గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, సెప్టెంబర్ 2023, గురువారం

శ్రీ యాదాద్రి లక్ష్మీనృసింహ శతకము 58వ పద్యము .... రచన. చింతా రామకృష్ణారావు. గానం. శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్.

58. ఓం వరప్రదాయ నమః.

మణిగణనికర వృత్త గర్భ సీసము.

జయములు కొలిపెడి సఖుఁడవు నృహరీ! వి - జయచింత నాకేల? సద్విభాస!

నయముగ నడిపెడి నరుఁడవు కదయావి - నయ వర్తనము చింత నాకదేల?

భయములనణచెడి వరదుఁడవుకనంగ -  నినుఁ గానకుందునా నిత్యసత్య!

ప్రియమున నిలువఁగ వెలయుము మదిలోన - విజ్ఞాన తేజమై వెలుఁగు నీయ.

గీ. సకల సద్గుణ మణిగణనికర గర్భ - సీస భాస *వరప్రదా*! చేరుము నను.

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

58 సీస గర్భస్థ మణిగణనికర వృత్తము. ( .. యతి 9)

జయములు కొలిపెడి సఖుఁడవు నృహరీ!

నయముగ నడిపెడి నరుఁడవు కదయా

భయములనణచెడి వరదుఁడవు కనన్.

ప్రియమున నిలువఁగ వెలయుము మదిలో.

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! విజయములు కలిగించెడి సఖుఁడవైన నీవుండగా నాకు

విజయము విషయములో అనుమానము లుండనవసరము లేదు. నయమార్గమున నడిపెడి నీ తోడు నాకుండగా నీతితో

కూడిన ప్రబర్తన విషయమై నాకు విచారము ఉండనవసరము లేదు. భయములను బాపెడి నీవు నన్ను కనకుండగా

ఉండవు. మనములందు ప్రేమతో వసింప వచ్చి విజ్ఞానతేజమునిమ్ము. మణిగణ వృత్త గర్భసీసమునందు ప్రకాశించు

సకల సద్గుణమణివైన వరప్రదా! నన్ను చేరుము.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.