జైశ్రీరామ్.
39. ఓం బలభద్రకాయ నమః.
తరలి వృత్త గర్భ సీసము.
హరి! నీకు వందన మనఘా! ననుఁ గను భ - వ్య వినుత శ్రీహరీ! భవభయహర!
వరదుఁడా! సుందర వదనా! సురుచిర శు - ద్ధ హృదయ మాధవా! మహిమఁ గనుమ.
యసమాన! మంద సుహసనా! పలుకుము మా - న్యుఁడ! సదయుండవై. విడకు నన్ను.
ప్రవరుండ! బంధితుఁడవనన్ మనసును బా - యక నిలుమా కృపన్. బ్రకటితముఁగ.
గీ. శ్రీశ! తరలి గర్భ మహిత సీస వాస! - సుందరా! *బలభద్రకా*! వందనములు.
భక్త జన పోష! భవశోష! పాపనాశ! - శ్రితజనోద్భాస! యాదాద్రి శ్రీనృసింహ!
39వ సీస గర్భస్థ తరలి. (భ స న జ న ర .. యతి 11)
వందన మనఘా! ననుఁ గను భవ్య వినుత శ్రీహరీ!
సుందర వదనా! సురుచిర శుద్ధ హృదయ మాధవా!
మంద సుహసనా! పలుకుము మాన్యుఁడ! సదయుండవై.
బంధితుఁడవనన్ మనసును బాయక నిలుమా కృపన్.
భావము.
భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా!
ఆశ్రిత జనమున
ప్రకాశించువాఁడా!
ఓ యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! ఓ భవభయ హరా ఓ అనఘా! నీకు వందనము. ఓ
వరదుఁడా! ఓ సుందర వదనుడా! సుందరమైన ఓ శుద్ధ హృదయా! మాధవా! నన్ను మహిమతో చూడుము.సాటిలేని
మంచి సురుచిర మందహాసా! ఓ మాన్యుఁడా! పలుకుము. దయతో కూడినవాడవై నన్ను విడిచెపెట్టకుము.. ఓ
సర్వశ్రేష్టుఁడా! నీవు బంధితుడవైతివను విధముగా కృపతో నా మనసునుండి విడిపోకుండా స్పష్టమగునట్లుగా నాలో
నిలుము. ఓ శ్రీపతీ తరలి వృత్త గర్భ సీసపద్యస్థుఁడా! ఓ సుందరా! ఓ బలభద్రకా! నీకు నమస్కారములు.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.