గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, సెప్టెంబర్ 2023, గురువారం

శ్రీ యాదాద్రి లక్ష్మీనృసింహ శతకము 2వ పద్యము .... రచన. చింతా రామకృష్ణారావు. గానం. శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్.

2. ఓం మహాసింహాయ నమః.

మలయజ వృత్త గర్భ సీసము.

సురనుత దైవమ! సుజనుల ధైర్యమ! - శుభములు గొల్పఁగఁ జొరుము హృదిని.

భరమొకొ నన్ గన భవభయ దూరుఁడ! - వరగుణ వర్ధన! వరలు మెదను.

మరిమరి కొల్చెద మహిమను జూపర. - మనుజులు నీదగు మహిమఁ గనఁగ.

నరహరి దైవమ! నయగుణ వర్తిగ - ననుఁ గను నిత్యము నడుపుమికను

గీ. నన్నుఁ గరుణించి నా దరినున్న నీవు. -  చింతలుండవు శ్రీ  *మహాసింహ* దేవ.

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

2 సీస గర్భస్థ మలయజ వృత్తము. ( .. యతి 1-8-15-22)

సురనుత దైవమ! సుజనుల ధైర్యమ! శుభములు గొల్పఁగ చొరుము హృదిన్.

భరమొకొ నన్ గన భవభయ దూరుఁడ! వరగుణ వర్ధన! వరలు మెదన్.

మరిమరి కొల్చెద మహిమను చూపర మనుజులు నీదగు మహిమఁ గనన్.

నరహరి దైవమ! నయగుణ వర్తిగ ననుఁ గను నిత్యము నడుపుమికన్.

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! దేవతలచే పొగడఁబడెడి దైవమా! మంచివారికి

ధైర్యమైనవాఁడా! శుభములు కలుఁగఁ జేయుటకు నా హృదయమున ప్రవేశించుము. భవభయములను తొలగించువాఁడా!

నన్నుచూచుట నీకు కష్టమా? శ్రేష్ఠగుణములనభివృద్ధి చేయువాడవయిన ఓ దేవా! నా మదిలో మెదలుచుండుము.

నిన్ను పదే పదే కొలిచెదను. జనులు నీ మహత్వముచూచువిధముగ నీ మహత్వమును చూపించు తండ్రీ! శ్రీ

మహాసింహదేవా! నీవు నాదరినున్నచో నాకు విచారములుండవు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.