జైశ్రీరామ్.
26. ఓం మహాప్రభవే నమః.
సన్నుత వృత్త గర్భ సీసము.
శ్రీమన్మహా దేవ! నా మొరన్ విన వల - దే ప్రియ నృహరీ! మదీయ హృదయ!
యీనాటి యీ జీవ మీవె కాదొకొ? వర - సేవిత ఘనుఁడా! ప్రసిద్ధ దేవ!
కడఁదేర్చగా నావగా మమున్ నడుపు. ప్ర - ణామము లనఘా! సుధామ దేవ!
నా మదిలో భావనా సుధాంబుధివయి - వర్తిలు కృపతోడ, భక్త సులభ.
గీ. భక్తునెంచి *మహాప్రభా*! భావనమున - నిలిచి జీవింపఁ జేయుమా నేర్పునొసఁగి.
భక్త జన పోష! భవశోష! పాపనాశ! - శ్రితజనోద్భాస! యాదాద్రి శ్రీనృసింహ!
26వ సీస గర్భస్థ సన్నుత. (ర జ న భ స .. యతి 10)
దేవ! నా మొరన్ విన వలదే ప్రియ నృహరీ!
జీవ మీవెగాదొకొ? వర సేవిత ఘనుఁడా!
నావగా మమున్ నడుపు. ప్రణామములనఘా!
భావనా సుధాంబుధివయి వర్తిలు కృపతో.
భావము.
భక్తులను పోషించువాఁడా! భవమును నశింపఁజేయువాఁడా!
పాపమును నశింపఁజేయువాఁడా!
ఆశ్రితజనమున
ప్రకాశించువాఁడా!
ఓ యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! శ్తీమన్మహాదేవా! నా హృదయమైన వాడా! నృహరీ! నా మొర
విన వలదా? ఈ నాటి నా జీవితము నీవే కదా. శ్రేష్ఠుఁడవైన సేవింపబడే ఘనుఁడా! ఓ ప్రసిద్ధమైన దేవా!. చక్కగా
ప్రకాశించు దైవమా. నీకు నమస్సులు. ఒడ్డునకు చేర్చు వరకు ఈ సంసార నౌకను నీవే నడుపుము. ఓ భక్త సులభా! నా
మనస్సులోని భావనాసముద్రుడవయి కృపతో సంచరింపుము. ఓ మహాప్రభా! నీ భక్తులను గణించి, వారి భావనములలో
నిలిచి, నేర్పునొసగి వారిని జీవింపఁజేయుము..!
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.