జైశ్రీరామ్.
33. ఓం చండకోపినే నమః.
ఊర్వశి వృత్త గర్భ సీసము.
సన్నుతుండ! సుజన సంరక్షకా! సుంద - రాంగ! రారా! మృగరాజ ముఖుఁడ!
భక్తులైన ప్రజల బాధల్ కనన్ రార - రక్ష నీవే కదా! రాక్షసారి!
నీరజాక్ష! నిజము నిన్నే మదిన్ నిల్పి - యున్నవారిన్ గాంచు మన్ననమున.
ధరను గావ కుజన దౌష్ట్యంబులం గూల్చి - యాదుకోరా! ప్రీతిఁ జేదుకోర.
గీ. దురితులకుఁ *జండకోపీ* బెదురు కొలుపుచు - సుజనులకు శాంత మూర్తివై శోభఁ గొలుపు.
భక్త జన పోష! భవశోష! పాపనాశ! - శ్రితజనోద్భాస! యాదాద్రి శ్రీనృసింహ!
33వ సీస గర్భస్థ ఊర్వశి. (న త త ర గ .. యతి 8)
సుజన సంరక్షకా! సుందరాంగ! రారా! - ప్రజల బాధల్ కనన్ రార. రక్ష నీవే!
నిజము నిన్నే మదిన్ నిల్పి యున్నవారిన్ - కుజన దౌష్ట్యంబులం గూల్చి ఆదుకోరా!
భావము.
భక్తులను పోషించువాఁడా! భవమును నశింపఁజేయువాఁడా!
పాపమును నశింపఁజేయువాఁడా!
ఆశ్రితజనమున
ప్రకాశించువాఁడా!
ఓ యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! ఓ సింహముఖుఁడా! పొగడఁబడువాడా! మంచివారిని
కాచువాడా! ఓ సుందరాంగా! నాకడకు విచ్చేయుము.. ఓ రాక్షసారీ! భక్తులైనవారి బాధలను చూచి నివారించుటకు రమ్ము.
నీవేకదా భక్తులకు రక్ష. ఓ పద్మనేత్రుఁడా! ఇది నిజముగా నిన్నే మనసున నిలిపి యున్నవారిని మన్ననముతో
చూడుము.
సాటిలేని దురాగతములు చేయు కుజనులదుశ్చర్యలనుండి మమ్మాదుకొనుము. మమ్ములను చేపట్టుము. ఓ
చండ కోపీ! దుర్మార్గులకు బెదురుపుట్టునట్లు చేయుచు మంచివారికి శాంతమూర్తివై శోభిలఁజేయుము.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.