గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, సెప్టెంబర్ 2023, బుధవారం

అష్టోత్తరశత సతీ అశ్వధాటి (సతీ శతకము). 45వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు. గానము ... శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్.

45. ఉత్సాహ మీవె కద ప్రోత్సాహ మిచ్చుచు శుభోత్సేక మిచ్చెదవు నీ

వాత్సల్య మెన్నఁగ మహోత్సాహమే కలుగు సత్ సిద్ధి ప్రాప్తమగుగా.

మత్సేవ్య తేజమ! సరిత్సాగరంబువయి ద్యుత్సన్నిధిన్ నిలుపుమా.

కుత్సిత్వమున్ గనని ప్రోత్సాహులన్ గనఁగ నుత్సాహమిమ్మిక సతీ!   

భావము.

ఓ సతీ మాతా! మాలోని ఉత్సాహము నీవేనమ్మా. ప్రోత్సాహమును 

కలిగించుచు శుభప్రదమయిన పొంకను కలిగించుదవమ్మా. నీకు మాపై ఉన్న 

వాత్సల్యము పరిగణించుచున్నచో గొప్ప ఉత్సాహము కలుగుచు మంచి 

సిద్ధించును కదా తల్లీ. నాచే సేవింపబడెడి ఓ తేజస్స్వరూపమా! 

దుర్గాసముద్రముగా అయి, నన్ను కాంతి చెంత నిలుపుమమ్మా. ఇక కుత్సిత 

స్వభావ దూరులయి ప్రోత్సాహము కలిగించువారినిచూచుటకు ఉత్సాహము 

కలిగించుము.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.