జైశ్రీరామ్.
37. ఓం గుణభద్రాయ నమః.
చంద్రికాద్వయ గర్భ సీసము.
సరస సుగుణ సాధ్య సత్ప్రభూ! మరువకు - నను మాన్య రక్షకా! కనుము కృపను.
సిరులనడుగఁ, జిత్ప్రసిద్ధుఁడా! వరము నొ - సఁగు భక్తి భావమున్. నిగమ వేద్య!
సురుచిర కృతి శోభఁ జూడరా! స్థిరుఁడవు - కన దీని దీప్తిలోఁ. గమల నయన.
పరమ పురుష బ్రహ్మబాంధవా! శరణు శ - రణు చంద్రికాసుధార్ణవ, మనోజ్ఞ!
గీ. చంద్రికాద్వయ గర్భిత సాంద్ర సీస - రమ్య *గుణభద్ర*! దాసుఁడన్. రక్షనిమ్ము.
భక్త జన పోష! భవశోష! పాపనాశ! - శ్రితజనోద్భాస! యాదాద్రి శ్రీనృసింహ!
37వ సీస గర్భస్థ చంద్రికాద్వయము. (న న ర వ .. యతి 7)
1.సరస సుగుణ సాధ్య సత్ప్రభూ! - మరువకు నను మాన్య రక్షకా!
సిరులనడుగఁ, జిత్ప్రసిద్ధుఁడా! - వరము నొసఁగు భక్తి భావమున్.
2.సురుచిర కృతి శోభఁ జూడరా! - స్థిరుఁడవు కన దీని దీప్తిలో.
పరమ పురుష బ్రహ్మబాంధవా! - శరణు శరణు చంద్రికాసుధా!
భావము.
భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా!
ఆశ్రిత జనమున
ప్రకాశించువాఁడా!
ఓ యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! సరస సుగుణములచేత మాత్రమే సాధ్యమగువాడా!
మన్ననలందు నా రక్షకుడవైన ఓ హరీ! నన్ను కృపతో చూడుము, మరువకుసుమా. చిద్రూపిగా వేదములచే
యెఱుగబడెడివాడా! నేను ధనములు కోరుటలేదు. .భక్తి భావములే నాకు వరముగా నిమ్ము. ప్రసిద్ధమయినవాడా! ఓ
కమలనయనా! ఈ శతకము యొక్క ప్రకాశములో నీవు స్థిరుఁడవై యున్నావు. .చూడుము..ఓ వెన్నెలసుధా సాగరమా!
మనోజ్ఞుఁడా! ఓ పరమ పురుషా! బ్రహ్మ పితా! నిన్ను శరణు కోరుచున్నాను..చంద్రికావృత్తద్వయగర్భసీసస్థుఁడవైన ఓ
గుణభద్రా! నేను నీ దాసుఁడను. నీవు నాకు రక్షణనిమ్ము.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.