గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, సెప్టెంబర్ 2023, గురువారం

శ్రీ యాదాద్రి లక్ష్మీనృసింహ శతకము 29వ పద్యము .... రచన. చింతా రామకృష్ణారావు. గానం. శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్.

29. ఓం దుర్నిరీక్షాయ నమః.

ప్రణవ వృత్త గర్భసీసము.

కమల నాభుండ! నే కాంక్షించెద నినుఁ జూ - డంగన్ మనంబునుప్పొంగఁగనిల.

గౌరవార్హుండ. నీకై నేనిట నిలుతున్ - దేవా! కృపాసాంద్ర! దివ్య పురుష!

కమలనాభుండ! శ్రీ కామ్యార్థద! సిరితో - రమ్మా! లసత్ జ్ఞాన మిమ్ము నృహరి!

గోకుల వాస! నాకున్ దిక్కయి నడు నా - తండ్రీ! ప్రణవ రూప! దర్శనమిడు.

గీ. దోష కలుషిత జనులకు *దుర్నిరీక్ష*! - దోషములు పాపి కాపాడు శేషశాయి!

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

29 సీస గర్భస్థ ప్రణవము. ( .. యతి 6)

నే కాంక్షించెద నినుఁ జూడంగన్. - నీ కై నేనిట నిలుతున్ దేవా!

శ్రీ కామ్యార్థద! సిరితో రమ్మా! - నా కున్ దిక్కయి నడు నా తండ్రీ!

భావము.

భక్తులను పోషించువాఁడా! భవమును నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రితజనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! కమల నాభుఁడా! నా మనసు ఉప్పొంగిపోవునట్లుగా

నిన్ను నేను మనస్సులో చూచుటకు కోరెదను. గౌరవార్హుఁడవయిన కృపాసాంద్రా! హరీ! ముకుందా! నీ కొఱకై

నేనిక్కడ నిలిచి యుంటిని. కమలనాభుఁడా! మంచి కోరికలు తీర్చువాడా! లక్ష్మీసమేతుఁడవై రమ్ము. నృహరీ!

ప్రకాశించే జ్ఞానమును నాకు ప్రసాదించుము.. ప్రణవరూపుడా! గోకులవాసా! నాకు దిక్కుగానుండి నడువుము. నాకు నీ

దర్శనము కలిగించుము. పాపకలితులకు దుర్నిరీక్షుఁడవైన ఓ శేషశాయీ! మా దోషమునను పోఁగొట్టి కాపాడుము.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.