జైశ్రీరామ్.
19. ఓం పంచాననాయ నమః.
శివశంకర వృత్త గర్భ సీసము.
హరినామ జపము, సుందర హరి పూజయు - శుభమౌన్. సుభక్తాళి శోభ పెంచు.
హరియించు కుగతి. మాధురి హరిమార్గమె - యిలలోని జనులకు వలయు నిదియె.
పరమాత్ముఁడు దయ పంచుర. భజియించుడు - హరినే మదిని నిల్పి మురియ వలయు.
నరసింహుఁడ! యిది నిన్గను నయమార్గము - కదరా! కృపన్నీవు. కావ రార.
గీ. నన్నుఁ బ్రోచెడి *పంచాననా*! నృసింహ - భావమందున నీవుండి ప్రబలుమయ్య.
భక్త జన పోష! భవశోష! పాపనాశ! - శ్రితజనోద్భాస! యాదాద్రి శ్రీనృసింహ!
19వ సీస గర్భస్థ శివశంకర వృత్తము. (స న జ న భ స .. యతి 11)
హరినామ జపము, సుందర హరిపూజయు శుభమౌన్.
హరియించు కుగతి. మాధురి హరిమార్గమె యిలలో.
పరమాత్ముఁడు దయ పంచుర. భజియించుడు హరినే.
నరసింహుఁడ! యిది నిన్గను నయమార్గము కదరా!
భావము.
భక్తులను పోషించువాఁడా! భవమును నశింపఁజేయువాఁడా! నన్ను కాపాడెడి విశాలమైన ముఖము కలనృసింహా! నా
భావమున నీవుండి అతిశయింపుము.పాపమును నశింపఁజేయువాఁడా!
ఆశ్రితుజనమున ప్రకాశించువాఁడా!
ఓ
యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! హరి నామ జపము, హరి పూజ మంచి భక్తజనులకు శుభంకరమే కాక వారి శోభను
కూడా పెంచును. .దుర్గతిని పారద్రోలును. అది మధురమైన మార్గము.భూజనులకిదే అవసరము..ఆ పరమాత్ముఁడు
దయను పంచును.కాన అతనిని సేవించుడు.ఆ శ్రీహరినే మనసున నిల్పి మురియదగును.ఓ నరసింహుఁడా! ఇదే నిను
చూడఁదగిన ధర్మ మార్గము.కృపతో నీవు కాపాడ రమ్ము.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.