గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, సెప్టెంబర్ 2023, గురువారం

శ్రీ యాదాద్రి లక్ష్మీనృసింహ శతకము 79వ పద్యము .... రచన. చింతా రామకృష్ణారావు. గానం. శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్.

79. ఓం సువ్యక్తాయ నమః.

పదమాలి వృత్త గర్భ సీసము.

అహరహంబును నో నరహరి! నీ దయ చాలు - నాకిలన్ గతివీవె శ్రీకరుండ!  

క్షమఁ గొల్పవయ్య పరమ దయాపర! భక్త - బాంధవా! నా తోడఁ బంతమేల?

జగదేకవీర! సరగున నీపద సేవ - చాలురా! కల్పించు సమ్మతమున.

కనిపించుమయ. నే ధరనిఁక నిన్ విడలేను - దైవమాతోడుండు తత్వమెఱిగి.

గీ. చిత్ర పదమాలి గర్భ స్థ సీస! శ్రీశ! - సుజన *సువ్యక్త* తేజమా! చూడు నన్ను.

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

79 సీస గర్భస్థ పదమాలి. ( .. యతి 10)

నరహరి నీ దయ చాలు నాకిలన్

పరమ దయాపర! భక్త బాంధవా!

సరగున నీ పద సేవ చాలురా!

ధరనిక నిన్ విడలేను దైవమా

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! అహరహమూ నీ దయ నాకు చాలును.భూమిపై నాకు నీవే

గతివి సుమా. నాకు క్షమను ప్రసాదింపుము. నాతో నీకు పంతము వలదు. నీ పదసేవ నాకు చాలును కల్పింపుము. నేను

నిన్ను విడిచి ఉండ లేను. నా తత్వమెఱిఁగి నాకు తోడుగా ఉండుము. చిత్రపదమాలి వృత్త గర్భ సీసపద్య రూపా! శ్రీశా!

సుజనులకు వ్యక్తమగు సువ్యక్తా! నన్ను చూడుము.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.