గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, సెప్టెంబర్ 2023, గురువారం

శ్రీ యాదాద్రి లక్ష్మీనృసింహ శతకము 104వ పద్యము .... రచన. చింతా రామకృష్ణారావు. గానం. శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్.

104. ఓం సచ్చిదానందవిగ్రహాయ నమః  

మత్తహంసిని వృత్త గర్భ సీసము.

ఎన్ని కను మురారి! నిన్నే విభునిగా ను - తింతు రా, మదిలోన శాంతి నిల్ప.

సాకఁగను పరాకు నీకేల ప్రవరుండ! - కావఁగా కష్టమా కరుణఁ జూచి?

పుణ్యులును, నరోత్తముల్ జీవనము నీవె = యందురే! వినవేమి సుందరాంగ!!  

రాక్షసారి! పరాత్పరా! నీవె ప్రభవంబుఁ - గొల్పరా! తీర్చరా కోరికలను.

గీ. మత్తహంసిని గర్భ సన్మహిత సీస - *సచ్చిదానంద విగ్రహా*! సన్నుతులయ!

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

104 సీస గర్భస్థ మత్తహంసినీ వృత్తము ( .. యతి 7)  

మురారి! నిన్నే విభునిగా నుతింతురా. - పరాకు నీకేల ప్రవరుండ! కావఁగా.

నరోత్తముల్ జీవనము నీవె యందురే! - పరాత్పరా! నీవె ప్రభవంబుఁ గొల్పరా!

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! మురారీ! నా మనసులో శాంతిని నింపుట కొఱకు

ప్రత్యేకించి విభుఁడుగా నిన్నె ఎన్నుకొని కొలుచుదును. ప్రవరుఁడా! మమ్ములను సాకుట విషయమున పరాకు

నీకెందులకు? కరుణతో మమ్ము కాపాడుట నీకు కష్టమా? సుందరాంగా! నరోత్తములు, కృత పుణ్యులు జీవనము నీవే

యని అందురే, వారి పలుకులాలకింపవేమి? రాక్షసారీ! పరాత్పరా! నీవే మాలో శౌర్యము కొలుపుము. మా కోరికలను

తీర్పుము. మత్తహంసినీ వృత్త గర్భ సీసమున వెలుగొందుచున్న సచ్చిదానందవిగ్రహా! నీకు నా సన్నుతులు.    

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.