గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

31, డిసెంబర్ 2015, గురువారం

జనవరి 2016 తెలుగు వెలుగులో గణనాధ్యాయి వెలుగు.

0 comments

జైశ్రీరామ్
 జనవరి 2016 ‘తెలుగు వెలుగు’లో గణనాధ్యాయి వెలుగు. 
శ్రీమద్భాగవతాంధ్ర కల్ప సుమముల్ చిత్సౌరభం బెన్నికన్
ధీమంతుండగు పోతనార్యు కృతిచే దిగ్దేశ వ్యాప్తంబవన్,
శ్రీమద్భాగవతార్య గణ్య ఫలముల్ చేరెన్ దిశాంతంబులన్.
ఏమాభాగ్యము తెల్గువెల్గులిలలోనీశానురూపంబయెన్. 
జైహింద్.

30, డిసెంబర్ 2015, బుధవారం

శ్రీ కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళె గారికి సాహితీ పురస్కారం కార్యక్రమమునకు సంబంధించిన చిత్రమాలిక.

1 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! డా. కోడూరు ప్రభాకరరెడ్డి సాహితీ పీఠం, ప్రొద్దుటూరు. శ్రీ కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళె గారికితే. 27-12-2015 సాయంత్రం గం.4.00లకు
జయప్రకాష్ నారాయణ్ నగర్ కమ్యూనిటీ హాలు(మియాపూర్)నందు సాహితీ పురస్కారం కార్యక్రమమునకు సంబంధించిన చిత్రమాలిక.
జైహింద్.

న దేవాంశో దదాత్యన్నం . . . మేలిమి బంగారం మన సంస్కృతి,

1 comments

జైశ్రీరామ్
శ్లో. న దేవాంశో దదాత్యన్నం!
నారుద్రో రుద్ర మర్చ్యతే!
నా నృషిః కురుతే కావ్యం!
నావిష్ణుః పృథివీపతిః!!
గీ. కలుఁగ దైవాంశ దాతగా వెలుగునతఁడె.
రుద్రుఁడగువాఁడె చేయు రుద్రార్చనంబు.
ఋషియె కావ్యంబు వ్రాయనౌనెన్ని చూడ.
కలుఁగ విష్ణ్వంశ రాజుగా వెలుగునతఁడె.
భావము. దేవతాంశ లేనియెడల అన్నదాత కాజాలడు; రుద్రాంశ లేనిచో రుద్రుని అర్చించడు; ఋషి గానిచో కావ్యమును రచించలేడు; విష్ణు అంశ లేనివాడు రాజ్యపాలకుడు కాలేడు.
జైహింద్.

29, డిసెంబర్ 2015, మంగళవారం

అన్నం పరబ్రహ్మస్వరూపమ్.

3 comments

జైశ్రీరామ్.
క. పుట్టినదాదిగ మనలకు 
మట్టిగ నగునంత వరకు మధురాన్నంబుల్
పొట్టకు పెట్టక తప్పదు.
నెట్టుట కవ దాకలిని మనీషులకయినన్.
గీ. అట్టి యాకలికన్నము నమరఁ జేయు
దైవ మిల రైతు ఆ రైతు జీవ శక్తి
భూమి కర్పించి పండించు పూజ్యమైన
అన్నమా దైవ దత్తమే. మన్ననమది.
గీ. అట్టియన్నంబితరులకుఁ బెట్టవలయు,
ఆకలినిగొన్నవారిని హరిగఁ దలచి
అన్నమును పెట్టనగునది హరికి సేవ.
విష్ణుఁడభ్యాగతుండని వినమె మనము?
క. అన్నద్వేషము కూడని
దన్నం బిల విసరఁగఁ దగ దాగ్రహమున నా
యన్నంబు విసురు వారికి
నన్నంబో రామచంద్ర యను దశ కలుగున్.
జైహింద్.

28, డిసెంబర్ 2015, సోమవారం

అభ్యాగతః స్వయం విష్ణుః.

2 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! 
 పదచిత్ర రామాయణ కవి శ్రీ విహారి గారు, 
ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగు భాషాధ్యక్షులు డా.వెల్దండ నిత్యానందం గారు, 
పద్యకళాప్రవీణ డా.ఫణీంద్ర గారు 
మాయింటికి వచ్చి మా అందరికీ మహదానంద కారకులయినారు. 


కంద - తేటగీతి గర్భ చంపక మాల.
వర గుణధాముడౌ హరియు, బ్రహ్మ నటేశులు హాయిఁ గొల్ప  నా
దరమతులై కదా యిట విహారియు, నిత్య  ఫణీంద్రలౌచు సు
స్థిర ఘనతన్ ననున్ వరలఁ జేయ నయంబున వచ్చినారు. హ్లా
ద రస ఘృణిన్ సదా  కని ముదంబున మత్ శుభ కాంక్షఁ దీర్చగా.!

చంపకమాల గర్భస్థ కందము.
గుణధాముడౌ హరియు, బ్ర
హ్మ, నటేశులు హాయిఁగొల్ప  నాదరమతులై
ఘనతన్ ననున్ వరలఁజే
య నయంబున వచ్చినారు.హ్లాద రసఘృణిన్.

చంపకమాల గర్భస్థ తేటగీతి.
హరియు, బ్రహ్మ, నటేశులు హాయిఁగొల్ప 
యిట విహారియు, నిత్య ఫణీంద్రలౌచు
వరలఁజేయ నయంబున వచ్చినారు
కని ముదంబున మత్ శుభ కాంక్షఁ దీర్చ.

సాక్షాత్కరించిన త్రిమూర్తులైన వీరికి 
నా హృదయ పూర్వక ధన్యవాదములు తెలియఁ జేసుకొనుచున్నాను.
జైహింద్.

27, డిసెంబర్ 2015, ఆదివారం

శ్రీ పిళ్ళే కవి - డా.వెల్దండ సమీక్ష, సమర్పించనున్న పఞ్చరత్నములు, నివేదన పత్రము.

0 comments

జైశ్రీరామ్.
తెలుగుశాఖాధిపతి, ఉస్మానియావిశ్వవిద్యాలయం
హైదరాబాదు.
పరిణతప్రజ్ఞులు, పద్యరచనా ప్రవీణులు, నవలాకారులు, ఉత్తమ ఉపాధ్యాయులు అయిన శ్రీ కరణం బాలసుబ్రహ్మణ్య పిళ్ళె గారు 1936 పిబ్రవరి 1న చిత్తూరు తాలుకా తలుపులపల్లె గ్రామంలో జన్మించారు. భాషాప్రవీణ పూర్తిచేసి చిత్తూరు ప్రాంతంలో దాదాపు 38 ఏళ్ళ పాటు అనేక ఉన్నత పాఠశాలల్లో తెలుగు అధ్యాపకులుగా పనిచేశారు.
బాలసుబ్రహ్మణ్యపిళ్ళె గారు  తమ  అపార అనుభవంతో రాసిన వెలుగు తగ్గిన తెలుగు  వ్యాస సంకలనం ఎంతో విలువైంది.  భాషాభిమానులందరూ చదువదగింది.  తెలుగు భాష – బోధన నానాటికి  తీసికట్టుగా మారుతుందన్న ఆవేదన ఈ రోజు అందరినీ క్రుంగదీస్తుంది. మాట్లాడే ప్రతి భాష ఏదో ఒక పరిమిత ప్రాంతానికో, పరిమిత వర్గానికో చెందుతూనే ఉంటుంది. స్వల్పకాలంలో అది మారిపోతుంది. కాని విద్యార్థులకు నేర్పవలసింది సరళగ్రాంథికభాషనే. పుస్తకాలలో వ్యావహారిక భాష, దిక్కుమాలిన కాన్వెంట్లు, లోపభూయిష్టమైన పాఠ్యభాగాల ఎంపికా, అవకతవక పరీక్షావిధానం, దిగజారిన వాచకాలు నేటి తెలుగుదుస్థితికి కారణమవుతున్నాయి.  సుదీర్ఘపరిశీలన,  పరిశోధన చేసి కొన్ని పాఠాలను ఎన్నుకొని పాఠాలబ్యాంక్ తయారుచేసుకోవాలి. అప్పుడు భాషాస్థాయి, భాషాభోధనస్థాయి, విద్యార్థులలో భాషాపరిజ్ఞాన స్థాయి చిరకాలం ఒకేలాగా ఉంటాయి. ఈ పనిని ఒక ఉన్నత భాషావేత్తల సంఘం నిర్వర్తించి పనిపుర్తి కాగానే విరమించాలి. మరీ ప్రాచీన కాలపు గొడ్డు గ్రాంథికాలు కాకుండా మరీ వ్యావహారికభాషలోని విపరీతవైవిధ్యాలు కాకుండా సరళగ్రాంథికాన్ని ముఖ్యంగా పాఠశాలల విద్యార్థులకు నేర్పవలసిఉంది. అప్పుడే సార్వజనీనత, సార్వకాలీనత, సార్వదేశీయత కలుగుతుందన్న ప్రగాఢ అభిప్రాయాన్ని 38ఏళ్ళ అధ్యాపన అనుభవంతో కరణం బాలసుబ్రహ్మణ్య పిళ్ళె గారు చెప్తున్న మాట ఆలోచించదగింది. వీరావేశాలు, ప్రయోగాలు, సిద్ధాంతపరమైన రాగద్వేషాలు పెంచుకొని వాటిని పిల్లల మీద రుద్ది ఎదగనీకపోవడం జరుగుతుందేమోననిపిస్తింది. విశాల భావాలు, సిద్థాంతాలు ప్రతిపాదించే వారిలో నున్న ఆ విశాలత్వం, సైద్థాంతికత సైతం మరోరూపంలో సంకుచితత్వానికి కారణమై,  ఈ దేశం, భాష, సమాజగమనం, ప్రతిదీ చెడ్డదేనన్న వ్యతిరేకభావం నూరిపోయడానికి హేతవు కావడం విషాదకర పరిణామం.  అన్ని ప్రాంతీయ వ్యావహారిక భాషలు అందమైనవే. ఆదరణీయాలే. హేళన చేయకూడదు. సృజనాత్మకరచనల్లో వాటిని ప్రయోగించుకోవచ్చు. కాని వాటిని ఆదరిస్తునే మరొక ప్రామాణికభాష కూడ పుస్తకాలలో ఉండవలిసిన అవసరముంది. ఇది విజ్ఞులందరి భావన.
శ్రీపట్టాభిరామ సుప్రభాతం, సీతాష్టకం, పోలేరి మాతాస్త్రోత్రం రచనలతో బాలసుబ్రహ్మణ్యపిళ్ళె గారు రచనా వ్యాసంగ ప్రకటనకు శ్రీకారం చుట్టారు. భారతంలోని రెండు విలక్షణ అంశాలను తీసుకొని రాసిన విషాదమాధవి. చరిత్రకెక్కని మారణహోమం కావ్యాలు, చారిత్రకేతివృత్తంతో రాసిన ఓరుగల్లు – వీరగల్లుకావ్యం, సాంఘిక వృత్తాన్ని గ్రహించి రాసిన ఒక రాఘవరెడ్డి కథ కావ్యం బాలసుబ్రహ్మణ్యం గారికి పద్యకవిగా ఎనలేని కీర్తిప్రతిష్ఠలు తెచ్చిపెట్టాయి. వీరి నాలుగు కావ్యాలు పద్యాన్ని భావపుష్టి, భాషాపుష్టి, స్పష్టత,  సారళ్యంతో సంస్కారభరితంగా రాయవచ్చునని నిరూపించేవే. 
కవి వస్తుస్వీకరణకు ఎల్లలుండవు. భారతంలో ఆశ్రమవాసపర్వంలో(2-127) ఒక చిన్న పాటి వచనంలో చెప్పిన అంశం బాలసుబ్రహ్మణ్యపిళ్ళె గారిని ప్రముఖంగా ఆకర్షించింది. ఎందరో దాన్ని చదివి వుంటారు. కాని దాని మీద దృష్టి వీరికి మాత్రమే పడింది. చరిత్ర కెక్కని మారణహోమం పేరుతో చక్కని చిక్కని కావ్యాన్ని రచించారు. కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. లక్షలాదివీరులు ప్రాణాలు కోల్పోయారు. ధర్మరాజు పట్టాభిషిక్తుడయ్యాడు. కుంతి, గాంధారి, ధృతరాష్ట్రుడు వానప్రస్థానానికి వెళ్ళారు. అన్నలు, తండ్రులు, తాతలు, అందరూ చనిపోయారు. యుద్ధంలో పాల్గొనని మగవారు మాత్రం బతికిపోయారు. ఆ మగవారే ఈ ఆడవారికి ఏ రకంగా నైన తోడ్పడాలి. అంతేగదా!
సీ.   అంతంత నిల్చి మాటాడు హద్దులు వోయి
చెంత కూర్చుండి భాషించు టొదవె
నేల చూపులు నిల్పి యాలకించుట వోయి
కనుల కన్నులు వెట్టి వినుట యొదవె
నిచ్చి గైకొనువేళ నిలపై నిడుట వోయి
పట్టి యిచ్చుట కరస్పర్శ లొదవె
నినుడు  గ్రుంకగ తమ  యిండ్ల కేగుట వోయి
యిచ్చ  నచ్చటె శయినించు టొదవె
నిరుదెసల  నంకురించిన యీప్సితములు
వాంఛలై , తమకంబులై , వలపు  బాళు
లై , గతులు దప్పి  స్త్రీ  పుం  సమాగమమున
జరగవలసిన దంతయు  జరిగిపోయె .  40
ఆ.వె. కండ్ల  కలక వోలె , కామెర్ల వోలెను ,
స్ఫుట మశూచి వలె , విశూచి వలెను
మరుని తంత్రమహిమ  మసకంపు రోగంబు
రాచవారి  యిండ్ల  రాజు కొనియె . 41
చం. ఒకరిని జూచి యొక్కరు సముత్సుకతన్ వెఱపింతలేక యొ
క్కొ క పురుషున్ కుటుంబ హిత యోజకుని గా వరియించి సర్వకా
ర్య  కుశలలై తిరస్కృత నిరాస్త  కులానుగత ప్రతిష్ఠలై ,
ప్రకట  విశృంఖలత్వమున పాడి దొఱంగిరి  క్షత్రియాంగనల్     42
దాంతో చక్రవర్తి అయిన ధర్మరాజుకు కొత్త తలనొప్పులు వచ్చాయి. ధర్మరాజు ఒక రోజు కుంతి, గాంధారి, ధృతరాష్ట్రులను చూడడానికి అడవికి వెళ్ళాడు.  వ్యాసుడు కూడ వచ్చాడు. వ్యాసు డేదైన వరం ఇస్తాను కోరుకో అని ధృతరాష్ట్రునికి చెప్పాడు. కురుక్షేత్ర యుద్ధంలో  చనిపోయిన వీరులందరినీ ఒక్కసారి చూడాలని ధృతరాష్ట్రు డర్థించాడు.  చనిపోయిన వీరులందరు  పై లోకాల్లోంచి దివ్యరూప వస్త్రాభరణాలతో వచ్చారు. అందరూ సంతోషించారు.  ఆ వీరుల భార్యలను వారితో పాటే పోదలచినవారు వెళ్ళండి అని వ్యాసుడనేసరికి కొన్ని లక్షల మంది స్త్రీలు గంగానదిలో దూకి, మానుషదేహాలు విడిచి, దేవతనువులు దాల్చి వెళ్ళి పోతారు .
యుద్ధంలో పాల్గొన్న వీరులు చస్తారు. కాని స్త్రీల స్థితి  ఏమిటి? వారి రక్షణ, వారి మానసిక శారీరక స్థితి ఏమిటి? దాని వల్ల సమాజంలో తలెత్తే స్థితి ఏమిటి?  ఈ వితంతువులందరు  ఇష్టపుర్తిగా  ప్రాణత్యాగం చేశారంటారా?  వంశగౌరవ ప్రతిష్ఠలు స్త్రీపురుషుల ఇరువురి  సమాన బాధ్యత అని కాకుండా పురుషునిదే  అన్నట్లుగా  ఈ స్త్రీలందరిని వదిలించుకోవడానికే ధర్మరాజు, వ్యాసుడు, ధృతరాష్ట్రుడు  పథకం ప్రకారం చేసిన పని. ఎలాంటి  ప్రతిఘటన రాకుండా ఉండడానికే ధర్మరాజు చతురంగబలాలను తీసుకొని వెళ్ళాడని  బాలసుబ్రహ్మణ్య పిళ్ళె గారి ఊహ కావచ్చు. ఇది అసంబద్ధమైన ఊహ ఏమి కాదు.  ఈ పనిచేయడానికి కురుక్షేత్రయుద్ధం జరిగిన 16 ఏళ్ళ దాక ఎందుకు ఆగారన్నది నా సంశయం . జరిగే అనర్థాలన్నీ ఆపాటికే జరిగి ఉంటాయి . 
బాలసుబ్రహ్మణ్యపిళ్ళె గారు రచించిన మరో అపూర్వకృతి విషాదమాధవి. ఇదొక విచిత్రమైన ఉదంతం. మాతృస్వామ్యవ్యవస్థ నుండి పురుషాధిక్య వ్యవస్థలోకి మారుతున్న కాలం నాటిది. గాలవుడు అనే వ్యక్తి గురుదక్షిణ కోసం కావలిసిన గుర్రాలను సంపాదించడం కోసం మాధవిని వాడుకొన్నతీరును చిత్రించారు. మాధవి తన దయనీయస్థితిని తానే చెప్పుకొన్నట్లు  ఉత్తమపురుషలో రాయడంతో కవిత్వానికి గాంభీర్యం హెచ్చింది. నలుగురితో కలిసి మగపిల్లలను  కనాల్సిన దుస్థితి, తనవారంటూ ఎవరు లేని స్థితి,  తన ఇష్టానిష్టాల ప్రమేయం ఎక్కడా లేని స్థితి. మాధవి హృదయక్షోభను బాలసుబ్రహ్మణ్యపిళ్ళె గారు పరమ ఆర్ద్రంగా చిత్రించారు.
ఉ. నాకొక యిల్లు గావలయు నన్నొక భర్త హృదంతర స్ఫురత్
ప్రాకట రాగ భావ పరిరంభ సుఖంబుల దేల్చగావలెన్
మే కొని భృత్యబంధు సుత మిత్ర సమృద్ధి రహింపగావలెన్
నా కలలన్ని కల్లలయి న న్నపహాస్యము చేసె దవ్వులన్            100
ఎవ్వరు నెందు నుంబడని యీ దురవస్థలు గల్గ కారణం
బెవ్వడు? గాలవుండొ  నను నిచ్చిన  తండ్రియొ , వంతులూని
జవ్వనమున్ గ్రసించిన నృశంసులు రాజులొ , కౌశికుండొ న
న్ని వ్విధి నిందఱున్ కలిసి యేర్చిరి దుస్సహ చిత్రహింసలన్     102
ఉ. ఇట్టిది నా సుదీర్ఘ రస హీన నికృష్ట చరిత్ర:  దీనికిన్
పట్టము గట్టిననారు కవివర్యులు : పూరుష లోహపాద సం
ఘట్టిత శీర్ణ జీర్ణ పరి కర్శిత  జీవనులైన స్త్రీలకున్
నెట్టన ద్యాసబంధన  వినిర్గతి  లేదు  యుగాంతరంబులన్      104
ఆని మాధవి సమస్త కాలాల్లోని పురుషజాతిని నిలదీసి ప్రశ్నస్తుంటే సిగ్గుతో తలవంచుకోక తప్పదు.
రాజ్యహింస, నక్సలైట్ హింస కారణంగా ఏ సంబంధం లేని అమాయక జీవి బలికావడాన్ని బాలసుబ్రహ్మణ్య పిళ్ళె గారు ఒక రాఘవరెడ్డి కథ కావ్యంలో చిత్రించారు. పద్యానికి వచనానికి  ఉండే తేడాలను  సూత్రప్రాయంగా వివరించారు. సమకాలీన సామాజిక ఇతివృత్తానికి కూడ శాశ్వత ప్రయోజనం విలువ కల్పించాలంటే నిరాడంబరమైన పద్యాలలో వ్రాయడమే మంచిదన్న అభిప్రాయంతో  ఈ కావ్యాన్ని రచించారు .
ఒక పేదవాడు ఒకరైతు ఇంటిలో పాలేరుగా చేరుతాడు. అభిమానం సంపాదిస్తాడు. ఆ రైతు తన బిడ్డను ఇచ్చి పెళ్ళి చేద్దామనుకొంటాడు.  అందరూ హర్షిస్తారు. పెళ్ళి పనులమీద నాలుగయిదు సార్లు పొరుగున ఉన్న పట్టణానికి వెళ్తాడు. తమ కదలికలను చెప్తున్న పోలీసు ఇన్ ఫార్మర్ గా నక్సలైట్స్ భావిస్తారు. నక్సలైట్లకు తమ ఉనికి గురించి అందిస్తున్న కొరియర్ గా పోలీసులు భావిస్తారు. ఇద్దరు చంపేస్తారు నిజానికే అతనికేమాత్రం సంబంధం లేదు. ఇదీ కథ.
చం. దళితులు పీడుతుల్ పడెడు దారుణ బాధల మాన్ప , సామ్యమున్
వెలయగ జేయ బూనిరట విప్లవ వీరులు  - శాంతి భద్రతల్
నెలకొన , న్యాయచట్టముల నిల్పగ బూనెదరంట పోలిసుల్ –
బలిగొనిరేల రాఘవుని వారును వీరును గూడి యేకమై 339
కం. కన్నీరటు మున్నీరుగ కన్నియ యేడ్వంగ దాని గన్న పితరు లా
పన్నత నేడ్వగ , జనములు కన్నుల నీరొత్తుకొనుచు కలగుచు నేడ్వన్ 358
ఆ.వె. పల్లె యేడ్చె, పైరు పచ్చలు నేడ్చెను,
మఱ్ఱి చెట్టు నేడ్చె, మడియు నేడ్చె,
బావిచెంతనున్న పాకయు నేడ్చెను
పూర్వ పరిచయమున పొగిలి పొగిలి 359
కం. అన్నలు నవ్విరి, పోలిసులు న్నవ్విరి, కోర్ట్లు నవ్వె, లోకము నవ్వెన్
చన్నదొక బడుగు ప్రాణము మిన్నక మనమేల దాని మెఱముట యనుచున్360
కం. దారణవర్గ విభేదప్రారబ్ధము మాయ దికను భరతావనికిన్
నా రచన నిరర్థకమని భారత రాజ్యాంగమొక్క బాష్పము రాల్చెన్ 361
కాకతీయ రాజన్యులలో రుద్రమదేవి చాలమంది  కవులను  ఆకర్షించినట్లే బాలసుబ్రహ్మణ్య పిళ్ళె గారిని ఆకర్షించినది.  కాకతిరుద్రమ ప్రతాప పౌరుషాలను వర్ణిస్తూ దేవగిరి యాదవరాజు ఒక మహిళ ముందు తలవంచడమా అని యుద్ధానికి దిగి ఓడిపోవడాన్ని చిత్రిస్తు ఓరుగల్లు-వీరగల్లు అనే కావ్యాన్ని 192 పద్యాల్లో రాశారు. చారిత్రకపరిజ్ఞానం, సమకాలీన సామాజిక స్పృహ, కవికల్పనా సామర్థ్యం మేళవించి రాయబడిన ఈ కావ్యాన్ని దేశ సరిహద్దుల్లో పోరాడి ప్రాణాలర్పించిన వీర జవానులకూ, దుష్ట వ్యవస్థతో పోరాడి ప్రాణాలర్పించిన వీర పౌరులకు అంకిత మిచ్చారు .
శా. లేరా కాకతి సీమలోన పురష శ్రేష్ఠుల్ ప్రతాపోన్నతుల్
వారీ యంగన యాధిపత్యము ననిర్వార్యంబుగా జూచిరో
నారీ పాదయుగ  ప్రపీడనమె మూర్థ్నాగ్రాహ్యమం చెంచిరో
చీ! రోషం బభిమాన ముత్ర్పకృతి కించిత్తేని లేదేరికిన్        12
కాకతి వంశంలో ఒక్క మగవానికి పట్టం కట్టకుండా ఆడదానికి పట్టం కట్టడమేమిటి సిగ్గులేకుండా అని సామంతరాజులు దేవగిరి యాదవరాజుతో చేయి కలిపారు. ఈ సామంతరాజులకు రుద్రమదేవి మీద ఇష్టం లేదు. కాని ఆమెను తలచుకుంటే చాలు  వారికి “వేపథువు, వివర్ణతయు, వెక్కసపాటును, ఘర్మవారియున్ దోపగ, గుండె ఝల్లుమను తూలును మాటయు పాయు ధైర్యమున్”  (14). ఇటువంటి పిరికి వారిని తనకు సాయపడే గొప్పవీరులుగా భావించి రుద్రమ దేవి మీదికి దండెత్తడమే ఆ రాజు చేసిన దోషం. దాని ఫలితంగా ఓటమి. రెండు కోట్ల ధనం ఇచ్చి బయటపడవలసివస్తుంది.
ఆ అవమానానికి ప్రతిక్రియ చేయాలని ఓరుగల్లుకు  ప్రతిరూపంగా మరో ఓరుగల్లు కోటను చిన్నగా నిర్మించి దాన్ని కూల్చి ఓదార్పు పొందడం పరిష్కారంగా అందరూ సూచిస్తారు .
తే.గీ. ఓరుగల్లుకు ప్రతిరూప మొకటి చేసి
కొదరి కసిదీర దానిని గ్రొచ్చి కూల్చి
మట్టగింతము జనులు సమ్మతిని జూడ
నదియె నేటికి కర్తవ్య మనియె నొకడు      64
ఉ. ఆ విధినైన నొక్కమెయి నాత్మ పరాభవ సాంత్వన క్రియా
వ్యావృతిగాంచవచ్చు నది యట్టిద దేవుని మట్టిముద్దలో
సి పూజలిడు భంగిన యిందును నోరుగల్లునున్
భావనచేసి పోనడచి స్వాంతము స్వాంతన బొందుటొప్పగున్  65
కృతిమంగా అలా కోట కట్టి హేళన చేస్తు భవిష్యత్తులో ఓరుగల్లు కోటకు ఇదే గతి పట్టాలని ఆకాంక్షిస్తూ  దాన్ని ద్వంసం చేస్తున్నారు. ఇది కవి ప్రతిభను ప్రదర్శించే కల్పన. ఇక్కడి నుండి ఉదాత్తమైన ఉత్కంఠభరితమైన మలుపుతిరుగుతుంది కావ్యం.  కవిగారు ఇవ్వదలిచిన సందేశం అది.  వరంగల్లుకు చెందిన బాచన్న అనే యువకుడు బతుకుతెరువు కోసం ఆదే నగరిలో ఉంటాడు. ఓరుగల్లుకు ఇలా అవమానించడం చూసి భరించలేక రగిలిపోతాడు.
చం. ఇది కృతకంబొ, నిక్కమొ మరేమయినన్ సరె యోరుగల్లుగా
మదిగొని దీనికిప్పు డవమానము చేయుట చూచి సైతునే
హృదయము కాకతీయము, శరీరము కాకతి ఆత్మ, కాకతీ
య దయితమైన నేగలుగ నాపద కాకతి కంట నిత్తునే  81
కం. తన తల్లికి తన నేలకు తన జాతికి  భంగపాటు తవిలిన తఱి ము
క్కున నూర్పుగల్లు మానిసి తన ప్రాణము లొడ్డి సేగి తలగగ వలదే ? 82
చం. ఒకరుడనైన నేమి? కొన యూపిరి దాకను మాతృభూమి ర
క్షకు నసువుల్ శరీరమును కల్మియు నొడ్డని నాదు జన్నమే
టికి? తెలుగుం జవంబు ప్రక టింపని యీ తనువేటి కీ రిపు
ప్రకరము నోర్వ నూల్కొనని బాచన గుండియ లేటి కేటికా?  83
తైలం, దూది, కర్పూరం, గుగ్గిలం, లక్క కలిపి బాణాలు తయారు చేసుకొని ఆ కృత్రిమ కోటను కూలుస్తున్న యాదవుల మీదికి ప్రయోగిస్తాడు.
శా. ఉన్నాడిక్కడ తెల్గు వీరుడొక డుద్యోగించి మీ పూనికల్
ఛిన్నాభిన్నమొనర్చువాడు . రిపు విచ్ఛేదంబె కార్యంబుగా
నున్నాడిక్కడ . వీని ముక్కుకొన కుట్టూర్పుండునందాక మీ
సన్నాహంబులు సాగనేరవు మనశ్చాంచల్యముల్ వీడుడీ  .97
అందరూ  ఒక్కుమ్మడిగా  బాచన పై దాడి చేసి చంపేస్తారు. ఇక్కడ  చావడం ప్రధానం కాదు. ఓరుగల్లుకు అవమానం జరగకుండా చివరిదాక పోరాడి  దేశభక్తిని ప్రదర్శించడం  గమనించాల్సిన ప్రధానాంశం. ఇంతలో రాత్రి అయింది. కవిగారికి తన వర్ణనప్రతిభను ప్రదర్శించే అవకాశం చిక్కింది.
తే.గీ. తెలుగు వీరుని సాహస విలసనంబు
గాంచగా తెల్గువీరు లొకండొకండ
వచ్చి మూగిన రీతి నభంబునందు
చుక్కలొండొండ పొడవమె మినుక్కుమనుచు       147
తే.గి. ఇది యెఱిగి తెల్గురాణి యింకేమి సేయ
దలచునో యను భీతి యాదవుల యెదల
గ్రమ్మినట్టుల చీకటుల్ గ్రమ్ముకొనియె
ధైర్య దీధితి కిసుమంత దారియీక         148
ఇలాగ సూర్యోదయస్తమయాలను కథకు అన్వయించి రాయడం తిక్కననాటి నుండి తెలుగు సాహిత్యములో ఉన్నదే ఈ బాచన సాహసకార్యం ఓరుగల్లు మహరాణి రుద్రమదేవి  చెవులదాక వెళ్ళింది. బాచన సైనికుడు కాదు. తనను కొల్వలేదు. మామూలు పౌరుడు పైగా బతుకుతెరువు కోసం దేవగిరి వెళ్ళినవాడు.  తనఊరు కాదు. తనవారు లేరు. అయినా ఏమాత్రం అదరలేదు. బెదరలేదు.
తే.గీ. ప్రాణములు పోవునెడ వాని సర్వమునందు
తనదు భూమికి ,  రాజ్ఞికి తెనుగు  ప్రజకు
జయమనెడు మాట మంద్రమై బయలువెడలె
తల్లిరో ! వాని జన్మంబు  ధన్యమయ్యె .      163
రుద్రమదేవి అతని స్మృత్యర్థం ఒక వీరగల్లుని నిర్మిస్తుంది. వీరగల్లు అంటే యుద్ధంలో చనిపోయిన వీరుని పేరిట ఒకరాతి బండను అతని పేరు రాసి నిలబెట్టడం. దేశగౌరవప్రతిష్ఠలను కాపాడడం ప్రజలందరి కర్తవ్యమని బాలసుబ్రహ్మణ్య పిళ్ళె గారు కావ్యం ద్వార అందిస్తున్న సందేశం.
బాలసుబ్రహ్మణ్య పిళ్ళె గారు కేవలం తెలుగు పద్యకవులే గాదు. యక్షప్రశ్నల  మీద సంస్కృతంలో ఒక రూపకం రాశారు.   ప్రభుత్వం మతవ్యవస్థ సంపూర్ణంగా వేర్వేరుగా ఉన్న దేశాలు అభివృద్థిలోకి వచ్చాయని రెండు కలిసిపోయిన దేశాలు వెనకబడిపోయాయని ఏనాడో జరిగిపోయిన అంశాలను ఈనాటి భావనలతో, ప్రయోగాలతో విమర్శించడం అన్యాయం, నిష్ప్రయోజనం అంటు  వర్ణ వ్యవస్థపుట్టు పుర్వోత్తరాలను చర్చిస్తూ చండాలుడు నవల రాశారు.
ద్దంకి పండురంగని శాసనాన్ని ఆలంబనగా చేసుకొని బోయకొట్టములు పండ్రెండు అనే కావ్యతుల్యమైన చారిత్రకనవలను రచించారు. శ్రీ కరణం సుబ్రహ్మణ్యం పిళ్ళె గారి సాహితీయాత్ర ఎంతో ఉదాత్తపథంలో సాగుతుంది. అది అలాగే సాగుగాక. యువతరంలో  భాష, దేశం, భావనల్లో ఉదాత్తతను, ప్రేమాభిమానాలను రగిలించి ఉత్తేజపరచడంలో శ్రీ కరణం సుబ్రహ్మణ్యం పిళ్ళె గారి సాహిత్యం విజయవంతమగుగాక!       
ఉత్తరప్రత్యుత్తరాలకు చిరునామ.
ఆచార్య వెలుదండ నిత్యానందరావు.
ప్లాట్.నెం.34. విరాట్ నగర్.మీర్ పేట పోస్టు
హైదరాబాదు-500097
సెల్.9441666881

శ్రీరస్తు               శుభమస్తు       అవిఘ్నమస్తు.
శ్రీ కరణం సుబ్రహ్మణ్యం పిళ్ళె కవివరులకు శ్రీ కోడూరి ప్రభాకరరెడ్డి సాహితీపీఠ పురస్కారమ్.
పఞ్చరత్నములు.
రచన. చింతా రామకృష్ణారావు. దూరవాణి సంఖ్య 9 2 4 7 2 3 8 5 3 7
శా. శ్రీదేవీ హృదయాబ్జ భృంగ!  విలసచ్చిద్రూప! సర్వేశ్వరా!
ప్రాదుర్భావ ఫలంబు గాంచె కవి సుబ్రహ్మణ్య పిళ్ళే. సుధా
మాధుర్యంబుల సంస్కృతాంధ్ర కృతులే మాన్యత్వముంగొల్పె నీ
మేధావిన్ చిరకాల జీవన గతిన్ మేల్కూర్చి రక్షింపుమా!

మ. వర కోడూరి ప్రభాకరుండు కవియుం బ్రఖ్యాత వైద్యుండునై
చిర కీర్తిన్ విలసిల్లఁ జేయు కవులన్ జేయించి సత్కారముల్.
ధర సత్కావ్య ప్రకల్పనా చణ లసద్భానుండు పిళ్ళే కవిన్
పరమౌచిత్య పురస్కృతిన్ గొలిచి, సంభావించె సన్మాన్యతన్.

సీ. పట్టాభి రాముని వర సుప్రభాతము -  గొప్పఁగా నుండెడి ఘోష యాత్ర,
యక్ష ప్రశ్నల ఉపాఖ్యానమును విషాద - మాధవి, కలిగిన మఱ్ఱి మాను
సాక్షిగా, ఆ నవ్వె. చండాలుఁడు, వెలుఁగు - తగ్గిన తెలుఁగును, తనియుచు  దివి
కవుల సమ్మేళన ఘన బోయ కొట్టముల్ - పండ్రెండు నొక రాఘవ ఘన రెడ్డి 
కథనుచరిత్ర కెక్కని మారణపు హోమ - మన్వేషణము , అంభి, అద్భుతమగు
ఓరుగల్ వీరగల్, కోరుకొనుచు గుండె - చిన ఊసులాడిందిజింకపిల్ల
గీ.  విలువఁ బెంచెడి యీ పద్య ములను మనము  
నేర్చుకుందామ? యను కృతుల్ నేర్పుమీర
సంస్కృతాంధ్రంబులందున సరస గతిని
ఘనముగా వ్రాసె కరణము ఘనుఁడు పిళ్ళె.

మ. ముదమొప్పారు కవిత్వ కాంత పటిమన్ ముద్దుం గనన్ జూడఁగా!
పదకొండేళ్ళకు నొక్క రెండు, పెరుగున్ ప్రాయంబు యీ పిళ్ళెకున్.
సదయన్ దైవము సర్వ సౌఖ్యదుఁడగున్ సద్గణ్యుఁడౌ పిళ్ళెకున్.
హృదయాహ్లాదముతోడ వర్ధిలునిలన్  బ్రీతిన్ బుధుల్ మెచ్చగన్.

కంద - గీత గర్భ చంపకమాల.
వరకవిపాళికిన్, మధుర వాక్కవి పిళ్ళెకు మంగళంబుగా
వరమిడు మాతయై మహిని వర్ధిలు వాణికి మంగళంబులౌన్.
వర రవి తేజుఁడౌ మన ప్రభా కవి కాంచెడు మంగళంబు, కా 
వర నృహరీ! సదా మహిత భారత మాతకు మంగళంబులౌన్.  స్వస్తి.
మఙ్గళమ్.                   మహత్.                        శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ 
జైహింద్.

నేను 16/24 గంటలలో రచించిన భారతీశతకముపై శ్రీవల్లభ వారి అభిప్రాయ బీజాక్షర చిత్రకవిత.

0 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీమన్మధ నామ సంవత్సర కార్తీక శుద్ధ విదియా శుక్రవారం నాడు 16 / 24 గంటల వ్యవధిలో ఆ జగన్మాత కృపచే వ్రాసిన చంపక భారతి అనే భారతీశతకమును పఠించిన బ్రహ్మశ్రీ వల్లభవఝల అప్పలనరసింహమూర్తి కవి తమయొక్క స్పందనను ఆ జగన్మాతను దర్శింపఁ జేయు బీజాక్షర రూపములో చిత్రకవితవెలయించి యున్నారు. వారి అవ్యాజానురాగ పూర్వక అభినందనలకు నా ధన్యవాదములు తెలియఁ జేయుచున్నాను.
ఆ పద్యములను మీరూ తిలకించండి.కవి వరులైన శ్రీ వఝల వారికి ధన్యవాదములు.
బహుళ కంద గీత గర్భ చంపక మాల.
వర శుభభావ సత్ ఘనులు వల్లభవజ్ఝల జ్ఞాన తేజులన్
స్థిర విభవున్ మహత్ సుగుణ తేజ భరున్, భవ చిద్విలాసు సా
క్షర సుభగున్ సదా నవ లసన్నిభు  అప్పల నారసింహునిన్
వర ప్రభువున్ మదిన్ తలతు భాగ్య భవోద్భవ తత్వమూర్తిగా. 

ఘనులు వల్లభవజ్ఝల జ్ఞాన తేజు
సుగుణ తేజ భరున్, భవ చిద్విలాసు
నవ లసన్నిభు  అప్పల నారసింహు
తలతు భాగ్య భవోద్భవ తత్వమూర్తి

శుభభావ సత్ ఘనులు వ
ల్లభవజ్ఝల జ్ఞాన తేజులన్స్థిర విభవున్.
సుభగున్ సదా నవ లస
న్నిభు  అప్పల నారసింహునిన్వర ప్రభువున్.౧

విభవున్ మహత్ సుగుణ తే
జ భరున్, భవ చిద్విలాసు సాక్షర సుభగున్,
 ప్రభువున్ మదిన్ తలతు భా
గ్య భవోద్భవ తత్వమూర్తిగా. వర శుభభా..౨

శుభభావ సత్ ఘనులు వ
ల్లభవజ్ఝల జ్ఞాన తేజులన్స్థిర విభవున్.
విభవున్ మహత్ సుగుణ తే
జ భరున్, భవ చిద్విలాసు సాక్షర సుభగున్ ౩

శుభభావ సత్ ఘనులు వ
ల్లభవజ్ఝల జ్ఞాన తేజులన్స్థిర విభవున్.
ప్రభువున్ మదిన్ తలతు భా
గ్య భవోద్భవ తత్వమూర్తిగా. వర శుభభా.౪

విభవున్ మహత్ సుగుణ తే
జ భరున్, భవ చిద్విలాసు సాక్షర సుభగున్
సుభగున్ సదా నవ లస
న్నిభు  అప్పల నారసింహునిన్వర ప్రభువున్ ౫

నవ లసన్నిభు  అప్పల నారసింహు
తలతు భాగ్య భవోద్భవ తత్వమూర్తి
ఘనులు వల్లభవజ్ఝల జ్ఞాన తేజు
సుగుణ తేజ భరున్, భవ చిద్విలాసు ౬.

ప్రభువున్ మదిన్ తలతు భా
గ్య భవోద్భవ తత్వమూర్తిగా. వర శుభభా
విభవున్ మహత్ సుగుణ తే
జ భరున్, భవ చిద్విలాసు సాక్షర సుభగున్, ౭.

విభవున్ మహత్ సుగుణ తే
జ భరున్, భవ చిద్విలాసు సాక్షర సుభగున్
శుభభావ సత్ ఘనులు వ
ల్లభవజ్ఝల జ్ఞాన తేజులన్స్థిర విభవున్. ౮.

ప్రభువున్ మదిన్ తలతు భా
గ్య భవోద్భవ తత్వమూర్తిగా. వర శుభభా.
శుభభావ సత్ ఘనులు వ
ల్లభవజ్ఝల జ్ఞాన తేజులన్స్థిర విభవున్. ౯.

సుభగున్ సదా నవ లస
న్నిభు  అప్పల నారసింహునిన్వర ప్రభువున్
విభవున్ మహత్ సుగుణ తే
జ భరున్, భవ చిద్విలాసు సాక్షర సుభగున్ ౧౦.
జైహింద్.