గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, సెప్టెంబర్ 2023, గురువారం

శ్రీ యాదాద్రి లక్ష్మీనృసింహ శతకము 6వ పద్యము .... రచన. చింతా రామకృష్ణారావు. గానం. శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్.

6. ఓం మహాదేవాయ నమః.

మదన వృత్త గర్భ సీసము.

అరసి రక్షించు యాదాద్రి వాస నృహరీ! - యభయంబునిమ్మా. మహానుభావ!

దయఁ గల్గి మమ్ము మోదంబుతోడ కనుమో - భువనైకవేద్యా! ప్రపూజ్యదేవ!

యసుర సంహార! పాదాంబుజంబులకు నన్ - బ్రణమిల్లనిమ్మా సవినయముగను.

దరహాసముఖుఁడ! మోదంబుఁ గూర్చు, వరదా! - భువిపైన మాకున్. సుకవి వినోద!

గీపరమ భక్తుఁడు ప్రహ్లాదునరసి కాచు - కరుణవార్ధి! *మహాదేవ*! కావ రావ!

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

6 సీస గర్భస్థ మదన వృత్తము. ( గగ .. యతి 9)

యాదాద్రి వాస నృహరీ! యభయంబునిమ్మా.

మోదంబుతోడ కనుమో భువనైకవేద్యా!

పాదాంబుజంబులకు నన్ బ్రణమిల్లనిమ్మా.

మోదంబుగూర్చు వరదా! భువిపైన మాకున్.

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! మమ్ములను ఎఱిగి రక్షించునటువంటి

మహానుభావుఁడవైన యాదాద్రినివాసుఁడవైన నరసింహా! మాకు అభయమిమ్ము. ప్రసిద్ధముగా

పూజింపఁబడెడివాడా! మాపై దయ కలిగి మమ్ములను సంతోషముతో చూడుము. !  సృష్టిలో తెలుసుకొనఁదగినవాడా!

రాక్షసాంతకా! నీ పాదపద్మములకు నయవినయములతో నన్ను నమస్కరింపనీయుము. చిరునవ్వులొలుకు

ముఖమువాఁడా! మంచి కవులకు వినోదమును కూర్చువాఁడా! వరములనొసఁగు నరసింహా! భూమిపై

మాకు సంతోషమును కలిగించుము. పరమ భక్తుఁడయిన ప్రహ్లాదుని అరసి, కాపాడు కరుణా సముద్రుఁడవైన ఓ

మహాదేవా! నన్ను కాపాడుటకు రమ్ము.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.