గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, సెప్టెంబర్ 2023, గురువారం

శ్రీ యాదాద్రి లక్ష్మీనృసింహ శతకము 3వ పద్యము .... రచన. చింతా రామకృష్ణారావు. గానం. శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్.

3. ఓం దివ్యసింహాయ నమః.

వంశపత్రపతిత వృత్త గర్భ సీసము.

పరమాత్ముఁడా! యురుగుణా! యొనరఁ - నుమయా. కృపాసాంద్ర ప్రముదమిడఁగ.

శ్రీపతివైన నీ చెలువమే సిరిగఁ గొ - లుపుమా! మహాదేవ! స్వపర రహిత!

నీ పదపద్మముల్ నియతితో నిధియని - కననీయవయ్య మా కమలనయన!   

దీపిత నేత్రుఁడా! తెలియనేది యది తె - లుపుమా! నృసింహుఁడా! కృపను జూచి

గీకరమునందించి కావరాఘన సుచరిత! - తేజమునుఁ గొల్పి వరలించు  *దివ్యసింహ*!

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

3 సీస గర్భస్థ వంశపత్రపతిత వృత్తము.. ( .. యతి 11)

పరమాత్ముఁడా! యురుగుణా! యొనరఁ గనుమయా.

శ్రీపతివైన నీ చెలువమే సిరిగఁ గొలుపుమా!

నీ పదపద్మముల్ నియతితో నిధియని కననీ!

దీపిత నేత్రుఁడా! తెలియనేది యది తెలుపుమా!

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! పరమాత్ముఁడా! గొప్ప గుణములకు నిలయమైనవాఁడా!

గొప్పకృప కలవాడా! నాకు మిక్కిలి ఆనందము కలుగునట్లుగా ఒప్పిదముగా నన్ను చూడుమయ్యా! స్వపరములన్నవి

లేనటువంటివాఁడా! లక్ష్మీపతివైన నీ యొక్క చెలువమునే నాకు ధనముగా కలుఁగఁ జేయుము. మావాఁడవయిన

పద్మములవంటి నేత్రములు కలవాఁడా! నీ పాదపద్మములే మాకు నిధియని నియమముతో కననిమ్ము. ప్రకాశవంతమైన

కన్నులు కలవాఁడా! నరసింహా! మాలో తేజమును కలిగించి, మేము వరలునట్లు చేయునట్టి దివ్య సింహా! నన్ను

కృపతో చూచి, తెలుసుకొనవలసినదేది కలదో అది నాకు తెలియునట్లు చేయుము

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.