గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, సెప్టెంబర్ 2023, గురువారం

శ్రీ యాదాద్రి లక్ష్మీనృసింహ శతకము 15వ పద్యము .... రచన. చింతా రామకృష్ణారావు. గానం. శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్.

15. ఓం కోలాహలాయ నమః.

కౌముది వృత్త ద్వయ గర్భ సీసము.

మదిని భావింపగా మాన్య నీ పదరజం బున్, బ్రభల్ వర్ధిలున్ పుణ్య పురుష!

సదయ సంతోష సంస్కారముల్ మదిని - ల్పించు ప్రేమన్ , హరీ! వెలసి నీవు!  

హృదయ సీమన్ హితంబెప్పుడున్ పదిలమున్ - జేయు సంవర్ధకా! చేకొనుమయ

మధుర భావా మహాత్మా! ననున్ మదిని నీ - వుంచుకొమ్మా కృపన్ గాంచి నృహరి!

గీ. భక్త *కోలాహలా*సక్త! ముక్తి వరద! - శక్తినిమ్ము నిన్ గాంచఁగా శాశ్వతముగ.

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

15 సీస గర్భస్థ కౌముది వృత్త ద్వయము. ( .. యతి 8)

1.మదిని భావింపగా మాన్య నీ - పదరజంబున్ బ్రభల్ వర్ధిలున్

సదయ సంతోష సంస్కారముల్ - మదిని కల్పించు ప్రేమన్ ,  హరీ

2.హృదయ సీమన్ హితంబెప్పుడున్ - పదిలమున్ జేయు సంవర్ధకా!  

మధుర భావా మహాత్మా! ననున్ - మదిని నీవుంచుకొమ్మా కృపన్.  

 

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! మాన్యుఁడవైన పుణ్య పురుషా! నీ పాద రజమును

మనసున తలచినంతనే మాలో దివ్య ప్రభలు వర్ధిల్లునుకదా.  లక్ష్మీదేవికి మనోజ్ఞుఁడవైన శ్రీహరీ! దయతో మా మదిలో

నీవు ప్రేమతో వెలసి సంతోషమును, సంస్కారమును కల్పించుము! నా హృదయ సీమలో మంచిని భద్రపరచే

సంవర్ధకుఁడవైన మహాత్మా! నన్ను చేకొనుము. మధురమైన భావమైనవాఁడా! నరహరీ! కృపతో నన్ను చూచి, నీమదిని

నిలుపుకొనుము. భక్తులకోలాహలముపై ఆసక్తి కలవాఁడా! ముక్తిని వరముగా దయచేయువాఁడా! నిన్ను శాశ్వితముగా

చూచుటకొఱకు నాకు శక్తిని ప్రసాదించుము.   

జైహింద్.

Print this post

2 comments:

అజ్ఞాత చెప్పారు...

🙏🙏🙏👏👏👏 ధన్యవాదములు మిత్రమా రాసారు . పాడిన వారి స్వర మాధుర్యం ప్లే బ్యాక్ సింగర్స్ రామకృష్ణ గారు, ఘంటసాల గారు పాడారా అన్నట్లు వున్నది.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

అజ్ఞాతగారూ! ధన్యవాదాలండి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.