గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, సెప్టెంబర్ 2023, గురువారం

శ్రీ యాదాద్రి లక్ష్మీనృసింహ శతకము 28వ పద్యము .... రచన. చింతా రామకృష్ణారావు. గానం. శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్.

28. ఓం సహస్రాక్షాయ నమః.

కవిరాజవిరాజిత గర్భ సీసము

జనులకు సేవలు చక్కగఁ జేయుచుఁ - జక్కని పాలన సల్పు ప్రభుని

కనుమయ నిత్యము గౌరవమొప్పఁగఁ - గల్పకమై మముఁ గావు కృపను.

జనుల మనంబులఁ జక్కని వాఁడుగ - సన్నుతిఁ గాంచెడి సౌమ్య విభుని

మనమునఁ గావుమ మన్ననఁ గొల్పుమ, - మా నరసింహుఁడ మంచిఁ గనఁగ.

గీ. ప్రజల మనములు దోచెడి ప్రభువులందు - నిలుతువీవె *సహస్రాక్ష* నిత్యముగను

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

28 సీస గర్భస్థ కవిరాజవిరాజితము. ( లగ .. యతి 1-8-14-20)

జనులకు సేవలు చక్కగఁ జేయుచుఁ జక్కని పాలన సల్పు ప్రభున్.

కనుమయ నిత్యము గౌరవమొప్పఁగఁ గల్పకమై మముఁ గావు కృపను.

జనుల మనంబులఁ జక్కని వాఁడుగ సన్నుతిఁ గాంచెడి సౌమ్య విభున్.

మనమునఁ గావుమ మన్ననఁ గొల్పుమమా నరసింహుఁడ మంచిఁ గనన్.

భావము.

భక్తులను పోషించువాఁడా! భవమును నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రితజనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! జనులకు సేవలు చక్కగా చేయుచు పరిపాలన చేసెడి

ప్రభువులను గౌరవ ప్రదముగా నిత్యమూ చూడుము. కల్పకమై మమ్ములను కృపతో కాపాడుము. ప్రజల మనస్సులలో

చక్కని రాజ్యపాలకునిగా సన్నుతి గడించినసౌమ్యుఁడయిన ప్రభువులకు మన్నన కలుగఁజేయుచు మనస్సున

నిలుపుకొని మన్నింపఁబడునట్లుగా కాపాడుము. సహస్రాక్షా! ప్రజలు మెచ్చెడి ప్రభువులందుండువాడ వీవేకదా.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.