గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, సెప్టెంబర్ 2023, గురువారం

శ్రీ యాదాద్రి లక్ష్మీనృసింహ శతకము 20వ పద్యము .... రచన. చింతా రామకృష్ణారావు. గానం. శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్.

20. ఓం పరబ్రహ్మణే నమః.    

మత్తేభ వృత్త గర్భ సీసము.    

స్వ పర భావంబును బాపుమయ్య కృపతో! - భాస్వన్నఖాకేశవామహేశ!

సుకరమీవందిన శోభ కల్గు నృహరీ! - కల్యాణ సంవర్ధకా గ్రహించు.

ప్రవర మేధాక్షయ భాసమాన ఘృణివే! - వర్ధిల్లనిమ్మా ప్రభన్ వసించి.

స్వధర కాలున్ బలె పాపులన్ దునుము చోన్ - ధర్మంబు నిల్చున్ గదాసతంబు.

గీ. దుర్జనాళికి గుండె లోతులను మెలగి - భయము గొల్పు. పరబ్రహ్మ పథము చూపు

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

20 సీస గర్భస్థ మత్తేభ వృత్తము. ( .. యతి 14) 

పరభావంబును బాపుమయ్య కృపతోభాస్వన్నఖాకేశవా!

కరమీవందిన శోభ కల్గు నృహరీకల్యాణ సంవర్ధకా!

వర మేధాక్షయ భాసమాన ఘృణివేవర్ధిల్లనిమ్మా ప్రభన్ .

ధర కాలున్ బలె పాపులన్ దునుముచోన్ ధర్మంబు నిల్చున్ గదా

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా!  ప్రకాశవంతమైన నఖములు కల కేశవా! మహేశా! స్వ

పర భావములను మా నుండి తుడిచివేయుము.. నృహరీ! నీవందుకొనినచో మాకు అది జీవితము సుకరము. మాకు శోభ

కలుగును. కల్యాణ సంవర్ధకా! ఇది గ్రహించుము.మిక్కిలి శ్రేష్టమైన మేధ చేత అక్షయమైన ప్రకాశించు

భాస్కరుఁడవే.మాలో నివసించి యుండి మమ్ములను వర్ధిల్లనిమ్ము. నీ భూమిపై కాలునివలె నున్న పాపాత్ములను

సంహరించినచో ఎల్లప్పుడూ ధర్మము నిలుచునుకదా! దుర్జనుల గుండెలలో ఉండి వారికి భయమును

కలిగించుము.వారికి పరబ్రహ్మ పదమును చూపుము.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.