గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, సెప్టెంబర్ 2023, గురువారం

శ్రీ యాదాద్రి లక్ష్మీనృసింహ శతకము 27వ పద్యము .... రచన. చింతా రామకృష్ణారావు. గానం. శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్.

27. ఓం నిటలాక్షాయ నమః.

సాధ్వీ వృత్తగర్భ సీసము.

రాజిత పదయుగ! రంజక వచసుఁడ! - ప్రార్థన వినుమయ రమ్యముగను.    

పూజిత వరదుఁడ! పుణ్య ఫలమ! నినుఁ - బొందితిమిల ఘన పుణ్యముగను.        

మా జయములకును మాన్యుఁడవగు నిను - మన్ననఁ గనుదుము మంచిఁ గనను,

శ్రీజయ విభవుఁడ! చేకొనుమయ మము - చిత్తమునను నిలు. క్షేమమిడను.

గీ. సాధ్వి గర్భిత సీస ప్రశాంతరూప! - చేదుకొనుమయ్య *నిటలాక్ష*! చిత్ప్రకాశ

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

27 సీస గర్భస్థ సాధ్వీ. ( .. యతి 1-8-15-22)

రాజిత పదయుగ! రంజక వచసుఁడ! ప్రార్థన వినుమయ రమ్యముగన్.    

పూజిత వరదుఁడ! పుణ్య ఫలమ! నినుఁ బొందితి మిల ఘన పుణ్యముగన్.        

మా జయములకును మాన్యుఁడ వగు నిను మన్ననఁ గనుదుము మంచిఁ గనన్.

శ్రీజయ విభవుఁడ! చేకొనుమయ మము చిత్తమునను నిలు క్షేమమిడన్.

భావము.

భక్తులను పోషించువాఁడా! భవమును నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రితజనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! ప్రకాశించు పదములు కలవాడా! మనో రంజకమైన

వాక్కులు కలవాడా! రమ్యముగా నా ప్రార్థన వినుము. పూజింపఁబడే వరప్రదాతా! మా పుణ్యముల ఫలితమైనవాడా! మా

యొక్క గొప్ప పుణ్యముగా నిన్ను పొందితిమి. మా జయముల కొఱకు, మంచి కనుట కొఱకు మాన్యుఁడవయిన నిన్ను

మన్ననతో చూచుదుము. మంగళకర జయవైభవము కలవాడా! మమ్ములను మనః పూర్వకముగా చేకొనుము. మాకు

క్షేమము కలుగఁ జేయుట కొఱకు మానస్సులో నిలిచి యుండుము. సాధ్వీవృత్త గర్భిత సీసరూపమున నున్న ప్రశాంత

స్వరూపుఁడా! నిటలాక్ష చిత్ప్రకాశా! మమ్ములను చేదుకొనుము.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.