గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

12, సెప్టెంబర్ 2023, మంగళవారం

శ్రీ వసంతతిలక సూర్యశతకము 26 నుండి 30 వరకు... రచన చింతా రామకృష్ణారావు.... గానం శ్రీమతి సిశీలాదేవి.బీ.

 

జైశ్రీరామ్.

26. ప్రాతర్నమామి దినరాజ! అనంత తేజా!   

చైతన్యమున్ గొలుపు సత్పరిపూర్ణభాసా.

నీ తత్వమెన్ను మహనీయులె లేరు ధాత్రిన్.  

ఖ్యాతి ప్రదా. విజయ కారక. సూర్యదేవా!  

27. సప్తాశ్వముల్ కనఁగ సప్త వివర్ణ మాలల్  

లుప్తంబయెన్ తెలుపు లోపల చేరియుంటన్.

గుప్తార్థమిందు కనుగొన్న ప్రభాత వేళన్   

దీప్తంబగున్ మహిత తేజము సూర్యదేవా!   

28. వేదస్వరూప! నిను వేడెద పేదవారిన్,  

నీ దాసులన్ గనుము నిత్యమనంత తేజా.

బోధన్ కృపంగొలిపి పుణ్యము గట్టుకొమ్మా.  

మోదంబుతోఁ గొలుతు పూజ్యుఁడ సూర్యదేవా!   

29. నారాయణా! భరమ? నా దరి చేర నీకున్.  

కారుణ్యమే మదిని కానఁగ లేదదేమో.

ధీరాత్ములన్ సతము తేల్చెడి దివ్య తేజా  

ప్రారబ్ధముల్ కనుచుఁ బాపుమ సూర్యదేవా!  

30. ఆనందదాయివి గ్రహాధిప! లోకబంధూ!  

జ్ఞానంబె తేజముగ కల్గగ చేయుమయ్యా.

నీ నామ సంస్మరణనే విడనీకుమయ్యా.  

జ్ఞానాక్షి దాతవయి కావుమ సూర్యదేవా! 


జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.