జైశ్రీరామ్.
24. ఓం మహాజ్వాలాయ నమః.
మానిని గర్భ సీసము.
శ్రీ నరసింహ! విశేష శుభాస్పద! - చిన్మయ రూప! వశింపు మదిని.
నీ నయగారము నీ శుభ రూపము - నేఁ గని బొంగెద నిత్యమిలను.
మానవమాత్రుఁడ, మాయలఁ జిక్కుదు, - మాయలఁ బాపుము మంచినిడను.
హీన పథోద్గతి హేయము. పాపు మ - హీన శుభాస్పద! హీన గతిని.
గీ. నిత్య నుత *మహాజ్వాలా*ఖ్య! నిర్మలాత్మ - సత్య సన్మార్గ వర్తన సదయనిడుమ!
భక్త జన పోష! భవశోష! పాపనాశ! - శ్రితజనోద్భాస! యాదాద్రి శ్రీనృసింహ!
24వ సీస గర్భస్థ మానిని. (భ భ భ భ భ భ భ గ .. యతి 1-7-13-19)
శ్రీ నరసింహ! విశేష శుభాస్పద! చిన్మయ రూప! వశింపు మదిన్.
నీ నయగారము నీ శుభ రూపము నేఁ గని బొంగెద నిత్యమిలన్.
మానవమాత్రుఁడ, మాయలఁ జిక్కుదు, మాయలఁ బాపుము మంచినిడన్.
హీన పథోద్గతి హేయము. పాపు మహీన శుభాస్పద! హీన గతిన్.
భావము.
భక్తులను పోషించువాఁడా! భవమును నశింపఁజేయువాఁడా!
పాపమును నశింపఁజేయువాఁడా!
ఆశ్రిత జనమున
ప్రకాశించువాఁడా!
ఓ యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! చిన్మయ రూపా! విశేష శుభాస్పదుఁడవైన ఓ శ్రీ నరసింహా!
నా మనసులో నివసింపుము. నీ మార్దవము, నీ శోభన రూపము, నేను నిత్యము చూచుచు పొంగుచుందును. నేను
మానవమాత్రుఁడను. మాయలలో చిక్కుచుందును. నాకు మంచినొసగుటకు మాయలను పారద్రోలుము. హీన
మార్గమనుసరించుట అసహ్యకరమైనది. ఓ అహీన శుభాస్పదా! నాలోని హీనత రూపుమాపుము. నిత్యము పొగడఁబడెడి
మహాజ్వాల నామకుఁడా! నాకు నిర్మలాత్మను, సత్య సన్మార్గ వర్తనమును దయచేయుము.!
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.