జైశ్రీరామ్.
34. ఓం సదాశివాయ నమః.
సరసాంక వృత్త గర్భ సీసము.
నా దివ్య దేవర! నంద బాలమణివే - ప్రభవిల్లు దేవాక్షరా! నృసింహ!
ప్రఖ్యాతిగా నిరపాయ జీవన గతిన్ - నిజ శక్తినిమ్మా దనుజ విదార!
యిలఁ గావుమా కరుణించి నా మనమునన్ - గల చింత తీరంగఁ గమలనయన!
అరుదైన నా పరమాత్ముఁడా! మదిని నిన్ - వదలన్ సతంబుండు భవ్య నృహరి!
గీ. నిత్య సరసాంక సంయుక్త నిరుపమాన - భువి *సదాశివా*! యాదాద్రి పూజ్యదేవ!
భక్త జన పోష! భవశోష! పాపనాశ! - శ్రితజనోద్భాస! యాదాద్రి శ్రీనృసింహ!
34వ సీస గర్భస్థ సరసాంక వృత్తము. (స జ స స య .. యతి 10)
వర నంద బాలమణివే ప్రభవిల్లు దేవా!
నిరపాయ జీవన గతిన్ నిజ శక్తినిమ్మా!
కరుణించి నా మనమునన్ గల చింత తీరన్,
పరమాత్ముఁడా! మదిని నిన్ వదలన్ సతంబున్!
భావము.
భక్తులను పోషించువాఁడా! భవమును నశింపఁజేయువాఁడా!
పాపమును నశింపఁజేయువాఁడా!
ఆశ్రితజనమున
ప్రకాశించువాఁడా! సరసాంక సంయుక్త నిత్యుఁడా! సాటి లేనివాడా! ఓ సదాశివా! ఓ యాదాద్రి పూజ్య దేవరా!. ఓ
యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! దివ్యుఁడవైన నా పరమాత్మా! నాశ రహితుఁడవై ప్రభవిల్లు దేవా! నందబాలమణివి
నీవు. ఓ దనుజ సంహారకా! ప్రఖ్యాతమైన నిరపాయమైన నిజజీవనగతిని శక్తిని నాకిమ్ము.నామనసునగల చింతపోకార్పు
దేవరా! కరుణించి నన్ను కాపాడుము.అరుదైన ఓ పరమాత్ముఁడా! ఓ భవ్య నృసింహా! మదిలో నిన్ను వదలను.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.