జైశ్రీరామ్.
36. ఓం దైత్యదానవ భంజనాయ నమః.
విద్రుమలతా వృత్త గర్భ సీసము.
నిరుపమ! కొల్చెద నిను నిరతమిలన్ సు - సౌందర్య లహరివి సారసాక్ష!
తరుణము కావఁగ, ధరను ననుఁ గనన్ గ - కలనయినం గని కావుమయ్య!
చరణములందుదు సమయమిది హరీశ! - స్మరణమె ముక్తిని చక్కనిచ్చు.
వరముగనందుమ వరలఁ గన ననున్ వి - వర్ధిలఁ జేయుమ, భవ్య నృహరి!
గీ. విద్రుమలతగర్భ సీసస్థ! వెలసి మదిని - *దైత్యదానవ భంజనా*! తనియనిమ్ము.
భక్త జన పోష! భవశోష! పాపనాశ! - శ్రితజనోద్భాస! యాదాద్రి శ్రీనృసింహ!
36వ సీస గర్భస్థ విద్రుమలతావృత్తము. (న జ న న వ .. యతి 8)
నిరుపమ! కొల్చెద నిను నిరతమిలన్
తరుణము కావఁగ, ధరను ననుఁ గనన్.
చరణములందుదు సమయమిది హరీ!
వరముగనందుమ వరలఁ గన ననున్.
భావము.
భక్తులను పోషించువాఁడా! భవమును నశింపఁజేయువాఁడా!
పాపమును నశింపఁజేయువాఁడా!
ఆశ్రితజనమున
ప్రకాశించువాఁడా!
ఓ యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! సాటిలేని వాడా! నిన్ను కొలిచెదను.ఓ సారసాక్షా! నీవు
మంచి సౌందర్యకెరటమే.. భూమిపై నన్ను చూచుటకు కాపాడుటకు ఇదే మంచి సమయము. నా కలలోనైనను నన్ను
చూచి కాపాడుము. ఓ హరిపరమాత్మా! ఇది మంచి సమయము. నీ పాదములందుకొందును. .నీ స్మరణమె చక్కగా
ముక్తినిచ్చును కదా.నన్ను వరలునట్లు చూచుటకు నీవు నాకు వరముగా లభించుము. ఓ గొప్పవాడవైన నరహరీ నను
ప్రవర్ధిలఁ జేయుమయ్యా. ఓ దైత్య దానవ భంజనా! విదృమ వృత్తగర్భ సీసపద్యమున కలవాడా! నా మనసున వెలసి
నన్ను తృప్తిపడనిమ్ము.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.