జైశ్రీరామ్.
18. ఓం జయవర్ధనాయ నమః.
ఆటవెలది ద్వయ - దేవరాజ వృత్త - ఉత్సాహ గర్భ సీసము,
శ్రీశ! వినుత శ్రీహరీ! మనవిని వీను - లార వినవొకో సుధీర నృహరి!
సాక కనుల విందుగా కనఁబడి గౌర - వమ్ము నిలుపుకో. సుఖమ్మదేను. (ఆ.వె.౧)
ధాత్రిన్ క్షణము చాలదా కనులకుఁ గాని - పించుటకు హరీ! వసించ మదిని.
దీప్త! మనసు తెల్పితిన్ మహితుఁడ! మాకు - నీవెకద సదా పునీత చరిత! (ఆ.వె.౨)
గీ. జనుల జయవర్ధనా నీకు జయము జయము. - సుజన సంవర్ధనము చేసి చూడు మనఘ!
భక్త జన పోష! భవశోష! పాపనాశ! - శ్రితజనోద్భాస! యాదాద్రి శ్రీనృసింహ!
18వ సీస గర్భస్థ దేవరాజ వృత్తము. (న ర న జ భ స .. య తి 11)
వినుత శ్రీహరీ! మనవిని వీనులార, వినవొకో?
కనుల విందుగా కనఁబడి గౌరవమ్ము నిలుపుకో.
క్షణము చాలదా కనులకుఁ గానిపించుటకు హరీ!
మనసు తెల్పితిన్ మహితుఁడ! మాకు నీవెకద సదా!
18వ సీస గర్భస్థ ఉత్సాహ. . (7 సూర్య గణములు 1 గురువు .. యతి 5వ గణము 1వ అక్షరము)
వినుత శ్రీహరీ! మనవిని వీనులార, వినవొకో?
కనుల విందుగా కనఁబడి గౌరవమ్ము నిలుపుకో.
క్షణము చాలదా కనులకుఁ గానిపించుటకు హరీ!
మనసు తెల్పితిన్ మహితుఁడ! మాకు నీవెకద సదా!
భావము.
భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా!
ఆశ్రిత జనమున
ప్రకాశించువాఁడా!
ఓ యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! వినుతింపఁబడే ఓ శ్రీహరీ! ధీరుఁడవైన నరసింహా! మా
మనవిని చెవులారా వినవా? కనులవిందుగా మాకు కనఁబడి మమ్ములను సాకుచు నీ గౌరవము నిలుపుకొనుము. అదే
సుఖముసుమా. మా మనసులో నివసింప వచ్చుటకు, కనులకు కనఁబడిటకు క్షణకాలము చాలదా నీకు? ప్రకాశించువాడా!
ఓ పవిత్ర చరితుఁడా!నా మనసును నీకు తెలిపితిని. మాకు నీవే దిక్కు.ప్రజల జయమును పెంచువాడా! నీకు
జయమగుగాక.మంచివారిని వర్ధిల్లచేసి వారి మనసును తెలుసుకొనుము.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.