!విభుడు!బాధలు!మాపున్లే!పదిపదుల!వరదాలన్!

6.గర్భగత"-మాధవా"-వృత్తము.
అతిజగతీఛందము.న.న.య.భ.మ.గణములు.యతి.10.ప్రాసగలదు.
మదిమెదలు!సుధ వీవే!మాధవకృష్ణా!శ్రీ
ముదమున!ననుగనున్లే!మాధురి!తానౌచున్!
సదమల నయన!శ్రీశా!సాదరమేర్పంగా!
పదిపదుల!వరదాలన్! బాధలు మాపున్లే!

7.గర్భగత"-సుధీ"-వృత్తము.
అతిజగతీఛందము.భ.మ.న.న.య.గణములు.యతి.07.ప్రాసగలదు.
మాధవకృష్ణాశ్రీ! మదిమెదలు!సుధ వీవే!
మాధురి!తానౌచున్!ముదమున!ననుగనున్లే!
సాదరమేర్పంగా! సదమల!నయన శ్రీశా!
బాధలు!మాపున్లే!పదిపదుల!వరదాలన్!

8.గర్భగత"-మదనాగరు"-వృత్తము.
ఉత్కృతీఛందము.భ.మ.న.న.య.భ.స.భ.లల.గణములు.యతులు.07,16.ప్రాసనీమముగలదు.
మాధవకృష్ణా!శ్రీ!మదిమెదలు!సుధవీవే!మదనాగరు!కస్తూరి తిలక!
మాధురి!తానౌచున్!ముదమున!ననుగనున్లే!మదుసూధనగోపాలమధుర!
సాదర మేర్పంగా!సదమల!నయన!శ్రీశా!సదయానిధి!వైకుంఠ!నిలయు!
బాధలు!మాపున్లే!పదిపదుల!వరదాలన్! పధగాముడు!గీతార్ధవిభుడు!

9.గర్భగత"-శ్రీశుభా"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.మ.స.స.భ.లల.గణములు.యతి07.ప్రాసగలదు.
మాధవకృష్ణా!శ్రీశా! మదనాగరు!కస్తూరితిలక!
మాధురి తానౌచున్!మధుసూదన!గోపాల!మధుర!
సాదరమేర్పంగా!సదయానిధి! వైకుంఠన!నిలయు!
బాధలు!మాపున్లే!పధగాముడు!గీతార్ధవిభుడు!

10.గర్భగత"-సుధారస"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.స.భ.న.న.న.మ.స.గగ.యతులు.12.21.
ప్రాసనీమముగలదు.
మదనాగరు కస్తూరి!తిలక!మదిమెదలు సుధి!వీవే!మాధవకృషష్ణా!శ్రీ
మదుసూదన!గోపాల మధుర!ముదమున!ననుగనున్లే!మాధురితానౌచున్
సదయానిధి!వైకుంఠనిలయు!సదమలనయన శ్రీశా!సాదరమేర్పంగా!
పధగాముడు!గీతార్ధవిభుడు!పదిపదుల!వరదాలన్!బాధలు!మాపున్లే!

స్వస్తి.
వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
శ్రీ వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి కవికి నా అభినందన పూర్వక ధన్యవాదములు.
జైహింద్..