గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, సెప్టెంబర్ 2023, బుధవారం

అష్టోత్తరశత సతీ అశ్వధాటి (సతీ శతకము). 96వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు. గానము ... శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్.

96. అమ్మా నినున్ దలవనిమ్మా నిరంతర సుఖమ్మందగాఁ గరుణతో

నిమ్మా యనుజ్ఞ వరమిమ్మా ప్రమోదముగ సమ్మోదముం గొలుపుమా.

నమ్మంగ నిన్ మదిని కొమ్మంచు శోభనములమ్మా యొసంగెదవుగా.

మమ్మున్ సదా కనుచు నెమ్మిన్ భరింతువు ఘనమ్మిద్దె మాకిల సతీ!

భావము.

ఓ సతీ మాతా! ఎల్లప్పుడూ సుఖమును పొందు నిమిత్తము కరుణామూర్తివై  

నిన్ను స్మరింపనిమ్ము! నిన్ను స్మరించుటకు అనుజ్ఞనిమ్ము తల్లీ! 

సంతోషముతోమాకీ వరమును ప్రసాదింపుమమ్మా! మాకు ఆనందమును 

కలుగఁజేయుమమ్మా!! మామనసులలో నిన్ను నమ్ము విధముగా స్వీకరింపమని 

శుభములను నీవు మాకు ఇచ్చెదవు కదా. మమ్ములనెల్లప్పుడూ కనిపెట్టి 

చూచుకొనుచు మమ్ము నీవు భరించుచుంటివి. భూమిపై మాకిది యెంతయో 

గొప్పవిషయమమ్మా.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.