గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, సెప్టెంబర్ 2023, గురువారం

శ్రీ యాదాద్రి లక్ష్మీనృసింహ శతకము 14వ పద్యము .... రచన. చింతా రామకృష్ణారావు. గానం. శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్.

14. ఓం హరయే నమః.

ఆటవెలది దశక గర్భ సీస మాలిక.

1.మహిని కరుణ తోడ మము గాచు నరసింహ! - సహజ సుగుణ మిచ్చి మహిమఁ గనుమ.

యిహము పరము నీవె, హరి! మొగమాటమా? - వరములొసఁగ మాకుఁ బపరమ పురుష!

దురిత హరుఁడనీకు సరియెవ్వరిలలోనఁ - గరము పట్టి నడుపు కామితదుఁడ!

సుజనుల మదిలోన శుభ రూపముననుండు - నిరుపమ నుత యాదగిరి నివాస!

2.జగతిని కలవారు జగమేల వలతురు. - జగతిని నిరతంబు మిగులుదురొకొ?

ప్రగతిని కనినంత జగ మేల తగుదురో? - జగతికి పతివీవె నిగమ వేద్య!

నిజముగ జగమెట్లు నినువీడి వెలుగును? - నిరుపమ గుణధామ నిత్యపూజ్య!

నిరతము కని మమ్ము నీవె కాపాడుమా! - ప్రగతి మార్గమునను ప్రబలనిమ్మ.

3.పరమ పురుష సృష్టి పరమార్థమును కంటి. - ప్రతిభఁ జూపెడి నిను మతిని కంటి.

నిరుపమానమయిన కరుణార్ద్రతను కంటి - శోభఁ గొల్పుదువని శ్రుతుల వింటి.

సకల శుభదుఁడంచు సన్నుతుల్ గన వింటి - సరస మతులలోనఁ జక్కఁ గంటి.

చిన్న పిల్లల మది నున్న నిన్ గనుగొంటి - శ్రీ కరుండ వనుచుఁ జేరనుంటి.

4.కవుల తలపులందుఁ గమనీయ భావనా - గతివి నీవె మధుర కృతివి నీవె.

గాయకాళి మధుర గానామృతము నీవె - పాటలందుఁ గలుఁగు ప్రభవు నీవె.

నాట్యకారుల మది నటరాజువే నీవు, - నయతను విడనట్టి నటుఁడ వీవె.

యలరఁ జేయఁగ నిల నాంధ్రామృతము నీవె. - శంకరాభరణపు శక్తి వీవె.

5.కాల మీవె కనఁగకాలాంతకుఁడవీవె. - ధర్మ మీవె సృజన మర్మమీవె.

భూత పంచక యుత పూర్ణ రూపుఁడవీవె. - పృథ్విపై ప్రబలెడు ప్రేమ వీవె.

సజ్జనాళిని కను సన్నుతాత్ముఁడవీవె. - సన్నుతాత్మలఁ గల సత్వమీవె.

శ్రీపరాత్పరి మది సేద తీరుదు వీవె. - భూసతి మది లోనఁ బొంగుదీవె.

గీ. దుష్ట హరణంబు చేసెడి శిష్టరక్ష! - కాన రావయ్య. నిరతంబు కావవయ్య.

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

14 సీస గర్భస్థ ఆటవెలది దశకము

1.మహిని కరుణ తోడ మముఁగాచు నరసింహ! - సహజ సుగుణ మిచ్చి మహిమఁ గనుమ.

యిహముఁ బరము నీవె, హరి! మొగమాటమా? - వరములొసఁగ మాకుఁ బరమ పురుష.

2.దురిత హరుఁడనీకు సరియెవ్వరిలలోనఁ - గరముపట్టి నడుపు కామితదుఁడ!

సుజనుల మదిలోన శుభ రూపముననుండు - నిరుపమ నుత యాదగిరి నివాస!

3.జగతిని కలవారు జగమేల వలతురు. - జగతిని నిరతంబు మిగులుదురొకొ?

ప్రగతిని కనినంత జగమేల తగుదురో? - జగతికి పతివీవె నిగమ వేద్య!

4.నిజముగ జగమెట్లు నినువీడి వెలుగును? - నిరుపమ గుణధామ నిత్యపూజ్య!

నిరతము కని మమ్ము నీవె కాపాడుమా! - ప్రగతి మార్గమునను ప్రబలనిమ్మ.

5.పరమ పురుష సృష్టి పరమార్థమును కంటి. - ప్రతిభఁ జూపెడి నిను మతిని కంటి.

నిరుపమానమయిన కరుణార్ద్రతను కంటి - శోభఁ గొల్పుదువని శ్రుతుల వింటి.

6.సకల శుభదుఁడవని సన్నుతుల్ గన వింటి - సరస మతులలోనఁ జక్కఁ గంటి.

చిన్న పిల్లల మది నున్న నిన్ గనుగొంటి - శ్రీ కరుండ వనుచుఁ జేరనుంటి.

7.కవుల తలపులందుఁ గమనీయ భావనా - గతివి నీవె మధుర కృతివి నీవె.

గాయకాళి మధుర గానామృతము నీవె - పాటలందుఁ గలుఁగు ప్రభవు నీవె.

8.నాట్యకారుల మది నటరాజువే నీవు, - నయతను విడనట్టి నటుఁడ వీవె.

యలరఁ జేయఁగ నిల నాంధ్రామృతము నీవె. - శంకరాభరణపు శక్తి వీవె.

9.కాల మీవె కనఁగకాలాంతకుఁడవీవె. -  ధర్మ మీవె సృజన మర్మమీవె.

భూత పంచక యుత పూర్ణ రూపుఁడవీవె. -  పృథ్విపై ప్రబలెడు ప్రేమ వీవె.

10.సజ్జనాళిని కను సన్నుతాత్ముఁడవీవె. -  సన్నుతాత్మలఁ గల సత్వమీవె.

శ్రీపరాత్పరి మది సేద తీరుదు వీవె. -  భూసతి మది లోనఁ బొంగుదీవె.

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! భూమిపై కరుణతో మమ్ము కాపాడే నరసింహా! సహజమైన

సుగుణమును మాలో కొలిపి మహిమతో చూడుము. పరమ పురుషా. మాకు ఇహము పరము నీవే కదా. మరి శుభములు

మా కొసగుటకు నీము మొహమాటమెందులకు? పాపములు పారద్రోలువాడా! కోరికలు తీర్చుచూ చేయిపట్టి నడిపేవాడా!

భూమిపై నీకు సాటి ఎవరూలేరు. సాటిలేని పొగడబడువాడా! యాదాద్రీశా! మంచివారి మనస్సులలో శుభముల

రూపమున ఉండుము. ప్రపంచముననున్నవారు జగమునే పాలింప భావింతురు. జగత్తులో శాశ్వితముగా

నిలుచువారెవరు కలరు? ఏదో ప్రగతిని సాధించినంతమాత్రమున లోకమునేల సరిపోవుదురా? వేదవేద్యా! జగతిని

ఏలు పతివి నీవు మాత్రమేకదా. సాటిలేని గుణములచే ప్రకాశించువాడా! నిజమునకు జగత్తు నిన్ను విడిచి ఎట్లు

ప్రకాశింపకలదుఎల్లప్పుడూ మమ్ములను చూచుచు కాపాడుము. ప్రగతిమార్గముననే మమ్ము నడుపుము. పరమ

పురుషా! సృష్టి పరమార్థమును చూచితిని. ఇందు ప్రతిభను చూపెడి నిన్ను నా మనమున చూచితిని. నీయందున్న

సాటిలేని కరుణను చూచితిని. శోభను కొలిపేవాడివని వేదములందు వింటిని. సకలశుభములనొసగువాడివని

సన్నుతులు కనుటను వింటిని. సరస హృదయులలో నిన్ను చక్కగా చూచితిని. చిన్నపిల్లల మనస్సులలోనున్న నిన్ను

చూచితిని. నీవు శుభంకరుఁడవని నిన్ను చేరనుంటిని. కవుల తలపులలో కమనీయమైన భావనలకు మార్గము నీవే.

మధురమయిన రచయు నీవే. గాయకుల మధుర గానామృతము నీవే కదా. పాటలందు వెలిగెడి ప్రభవు నీవే.

నాట్యకారులలో నటరాజువు నీవే. న్యాయమును వీడని గొప్ప నటుడవు నీవేకదా. పాఠకులనలరఁ జేయుటకు ఉన్న

ఆంధ్రామృతము నీవే కదా. శంకరాభరణము యొక్క శక్తివి నీవేకదా. కాలము నీవే. కాలాంతకుడవూ నీవే. ధర్మము నీవే

సృజనలో ఉన్న మర్మము నీవే. పంచభూతములతో కూడిన పూర్ణస్వరూపుడవీవే. భూమిపై వెలుగొందు ప్రేమ నీవే

సుమా. మంచివారిని చూచెడి సన్నుతాత్ముఁడవు నీవే. సన్నుతాత్ములలో ఉండే సత్వ స్వభావమూ నీవే. లక్ష్మీ

హృదయమున సేదతీరెడివాడవు నీవే. భూమాత మదిలో పొంగెడివాడవూ నీవే. చెడును హరించెడి సద్రక్షకామాకు

కనిపింప రమ్ము. ఎల్లప్పుడూ కాపాడుము.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.