గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, సెప్టెంబర్ 2023, గురువారం

శ్రీ యాదాద్రి లక్ష్మీనృసింహ శతకము 17వ పద్యము .... రచన. చింతా రామకృష్ణారావు. గానం. శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్.

17. ఓం విజయాయ నమః.

బంభరగాన వృత్త గర్భ సీసము.

సుజన వరద! జయము జయము కేశవ! - శాశ్వితుఁడా! గుణసాంద్ర వినుత!

పూజితుఁడా! ప్రియము గొలుపు నీవిక - మాకిలలో శుభమార్గదర్శి!

పొంగుచు నీ నయమును కననీ. నవ - నీత ప్రియా! ఫలదాత! నృహరి!

వెతలనిడే భయము తొలఁగనీ వర - భక్తి సుధన్! భవబంధ నాశ

గీ. నిత్య కల్యాణ యాదాద్రి నిలయ శ్రీశ! - స్తుత్య విజయాఖ్య సర్వేశ! సుప్రకాశ!  

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

17 సీస గర్భస్థ బంభర గాన వృత్తము. ( .. యతి 8)

జయము జయము కేశవ! శాశ్వితుఁడా! - ప్రియము గొలుపు నీవిక మాకిలలో.

నయమును కననీ. నవనీత ప్రియా! - భయము తొలఁగనీ వర భక్తి సుధన్.

భావము.

నిత్యకల్యాణ యాదగిరివాసా! శ్రీపతీ! పొగడఁబడే విజయనామకా! సర్వేశ్వరా! సుప్రకాశా

భక్తులను పోషించువాఁడా! చెడును నశింపఁజేయువాఁడా! భవమును నశింపఁజేయువాఁడా!  సుగుణములచే

పొగడఁబడువాడా! శాశ్వితుఁడా! ఆశ్రితులయందు ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా!

మంచివారి కోరికలు తీర్చెడి కేశవా! నీకు జయము. పూజింపఁబడువాడా! ఇలలో మాకు శుభమార్గదర్శివి. ఇక మాకు నీవు

ప్రియమునే లభింపఁజేయుము. నవనీత ప్రియుడా! ఫలితములొసగు నరహరీ! నీ న్యాయమార్గమును పొంగిపోవుచూ

మమ్ములను చూడనిమ్ము. భవబంధనాశకా! భయమును గొలిపే బాధలను నీవొసగు శ్రేష్టమైన భక్త్యమృతముచేత

తొలగునట్లు చేయుము.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.