జైశ్రీరామ్.
57. హృద్యాద్భుతంబయిన పద్యంబులన్ సుజన వేద్యా! రచించి యిడనా?
సాధ్యంబు నీ కృపను, వేద్యంబు నీకిదియు, విద్యావతీ కనుదువా?
ఆద్యంతమున్ దనుపు పద్యప్రవాహమిడు విద్యన్ వరంబడిగెదన్.
సద్యఃఫలప్రదవు, సద్యోగమిమ్మికను, విద్యాధరీ భువి సతీ!
భావము.
ఓ సతీ మాతా! మంచివారిచే తెలియఁడుదానా? మనోహరమయిన
అద్భుతమయిన పద్యములను నేను విరచించి నీకు సమర్పించనా తల్లీ!
ఇది నాకు సనీ కృపచేత సాధ్యమయిన పనియేనమ్మా. ఈ విషయము నీకు
కూడా తెలియును. ఓ విద్యావతీ చూచెదవా? పఠించువారిని, ఆలకించువారిని
ఆద్యంతము తృప్తిపరచు పద్య ప్రవాహమును ప్రసాదించు విద్యను
వరముగా నిన్ను నేను అడిగెదను. ఓ విద్యాధరీ! భూమిపై మాకు
మంచియోగమును ప్రసాదించు తల్లివి నీవు. అమ్మా! నీ లో ఐక్యమగుటయే
సద్యోగము కదా. అట్టి మంచి యోగమును నాకు ప్రసాదింపుము.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.