గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, సెప్టెంబర్ 2023, గురువారం

శ్రీ యాదాద్రి లక్ష్మీనృసింహ శతకము 67వ పద్యము .... రచన. చింతా రామకృష్ణారావు. గానం. శ్రీ కుమార సూర్యనారాయణ.

జైశ్రీరామ్

67. ఓం సురేశ్వరాయ నమః.

ప్రహరణకలిత వృత్త గర్భ సీసము.

దీన బంధు నృహరి! తెలియ నీ నిజ ఘన -  నిలన్. బ్రభా పూర్ణదర్ప హరుఁడ!

కలిగినట్టి సహన ఘనతచే జయములు - కనితిన్ గదా నీదు కరుణ చేత.

గొప్పదైన యిహము కొలుపు నీహృదయమ - ది భువిన్ పరాత్పరాత్రిభువనేశ!

జ్ఞాన మిచ్చిమహిమఁ గనునటుల్ మలచుమ - మములన్ మహాదేవ! మా నృసింహ!

గీ. పాప ప్రహరణ గుణగణ శ్రీపతివయ! - జయము ధీరా! *సురేశ్వరా*! జయము జయము.

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

67 సీస గర్భస్థ ప్రహరణకలిత వృత్తము. (     .. యతి 8)

నృహరి! తెలియ నీ నిజ ఘనత నిలన్.

సహన ఘనతచే జయములు కనితిన్ .

యిహము కొలుపు నీహృదయమది భువిన్.

మహిమఁ గనునటుల్ మలచుమ మములన్.

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! దీనబంధూ! నీ ఘనత తెలిసికొనుట కొఱకు నాకు

కలిగియున్న సహనము యొక్క గొప్పతనము చేతజయమునందితిని, అది నీకరుణచేతనే సుమా. త్రిభువనేశా! నీ

గొప్ప మనసు ఇహమును ప్రాప్తింప చేయుట కోసము మాకు జ్ఞానమును ప్రసాదించి, మహిమమును కనునట్టుల

మమ్ములను మలచుము. పాప ప్రహరణ గుణగణుఁడవయిన లక్ష్మీపతివి, సురేశ్వరా! నీకు జయము.

జైహింద్. 

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.