గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, సెప్టెంబర్ 2023, గురువారం

శ్రీ యాదాద్రి లక్ష్మీనృసింహ శతకము 25వ పద్యము .... రచన. చింతా రామకృష్ణారావు. గానం. శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్.

25. ఓం జ్వాలామాలినే నమః.

మనోజ్ఞ వృత్త గర్భ సీసము.

జయముల నిచ్చుచు సంతసంబున నిల్పి - తే యాదగిరివాసధీప్రభాస!

భయమును బాపుచు భక్త బాంధవ ప్రోచి - తే నీదు కృపఁ జూపి దివ్య మూర్తి.

నయ వినయంబులు నాకు నా కృతికిచ్చి -  తే నన్ను దీవించి? దీన బంధు!

ప్రియమున నన్గను విశ్వ వేద్య నృసింహుఁ - డానందసంధాత యనఁగ నిలిచి,

గీ. సన్మనోజ్ఞ యుత వర సీసంబునందు. - నున్నవాఁడ! *జ్వాలామాలి*! నన్ను కనుమ.

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

25 సీస గర్భస్థ మనోజ్ఞ వృత్తము. (     .. యతి 10)

జయముల నిచ్చుచు సంతసంబున నిల్పితే! - భయమును బాపుచు భక్త బాంధవ ప్రోచితే

నయ వినయంబులు నాకు నా కృతికిచ్చితే. - ప్రియమున నన్గను విశ్వ వేద్య నృసింహుఁడా!

భావము.

భక్తులను పోషించువాఁడా! భవమును నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! నాకు జయములు కలుఁగ జేయుచు నాకు సంతోషమును

నిలిపితివా.  ధీ ప్రభాసుడా యాదగిరీశుడా! భక్తబాంధవా! నాలోని భయమును పారద్రోలుచు నన్ను కాపాడితివా. దీన

బంధూ! నాకు, నా కృతికి నయ వినయములు కలుఁగఁజేసితివా. నీవు ఆనంద సంధాతవనునట్లుగా నృసింహా నిలిచి

ప్రియముతో నన్ను కనుము. మంచి మనోజ్ఞవృత్తముగర్భమునందు కలిగియున్న సీస పద్యమున ఉన్న ఓ జ్వాలామాలి

నన్ను కనిపెట్టుకొని చూచుచుండుము.   

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.