జైశ్రీరామ్.
32. ఓం ప్రాఙ్ఞాయ నమః.
పాలాశదళ వృత్త గర్భ సీసము.
(పాలాశదళవృత్తమునే శశిశోభ, త్వరితగతి యని కూడ అందురు)
జన హితము కొలుపు మన సచివు లిల నీ – వే, రక్షకుఁడవు నీవే మురారి,
ఘనుఁడవగు సునయన నిగమ సుగమ దే - వాదిదేవుఁడవు మహానుభావ!
ఘనతఁ గల సచివులను గనుచు శుభ మి - మ్మాదరించెడు బుద్దిననయమిమ్ము.
మనుజులకు సుఖద ఘన మహితులనె యి - మ్మా శుభజులఁ గావుమా నృసింహ!
గీ. పాలకుల బుద్ధి బాగున్న బాగు మాకు. - పాలకులను *బ్రాజ్ఞా*! కన బాగు నీకు.
భక్త జన పోష! భవశోష! పాపనాశ! - శ్రితజనోద్భాస! యాదాద్రి శ్రీనృసింహ!
32వ సీస గర్భస్థ పాలాశదళ వృత్తము. (15 లఘువులు గగ .. యతి 11)
జన హితము కొలుపు మన సచివు లిల నీవే
ఘనుఁడవగు సునయన నిగమ సుగమ దేవా!
ఘనతఁ గల సచివులను గనుచు శుభ మిమ్మా!
మనుజులకు సుఖద ఘన మహితులనె యిమ్మా!
భావము.
భక్తులను పోషించువాఁడా! భవమును నశింపఁజేయువాఁడా!
పాపమును నశింపఁజేయువాఁడా!
ఆశ్రితజనమున
ప్రకాశించువాఁడా!
ఓ యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! భూమిపై ప్రజా హితమును నెరవేర్చెడి మన నేతలు నీవే.
రక్షకుఁడవు నీవే కదా. ఘనుఁడవగు ఓ సునయనా! ఓ మహానుభావా! నీవు వేదములందు సుగమమయే
దేవాదిదేవుఁడవు.
గౌరవము కలిగిన పాలకులను నీవు చూచుచు శుభములనొసఁగుము. నిన్నాదరించు బుద్ధిని ఎల్లప్పుడు
ఇమ్ము.
ఈ మానవాళికి సుఖమును కల్పించెడి నాయకులనే ప్రసాదింపుము. శుభజులను కాపాడుము.పాలకుల బుద్ధి
బాగున్నచో మాకు క్షేమము. ఓ ప్రజ్ఞావంతుఁడా! ఆ విధముగ చూచుటయే నీకు మంచిది సుమా.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.