గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

12, సెప్టెంబర్ 2023, మంగళవారం

శ్రీ వసంతతిలక సూర్యశతకము 31 నుండి 35 వరకు... రచన చింతా రామకృష్ణారావు.... గానం శ్రీమతి సిశీలాదేవి.బీ.

జైశ్రీరామ్.

31. పచ్చందనంబునకు భాస్కర హేతువీవే.  
మెచ్చున్ నినున్ ధరణి మేలగు కాంతినొప్పన్.
నచ్చున్ గదా ప్రకృతి నవ్యమనోజ్ఞ కాంతిన్.  
సచ్చిత్ ప్రభాస గుణ సన్నుత సూర్యదేవా! 

32. నిత్యాన్నదాన మహనీయులు, దైవ భక్తుల్  
సత్యవ్రతుల్, సుపధ చారులు, యుద్ధవీరుల్
స్తుత్యల్ పతివ్రతమతుల్ నిను చేరుటెల్ల న్  
సత్యమ్ముసత్యమది శాశ్వత! సూర్యదేవా!   

33. నీ లీలచే జగతి నిర్మితమయ్యెనయ్యా.  
ఆలింపు మా వినతి హాయిగనుండనిమ్మా.
చాలింపుమా జ్వలన సంస్కృతి సద్వరేణ్యా!  
పాలింపుమా హృదయపద్మము సూర్యదేవా.

34. పుణ్యంబునంద కవి పూజ్యులు కైతలందున్  
గణ్యంబుగా నిను ప్రకల్పనఁ జేయువారే.
ధన్యాత్ములీ కవివతంసులు. కావుమర్థిన్.  
మాన్యుండ శంకలను మానుము సూర్యదేవా!  

35. మేఘంబునన్ జలమమేయము చేర్తువీవే.   
మాఘంబునన్ శుభమమాంతము కూర్తువీవే.
ఆఘాతముల్ నిలిపి యార్తులఁ గాతువీవే.  
ఆఘాటదూరుఁడ! మహాత్ముఁడ! సూర్యదేవా!

జైహింద్.

 

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.