జైశ్రీరామ్.
41. ఓం కరాళాయ నమః.
మోహప్రలాప వృత్త గర్భ సీసము.
ధీవర! ముక్తి, సుధీ! యిచ్చి ప్రోవ రా - వా? మహా దేవరా! ప్రేమతోడ.
జీవికఁ జూచి సృజించంగఁ జూచు దే - వా! మహా దేవదేవా! సమర్ధ!
భావికి శ్రీవరభాగ్యమ్మునీయరా - వాగర్థ సంభాస! పాప నాశ!
సేవకుఁ జూచి ప్రసిద్ధంబుఁ గొల్పరా - రాజాధిరాజ! నిన్ బూజ సేతు.
గీ. ప్రాణ భీతినిఁ బాపు *కరాళ*! నృహరి! - జ్ఞాన భాతిని గొల్పుమా కన్నతండ్రి!
భక్త జన పోష! భవశోష! పాపనాశ! - శ్రితజనోద్భాస! యాదాద్రి శ్రీనృసింహ!
41వ సీస గర్భస్థ మోహప్రలాప వృత్తము. (భ భ త ర గ .. యతి 7)
ధీవర! ముక్తి , సుధీ! యిచ్చి ప్రోవ రావా? - జీవికఁ జూచి సృజించంగఁ జూచు దేవా!
భావికి శ్రీవరభాగ్యమ్మునీయ రావా! - సేవకుఁ జూచి ప్రసిద్ధంబుఁ గొల్ప రారా!
భావము.
భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా!
ఆశ్రిత జనమున
ప్రకాశించువాఁడా!
ఓ యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! ఓ మహా దేవరా! ఓ ధీవరా! ప్రేమతో ముక్తిసుధను నాకు
ప్రసాదించి కాపాడ రావా? ఓ సమర్ధుఁడా! ఓ దేవదేవా! జీవనాధారమును చూచి సృజించ జూచువాడవా?. ఓ పాపహరా! ఓ
వాగర్థ సంభాసా!. భావి కొఱకు శ్రేష్ఠమైన భాగ్యమునిమ్ము!. ఓ రాజాధి రాజా! నెన్ను పూజింతును. ఈ సేవకుని చూచి
ప్రసిద్ధమగునట్లు చేయుము. ప్రాణభయమును పోగొట్టు కరాళ! ఓ నృహరీ! ఓ కన్న తండ్రీ! నాలో జ్ఞానదీప్తిని కొల్పుము.!
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.